నానాటికీ మానవత్వం కనుమరుగైపోతున్నదని తెగ బాధపడుతున్నాం. మంచితనం చిరునామా గల్లంతు అవుతున్నదని ఆరాటపడుతున్నాం. మరి బాల్యం సంగతేంటి?. ఒకప్పుడు బాల్యమంటే బంగారు జ్ఞాపకాలు, ఆటపాటలు, విలువల పాఠాలు, బంధాలకు పునాది, నేటి బాల్యం ‘సెల్’లో బందీగా మిగిలింది. పక్షులు ఎగిరిపోయిన గూడులా బోసిగా నిలిచింది. దాని పర్యవసానం ఏంటో చూస్తూనే ఉన్నాం. బాల్య జ్ఞాపకాలు, అనుభవాలు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అవి కరువు కావడంతోనే నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు మానసిక ఆరోగ్య సమస్యలు, అవలక్షణాలు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, సమాజం బాగుపడాలన్నా.. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ‘పదండి ముందుకు.. పదండి తోసుకు’ మాదిరిగా బంగారు బాల్యాన్ని తేవడానికి అందరం వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది.
Childhood | మీకో నాలుగు పదుల వయసు ఉంటుందా? అయితే మీ చిన్నప్పటి సంగతులు ఓసారి గుర్తుకు తెచ్చుకోండి, ఏం గుర్తుకొచ్చాయి?.. ఉమ్మడి కుటుంబం, పెద్దలంటే గౌరవం, ఒత్తిడి లేని చదువులు, బడిలో ఆటలు పాటలు, వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి ప్రయాణం, నాన్న భుజాల పైనుంచి కళ్లు పెద్దవి చేసుకొని చూసిన జాతర, వర్షపు నీటిలో కాగితపు పడవలు.. ఇవే కదా.. అవి కేవలం జ్ఞాపకాలే కాదు, మీ వ్యక్తిత్వ పునాదులు. విలువల పాఠాలు. బాల్య అనుభవాలు, జ్ఞాపకాలే మీరు.
ఆ మధ్య వచ్చిన పిల్ల జమిందార్ సినిమాలో హీరో నాని ‘చదువు ఎవరైనా చెప్తారు సార్.. సంస్కారం గురించి మీరే చెప్పాలి’ అంటాడు. అక్షరాలు బడిలో నేర్పుతారేమో గానీ, అనుబంధాలను కుటుంబమే నేర్పుతుంది. పిల్లలకు తొలి బడి ఇల్లే. సుద్దులు, బుద్ధులు చెప్పేది కుటుంబమే. అప్పట్లో తాతయ్య నానమ్మ, అమ్మానాన్న, బాబాయి పిన్ని, అత్తయ్య మామయ్య కలిసి ఉండేదే కుటుంబం. వీళ్లందరూ టీచర్లే. ప్రత్యేకంగా సిలబస్ అంటూ ఏమీ ఉండదు. ఒక్కొక్కరూ ఒక్కో సబ్జెక్ట్. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లలకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో చూద్దాం..
అప్పట్లో పిల్లలకు నిద్రపోయే ముందు అమ్మమ్మో తాతయ్యో, అమ్మో, పిన్నో కథలు చెప్పేవారు. రామాయణ మహాభారతాల దగ్గర నుంచి పంచతంత్ర కథల వరకు పిల్లలు వింటూ పడుకునే వాళ్లు. ఇప్పుడు ఆ సంస్కృతే లేకుండా పోయింది. అందుకే పిల్లల్లో సృజనాత్మకత గాని, కుతూహలంగానీ తగ్గుతూ వస్తున్నాయి. కథలు వినడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. రెక్కల గుర్రంపై రాజకుమారుడు, ఒంటి కన్ను రాక్షసుడు గురించి కథల్లో తెలుసుకున్నప్పుడు ఆ రూపాన్ని పిల్లలు ఊహిస్తారు. మానవ మెదడు సెకండ్‌కి 75 చిత్రాలను ఊహించగలదు. కథలోని పాత్రలను, ఘటనలను ఊహించడం ద్వారా పిల్లల మెదడు ఊహాశక్తి మరింత మెరుగవుతుంది. కథలు వినడం ద్వారా పిల్లలకు భాషపై పట్టు వస్తుంది. భావోద్వేగాలు ఎలా వ్యక్తపరచాలో తెలుస్తుంది. తోటివారి పట్ల సానుభూతి, సహానుభూతిని చూపించడం అవగతమవుతుంది. కథలో అంతర్భాగంగా ఉండే నీతి ద్వారా పిల్లలు విలువలు నేర్చుకుంటారు. అందుకే సైకాలజీలో స్టోరీ టెల్లింగ్ ఒక థెరపీగా మారింది. కథలు చెప్పడంలో శిక్షణ ఇవ్వడం ఇప్పుడు ఓ పెద్ద పరిశ్రమ. ఇవేమీ లేకుండానే నాడు పిల్లలకు కథలు వినే అవకాశం దక్కేది.
కథలు వినడం అనేది పిల్లల్లో సృజనాత్మకత ఏకాగ్రత పెంచడంతోపాటు మెదడు కూడా పదునెక్కేలా చేస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కథ వినే సమయంలో పిల్లల మెదడు, కథ చెప్పే వారి మెదడు ఏకరీతిలో స్పందిస్తాయని న్యూరో ఇమేజింగ్ ద్వారా తెలుసుకున్నారు. దీన్నే సైకాలజీలో న్యూరో కప్లింగ్ అంటారు. పిల్లలు కథను వినటమే కాకుండా అందులోని ఏదో ఒక పాత్రతో మమేకమవుతారు. కథ వినే సమయంలో పిల్లల మెదడులో భాషా నైపుణ్యాలు నియంత్రించే ప్రాంతం, ఉద్వేగాల వ్యక్తీకరణను నియంత్రించే ప్రాంతం, అవధానాన్ని నియంత్రించే ప్రాంతాలు జాగృతమవటం న్యూరో సైంటిస్టులు గమనించారు. తరచుగా కథలు వినటం ద్వారా పిల్లల్లో అవధానం, ఏకాగ్రత పెరగడంతో పాటు ఉద్వేగాలను అర్థం చేసుకోవడం, సరైన రీతిలో వ్యక్తీకరించడం అలవడుతుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఐదు నుంచి పదేళ్ల వయసు వరకూ పిల్లల్లో మానసిక వికాసం పతాక స్థాయిలో ఉంటుంది. ఆ వయసులో వారికి కథలు పరిచయం చేస్తే మేధో వికాసంతో పాటు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. నాటి బాల్యంలో కథలు వినటం అనేది అంతర్లీనంగా ఉండటంతో ఇప్పుడు నాలుగు పదుల వయసు ఉన్న వారిలో విలువలు, సామాజిక బాధ్యత, బంధాల పట్ల సానుకూల దృక్పథం ఉండటం గమనించొచ్చు.
నాటి బాల్యంలో చదువుల ఒత్తిడి లేదు. ఐఐటీలు, ఇంజనీరింగ్ మెడిసిన్లు ఇవేమీ తెలియవు. తెలిసిందల్లా బడికి వెళ్లి రావడమూ, ఆడుకోవడం. ప్రతి ఆటలోనూ పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే ఏదో ఒక అంశం ఉండేది. నాయకత్వ లక్షణాలు అబ్బేవి. గెలుపు ఓటములను ఒకే రకంగా చూడగలిగే దృక్పథం అలవడేది. నేటి తరానికి ఆటలు దూరం కావడం వల్ల శారీరక, మానసిక నిస్సత్తువ ఆవహించేస్తున్నది. 2019లో చేసిన ఒక పరిశోధనలో చిన్నతనంలో ఆరు బయట ఆడుకున్న పిల్లల్లో తర్వాతి జీవితంలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటం గమనించారు. 87 శాతం మంది ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండటం గమనించారు. పిల్లలు ఆడుకునే మట్టిలో ఉండే మైకోబ్యాక్టీరియం వాకి అనే బ్యాక్టీరియా మెదడులో సెరటోనిన్ మోతాదును పెంచుతుందని పరిశోధనలో తేలింది. ఈ సెరటోనిన్ పిల్లల మూడ్‌ను మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి కూడా ఇస్తుంది.
జనాభా నియంత్రణ కోసం ‘చిన్న కుటుంబం.. చింతలు లేని కుటుంబం’ అంటూ గతంలో పలు ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ కు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాయి. దీంతో కుటుంబ సభ్యుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగం కోసమనో, వ్యాపారం కోసమనో నగరాలకు, పట్టణాలకు వలసలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కుటుంబాల స్థానాన్ని చిన్న కుటుంబాలు ఆక్రమించేశాయి. కాగడా పెట్టి వెతికినా ఉమ్మడి కుటుంబాలు కనిపించడం కష్టమైపోయింది. ఏడాదికో, రెండేళ్లకో పల్లెకు వెళ్లడం పెద్దలను, బంధువులను కలవడం తప్ప అందరూ కలిసి ఉండటం అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది. నేటి పిల్లలకు బంధువుల్లో ఎవరు ఏ వరుస అవుతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇది పిల్లల వికాసం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన పిల్లలకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, చిన్న కుటుంబంలో ఉండే పిల్లలకు అన్ని నష్టాలు ఉన్నాయి.
ఇప్పుడు కుటుంబం అంటే అమ్మ నాన్న, పిల్లలు అంతే. అందులోనూ ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఇద్దరు వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో ఉండేవారే. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య మాటలు కరువవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తల్లిదండ్రులు రోజు మొత్తం మీద పిల్లలకు కేటాయిస్తున్న సమయం 30 నిమిషాలు మాత్రమే అని తేలింది. పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇది వారిలో అభద్రతా భావాన్ని పెంచుతుంది.
ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు ఏదైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా ఎవరో ఒకరు సరిదిద్దేవారు. చిన్న కుటుంబాల్లో ఆ అవకాశం లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఎవరికి వారు బిజీగా ఉండటం వల్ల పిల్లల నడవడిక మీద, ఆలోచన విధానం మీద దృష్టి సారించే సమయం ఉండటం లేదు. పిల్లలకు సరైన దిశా నిర్దేశం దొరకటం లేదు.
బాల్యం అంటే కేవలం జ్ఞాపకాలే కాదు, వ్యక్తిత్వ నిర్మాణం కూడా. ఆ మధ్య వచ్చిన వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాలో ‘జ్ఞాపకాలు మోయాల్సిందే.. మంచివైనా చెడ్డవైనా’ అంటూ ఓ డైలాగు ఉంటుంది. బాల్య జ్ఞాపకాలు కూడా అంతే, అంత తేలిగ్గా వదిలి పెట్టవు. ఓ వ్యక్తి రాబోయే రోజుల్లో ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అని నిర్దేశించేది బాల్యమే, అప్పటి జ్ఞాపకాలే. బాల్యం, అప్పటి జ్ఞాపకాలు మనుషులపై గాఢ ప్రభావం చూపిస్తాయని సైకాలజీ చెబుతుంది. ఆ ప్రభావం ఎంతగా ఉంటుందో చూద్దాం..
బాల్యం, బాల్య జ్ఞాపకాలు మనుషులపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకున్నారు కదా. కుటుంబంతో కలిసి ఉండటం, కథలు వినడం, ఆరుబయట ఆటలు పిల్లలకు ఎంత ముఖ్యమో అర్థమైంది కదా. మరి ఇవన్నీ కూడా మన పిల్లలకు అందిద్దామా.. బాల్యాన్ని మళ్లీ పాత రోజులకు తీసుకు వెళ్లడం ద్వారా భావితరాలకు బలమైన పునాదిని వేయడం మన చేతిలోనే ఉంది మరి.
రండి.. చేయి చేయి కలుపుదాం..
బంగారు బాల్యాన్ని అందిద్దాం..
జనరేషన్ ఆల్ఫా, బీటాలకు ప్రపంచమే ఇల్లు. భౌగోళిక, మానసిక సరిహద్దులను దాటి వసుధైక కుటుంబంలా ఉండనున్నారు. సాంస్కృతిక వ్యత్యాసాల పట్ల సానుకూల దృక్పథం, భిన్నాభిప్రాయాల పట్ల గౌరవం, సామాజిక అంశాల పట్ల అవగాహన ఈ తరాల ప్రధాన లక్షణాలు కానున్నాయి. జీవనశైలి కూడా పర్యావరణానికి హాని కలిగించని విధంగా మారనుంది. ముందు తరాల వారికి మానసిక ఆరోగ్యంపై అవగాహన లేక రకరకాల సమస్యలతో సతమతమైతే, ఈ తరాలు మానసిక ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఈ తరాలతో వచ్చిన చిక్కల్లా ఏంటంటే.. ఆప్యాయత అనురాగాలకు, బంధాలకు బంధుత్వాలకు నిర్వచనం మారిపోవడం. ఈ విషయంలో సరైన దిశానిర్దేశం చేయగలిగితే నవతరం బాల్యమూ నందనవనంగా మారుతుంది.
ప్రస్తుత తరాల బాల్యం ఒక రకంగా ఉంటే, రానున్న తరాల బాల్యం మరో రకంగా ఉంటుందని మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2010 2024 మధ్య పుట్టినవారిని జనరేషన్ ఆల్ఫాగాను, 2025 2039 మధ్య పుట్టినవారిని జనరేషన్ బీటాగా పరిగణిస్తున్నారు. ఈ రెండు తరాల బాల్యమంతా కూడా టెక్నాలజీతో ముడిపడి ఉంది. ముందుతరాల వారికి టెక్నాలజీ కొంత కొరుకుడు పడని విషయం కావచ్చేమో గానీ, వీళ్లు మాత్రం వేళ్ల మీద ఆడుకుంటారు. ‘కొత్త బంగారులోకం’ మూవీలో హీరోయిన్ మేనమామ ‘ఈరోజు తప్పయింది రేపు ఒప్పు అవుతుంది, ఈరోజు ఒప్పు అయింది రేపు తప్పు అవుతుంది’ అంటూ ఉంటాడు. సరిగ్గా గమనిస్తే తరాల జీవనశైలి కూడా అంతే. ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అనుకున్న దుస్తులు, హెయిర్ స్టయిల్ ఇప్పుడు రెట్రో స్టయిల్ అయ్యాయి. అప్పట్లో పేదవాళ్లు తినేవని తేలిగ్గా చూసిన జొన్నలు, రాగులు ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు అయ్యాయి. జొన్నరొట్టె, రాగి సంకటి తింటున్నామని గొప్పగా చెప్పుకొనే రోజులు వచ్చాయి. పిల్లల బాల్యం కూడా అంతే. ఆల్ఫా, బీటా తరాలు టెక్నాలజీలో మునిగితేలినా వారి ముందుతరాల కంటే చాలా విషయాల్లో బెటర్‌గా ఉంటారని అంచనా. ఈ తరాలకు స్క్రీనేజర్స్ అని పేరు పెట్టినా, నెమ్మదిగా పాతతరం బాల్యం వైపు అడుగులు వేస్తున్నారు. 2023లో 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై నిర్వహించిన సర్వేలో స్కూల్ నుంచి రాగానే స్నేహితులను కలిసే వారి సంఖ్య 12 శాతం పెరగ్గా, వీడియోగేమ్స్ ఆడే వారి సంఖ్య 6% తగ్గిందని తెలిసింది. 2021 నుంచి చేసే ప్రతి పనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారి సంఖ్య 15% తగ్గింది. పిల్లల మనసు శాస్త్రీయ అంశాలపై మళ్లడం ఈ తరాల ప్రత్యేకత. పర్యావరణ సంబంధ అంశాలపై కూడా ఆసక్తి పెరగడం గమనించొచ్చు. ఇంకో శుభ పరిణామం ఏంటంటే.. తమ ఆశలు ఏంటో, ఆశయాలు ఏంటో ధైర్యంగా చెప్పగలిగే ఆడపిల్లలు ముందు తరాల కంటే 18 శాతం పెరగటం! ముందు తరాల వారికి సీరియల్స్, సినిమాలు, సిరీస్‌లు వినోద మాధ్యమాలుగా ఉంటే, ఈ తరాలు వినడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. పోడ్కాస్ట్లు వినే వాళ్ల సంఖ్య 12 శాతం, ఆడియో బుక్స్ వినే వారి సంఖ్య ఆరు శాతం పెరగడం విశేషం.
ఇప్పుడు పిల్లలకు ఓ ప్రశ్నకు సమాధానం కావాలన్నా, సమాచారం కావాలన్నా పేరెంట్స్నో, టీచర్స్నో అడగటం మానేశారు. గూగుల్‌నే ఆశ్రయిస్తున్నారు. 2025 ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఓ సర్వేలో ఏడు నుంచి పదేళ్ల వయసు ఉన్న పిల్లలు సమాచారం కోసం పెద్దలను అడగటం కంటే, గూగుల్‌ని అడగడమే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ మీకో అనుమానం రావచ్చు, సమాచారమే కదా ఎవరిని అడిగితే ఏముంది అని. సైకాలజీ అలా చెప్పడం లేదు, 2018 లో డాక్టర్ రేచల్ రోమియో బృందం చేసిన పరిశోధనలో పెద్దలతో సంభాషణ పిల్లల మెదడులో ఫోకస్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ రెగ్యులేషన్లను నియంత్రించే ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని తేలింది. పిల్లలు ప్రశ్నలను చాలెంజింగ్‌గా తీసుకొని జవాబులు వెతికే క్రమంలో మెదడులో న్యూరాన్స్ మధ్య కనెక్టివిటీ పెరిగి బుర్ర చురుగ్గా ఉంటుందని, ప్రతి దానికి గూగుల్ చేయడం ద్వారా మెదడుకు ఈ ప్రక్రియ అందక సహజ సిద్ధమైన సామర్థ్యాన్ని కూడా కోల్పోతుంది.
యాభై ఏళ్ల కిందట అనుకుంటా.. బడిపంతులు అనే సినిమా వచ్చింది. అందులో ‘బూచోడమ్మా బూచోడు.. బుల్లి పెట్టెలో ఉన్నాడు’ అంటూ ఓ పాట కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ బూచోడు ప్రతి ఇంట్లోనూ తిష్ట వేశాడు. ఆటలకు మాటలకు, వినోదానికి, వికాసానికి అన్నిటికీ సెల్‌ఫోనే. ఆటలు అంటే వీడియో గేమ్స్ మాత్రమే. ట్యాబో, ఫోనో లేకుండా పిల్లలు గంట కూడా ఉండలేని పరిస్థితి. ఓ పక్కన వైద్యులు, మనోవికాస నిపుణులు 18 నెలల వయసులోపు పిల్లలకు ఎటువంటి స్క్రీన్ అలవాటు కాకూడదని చెప్తూ ఉంటే, ఏడాది పిల్లలకు కూడా ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నాం! రెండేళ్ల వరకు పిల్లలకు ఎలాంటి స్క్రీన్ అలవాటు కాకూడదని, రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు తల్లిదండ్రుల పర్యవేక్షణలో రోజుకు గంట, ఐదు నుంచి పదేళ్ల వరకు రోజుకి రెండు గంటల లోపే స్క్రీన్ టైమ్ ఉండాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచన. పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. 2023లో నిర్వహించిన ఒక సర్వేలో 12 ఏళ్ల వయసు లోపు పిల్లల్లో 42 శాతం మంది రోజుకి నాలుగు గంటలు కంటే ఎక్కువ సేపు ఫోన్ లేదా టీవీ చూస్తున్నారని తెలిసింది. 2024లో నిర్వహించిన ఒక పరిశోధనలో ఐదు నుంచి 16 ఏళ్ల వయసు పిల్లల్లో 60 శాతం మంది డిజిటల్ అడిక్షన్ బారిన పడ్డారని తేలింది. ఈ ధోరణి పిల్లల శారీరక మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అందుకే నేటి తరం పిల్లల్లో ఆటిజం, ఏ.డి.హెచ్.డి, డెవలప్మెంటల్ డిలే, స్పీచ్ డిలే వంటివి ఎక్కువగా చూస్తున్నాం.
– బి.కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నీషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, హైదరాబాద్
99854 28261