ఆ మధ్య వచ్చిన రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ ఓ పాటలో ఫిడ్జెట్ స్పిన్నర్‌ను తిప్పుతూ కనిపిస్తాడు. అది చూసిన యూత్ కొన్నాళ్లపాటు ఫిడ్జెట్ స్పిన్నర్‌ను తెగ వాడేశారు. కాలక్రమేణా పక్కన పడేశారు. ఫిడ్జెటింగ్ ఏదో ఫ్యాషన్ కోసం కాదని, స్ట్రెస్ తగ్గించడానికి, ఫోకస్ పెంచడానికి ఉపయోగపడుతుందని సైకాలజీ చెబుతుంది. ఒకచోట కదలకుండా కూర్చుంటే ఏకాగ్రత కుదురుతుంది అనే భావనకు భిన్నంగా చిన్న, చిన్న కదలికలు ఫోకస్‌ను పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎ.డి.హెచ్.డి (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిస్ ఆర్డర్) ఉన్న పిల్లల్లో ఫిడ్జెటింగ్ ఫోకస్ పెంచుతుంది. సాధారణ పిల్లలకు కూడా చదివే సమయంలో దృష్టి మరలకుండా సాయపడుతుంది.
ఇప్పుడున్న ప్రపంచంలో రోజురోజుకీ పిల్లల నుంచి పెద్దల వరకూ ఫోకస్ తగ్గిపోతున్నది. మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత పిల్లలు పట్టుమని పది నిమిషాలు కూడా ఏకాగ్రత చూపలేకపోతున్నారు. మితిమీరిన స్క్రీన్ టైమే దీనికి ప్రధాన కారణం. ఫోన్ ముందేసుకుని గంటలు గంటలు కదలకుండా కూర్చోవడంతో దాని ప్రభావం వారు నేర్చుకునే సామర్థ్యంపై పడుతుంది. దీనికున్న పరిష్కార మార్గాల్లో ఫిడ్జెటింగ్ ఒకటి. ఇదేదో బ్రహ్మపదార్థం అనుకోవాల్సిన అవసరం లేదు. స్థిరంగా ఉండకుండా, కదులుతూ ఉండటం.
న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం ప్రకారం పిల్లల్లో గానీ పెద్దల్లో గాని నేర్చుకునే విధానం మూడు రకాలుగా ఉంటుంది. విజువల్ లెర్నింగ్, ఆడిటరీ లెర్నింగ్, కెనస్థిటిక్ లెర్నింగ్. విజువల్ లెర్నర్స్ చూడటం ద్వారా నేర్చుకుంటే, ఆడిటరీ లెర్నర్స్ వినడం ద్వారా నేర్చుకుంటారు. కెనస్థిటిక్ లెర్నర్స్ అనుభూతి ద్వారా, కదలికల ద్వారా నేర్చుకుంటారు. ఫిడ్జెటింగ్ బాపతు కెనస్థటిక్ లెర్నర్స్ అన్నమాట. వీళ్లు కదులుతూ నేర్చుకుంటారు. ఎ.డి.హెచ్.డి ఉన్న పిల్లలకు ఫోకస్ పెంచుకోవడానికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని వ్యూహాత్మక కదలికల ద్వారా చదువుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు ఏకాగ్రతను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యూహాత్మక కదలికలు ఏంటో చూద్దాం ..
వీటన్నిటిలో కొన్ని కదలికలు కొంతమందికి ఉపయోగపడతాయి. తమకు ఎలాంటి కదలికలు ఉపయోగపడుతున్నాయో స్వానుభవంతో తెలుస్తుంది. ఎవరికి వారు తమకు అనువుగా, అనుకూలంగా ఉన్న వ్యూహాలను అనుసరించి ఫోకస్‌ను పెంచుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మనం అనుసరిస్తున్న ఫిడ్జెటింగ్ వ్యూహం పక్క వాళ్లను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం! కదలకుండా కూర్చుని చదవడం అందరికీ పని చేయకపోవచ్చు, కదలికలతో కొంతమందికి ఫోకస్ కుదరొచ్చు. ఏ విధానం అనుసరిస్తున్నప్పుడు మన ఫోకస్ బాగుంటుందో తెలుసుకొని దానిని అనుసరించడం మంచిది.