ఇన్స్పెక్టర్ రుద్ర అన్ని ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో సీఐ శరత్.. గంగ స్టోరీ చెప్పడం ప్రారంభించాడు. ‘హలో రుద్ర.. భాస్కర్, అతని ప్రియురాలు కాంచన స్టోరీ అర్థమయ్యిందిగా. ఇప్పుడు కొత్తగా ఈ గంగ క్యారెక్టర్ ఏమిటా? అని నీకు డౌట్ రావొచ్చు. నిజానికి గంగను మేము ఈ సీన్లోకి తీసుకురాలేదు. పిచ్చిది.. ఓ సారీ.. సారీ.. పిచ్చోడు వాడే వచ్చాడు’ అని శరత్ అనగానే రుద్ర సహా అందరూ షాకయ్యారు.
‘గంగ అమ్మాయి కాదా.. అబ్బాయా?’ అంటూ హెడ్‌కానిస్టేబుల్ నోరెళ్లబెట్టగానే.. ‘అవును.. బాబాయ్. గంగ స్టోరీలో మరో ట్విస్ట్ ఏంటో తెలుసా?’ అంటూ స్నేహిల్ వైపు చూశాడు శరత్. అసలేం జరుగుతుందో అర్థం కాక, ముఖాలన్నీ క్వశ్చన్ మార్కుతో పెట్టారు అక్కడ ఉన్నవారందరూ. ఇంతలో శరత్ కొనసాగిస్తూ.. ‘ఒరేయ్ స్నేహిల్గా.. నీకు సినిమా నాలెడ్జ్ ఎక్కువేగా.. అయితే, దీనికి ఆన్సర్ చెప్పు. ఇది పజిల్ ఏమీ కాదురోయ్.. జస్ట్, గంగ గురించి మీ నోటివెంటే విషయాలు రప్పిద్దామని. అడగమంటావా?’ అంటూ కనుబొమ్మలు ఎగురవేశాడు శరత్. రుద్ర సరేనన్నట్టు సైగ చేయడంతో ‘అడుగు’ అన్నాడు స్నేహిల్. ‘రాఘవ లారెన్స్ కాంచన, గంగ సినిమాల గురించి డిస్కషన్ అయ్యిందిగా.. ఇప్పుడు ఈ గంగ అనే పేరుపెట్టుకొన్న హీరోయిన్ జ్యోతిక ఓ సినిమాలో మరో క్యారెక్టర్‌గా మారుతుంది. ఆ సినిమా ఏంటో’ అని శరత్ పూర్తిచేయకుండానే.. ‘చంద్రముఖి’ అంటూ సమాధానమిచ్చాడు స్నేహిల్. ‘మా బాబే.. నీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా సినిమా నాలెడ్జ్ బాగుందిరోయ్’ అంటూ శరత్ ఇంకా ఏదో చెప్తూపోతుండగా.. ‘అసలు విషయానికి రా.. ఎవరీ గంగ, చంద్రముఖి మధ్యలోకి ఎందుకు వచ్చింది?’ అంటూ మదిలో ఏదో అలజడితో సీరియస్‌గానే అన్నాడు రుద్ర.
‘కూల్ అవ్వు బాస్. లేకపోతే, నేను హర్ట్ అవుతా. అప్పుడు నీకే కష్టం’ అంటూ అంతే సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు శరత్. కోప్పడితే లాభంలేదనుకొన్న రుద్ర.. ‘సరే.. గంగ, చంద్రముఖి గురించి చెప్పు.. ప్లీజ్’ అంటూ బతిమిలాడాడు. చిన్నగా నవ్విన శరత్ మొదలుపెట్టాడు. ‘18వ పునర్జన్మ బలిపీఠ యాగానికి విష్ణుమూర్తి జాతకంలో పుట్టిన వాళ్లను మేం వెతకడం ప్రారంభించాం. అయితే, ఎప్పటి నుంచి ఈ విషయాన్ని గమనిస్తున్నాడో ఏమో.. గంగారామ్ అనే ఓ వ్యక్తి మమ్మల్ని ఫాలో అవుతూ ఓ రోజు మా స్థావరానికి వచ్చాడు. అదే సమయంలో కాంచనతో మా వాగ్వాదం కొనసాగుతుంది. వాడికి అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాకపోయినప్పటికీ, ఏదో క్రైమ్ మాత్రం జరుగుతుందని గ్రహించి బయటకు పరుగెత్తబోయాడు. దీంతో వాడిని ఎలాగైనా అడ్డుకోవాలని డబ్బులు ఆశచూపాం. బెదిరించాం. భయపెట్టాం. అయినా.. వాడు దేనికీ లొంగలేదు. అయితే, అప్పుడే వాడి మాటల్లో నాకు ఓ విషయం అర్థమైంది. నటన అంటే వాడికి పిచ్చి. సినిమాల్లో అవకాశాల కోసం పిచ్చి కుక్కలా తిరిగాడట. అది తెలిసిన నేను.. నా పోలీసు పవర్ ఉపయోగించి సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని నమ్మించా. వాడూ నమ్మాడు. అయితే, చివరకు మాకు అంత పెద్ద ఝలక్ ఇస్తాడనుకోలేదు’ అంటూ ఆగిపోయాడు శరత్.
‘మధ్యలో ఆపుతావేంట్రా? నువ్వేమైనా క్రైమ్ స్టోరీ రైటర్‌వా?? పాజ్లు ఇచ్చుకొంటూ సస్పెన్స్ క్రియేట్ చేయడానికి? హత్యలు చేశావ్‌రా.. నువ్వో క్రిమినల్వి, హంతకుడివి’ అంటూ హెడ్ కానిస్టేబుల్ రామస్వామి టెన్షన్‌ను తట్టుకోలేక అంతెత్తున లేచాడు. ఇంతలో కలుగజేసుకొన్న రుద్ర.. కాస్త భయంతోనే ‘ఆ తర్వాత?’ అన్నాడు. చెప్పడం కొనసాగించాడు శరత్. ‘సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నేను అనగానే నమ్మిన సారీ నమ్మినట్టు నటించిన ఆ గంగారామ్.. లేడీ క్యారెక్టర్లు బాగా వేయగలనని, ట్రాన్స్‌జెండర్‌గా మారడం తనకు ఇష్టమని చెప్పాడు. లింగమార్పిడికి కూడా సిద్ధమని చెప్పిన గంగారామ్.. సర్జరీ అయ్యాక తన పేరును చంద్రముఖిగా మార్చమన్నాడు. నేను వద్దని వారించా. గంగారామ్ కాబట్టి గంగ అని మారుస్తా అని చెప్పా. అయితే, ఇక్కడే గంగారామ్ మాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అసలు వాడు వచ్చింది సినిమా అవకాశాల కోసమో.. సర్జరీ చేయించుకోడానికో కాదు.. కాంచనను తప్పించడానికి. ఎందుకంటే, కాంచనకు స్వయానా వాడు తమ్ముడు. ఇద్దరూ కవలలు. విష్ణుమూర్తి జాతకంలోనే ఇద్దరు పుట్టారు. ఎంతైనా నేనూ పోలీసునే కదా. అందుకే ఇట్టే వివరాలు సేకరించా. మాకు ఈ విషయాలు తెలిసిపోయాయని గమనించిన గంగాధర్ అలియస్ గంగ.. నిజంగానే చంద్రముఖిలా మారిపోయింది’ అంటూ తాగడానికి నీళ్లు కావాలని సైగ చేశాడు శరత్.
‘ఏరా.. కాంచన, గంగ, చంద్రముఖి సినిమా స్టోరీలను కాపీ కొడుతూ.. నీ దరిద్రపు క్రియేటివిటీని మాపై రుద్దాలనుకొంటున్నావా?’ అంటూ ఫోరెన్సిక్ ఇంచార్జీ జయ అంతెత్తున లేచింది. ఇంతలో ఆమెను నిలువరించిన రుద్ర.. ‘అసలేంటి.. నువ్వు చెప్పేది?? ఈ చంద్రముఖి.. ఆ చంద్రముఖీ దేవి అయితే కాదుకదా??’ అని వణికిపోతూ అడిగాడు రుద్ర. ఆ వెంటనే అందుకొన్న శరత్ కొంచెం భయపడుతూనే.. ‘రుద్ర.. భయంలోనూ ఎంతో థ్రిల్ ఉందిరా.. నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానాన్ని చెప్పాలంటే.. నేనడిగే ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వు’ అంటూ వణుకుతున్న గొంతుతో గేమ్ మొదలుపెట్టాడు శరత్. ‘మొదటి ప్రశ్న: మహిళలు దేవుని ముందు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..’ రుద్ర సమాధానం చెప్పాడు. రెండో ప్రశ్న: ఉంగరాన్ని ఎడమ చేతి వేలుకే పెట్టుకోవాలంటారు? ఎందుకు?? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్..’ రుద్ర సమాధానం చెప్పాడు. మూడో ప్రశ్న: గోత్రాలు ఎలా పుట్టాయ్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. నాలుగో ప్రశ్న: ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..’ రుద్ర సమాధానం చెప్పాడు. ఐదో ప్రశ్న: ఒక వ్యక్తి తన 25వ పుట్టిన రోజునాడు చనిపోయాడు. ‘పండు ముసలి కదా.. అందుకే కాలంచేశాడు’ అని డాక్టర్లు అన్నారు. ఎలా?? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు.
ఐదు ప్రశ్నలకు రుద్ర కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో.. భయపడిపోతూనే శరత్.. ‘ఈ చంద్రముఖి.. ఆ చంద్రముఖీ దేవి ఒకటే’ అంటూ కండ్లతోనే సైగ చేశాడు. ఆ వెంటనే.. ‘ఏయ్.. శరత్.. నువ్వు చంపింది గంగను, చంద్రముఖిని కాదురా.. చంద్రముఖీదేవిని’ అంటూ గట్టిగా అరిచాడు రుద్ర. అసలేం జరుగుతుందో అర్థంకాక అందరూ నిశ్చేష్టులై ఉండిపోయారు. ఆ విషయం పక్కనబెడితే, శరత్ అడిగిన ప్రశ్నలకు రుద్ర ఏం సమాధానాలు ఇచ్చాడో కనిపెట్టారా?
సమాధానం 1: స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయ్యాలనుకొన్నప్పుడు వారి పొట్ట నేలను తాకుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. దానికి ఏమైనా హాని జరుగొచ్చని ఇలా అంటారు.
సమాధానం 2: ఎడమ చేతి వేలికి, మెదడులోని రక్త నాళాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా ఎడమచేతి నాలుగో వేలికి ఉంగరం ధరిస్తే, మెదడు చైతన్యవంతమైతుందని అంటారు.
సమాధానం 3: పురాతన కాలంలోని వారికి గోవులే ధనం. ఒకరి గోవులు, మరొకరి మందలో కలువకుండా ఒక్కో గో యజమానికి ఒక్కో పేరు పెట్టేవారు. అవే ఇప్పుడు గోత్రాలుగా మారాయి.
సమాధానం 4: పూర్వకాలం ఇండ్లముందే పిల్లలు ఆడుకొనేవారు. దీంతో ఇంటి ముందు ముగ్గు వేసేవారు. ముగ్గులోని సున్నపు పొడి వల్ల సూక్ష్మక్రిములు చనిపోయి.. పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావొద్దనే ఈ ఉపాయం.
సమాధానం 5: ఆ వ్యక్తి పుట్టిన రోజు ఫిబ్రవరి 29. అంటే లీపు సంవత్సరం (నాలుగేండ్లకు ఒకసారి వస్తుంది)