గంగానది పొడవునా ఘాట్లు అంటే నిరంతరం ఏవేవో సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పుర్‌లో మాత్రం గంగా ఘాట్ ఒకటి పాఠశాలగా మారింది. అక్కడ 31 ఏండ్ల నితిన్ పేదపిల్లలకు జ్ఞానగంగను ప్రసాదిస్తున్నాడు. అతను న్యాయశాస్త్ర పట్టభద్రుడు. కాన్పుర్‌లోని మురికివాడలు, చెత్త ఏరుకునేవాళ్లు, నదిలో పడవలు నడుపుకొనే కుటుంబాలకు చెందిన పిల్లలు ఈ ట్యూషన్‌కు వస్తుంటారు. వారికి గణితం, సంగీతం మొదలుకొని సంస్కృతం, ఫ్రెంచి భాష మొదలైనవి నేర్పుతుంటాడు. ఈ బడి ప్రారంభానికి నితిన్ వ్యక్తిగత అనుభవాలే స్ఫూర్తిగా నిలిచాయి.
కాన్పుర్ ఇరుకు వీధుల్లో దుర్భరమైన పేదరికంలో పెరిగిన అనుభవం అతనిది. తల్లి ఇంటిపని చేసుకునేది. తండ్రికి తగిన ఉద్యోగం లేకపోవడంతో అప్పుడప్పుడు ఖాళీగా ఉండే పరిస్థితి. దీంతో నలుగురి పిల్లల భారం తల్లే మోసేది. “మా అమ్మ పనిచేసే ఇండ్లవాళ్లు ఇచ్చిన ఆహారంతో వెళ్లదీసిన రోజులు కూడా ఉన్నాయి. మాకు పెట్టి తను అప్పుడప్పుడు పస్తులు ఉండేది. నీళ్లలో చక్కెర కలుపుకొని తాగి ఆకలి తీర్చుకునేది” అని నితిన్ గతం గుర్తుచేసుకుంటాడు. అలా పేదరికం పీడిస్తున్నప్పటికీ నితిన్‌కు చదువు ప్రాధాన్యం గురించి చిన్నతనంలోనే తల్లి నూరిపోసింది.
కానీ, బడికి వెళ్లడం మాత్రం అతనికి నిత్యపోరాటంగా ఉండేది. అయినప్పటికీ, నితిన్ చదువుకునే ప్రయత్నం విరమించుకోలేదు. ఉన్నత పాఠశాల విద్య పూర్తికాగానే అతను కాన్పుర్‌లోని మురికివాడల పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు మొదలుపెట్టాడు. పేదరికం, నిరక్షరాస్యతలో మగ్గిపోయే పిల్లలకు దిశా నిర్దేశం చేసేవాళ్లు ఎవరూ ఉండరు కాబట్టి, ఆ బాధ్యత తాను తీసుకున్నాడు. అయితే, స్థలం సమస్య వేధించింది. 2009లో నితిన్ దీనికి ఓ పరిష్కారం కనుక్కొన్నాడు. కాన్పుర్ నగరంలో గంగా తీరంలోని కమలేశ్వర్ ఘాట్ వేదికగా తరగతులు మొదలుపెట్టాడు.
“ఆరుబయట చదువు చెప్పడం వల్ల పిల్లలు కూడా చక్కగా వింటున్నారు” అంటాడు నితిన్. అలా పదిహేనేండ్లుగా మంద్రంగా సాగిపోయే గంగా ప్రవాహం నేపథ్యంలో నితిన్ ఆధ్వర్యంలో జ్ఞానగంగా ప్రవాహం నిరాటంకంగా సాగిపోతున్నది. ఇదే ఆ పాఠశాలకు ‘ఘాట్ వాలా స్కూల్’ అని పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ బడిలో 200కు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నితిన్‌కు అండగా స్థానిక ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవకులు నిలుస్తున్నారు. బడి అంటే తరగతి గదుల్లో జరిగేది మాత్రమే కాదు. విద్యావంతుడు చదువుకు ఎక్కడైనా సార్థకత కల్పిస్తాడు. విద్య వ్యాపారమైన చోట నితిన్ లాంటివారు చేస్తున్న సేవ విద్యావేత్తలకు స్ఫూర్తిదాయకం.