పట్టుదలతో గెలిచాడు
సాగు చేసేందుకు చుక్క నీరు లేకపాయే. పండించిన పంటకు గిట్టుబాటన్న మాటే లేదు. అయినా ఆ రైతు అలసిపోలేదు. ప్రత్యామ్నాయ పంటలవైపు నడిచాడు. పట్టు విడవకుండా ముందుకు సాగి లాభాలను గడిస్తున్నాడు సిద్దిపేట జిల్లాకు చెందిన రాగుల రాజు. ఇటీవల రాష్ట్ర ఉత్తమ పట్టు రైతు అవార్డును అందుకున్న ఆయన బతుకమ్మతో తన మల్బరీ ప్రస్థానం గురించి పంచుకున్నాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఇప్పుడంటే రంగనాయకసాగర్ పుణ్యమా అని పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. కానీ, నా చిన్నతనంలో ఈ పరిస్థితులెక్కడివి. మాది సిద్దిపేటకు సమీపంలో ఉన్న ముండ్రాయి గ్రామం. కరువు కాలంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాంతో ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసి 1999లో బతుకుదెరువుకోసం దుబాయి బాటపట్టిన. అక్కడ మేస్త్రీ పనిచేసుకుంటా పైసా పైసా పోగుచేసినా. కొన్ని రోజులకు నా తమ్ముడిని కూడా తీసుకొని పోయి ఇద్దరం పైసలు కూడబెట్టి ఇంటికాడ పదహారు ఎకరాల పొలం కొనుక్కున్నాం. ఇల్లు కట్టుకున్నాం.
2003ల పెండ్లి చేసుకొని ఆరు నెలల తర్వాత మళ్లీ దుబాయికి పోయిన. ఏడాదిన్నర పాటు ఉండి తట్టాబుట్టా సర్దుకొని ఇంటికొచ్చిన. ఊళ్లనే వ్యవసాయం చేయడం ప్రారంభించిన. సొంతభూమిలో బంగారంలాంటి పంటలు పండించాలనుకొని వస్తే కరువు దుఃఖాన్ని మిలిగ్చింది. సాగుచేయడానికి నీటి వసతి కోసం ఏకంగా 12 సార్లు బోర్లేస్తే అందులో రెండు మాత్రమే సక్సెస్ అయినయి. వాటితోనే కూరగాయలు, పత్తి, మక్కజొన్న సాగుచేసుకుంటూ జీవనం సాగించిన. అరుతడులు పెట్టుకుంటా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంట, చేతికొచ్చే సరికే పురుగు ముట్టేది. మార్కెట్లో దొరికే మందులన్నీ తెచ్చి కొడుతుంటిని. ఆ మందుల వాసనకు వంటిట్లో కూరల రుచి కూడా నాకు తెలిసేది కాదు.
హరీశన్న మాటవిని
పంటను అమ్ముకుందామంటే గిట్టుబాట ధర లేక తెచ్చిన అప్పులకు మిత్తి కూడా కట్టలేని పరిస్థితి. ఒకానొక సమయంలో పొలం అంటేనే విరక్తి పుట్టింది. 2020లో మిర్చి బ్రహ్మాండంగా కాత కాసింది, కానీ గిట్టుబాటు ధర లేదు. ఆ సమయంలోనే సిద్దిపేటలో రైతు మేళా నిర్వహించారు. పంటల గురించి అవగాహన కల్పిస్తున్నారంటే తెలిసి వెళ్లాను. ఆ సభలో మాజీ మంత్రి హరీష్రావు సార్ అయిల్ పామ్, సెరికల్చర్ పంటల గురించి వివరించి చెప్పాడు. కమర్శియల్ పంటలు వేస్తే.. రైతు కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని సార్ చెప్పిన మాటలను తలుచుకుంటూ ఇంటిబాట పట్టిన. సార్ మాటలు మాత్రమే చెప్పలేదు. అయిల్ఫామ్, సెరికల్చర్ పంటలు వేసిన వాళ్లదగ్గరికి వెళ్లి చూసి రమ్మని మా గ్రామంలో బస్సు పెట్టి మరీ పంపించిండు. అయితే ఆ బస్సు మిస్ అవ్వడంతో మా ఊరిలో నలుగురం రైతులం కలిసి చంద్లాపూర్లోని సెరికల్చర్ చూసేందుకు వెళ్లాం. ఆ పంట ప్రాసెస్ అంతా తెలుసుకొని ఇంటికొచ్చినం. తర్వాత మళ్లొక మూడురోజులపాటు జిల్లా అధికారుల సహాయంతో శిక్షణ తీసుకున్న. మల్బరీ సాగు చేయడం కోసం అప్పటికే ఏపుగా కాసిన మిర్చి పంటను తీసేసిన.

Silk
నెలకు రూ.లక్ష ఆదాయం
రూ.12 లక్షలు పెట్టి షెడ్ నిర్మాణం చేశాను. అందుకోసం కొంత బ్యాంకులో లోన్ తీసుకోగా మరికొంత బయట అప్పు చేసిన. 2021లో మొదటి పంటను వేసిన. గతంలో కూరగాయల సాగు చేసినప్పుడు రసాయన పురుగుల మందులు పిచికారీ చేయడంతో భూమి విషమయమైంది. ఆ ప్రభావం మల్బరీ పంటపై చూపించడంతో మొదటి పంట ఆదాయం రూ.1800 మాత్రమే చేతికొచ్చింది. అధికారుల సూచనలతో సేంద్రీయ పద్ధతిలో చేసిన కషాయాలను పిచికారీ చేయడం ప్రారంభించిన. క్రమంగా రిజల్ట్ కనిపించింది. మూడోపంటకల్లా వందశాతం క్రాప్ చేతికొచ్చింది. గతంలో నా పిల్లలు, భార్య, నేను కలిసి ఈ పనులన్నీ చేసుకునేవాళ్లం. పిల్లలు పై చదువులకోసం హైదరాబాద్కు వెళ్లడంతో మేమిద్దరమే పనులన్నీ చేసుకుంటున్నం. పని ఎక్కువగా ఉన్నపుడు కూలీలను పెట్టుకుంటం. అయితే కూలీలను తగ్గించుకునేందుకు ఈ మధ్యకాలంలో హార్వెస్టర్, బెండింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్న. ప్రస్తుతం అన్ని ఖర్చులుపోను నెలకు రూ.లక్ష వరకు అదాయం వస్తున్నది. ఈ సాగు గురించి మా గ్రామంలోని రైతులకు అవగాహన కల్పించినా ఇందులో శ్రమ ఎక్కువ ఉంటుందని ఎవరూ ముందుకు రాలేదు. కానీ, మా చుట్టుపక్కల గ్రామాలైన నాగరాజుపల్లి, వెంకటాపురం, మిరుదొడ్డి ప్రాంతాల రైతులు నా దగ్గర నేర్చుకొని వెళ్లి సాగు చేస్తున్నారు.
యువతకు చక్కటి అవకాశం
వ్యవసాయ కళాశాలల విద్యార్థులు బస్సుల్లో వచ్చి మరీ మల్బరీ సాగు గురించి నేర్చుకుంటున్నరు. ఇంటర్ కూడా పూర్తి చేయని నేను వాళ్లకు సెరికల్చర్ను వివరించడం ఎంతో గర్వంగా అనిపిస్తున్నది. గతంలో జిల్లా ఉత్తమ రైతు అవార్డును అందుకున్న నాకు రాష్ట్రస్థాయిలో అవార్డు వరించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇటీవల కేంద్ర పట్టు పరిశ్రమ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బెంగళూరులో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ గారి చేతుల మీదుగా ఉత్తమ పట్టురైతు అవార్డు అందుకున్నాను. గ్రామీణ యువత కొలువులు రాక నిరుద్యోగులుగా మారుతున్నరు. ఒక రెండు ఎకరాల పొలం ఉంటే హాయిగా తల్లిదండ్రుల చెంతనే ఉంటూ ఈ పట్టు పెంపకంలో వాళ్లు రాణించొచ్చు. నా పిల్లలు ప్రస్తుతం బీటెక్ చేస్తున్నరు. వాళ్లకోసం ఓ ఫ్లాట్ఫాం సిద్ధం చేసి పెట్టిన. వాతావరణ మార్పుల కారణంగా ఈ పంట దెబ్బతినకుండా షెడ్డులో ఒకే రకమైన వాతావరణాన్ని మెయింటెన్ చేస్తూ అధిక పంటలు తీయాలన్నదే నా భవిష్యత్తు లక్ష్యం.
– రాజు పిల్లనగోయిన

Sericulture
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

