పొద్దునే తాగితే నిద్రమబ్బు వదిలించే కాఫీ రుచి చూడని వారుండరు. ఇంటికి వచ్చిన వారికి తొలి ఆతిథ్యం అందించేదీ కాఫీ నీళ్లతోనే! పదిహేడో శతాబ్దంలో యెమెన్ యాత్ర నుంచి వస్తున్న బుడాన్ సాహెబ్ కాఫీ గింజలను మన దేశానికి తీసుకువచ్చి చిక్కమగళూరు జిల్లాలో కాఫీ తోటల పెంపకానికి ఆద్యుడయ్యాడు. పడమటి కనుమల్లో విస్తరించిన కాఫీ తోటలు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లో విస్తారంగా సాగవుతున్నాయి. ఆంధ్రా, ఒడిశా గిరిజనులు తూర్పు కనుమల్లోనూ కాఫీ తోటలు ఉన్నాయి. అరకు, చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటలు విస్తారంగా కనిపిస్తాయి. సేంద్రియ పద్ధతిలో సాగవుతున్న అరకు కాఫీకి మంచి డిమాండ్ ఉంది.
ప్రపంచ వాణిజ్య వ్యవసాయంలో ముఖ్యమైనది కాఫీ తోటల పెంపకం. రొబసా, అరబికా అని రెండు రకాల కాఫీ మొక్కలు ఉన్నాయి. ఈ తోటలను దాదాపు డబ్బు దేశాల్లో సాగుచేస్తున్నారు. కాఫీ మొక్కలు గుబురుగా, దట్టంగా పెరుగుతాయి. పువ్వులు ఎరుపు రంగులో గుత్తులు గుత్తులుగా కాస్తాయి. సువాసన కలిగి ఉంటాయి. ఎర్రని కాఫీ పండ్లను ఎండలో ఆరబెట్టి, దాదాపు ముదురు గోధుమ… అదే కాఫీ కలర్ వచ్చేదాకా ఉంచుతారు. లోపలి గింజలు గలగలలాడిన తర్వాత ప్రాసెస్ చేసి కాఫీ గింజలను తీసి అమ్ముతారు.
కాఫీ గింజలను పొడి చేసి, నీటిలో ఉడికించి డికాక్షన్ తయారు చేసి (బ్లాక్ కాఫీ) సేవించే వారు ఉన్నారు. పంచదార, పాలు కలుపుకొని తాగుతారు. కాఫీ వినయోగంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ కాఫీ గింజల్లోని కెఫిన్ మనసును ఉత్తేజపరుస్తుంది. జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులు కూడా కెఫిన్‌తో నయమవుతాయి. కాఫీ రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతుదంటారు. మితంగా కాఫీ తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మితిమీరి సేవిస్తే రక్త పోటు వచ్చే ప్రమాదం ఉంది. లో బ్లడ్ ప్రెజర్‌తో బాధ పడేవారికి కాఫీ మేలు చేస్తుంది. కాఫీ పరిమితంగా తాగితే మంచిదే. అతిగా తాగితే వ్యసనంగా మారుతుంది. దుష్ప్రభావాలు కలిగే ప్రమాదముంది. శృంగేరీ యాత్రకు వెళ్లినప్పుడు నాలుగు కాఫీ మొక్కలు తెచ్చి, కుండీల్లో పెంచుతున్నా.
g ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు