చేలల్లో చేపల వేట.. జీరో వ్యాలీ ప్రత్యేకత!
జీరోవ్యాలీ.. ప్రకృతి సౌందర్యానికి, ప్రత్యేకమైన గిరిజన సంస్కృతికి ఆలవాలం. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోయర్ సుబన్సిరి జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం.. అనేక పర్యాటక విశేషాలకు నిలయం. అపటాని తెగ ప్రజల జీవన విధానం, వ్యవసాయ పొలాల్లో చేపల పెంపకం.. ఇక్కడ మాత్రమే కనిపించే అద్భుతం. ఇక సంగీత సాగరంలో ముంచి తేల్చే మ్యూజిక్ ఫెస్టివల్.. మరింత ప్రత్యేకం.
పల్లెటూర్
తూర్పు హిమాలయాల నడుమ సుమారు 5,500 అడుగుల ఎత్తులో ఉంటుంది జీరోవ్యాలీ. ఈ అందమైన లోయ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రధానంగా ‘అపటాని’ గిరిజనులు నివసిస్తుంటారు. ఇక్కడి మహిళలు ముఖంపై పచ్చబొట్లతో, పెద్దపెద్ద ముక్కు పుడకలతో ప్రత్యేకంగా కనిపిస్తారు. పూర్వకాలంలో పొరుగు తెగల దండయాత్రల నుంచి మహిళలను రక్షించుకోవడానికి ముఖాలపై పెద్ద పచ్చబొట్లు పొడుచుకోవడం, ముక్కుపుడకలు ధరించడం వంటి ఆచారాలను పాటించేవారట. కాలక్రమేణా అది వారి ప్రత్యేక సాంస్కృతిక చిహ్నంగా మారింది.
వ్యవసాయంలోనూ విశేషమే!
సంస్కృతి-సంప్రదాయాలు, ఆచారవ్యవహారాల్లోనే కాదు.. వ్యవసాయంలోనూ తమ ప్రత్యేకత చాటుతున్నారు అపటాని ప్రజలు. నిజానికి వీరి వ్యవసాయ పద్ధతులే.. జీరో వ్యాలీకి ప్రపంచస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వరి పొలాల్లో చేపలు పెంచుతూ.. ఒకేసారి రెండు పంటలు తీస్తారు. పొలాల్లోని పురుగులు.. చేపలకు ఆహారంగా మారుతాయి; చేపల విసర్జన.. పంటకు అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి రసాయన ఎరువులు లేకుండానే భూమి సారం పెరుగుతుంది. ఇందుకోసం కొండల నుంచి వచ్చే సెలయేటి నీటిని అద్భుతమైన ఇంజినీరింగ్ విధానంతో పొలాలకు మళ్లిస్తారు. పొలాల్లో తిరిగే చేపలను చూసేందుకు, గాలాలు వేసి వాటిని పట్టేందుకు పర్యాటకులు ఇక్కడికి క్యూ కడతారు. వీరి వ్యవసాయ పద్ధతులను గుర్తించిన యునెస్కో.. జీరో వ్యాలీని వరల్డ్ హెరిటేజ్ సైట్ తాత్కాలిక జాబితాలోనూ చేర్చింది.

Zero Valley
అదిరిపోయే మ్యూజిక్ ఫెస్ట్
జీరో వ్యాలీలోని మరో విశేషం.. ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరిగే ‘జీరో మ్యూజిక్ ఫెస్టివల్’. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖ రాక్ బ్యాండ్లు, సంగీత కళాకారులు తరలివస్తారు. ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తారు. పచ్చని ప్రకృతి నడుమ జరిగే ఈ సంగీత ఉత్సవానికి యువత పెద్ద ఎత్తున హాజరవుతారు.
మరిన్ని పర్యాటక ప్రదేశాలు
ఇక్కడికి సమీపంలోని తాలి వ్యాలీ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం. దట్టమైన అడవులు, అరుదైన వృక్షజాలం, జంతుజాలంతో కూడిన ఈ అభయారణ్యం.. ట్రిక్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ‘కైలో వ్యూ పాయింట్’ నుంచి చూస్తే.. జీరో వ్యాలీ, వరి పొలాలు పచ్చటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. భారీ పరిమాణంలో ఉండే పైన్ చెట్లు కూడా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఎలా వెళ్లాలి?
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జీరో వ్యాలీకి చేరుకోవచ్చు. ఈటానగర్ నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇక అక్టోబర్ నుంచి మార్చి మధ్య.. ఇక్కడి వాతావరణం
ఆహ్లాదకరంగా ఉంటుంది.

Zero Valley 1

Zero Valley 2

Zero Valley 3
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

