గొప్ప సినిమాల గోత్ర ప్రవరలివిగో!
సినిమాలు తీయడానికి ప్రతిభ కావాలి. సినిమాలు చూడటానికి, సరిగ్గా అర్థం చేసుకోవడానికీ ప్రతిభ కావాలి. అర్థం చేసుకున్నదానిని అందరికీ అర్థమయ్యేలా రాయడానికీ సరుకు ఉండాలి. పైన చెప్పిన అన్నింటా ఆరితేరినవాడు జోశ్యుల సూర్యప్రకాష్. ఆయన తాజాగా విడుదల చేసిన ‘హిచ్‌కాక్ నుంచి నోలన్ దాకా 1’ చదివిన వారికి ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమాలంటే ఇష్టం లేనిది ఎవరికి? అయితే సూర్యప్రకాష్‌కు ప్రపంచ సినిమా ప్రాణం. ప్రపంచంలో అతి గొప్ప సినిమాలనుకున్న కొన్నింటిని ఒక వారపత్రికలో వారంవారం పరిచయం చేశారు. వాటిలో పాతిక కథనాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. కేవలం సినిమా కథలు ఎవరైనా పరిచయం చేస్తారు. సూర్యప్రకాష్ అలా కాదు. ఆ కథ పుట్టుక నుంచి సెల్యులాయిడ్ పైకి ఎక్కేవరకు జరిగిన కథంతా కూడా పూసగుచ్చినట్టు చెబుతారు. ఈ క్రమంలో దర్శక నిర్మాతల హైరానా మొత్తం కళ్లకు కడతారు. అందుకే అతని కథనాలంటే ఎవరికైనా ఆసక్తి. ఇక ఇందులో ప్రస్తావించిన సినిమాల గురించి చెప్పాలంటే చిన్న విషయం కాదు. అన్నీ వెలలేని రత్నాలే. అనర్ఘ మణిమాణిక్యాలే! మానవీయతకు పెద్దపీట వేసేవే! సరికొత్త ఆలోచనలను ప్రోది చేసేవే!! ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అతను రాసిన విధానానికి ముగ్ధులమై అప్పటికప్పుడే వాటిని చూడలనుకుంటాం. దీనినిబట్టి బలమైన అతని శైలిని అర్థం చేసుకోవచ్చు. ‘1917’ చిత్రం గురించి అతను చెప్పిన తీరు చాలా ఆసక్తిగా తోచింది. సైనికుడి బతుకులోని దైన్యం కంటతడి పెట్టిస్తుంది. ‘మా కోడిపిల్ల కాలు విరిగింది’ లాంటి ఇరానీ చిత్రాలు మనసును కట్టిపడేస్తాయి. ట్వెల్వ్ ఇయర్స్ స్లేవ్, అవతార్, జోకర్, వంట వచ్చిన ఎలుక వీరగాథ, ద షేప్ ఆఫ్ వాటర్, డైయింగ్ టు సర్వైవ్, బైసికిల్ థీవ్స్ మొదలైన చిత్రాల కథలు చదువుతూ ఉంటే ఆయా సినిమాల గొప్పతనం అర్థం అవుతుంది. ఇప్పటికే ఆయా చిత్రాలను చూసిన వారికి వాటిలోని కొత్త విషయాలు అవగాహనకు వస్తాయి. భారతీయ దర్శక దిగ్గజం సత్యజిత్ రే హాలీవుడ్ చేతిలో ఎలా మోసపోయారో కూడా ఇందులో వివరంగా ఉంది.
– హిచ్‌కాక్ నుంచి నోలన్ దాకా-1
రచన: జోస్యుల సూర్యప్రకాశ్
పేజీలు: 200, వెల: రూ.200
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
108 ఆణిముత్యాలు
ఆధ్యాత్మికత మనిషి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. మనిషి జీవన విధానాన్ని ప్రభావితం చేసే ఎన్నో అద్భుతమైన విశేషాలు వేదాల్లో, ఉపనిషత్తుల్లో అడుగడుగునా కనిపిస్తాయి. అయితే, మన పురాణ వాఙ్మయ సారం సామాన్యులకు చేరే మార్గాలు తక్కువే! ఆ లోటును పూడ్చడానికి ఎందరో ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక రచయితలు అహరహం శ్రమిస్తున్నారు. వేదాల్లోని సారాన్ని చిన్నచిన్న కథలుగా, అందమైన వ్యాసాలుగా వివిధ మాధ్యమాల ద్వారా జనబాహుళ్యంలోకి చేరవేస్తున్నారు. వేద సారస్వతాన్ని తమ రచనా వైచిత్రి ద్వారా అరటిపండు ఒలిచి ఇచ్చినట్టుగా అందిస్తున్నారు. ‘ఆణిముత్యాలు’ సంకలనం ద్వారా రచయిత సముద్రాల శఠగోపాచార్యులు అదే ప్రయత్నం చేశారు. ‘ధర్మ ప్రబోధం’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన 288 వ్యాసాల్లో 108 ఎంపిక చేసి ఈ సంకలనంలో ప్రచురించారు. మన మహర్షులు రాసిన కావ్యాల్లోని ధార్మిక విషయాలను సంగ్రహించి సారరూపంగా అందించారు. శ్లోకాలను ఉటంకిస్తూ, వాటి అర్థాలను వివరిస్తూ సమాజానికి మేలు చేసే ఎన్నో అంశాలను సహేతుకంగా ప్రస్తావించారు. ప్రతి వ్యాసమూ సమాజానికి చక్కటి సందేశాన్ని ఇచ్చేదే. ఆంజనేయుడి స్వామిభక్తి ఎంతటిదో చెబుతూ రాసిన ‘సేవానిరతి’ వ్యాసం భగవంతుడి కృపను ఆకాంక్షించే భక్తులు ఆచరించాల్సిన మార్గాన్ని ప్రబోధిస్తుంది. ‘ప్రత్యక్ష దేవతలు’ వ్యాసం తల్లిదండ్రులు, గురువు గొప్పదనాన్ని వివరించడమే కాకుండా, వారిపట్ల ఎలా మసలుకోవాలో తెలియజేస్తుంది. ఇలా జపమాలలో తులసి పూసలు కూర్చిన విధంగా 108 వ్యాసాలను గుదిగుచ్చి మనకు అందించారు రచయిత. వీటిని చదివిన తర్వాత తెలియకుండానే మనలో ఎంతో కొంత మార్పు వస్తుంది. ఆ వ్యాసాల్లోని విషయాన్ని గ్రహించి, దానిని ఆచరించగలిగితే మరింత ప్రయోజనం పొందవచ్చు.
– ఆణిముత్యాలు
రచన: సముద్రాల శఠగోపాచార్యులు
పేజీలు: 110, వెల: రూ.120 (పోస్టేజీ అదనం)
ప్రతులకు: 2-5-318, నక్కల గుట్ట,
హనుమకొండ-506001
ఫోన్ నెం: 98483 73067
మేటి పచ్చళ్లు
విస్తట్లో పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించినా, నడిమి వేలుతో అద్దుకోవడానికి రోటి పచ్చడి పడకపోతే.. ఆ భోజనం పరిపూర్ణం కాదు. మొదటి వాయగా రోటిపచ్చడి కలిపి, అందులోకి పోపు నూనె వేసుకొని, కలియ కలిపి, పట్టీపట్టనంత ముద్ద నోటికి అందించినప్పుడు జిహ్వకు కలిగే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. కచ్చాపచ్చగా దంచిన కొబ్బరి, అందులో బాగా నలిగిన ఉప్పుకల్లు, చివరగా ఇంగువ దట్టించి పెట్టిన తిరగమోత.. తినగ తినగ ఆత్మారాముడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు. ‘బాగానే చెబుతున్నారు కానీ, ఈ రోజుల్లో ఇంతలా ఊరించే రోటిపచ్చళ్లు మాత్రం ఎవరు చేస్తున్నారు?’ అని ఉసూరుమనకండి. రోటిపచ్చడి మేటిగా ఉండాలంటే కొలతలు పక్కాగా కుదరాలి. ఆ లెక్కల కిటుకులు, తయారీ చిట్కాలను ‘108 రోటి పచ్చళ్లు’ పుస్తకంలో పొందికగా అందించారు ఆలూరు కృష్ణ ప్రసాదు. కాయగూరలు, ఆకుకూరలు, పప్పుదినుసులతో చేసుకునే వెరైటీ రోటిపచ్చళ్ల తయారీ విధానాలు ఇందులో ఉన్నాయి. పచ్చళ్ల ప్రియులకు దిక్సూచి ఈ పుస్తకం.
– 108 రోటి పచ్చళ్లు
రచన: ఆలూరు కృష్ణప్రసాదు
పేజీలు: 144, వెల: రూ.150
ప్రతులకు: acchamgatelugu@gmail.com
85588 99478
– చంద్ర ప్రతాప్ కంతేటి
8008143507