భారతదేశంలో భూమికథ హింసతో, రక్తపాతంతో, కన్నీటి మరకలతో నిండి అనంతంగా విస్తరించింది. అధికారిక పత్రాలు, ముఖ్యంగా భూమి సమస్య గురించి నిపుణులు రాసిన గ్రంథాలు లోతుగా అధ్యయనం చేసి తెలుసుకున్న ఎన్నో కీలకాంశాలతో హఠాత్తుగా ఆనంద్ (నవలలో ప్రధాన పాత్ర) మస్తిష్కం కిక్కిరిసిపోయింది. వాటిలో ఒకటి.. పంతొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ పాలకుల ప్రోత్సాహంతో ఒక వ్యవస్థగా ఎదిగిన భూస్వామ్యం పుట్టుకకు సంబంధించినది.
కొందరు స్థానిక నాయకులు గెరిల్లా మార్గంలో దోపిడీలు సాగించి అధికారానికెలా వచ్చారో, జనం నుంచి ఎలా పన్ను వసూలుచేశారో, క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వంతో పొత్తు చేసుకుని దేశంలో విస్తృత భూసంపద మీద తమ ఆధి పత్యాన్ని స్థాపించుకున్నారో.. జమీందార్లు, పాలెగాళ్ళు అనే బిరుదులతో ఎలా వేళ్ళు తన్నుకుని నిలబడ్డారో పూసగుచ్చినట్టు వివరించింది. భూములకు వాళ్ళు రాజస్వం లేదా కప్పం చెల్లించేవారు. అధికార కేంద్రం బలహీనపడినప్పుడు అది అనిశ్చితంగా ఉండేది. బలవత్తర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏటా విధిగా రాజస్వం చెల్లించేవారు. ఆ రోజుల్లో బందిపోటు, రాజు, భూస్వామి వీరందరూ ఒకే వ్యక్తి ధరించే మూడు రూపాలుగా పరిణమించిన ఆశ్చర్యజనక సన్నివేశం విశేషంగా చెప్పుకోదగింది.
భూమి చరిత్ర తలపోస్తూ ఆనంద్ టేబుల్ ముందు అలాగే కూర్చుండిపోయాడు. యుగయుగాలుగా తన సంతానం లక్షలాది మందిని కడుపులో పెట్టుకుని పోషిస్తున్నదీ భూమాతే. వారిని చెప్పనలవికాని కష్టాల్లోకి తోసిందీ భూమాతే. ముఖ్యంగా బ్రిటిష్ పాలన ప్రారంభం నుంచి. ‘భూమి సమస్తం గోపాలుడికే చెందుతుంద’ని లోకోక్తి. గోపాలుడంటే భగవంతుడు కావచ్చు, లేదా గోసంపద ఉన్నవాడూ, గోవుల్ని పాలించేవాడూ కావచ్చు. మొదట గోవు, తర్వాత గోపాలుడు ఇదీ వరసక్రమం.
పశుపాలక సమాజంలో మనిషి పశువులతోపాటే సంచరించేవాడు కనుక ఇది సహేతుకంగానే కనిపిస్తుంది. ఆ విధంగా భూమి, దానిమీద జీవించే ప్రతి ఒక్కరికీ సొంతం; చెట్టు తనమీద గూడు కట్టుకున్న ప్రతి పక్షికీ సొంతం; అలాగే నీరు… అయత్నజనితమైన అవ్యాజమైన సృష్టికర్త చలవతో తనలోకి ఎగిరి దూకుతూ, ఈదుతూ, జారుతూ, పిల్లిమొగ్గలు వేస్తూ స్వేచ్ఛగా సంచరించే ప్రతి చేపపిల్లకీ అది సొంతం. ప్రతిదీ ప్రతి ఒక్కరికీ చెందుతుంది. ‘చెందడం’ అన్నదే సర్వవ్యాపితమైన స్వాభావిక స్థితి. అక్కడ ఎటువంటి రికార్డులు లేవు. రిజిస్ట్రేషన్లు లేవు. ఎవరికీ ప్రత్యేకమైన స్వామ్యం లేదు, ఎవరికీ వ్యక్తిగతమైన హక్కు లేదు.
– మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఆత్మకథాత్మక నవల ‘లోపలి మనిషి’ నుంచి