‘నేను బాగా ఆలోచిస్తాను. ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటాను’ అని మీకు మీరు ఎప్పుడైనా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారా? ‘ఈ విషయాలన్నీ నాకు కొట్టినపిండి. కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదు’ అనే నిర్ధారణకు వచ్చేశారా? ‘ ఒకసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను’ అంటూ పండుగాడిలా ఫోజు కొట్టేస్తున్నారా? మీ మాటల్లో తప్పొప్పులను ఎవరైనా బయటపెట్టినప్పుడు, అవతలివాళ్ల మీద తిరగబడుతున్నారా? మిమ్మల్ని మీరు సమర్థించుకోడానికి దూకుడుగా సిద్ధమవుతున్నారా?
మనకు ఇప్పటికే బాగా తెలిసిన అనేక విషయాలను.. పునరాలోచించుకోవాలని, మన నమ్మకాలను పునః పరిశీలించుకోవాలని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినయం, కుతూహలంతోనే నిరంతర విద్యార్థులం అవుతాం. ఆ స్థానాన్ని అహంకారం ఆక్రమిస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని హితబోధ చేస్తున్నారు. కాబట్టి, పునరాలోచన గురించి ఒకసారి ఆలోచించండి.
సమాచారం, సాంకేతికత కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చాయి. వేగవంతమైన ఈ మార్పులు మనకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నాయి. గతంతో పోలిస్తే.. మరింత తరచుగా మన నమ్మకాల్ని ప్రశ్నించుకోవాల్సిందేనని గుర్తుచేస్తున్నాయి. పాతబడిన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని బోధిస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం.. వైద్య రంగంలో సమాచారం రెట్టింపు కావడానికి దాదాపు 50 ఏండ్లు ఎదురుచూడాల్సి వచ్చేది. నాలుగు దశాబ్దాల నాటికి ఏడు సంవత్సరాలు సరిపోయేది. రెండు దశాబ్దాల నాటికి అందులో సగం సమయం సరిపోతున్నది. దీంతో, మన అభిప్రాయాలను పునరాలోచించుకోవటం తప్పనిసరి అవుతున్నది.
మైక్ లాజర్టిస్ పేరు మనకు తెలియకపోవచ్చు. కానీ బ్లాక్‌బెర్రీ ఆవిష్కర్త అనగానే ఇట్టే గుర్తుపడతాం. ఆ వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటాం. బాల్యం నుంచే ఎలక్ట్రానిక్ రంగంలో తనవైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన మైక్.. చలనచిత్రాల ఫిల్మ్‌పై బార్ కోడ్ గురించి అధ్యయనం చేశారు. పేటెంట్ దక్కించుకున్నారు. ఈ సాంకేతిక విజయానికి ఎమ్మీ, ఆస్కార్ వంటి అవార్డులు అందుకున్నారు. అత్యంత వేగంగా బ్లాక్ బెర్రీని అగ్రస్థానానికి తీసుకెళ్లారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సగానికి సగం బ్లాక్ బెర్రీదే. ఇక్కడే ఆగిపోతే.. ఈ సమాచారం దగ్గరే నిలబడిపోతే.. మనం భ్రమల్లో బతికేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే, 2014 నాటికి బ్లాక్ బెర్రీ మార్కెట్ ఒక్క శాతానికి పరిమితమై ఆ తర్వాత పూర్తిగా అంతర్ధానమైంది. కారణం, పరిణామ శాస్త్రం ప్రకారం బ్లాక్‌బెర్రీ తన గురించి తాను పునరాలోచించుకోలేక పోయింది. నిపుణులు ఎంత మొత్తుకున్నా ఐఫోన్ ప్రభావాన్ని అంచనా వేయలేకపోయాడు మైక్. ఈమెయిల్స్, కాల్స్ కోసం జనం వైర్లెస్ ఉపకరణాలపైనే ఆధారపడతారని విశ్వసించాడు. సకల వినోదాల్నీ అందించే యాప్‌లతో సహా ఏకంగా ఓ కంప్యూటర్‌నే అరచేతిలో పెట్టుకోడానికి జనం ఆసక్తి చూపుతారని ఆ పెద్దమనిషి అంగీకరించలేదు. కారణం.. మైక్‌కు ఆలోచనే కానీ, పునరాలోచన లేకపోవడం.
దీనికి భిన్నంగా ఆపిల్ సంస్థలో ఏం జరిగిందో చూడండి. 2004లో జరిగిన ఓ కీలక సమావేశంలో సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐపాడ్‌ను ఫోన్‌గా మార్చమని కొంతమంది ఇంజినీర్లు స్టీవ్ జాబ్స్‌కు ప్రతిపాదించారు. ‘అంత చెత్తపని నా చేతులతో చేస్తానా? నెవ్వర్?’ అంటూ ఆ సలహాను కొట్టిపడేశాడు స్టీవ్ జాబ్స్. కానీ, ఆ తర్వాత అతను పునరాలోచనలో పడ్డాడు. తన పాత ఆలోచనతో తానే విభేదించాడు. ఆపిల్ డీఎన్ఏను కాపాడుకుంటూనే.. మార్పు వైపుగా అడుగులు వేశాడు. ఆ తర్వాత జరిగినదంతా చరిత్రే. స్మార్ట్‌ఫోన్ రంగంలో పునరాలోచనకు ఐపాడ్ ప్రాతినిధ్యం వహించింది. అప్పటినుంచీ ఆవిష్కరణ కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నది. వివిధ సైజులు, విభిన్న రూపాలు, శక్తిమంతమైన కెమెరాలు, బ్యాటరీ మన్నిక, వినియోగదారుని అనుభవం.. ఇలా చిన్నచిన్న మార్పులతో విస్తృతిని పెంచుకున్నది. మైక్ లాజర్టిస్ కూడా ఇలానే పునరాలోచించి ఉంటే.. బ్లాక్ బెర్రీ ఉత్పత్తులు ఆపిల్‌తో పోటీపడేవి.
రాజకీయ, సామాజిక, సాంకేతిక రంగాల్లో మార్పులను తూకమేసినట్టు అంచనా వేయగలిగిన నిపుణుడిగా పేరుతెచ్చుకున్నాడు జాన్ పియరర్ బోగమ్స్. అమెరికా రాజకీయాల్లో అతని అంచనాలు నిజం అయ్యాయి. జూలై 2016న నిర్వహించబోయే యూఎస్ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో ట్రంప్ గెలవటానికి 68 శాతం అవకాశాలున్నాయని ఏడాది ముందుగానే జోస్యం చెప్పాడు జాన్. ఈ మాటల్ని అందరూ కొట్టిపారేశారు. రిపబ్లికన్ నామినీగా ట్రంప్ అవకాశాలు ఆరు శాతం మాత్రమే అని ప్రఖ్యాత గణాంక నిపుణుడు, ‘ఫైవ్ థర్టీ ఎయిట్’ వెబ్సైట్ వ్యవస్థాపకుడు నేట్ సిల్వర్ సహా పలువురు నిపుణులు అప్పటికే గట్టి నమ్మకంతో ఉన్నారు. మనకు ఏం తెలుసు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. మనం ఎలా అంచనా వేస్తాం అనేది కీలకం. ఈ రంగంలో రాణించటానికి పట్టుదల, ఆసక్తి, తెలివితేటల కంటే.. పునరాలోచనే కీలకం.
ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడమే కాదు. తప్పు చేసినప్పుడు నలుగురి ఎదుటా ప్రకటించడం కూడా ముఖ్యమే. 1990 తొలినాళ్లలో బ్రిటిష్ భౌతికశాస్త్రవేత్త ఆండ్రూలెస్ తన ఆవిష్కరణ గురించి ఓ సైన్స్ జర్నల్‌లో ప్రకటించాడు. కొన్ని నెలల తర్వాత జరిగిన ఖగోళ శాస్త్ర సదస్సులో తన తప్పిదాన్ని గుర్తించాడు. ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించినప్పుడు, సదస్సుకు హాజరైన శాస్త్రవేత్తలు లేచి నిలబడి ఆయనకు అభివాదం చేశారు. ‘ఇది ఇంతకుముందెన్నడూ చూడని ఘట్టం. దీనికి ఎంతో హుందాతనం కావాలి’ అని ప్రశంసలతో ముంచెత్తారు. స్వీయలోపంబు ఎరుగుట దొడ్డ విద్య.
విల్బర్ రైట్, ఆర్విల్ రైట్ సోదరులు చిన్నప్పటి నుంచీ అన్ని పనులూ కలిసే చేసేవారు. కలిసే ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించారు. కలిసే సైకిల్ షాపు ప్రారంభించారు. కలిసే బైకులు తయారుచేశారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి మొట్టమొదటి విమానాన్నీ కనుగొన్నారు. కానీ ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉండేవి. తరచూ వాదనలకు దిగేవారు. ఆ వాగ్వాదాలు నెలల తరబడి కొనసాగేవి. ఆ వాదనలోనే ఆనందం పొందేవారు. కొత్త విషయాలు నేర్చుకునేవారు. రైట్ సోదరుల తండ్రి ఓ చర్చి బిషప్. అయినా, ఆయన లైబ్రరీలో నాస్తిక సాహిత్యమూ అందుబాటులో ఉండేది. వాటిని చదివి చర్చించుకోమని తన కొడుకులకు చెప్పేవారు. అలా తమ ఆలోచనలను నెగ్గించుకోవడానికి తగువు పడటం, అసమ్మతి ఎదురైనా నిబ్బరంగా వాదించడం.. చిన్నప్పటి నుంచీ నేర్చుకున్నారు ఆ ఇద్దరూ. ఆలోచన, పునరాలోచన, పునర్ పునరాలోచన, పునర్ పునర్ పునరాలోచన.. మనిషి గాల్లో ఎగరడం అసాధ్యం అనే అభిప్రాయాన్ని ఖండించే స్థాయికి తీసుకెళ్లింది.
చాలామంది నాయకులు కొత్తదనానికి దూరంగా ఉంటారు. అధికారంలోకి రాగానే ఇతరుల ఆలోచనలను గౌరవించడం మానేస్తారు. తమ చుట్టూ తిరిగే కాకారాయుళ్ల మాటల్నే వింటారు. అన్నిటికీ ‘అవును’ అనే వ్యక్తులనే పక్కన ఉంచుకుంటారు. పొగడ్తలకు అలవాటు పడతారు. వ్యాపార నాయకులైన సీఈవోలూ ఇందుకు మినహాయింపు కాదు. తమ సంస్థలు పేలవమైన పనితీరును ప్రదర్శించినా రాబోయే ప్రమాదాన్ని అంచనా వేయలేకపోతారు. పాత ఆలోచనలను వదిలిపెట్టరు.
పునరాలోచనలతో జతకట్టరు. చివరికి వైఫల్యానికి చేరువ అవుతారు. ఒకప్పుడు బాగా రాణించిన సంస్థలు, గతంలో ఓ వెలుగు వెలిగిన నేతలు కాలక్రమంలో పతనం కావడానికి ఇదే ప్రధాన కారణం. ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. ఒకరి ఆలోచనకు మరొకరు సవాలు విసిరే సంస్కృతి అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం, ఆ దేశపు రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌లో కనిపిస్తుంది. గూగుల్‌లో కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే వారినే ప్రోత్సహిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోడానికి, పాత విషయాలను వదిలేయడానికి తగినంత సమయం కేటాయించుకోవాలి. ఆరోగ్య పరీక్షల కోసం ఏడాదిలో ఒకటి రెండు రోజుల్ని కేటాయించుకున్నట్టు.. మీ నమ్మకాలు, విశ్వాసాలు ఎలాంటి పరిణామాలకు నోచుకున్నాయి? పునరాలోచన అవసరమా, లేదా? అనేది తెలుసుకోవడానికి కూడా ప్రణాళిక రూపొందించుకోవాలి. పునరాలోచన తర్వాత మొత్తంగా మార్గాన్నే మార్చుకోవాల్సిన పన్లేదు. రోజువారీ పనుల్లో చిన్నచిన్న మార్పుల ద్వారా కొత్తదనాన్ని స్వాగతించడం సాధ్యమే. బాల్యం నుంచే పిల్లల్ని అందుకు సిద్ధం చేయాలని సూచిస్తారు నిపుణులు. వారం వారం ఓ కొత్త అంశాన్ని వారి ముందుకు తెచ్చి చర్చకు పెట్టాలని సలహా ఇస్తారు. భోజనం సమయం దీనికి అనువైందని సూచిస్తున్నారు. పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా.. ఆలోచన ఇవ్వాలి. దాంతోపాటు పునరాలోచన కూడా ఇవ్వాలి. అదే అసలైన పెంపకం. విజేతల్ని తయారు చేసే విధానం.
నాసాకు గుణపాఠం
పనిలో కొత్త విషయాలు నేర్చుకునే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టకుండా.. అలవాటైన మూస పద్ధతిలోనే చేసుకుంటూ పోతే ఫలితాలు దారి తప్పుతాయి. ఆ రొడ్డకొట్టుడు వ్యవహారం వల్ల అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకూ చేదు అనుభవాలు తప్పలేదు. ఇటాలియన్ వ్యోమగామి లూకా పర్మితానో తన 36 ఏళ్ల వయసులో 2013 జూలైలో మొదటి స్పేస్ వాక్ పూర్తిచేశాడు. అంతరిక్ష యాత్రికుల్లో అతిచిన్న వయసు అతనిదే. లూకా చేపట్టిన రెండో స్పేస్ వాక్ సందర్భంగా.. స్పేస్ సూట్లో తల వెనక భాగం నుంచి నీరు కారడాన్ని గుర్తించాడు. కానీ బయటికి చెప్పేంత సాహసం చేయలేదు. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు ఎలా ఉన్నా.. చివరికి ప్రాణాలతో భూమికి చేరాడు. నాసా చరిత్రలోనే అత్యంత భయానకమైన వైఫల్యం ఇది. ‘వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్’గా దీన్ని అభివర్ణిస్తారు. అంతకుముందు, 1986లో నాసాలో స్పేస్ షటిల్ విస్ఫోటనం చెందింది. ఏడుగురు మృత్యువాత పడ్డారు. అనంతరం, 2003లో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో మరో ఏడుగురు వ్యోమగాములు మృత్యువాత పడ్డారు. అసాధారణ విజయాలు సాధించిన తర్వాత.. నాసా అహంకారపు వలయంలో చిక్కుకుపోయింది. ఆ ఫలితమే ఇదంతా.
-డాక్టర్ పార్థసారథి చిరువోలు