కాలేయం ఆమెను కాటికి చేరువచేస్తున్న దశ. యాభై కిలోమీటర్ల దూరంలోని సర్కారు దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆ తల్లి కన్నుమూసింది. సరిగ్గా అదే సమయానికి ఆమె కొడుకు సుశాంత గిరి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. ఆ రోజే చివరి ఎగ్జామ్. పూర్తికాగానే నేరుగా శ్మశానానికే వెళ్లాడు. ‘ఈ దుఃఖం నాది కాదు. సమస్త సుందర్బన్ ప్రాంతానిది. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా వేలాది కుటుంబాల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత నాదే’ అనుకున్నాడు గిరి. పట్టుదలతో చదువుకుని ప్రయోజకుడు అయ్యాడు. పశ్చిమ బెంగాల్లోని బైకుంఠపూర్ ప్రాంతంలో ‘ఏక్తా యూత్ క్లబ్’ ప్రారంభించాడు. ఇక్కడి పిల్లల కోసం ఓ పాఠశాల నడుపుతున్నాడు. ఇందులో నామమాత్రపు ఫీజుకే నాణ్యమైన విద్య అందిస్తారు. పొద్దున్నే పాలు ఇస్తారు. మధ్యాహ్నం భోజనం పెడతారు.
ఈ ఆవరణలో చదువుకున్న విద్యార్థులు లాయర్లుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, నర్సులుగా పనిచేస్తున్నారు. తమ జీతంలోంచి ఎంతోకొంత విరాళంగా ఇస్తున్నారు. ఆ నిధులతోనే ఈ విద్యాసంస్థను నడుపుతున్నాడు గిరి. ఇప్పటికే సుందర్బన్ ప్రాంతంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలోని యాభై రెండు పల్లెలకు గిరి సేవలు విస్తరించాయి. వైద్యం, ఉపాధి కల్పన తదితర విభాగాలపైనా శ్రద్ధ పెడుతున్నాడు. వైద్య సేవల విషయంలో గిరి చాలా కచ్చితంగా ఉంటాడు. తల్లి మరణం తాలూకు విషాదం తనను ఇంకా వెంటాడుతూనే ఉంది. కాబట్టే, పద్నాలుగు పడకలతో సకల సౌకర్యాలూ ఉన్న వైద్యశాలను ఏర్పాటుచేశాడు. స్థానికులకు వ్యవసాయమే ప్రధాన ఉపాధి మార్గం కాబట్టి, సేంద్రియ పంటలతో ఆదాయాన్ని పెంచుకోవడం ఎలాగో నేర్పుతున్నాడు. ఫలితంగా వలసలు తగ్గాయి. వసతులు మెరుగుపడటంతో శిశుమరణాలు, ప్రసూతి మరణాలు నామమాత్రం అయ్యాయి. గిరి నేతృత్వంలో ఓ విపత్తు నివారణ బృందమూ పనిచేస్తున్నది. తుఫానులు, గాలివానలు సంభవించినప్పుడు స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగుతారు. ‘ఇంకా జరగాల్సింది చాలా ఉంది. సుందర్బన్ చుట్టుపక్కల ఏ పల్లెకూ కష్టమన్నదే తెలియకూడదు. ఇదే నేను కోరుకునేది’ అంటాడు గిరి.