ఫ్ల్లాషూట్తో 250 మంది వీడియోగ్రాఫర్లు చేతులు కలిపారు. వాళ్లకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్‌లో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో మొదలైన ఈ సేవలు వైజాగ్, వరంగల్, కరీంనగర్‌కూ విస్తరించాయి. చెన్నై, బెంగళూరు నగరాల్లోని వీడియోగ్రాఫర్లకు శిక్షణ ఇస్తున్నారు. త్వరలో అక్కడ కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వీడియోగ్రాఫర్లను పెద్ద పెద్ద ఫంక్షన్ల కోసమే కాదు నలుగురు స్నేహితులు కలుసుకున్నా, ఆలయానికి వెళ్లినా, గెట్ టుగెదర్ మీట్ అయినా ఫ్లాషూట్తో బుక్ చేసుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా కాదు.
హలో ఫ్రెండ్స్.. ‘ఈ ఫోనేమన్నా బువ్వ పెడుతుందా?’ అని ఇంట్లో వాళ్లు నిలదీస్తున్నారా? ‘ఇన్‌స్టా రీల్స్ చేయడం, రీల్స్ చూడటం తప్ప పైసా సంపాదించే పనే లేద’ని పెద్దలు తిడుతున్నారా? ఇష్టమైన పని దొరక్క, కష్టమైన బతుకులో కాస్త రిలీఫ్ కోసం రీల్స్ చేస్తుంటే ఇన్ని మాటలంటారా అని కుదేలవుతున్నారా! చలో.. ‘ఫోనే ప్రపంచం. రీల్సే జీవితం’ అనుకుంటూ వచ్చిన స్కిల్‌తో నచ్చిన రీల్సే చేసుకుంటూ బతికేయండి. రీల్స్ చేస్తే బతుకుదెరువు ఎలా అనుకోకండి. ప్లే స్టోర్‌లో ఫ్లాషూట్ (Flashoot) డౌన్లోడ్ చేసుకున్నారంటే షార్ట్ వీడియో అవసరమైన వాళ్లకు సాయం చేస్తూ దండిగా సంపాదించొచ్చు. ఐడియా అదిరింది కదూ!
వశిష్ట్ చేతిలో ఎప్పుడూ స్మార్ట్ఫోనే. ఏం చేస్తాడు పాపం.. జాబ్‌లెస్ లైఫ్. నిరుద్యోగికి, చిరుద్యోగికి ఎప్పుడూ తోడుండేది స్మార్ట్ఫోనే. ఎక్కడికి పోయినా అక్కడో రీల్ చేసి రోజులు గడిపేస్తాడు. అవసరమైన వాళ్లు అడిగితే ఫోన్‌తో వీడియో చేసి పెడతాడు. వీడియో ఎడిటింగ్ కూడా బాగా చేస్తాడు. ఇంతకంటే చేసే పనేమీ లేదని అందరూ అనుకుంటారు. ఇలా రీల్స్‌తో టైమ్‌పాస్ చేస్తూ ఉండే వశిష్ట్ లాంటి వాళ్లు ఇంటికి ఒకరైనా ఉంటారు. ఇంత టాలెంట్‌ని వేస్ట్ చేసుకుంటే ఎట్లా? వాళ్లనీ పనిలోపెట్టి ప్రయోజకుల్ని చేయాలనుకున్నాడు కార్తిక్ ఓలేటి. ఏదో సమాజాన్ని ఉద్ధరించాలని ఆయన కంకణం కట్టుకోలేదు. తనకు వచ్చిన చిన్న సమస్యకు పరిష్కారం వెతుకుతుంటే ఆయనకో పెద్ద స్టార్టప్ కాన్సెప్ట్ దొరికింది. ఆ ఐడియాకు తగ్గట్టే ఇద్దరు మంచి మిత్రులు తోడయ్యారు. ముగ్గురూ కలిసి ముచ్చటగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.
కార్తిక్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. వాళ్లమ్మ డెయిరీ టెక్నాలజీలో గోల్డ్ మెడలిస్ట్. ఒక ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీ నడుపుతున్నది. ఆ ఐస్‌క్రీమ్‌లను ప్రమోట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ చేద్దామనుకున్నాడు కార్తిక్. తనకు వీడియో సరిగా తీయరాదు. వీడియో ఎడిటింగ్‌లో పూర్. ఆన్లైన్లో ఎవరైనా ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్ టచ్‌లోకి వస్తారేమోని ‘వీడియోగ్రాఫర్ నియర్ మి’ అని సెర్చ్ చేశాడు. ఇరవై, ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా తీసుకునే కెమెరామెన్లే ఆయనకు ఆన్లైన్లో తారసపడ్డారు. నిమిషం వీడియో కోసం అంత ఖర్చు అవసరమా అనుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వెతికాడు. బోలెడు వీడియోలు తీసి రీల్స్ పోస్ట్ చేసేవాళ్లు ఉన్నారు. కానీ, వాళ్లకు ఉన్న స్కిల్‌తో ఇతరులకు నిరుపయోగం అని అర్థమైంది.
కార్తిక్ ఫ్రెండ్ ఓ రోజు కాల్ చేసి ‘వీడియోగ్రాఫర్ దొరకట్లేదు. ఇన్‌స్టా రీల్ కోసం వీడియో తీయాలి వస్తావా?’ అని అడిగాడు. కార్తిక్ వాళ్లింటికి వెళ్లి వీడియో తీసి, ఫోన్లోనే ఎడిటింగ్ చేసి 30 సెకన్ల వీడియో ఇచ్చాడు. ఇదంతా ఒక గంటలో జరిగిపోయింది. వీడియోలు తీయడం, రీల్స్ ఎడిట్ చేసి ఇవ్వడం ఇంత తేలిగ్గా, వేగంగా చేయొచ్చని వాళ్లకు అర్థమైంది. జొమాటో, ఉబర్, ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకున్నట్టుగా రీల్స్ కోసం కెమెరాపర్సన్ని బుక్ చేసుకునే సర్వీస్ ఉంటే బాగుంటుందని కార్తిక్‌కి ఐడియా వచ్చింది. పెండ్లి, పుట్టినరోజు, పండుగలు, గృహప్రవేశం, ప్రారంభోత్సవాలకు ఫొటోగ్రాఫర్‌ని పిలిస్తే వారం తర్వాతనే వీడియోలు ఇస్తారు. పెండ్లి వీడియోలకు నెలలు పడుతుంది. వేడుక రోజే వీడియోలు షేర్ చేసుకుంటే సంతోషాన్ని అందరితో పంచుకున్నట్టు ఉంటుంది. కానీ, మనవాళ్ల పని అలా లేదు. కస్టమర్‌కి కావాల్సినట్టుగా చేసేందుకు చిన్నచిన్న వీడియోగ్రాఫర్స్ని కలిశాడు. వాళ్లకు నెలకు రెండు, మూడు ఈవెంట్స్ ఉంటాయని, మిగతా రోజులన్నీ ఖాళీగా ఉంటామని చెప్పారు. అప్పుడు వీడియోగ్రాఫర్ అవసరం ఉన్నవాళ్లకు, వీడియోగ్రాఫర్లకు మధ్య గ్యాప్ ఉందని గ్రహించాడు. దాన్ని కనెక్ట్ చేసేందుకు ఇంటర్నెట్‌ని వాడాలనుకున్నాడు. ఇదే ఐడియాని తన ఫ్రెండ్ మణికంఠతో చెప్పాడు. ఈ ఐడియా బాగుందని అన్నాడు.
ఐడియా అదుర్స్! కానీ ఈ ఫీల్డులో ఇద్దరికీ అనుభవం లేదు. వాళ్ల స్నేహితుడు శ్రేయక్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. ఈ ఐడియాని ఆచరణలో ఎలా పెట్టాలో చెబుతాడని అతణ్ని కలిశారు. మొబైల్ యాప్ ద్వారా ఇన్‌స్టాంట్‌గా వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌ని బుక్ చేసుకునే ఐడియా విన్నాక.. ‘వండర్! ఇది ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు హెల్ప్ అవుతుంది. తప్పకుండా చేద్దాం. నేనూ మీతో చేరతా’ అన్నాడు. ముగ్గురికీ జోడీ కుదిరాక ఒక ఆఫీస్ తీసుకున్నారు. యాప్ డిజైన్ మొదలుపెట్టారు. యాప్‌లో ఒక్కో ఫీచర్ జోడిస్తూ ఏడాదిపాటూ కష్టపడ్డారు. ఈ పనిలోపడి కార్తిక్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేశాడు. అంతేకాదు కంపెనీ వాళ్లు చదివిస్తున్న ఎంటెక్ కోర్సుని కూడా వదిలేశాడు. యాప్ రెడీ అయిపోయింది. ఆగస్ట్ నెలలో ఆపరేషన్స్ మొదలయ్యాయి.
ఫ్లాషూట్ (Flashoot)ని డౌన్లోడ్ చేసుకుని వీడియోగ్రాఫర్‌ని బుక్ చేసుకుంటే దగ్గర్లో (5 కిలోమీటర్ల దూరంలో) ఉన్న వీడియోగ్రాఫర్కి కనెక్ట్ అవుతుంది. అతను బుక్ చేసుకున్న సమయానికి వచ్చి వీడియోలు, ఫొటోలు తీస్తాడు. వీడియోని ఎడిట్ చేసి 30 సెకన్ల నుంచి నిమిషం నిడివిలో ఔట్పుట్ ఇస్తాడు. ఇన్‌స్టా రీల్, యూట్యూబ్ షార్ట్స్‌లో దీనిని వెంటనే అప్లోడ్ చేసుకోవచ్చు. గంట సమయం ఫొటోగ్రాఫర్‌ని బుక్ చేసుకున్నందుకు ఫిక్స్డ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. బేరమాడే బాధ లేదు. అదనపు సమయం చేయించుకుంటే దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. హై ఎండ్ కెమెరా ఉన్న మొబైల్ ఫోన్‌తో వీడియో తీసి, ఎడిట్ చేసి రీల్స్‌ని ఇస్తారు. వ్యాపారులు కూడా కమర్షియల్ అవసరాల కోసం ఈ కెమెరామెన్లను బుక్ చేసుకోవచ్చు. ఫంక్షన్లు, పేరంటాల్లో మహిళలకు అసౌకర్యం లేకుండా కెమెరా ఉమెన్‌ని కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే రాత్రి తొమ్మిది గంటల తర్వాత జరిగే ఈవెంట్స్‌కు కెమెరా ఉమెన్స్‌ను బుక్ చేసుకోవడం కుదరదు. ఎందుకు ఆలస్యం. రెడీమేడ్ రీల్స్‌కి పోజులివ్వడానికి సిద్ధమవ్వండి.
– నాగవర్ధన్ రాయల