Jabardasth Comedian Racha Ravi | సినిమాల్లో కనపడాలనే ఆశ. అభిమాన హీరోను చూడాలనే కోరిక. ఇండస్ట్రీలో లదొక్కుకోవాలనే తపన. కలలు ఎన్ని ఉన్నా సరిగా తినడానికి కూడా డబ్బులుండేవి కాదు. కేజీ బియ్యం, ఆరు రూపాయల కూర కొనుక్కొని తింటే ఆ పూటకు అదృష్టవంతులు. చేతిలో వంద రూపాయలుంటే.. నెలమొత్తం పండగే. లేని రోజు ఖాళీ కడుపుతో సహవాసం. ఆకటిబాధను ఖూనీ చేయడానికి, కూనిరాగాలు తీస్తూ కాలం వెళ్లదీసిన రోజులెన్నో ! ఆ కష్టాన్ని అధిగమించి నలుగురికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగాడు దొడ్డిపాటి రవికుమార్ అలియాస్ రచ్చ రవి.
దొడ్డిపాటి రవికుమార్ అంటే వరంగల్‌లో ఏ కొద్దిమంది గుర్తుపట్టవచ్చు. అదే ‘రచ్చ రవి’ అంటే.. తెలుగు రాష్ట్రాలు సైతం చిరునవ్వు చిందిస్తాయి. ‘శాంతాభాయ్’గా అలరించినా.. ‘తీసుకోలేదా రెండు లచ్చల కట్నం’ అంటూ దెప్పిపొడిచినా.. తన కామెడీ స్టైల్ వేరు. స్క్రీన్ మీద రచ్చ రవి ప్రజెంటేషన్ వేరు. హన్మకొండలోని న్యూ రాయపుర రవి స్వగ్రామం. అమ్మ అహల్య, నాన్న శేఖర్. ఆరో తరగతి నుంచే సినిమాలంటే పిచ్చి. చిరంజీవి, బ్రహ్మానందం, చార్లీ చాప్లిన్ అభిమాన నటులు. ఇండస్ట్రీలో నిలబడాలనే తపన అతన్ని మొదట మిమిక్రీ ఆర్టిస్టును చేసింది. అప్పట్లో జెమినీ టీవీలో కొత్తగా ప్రసారం అవుతున్న ‘వన్స్‌మోర్ ప్లీజ్’లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నాడు. ఆ విషయం తల్లిదండ్రులకు చెబితే ఒప్పుకోలేదు. అన్నపై నమ్మకంతో డబ్బులిచ్చి మరీ హైదరాబాద్‌కు పంపింది చెల్లి. ‘వన్స్‌మోర్ ప్లీజ్’ అనే వేదికపై తానేంటో నిరూపించుకున్నాడు. అప్పటికే కొన్ని టీవీ షోలు ప్రారంభమవుతుండటంతో క్రమంలో.. హైదరాబాద్‌ను విడిచిపెట్టి, వరంగల్‌కు వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో మళ్లీ తిరుగు ప్రయాణమయ్యాడు. డిగ్రీ పూర్తి చేసుకున్నాడు.
డిగ్రీ తర్వాత వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేశాడు రవి. మళ్లీ కళారంగం మీద మనసు మళ్లడంతో.. హైదరాబాద్‌కు వచ్చేశాడు. ఉపాధి కోసం రేడియో జాకీగా పనిచేశాడు. ఆ అనుభవంతో దుబాయ్ వెళ్లి ఆర్జేగా మారాడు. అక్కడ ‘నవ్వుల నల్లబాలు’ పేరుతో అచ్చమైన తెలంగాణ యాసలో విస్తృతంగా వినోదాన్ని పంచాడు. అక్కడి గల్ఫ్ కథలు, ఇక్కడి తెలంగాణ కథలను జోడించి.. నవ్వుల పువ్వులు పూయించాడు. మనసు సినిమాలవైపు లాగడంతో హైదరాబాద్‌కు వచ్చేశాడు. ఇక్కడికొచ్చాక సినిమాల్లో కనిపించేందుకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. పెండ్లి చేస్తే కుటుంబం కోసమైనా కుదురుకుంటాడని ఇంట్లోవాళ్లు భావించారు. పెండ్లి చేసేశారు. ఇంకేముందు భార్యతో హైదరాబాద్‌కు వచ్చేశాడు. ఒక కంపెనీలో టెక్నీషియన్‌గా చేరాడు. పగలంతా సినిమా అవకాశాల కోసం తిరుగుతూ, సాయంత్రం వాషింగద్ మెషీన్లు రిపేర్ చేసేవాడు.
ఓ కస్టమర్ ఇంట్లో వాషింగ్ మెషీన్ రిపేర్ చేస్తున్నప్పుడు టీవీలో జబర్దస్త్ ప్రోమో కనిపించింది. అందులో ఎలాగైనా నటించాలనుకున్నాడు రవి. అప్పటి టీమ్ లీడర్ వేణును కలిసేందుకు చాలా ప్రయత్నించాడు. మరోమిత్రుడి ద్వారా చమ్మక్ చంద్ర అపాయింట్మెంట్ దొరికింది. అతని ప్రోత్సాహంతో నటుడిగా, స్కిట్ రైటర్‌గా, సెకండ్ టీమ్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘నా క్యారెక్టర్లకు స్ఫూర్తి సమాజమే’ అంటాడు రవి. ప్రతి మనిషినీ లోతుగా పరిశీలిస్తాడు తను. మాండలికాలు ఇట్టే పట్టుకుంటాడు. ఎవరు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తారో అవగాహన చేసుకుంటాడు. దీంతో సినిమా అవకాశాలూ తలుపుతట్టాయి.
కమెడియన్‌గా రచ్చ రవి ప్రతిభను గుర్తించి డైరెక్టర్లు కామెడీకే పరిమితం చేయకుండా అన్ని ఎమోషన్లనూ పండించే అవకాశం ఇచ్చారు. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో తనే సొంతంగా హిందీ డబ్ చెప్పుకునే అవకాశం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇచ్చారు. ఒక్కసినిమాల్లో కనిపిస్తే చాలు అనుకున్న వ్యక్తి.. వందకు పైగా సినిమాల్లో నటించాడు. అభిమాన హీరో చిరంజీవితో పాటు.. మెగా ఫ్యామిలీ హీరోలందరితో కలిసిన నటించాడు. తెలుగు తెరపై విజయవంతమైన చాలా సినిమాల్లో రచ్చరవి ఉన్నాడు. కళ్యాణవైభోగం, రాజా ది గ్రేట్, శతమానం భవతి, నేనే రాజు నేనే మంత్రి, మ్యాస్ట్రో, ఎంసీఏ, ఎఫ్2, గద్దలకొండ గణేశ్, సరిలేరు నీకెవ్వరు, క్రాక్.. సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు వచ్చాయి. శతమానం భవతి సినిమాలో ఆంధ్రా యాస, గద్దలకొండ గణేశ్‌లో తెలంగాణ యాస, నారప్పలో కర్నూలు యాస, కొండపొలంలో కడప యాస.. ఇలా వివిధ మాండలీకాలను సునాయసంగా పలికించాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ‘గుంటూరు హిందీ’ యాస మాట్లాడేందుకు గుంటూరు వెళ్లి ఆ యాసను ఒడిసిపట్టాడు. చెన్నైకి వెళ్లి తమిళుల బాడీ లాంగ్వేజ్‌ను నేర్చుకున్నాడు. పాత్రల కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. తనని తాను తెరపై మలుచుకున్నాడు. సినిమాల్లో సక్సెస్ అయిన రవి.. సామాజిక సేవలోనూ ముందున్నాడు. ఒకప్పుడు తినడానికి తిండిలేక తాను పడ్డ కష్టాలను మరిచిపోకుండా.. ఎందరికో సాయం చేస్తున్నాడు.
ఆదర్శంగా బతకడం తెలుగు టీచర్ పద్మజ నేర్పించారు. చరిత్రలో మనకంటూ ఓ పేజీ లిఖించుకోవాలని సోషల్ టీచర్ విజయలక్ష్మి బోధించారు. ఆ ఇద్దరి స్ఫూర్తితోనే ఇంతవరకూ వచ్చాను. ప్రతి అవకాశాన్నీ వినియోగించుకున్నాను. జబర్దస్త్ ఆర్టిస్టుగా, స్టాండప్ కమెడియన్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, స్కిట్స్ రైటర్‌గా నా ప్రయాణం వైవిధ్యభరితం. ‘రచ్చ రవి’ అనే యాప్‌తో మరింత మందికి చేరువయ్యాను. నావంతుగా సామాజిక సేవ కూడా చేస్తున్నా. స్వచ్ఛ వరంగల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. చార్లీ చాప్లిన్ అంతటి గొప్ప నటుడ్ని కావాలనేది నా లక్ష్యం.
-రచ్చ రవి
✍ రవికుమార్ తోటపల్లి
“Sudheer: ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, ఇప్పుడు కోటీశ్వరుడు..!”