చిన్నప్పుడు పంద్రాగస్టు వస్తున్నదంటే.. పండుగే మాకు. ‘ఇండిపెండెన్స్ డే’ అనే మాట ఎక్కువగా వాడేవాళ్లం కాదు. నిజాం నవాబు పరిపాలనలో ఉన్న తెలంగాణ వాళ్లం కదా! ‘పంద్రాగస్టు’ అనడమే అలవాటు. మామూలప్పుడు కాకపోయినా.. జెండావందనం కోసం మా స్కూల్ డ్రెస్సులు ఇస్త్రీ చేయించేది అమ్మ. రెండు జడలకు తెల్లని రిబ్బన్లు వేసి, పూలు పెట్టేది.
మబ్బులు పట్టిన ఆకాశం, అప్పుడప్పుడూ చిరుజల్లులు పడుతుంటే.. ‘ఎప్పుడెప్పుడు బడికి వెళ్దామా!?’ అని ఉత్సాహంగా ఉండేది. ఐదున్నరకే లేచి తయారై.. పాలు మాత్రం తాగి ఆరున్నరకే వెళ్లేవాళ్లం. మాకు షూస్ ఉండేవి కాదు. రోడ్లు బాగాలేక చెప్పులు బురదలో దిగబడుతూ ఉండేవి. స్లిప్పర్లయితే చటుకూ చటుకూ అని చప్పుడు చేస్తూ.. బట్టల నిండా బురద చుక్కలు పడేవి. రంగు రంగుల కాగితాలను జెండా ఆకారంలో కత్తిరించి తోరణాల్లా కట్టేవారు. స్కూలు ముందున్న గద్దెకు జెండా కర్ర ఫిక్స్ చేసి జెండాను తాడుతో కట్టి ఉంచేవారు.
పెద్దసారు జెండా ఎక్కించగానే.. పూలు జలజలా రాలిపడితే గొప్ప థ్రిల్లు మాకు. అందరం కణత దగ్గర కుడిచేతి వేళ్లుంచి సెల్యూట్ చేస్తూ.. ‘జనగణమన అధినాయక జయహే’ అని పాడుతుంటే చెప్పరాని సంతోషం కలిగేది. నేనూ, అక్కా గానీ, నాతో మరొక అమ్మాయి గానీ ముందట నిలబడి పాడేవాళ్లం. మాకు తలా రెండు పిప్పరమెంట్లు ఇచ్చేవారు. ఆ తరువాత మొదలయ్యేది మా ఊరేగింపు. మా బడి నుంచి ఊరిలోని ప్రధాన వీధుల్లో.. సార్లు ముందట, మేం వెనుకా. ‘బోలో స్వతంత్ర భారత్ కీ.. జై’; ‘మహాత్మా గాంధీ.. అమర్ రహే’; ‘భారత్ మాతాకీ.. జై’; ‘చాచా నెహ్రూ..
అమర్ రహే’ అని పిడికిళ్లెత్తి నినాదాలు చేసుకుంటూ వెళ్తుంటే.. అందరూ ఇళ్లల్లోంచి బయటికి వచ్చి మమ్మల్నే చూస్తూండేవారు. దాంతో దేశానికి మేమే స్వాతంత్య్రం తెచ్చినట్టుగా ఫీలయ్యేవాళ్లం. మొదట పోస్ట్ ఆఫీస్, తరువాత గ్రామ పంచాయతీ ఆఫీస్, డాక్ బంగ్లా, బీడీవో ఆఫీసు, స్టేట్ బ్యాంక్, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్.. ఇలా అన్ని చోట్లా మమ్మల్ని తిప్పి.. ఆఖరున హైస్కూలుకు తీసుకెళ్లేవారు. ఏడెనిమిదేళ్ల పిల్లలం.. మాకు కాళ్లు లాగేవి. ఈలోగా కొందరు పిల్లలు ఎవరింటి దగ్గర వాళ్లు మంచినీళ్లో, మరోటో అని ఇంట్లోకి జారుకునేవారు. హైస్కూల్లో మటుకు తలా ఒకటి ఐదు పైసల చాక్లెట్ ఇచ్చేవారు. ఇంటికొచ్చాక పూసగుచ్చినట్టు వివరాలు చెబుతుంటే.. “మీ బళ్లె మీరు జెండా ఎక్కిచ్చుకుంటె గాదా?! బిచ్చపోళ్ల తీరుగ అందరి దిక్కులకు మిమ్ములను తిప్పుడేంది? మీ నానకు చెప్పుత గదేం పద్ధతని.. ఆ సారును అడగమని!” అనేది నానమ్మ. నాన్న ఆ దరిదాపుల కూడా ఉండేవాడు కాడు. ఆ తరువాత ప్రైమరీ స్కూల్లో కూడా ఆ పద్ధతి మానేసినట్టున్నారు.
హైస్కూలుకు వచ్చాక ఏడున్నరకు బయల్దేరి వెళ్లేవాళ్లం. ఇప్పట్లా స్టిక్కర్స్ అమ్మేవాళ్లు కాదు. మేమే తెల్ల కాగితాన్ని చిన్న జెండా ఆకారంలో కత్తిరించుకుని కలర్ పెన్సిల్స్‌తో మూడు రంగులు వేసి, మధ్యలో అశోక చక్రం గీసి.. గుండుసూదితో గౌనుకు పెట్టుకునేవాళ్లం. బడికి నడిచి వెళ్లే కిలోమీటర్ దారిపొడవునా.. అందరిళ్లల్లో రేడియోలోంచి దేశభక్తి గీతాలు వస్తుండేవి. ‘మాదీ స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి’; ‘ఎత్తవోయి నీ జయ జెండా’ పాటలు వినిపిస్తుంటే పులకించి పోయేవాళ్లం. ఎన్నో బృందగీతాలు వచ్చేవి. ‘జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి’; ‘ఎత్తండీ ఎత్తండీ స్వాతంత్రపు జెండా’; ‘జైజై భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభసమయం’.. ఇలా ఎన్నెన్నో పాటలు వింటూ దేశభక్తి ఉప్పొంగుతుంటే.. గబగబా నడుస్తూ వెళ్లేవాళ్లం. హెడ్ మాస్టర్ జెండా ఎగరేయగానే నాలాంటి ఒకరిద్దరికి స్వరాజ్య అవతరణ గురించో, దేశనాయకుల త్యాగాల గురించో మాట్లాడే అవకాశం వచ్చేది.
బ్యాంక్ మేనేజర్, డాక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్.. ఇలాటి అతిథుల ముందు మాట్లాడి, వాళ్లు మెచ్చుకుంటే అదో సంబురం కలిగేది. ఇద్దరో, ముగ్గురో పాటలు పాడేవారు. హైస్కూల్లో రెండు బిస్కెట్లు, ఒక చాక్లెట్ ఇచ్చేవారు. అప్పటికదే గొప్ప. నేను హైదరాబాద్‌లో రెడ్డి కాలేజీలో చేరాక స్వాతంత్య్ర దినోత్సవం రోజున సగంమంది విద్యార్థులు కూడా హాజరు కాకపోవడం చెప్పలేనంత ఆశ్చర్యాన్ని కలిగించింది. కాకపోతే మా కాలేజీలో డెకరేషన్ బాగా చేసేవారు. మొదటిసారిగా బూందీ మిక్చర్, ఒక స్వీటు ఉన్న కవర్లు అందరికీ ఇవ్వడం అక్కడే చూశాను. ఎందుకో తరువాతి రోజుల్లో పంద్రాగస్టు జరుపుకొన్నా..
స్కూల్లో ఉన్నంత ఆనందం కలగలేదు. బ్యాంకులో చేరాక మాకు సెలవులే తక్కువ గనుకా, బ్రాంచ్ ముందు జెండా ఎగురవేసే అలవాటు లేకా ఇంటి దగ్గరే ఉండేవాళ్లం. మా బ్యాంక్ వరంగల్ జోనల్ ఆఫీసులో బాగా జరుపుకొనేవాళ్లం. ముందు రోజే సబ్‌స్టాఫ్ ఆఫీసు మొత్తం జెండాలు కట్టేవాళ్లు. అన్ని లోకల్ బ్రాంచులకూ, చుట్టుపక్కల దగ్గరున్న బ్రాంచులకూ ఆహ్వానంగా మెయిల్స్ పంపేవాళ్లం. మేనేజర్లూ, యూనియన్ నాయకులూ, కొద్దిమంది స్టాఫ్ వచ్చేవారు. జోనల్ మేనేజర్ జెండా ఎత్తగానే సెక్యూరిటీ వాళ్లు గన్ సెల్యూట్ చేసేవారు.
ఆరోజు స్వీటుతోపాటు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసేవాళ్లం. నేను సీనియర్ మేనేజర్ (ప్లానింగ్ మరియు డెవలప్మెంట్)గా ఉన్నప్పుడు ఈ ఏర్పాట్లు స్వయంగా, ఎంతో ఇష్టంతో చూసేదాన్ని. నేను ఇప్పటికీ పంద్రాగస్టు రోజు రేడియో పెట్టుకుని పాటలు వింటుంటాను. ‘నన్నే మున్నే రాహీ హూం, దేశ్‌కీ సిపాహీ హూం’; ‘అప్నీ ఆజాదీ కో హం హర్గిజ్ మిటా సక్తీ నహీ’ లాంటి పాటలు వింటూంటే.. మనసు పులకించి పోతుంది. ఆ తరువాత ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రసారమయ్యే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్ని టీవీలో చూస్తూ ఉంటాను. స్కూలు విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, పరేడ్ చూస్తున్నప్పుడు ఆ బంగారు రోజులు మళ్లీ రావుగా అనిపిస్తుంటుంది.