నవ్వీనవ్వని కళ్లు.. రామచక్కని కళ్లు
‘బాపూరమణీయం’గా వెలిగిన దర్శక నిర్మాతల ద్వయం జాతి చరిత్రలో గుర్తుంచుకునే ఎన్నో చిత్ర రాజాలను నిర్మించింది. వాటిలో ‘పెళ్లి పుస్తకం’, ‘భక్తకన్నప్ప’, ‘బుద్ధిమంతుడు’, ‘పెళ్లికొడుకు’, ‘సంపూర్ణ రామాయణం’ లాంటి చిత్రాలు కొన్ని. ఈ ద్వయానికి ‘సినారె’ సాహిత్యం తోడుగా నిలవగా అది ‘ముత్యాలముగ్గు’గా వెలిగింది.
‘బాపూరమణీయం’గా వెలిగిన దర్శక నిర్మాతల ద్వయం జాతి చరిత్రలో గుర్తుంచుకునే ఎన్నో చిత్ర రాజాలను నిర్మించింది. వాటిలో ‘పెళ్లి పుస్తకం’, ‘భక్తకన్నప్ప’, ‘బుద్ధిమంతుడు’, ‘పెళ్లికొడుకు’, ‘సంపూర్ణ రామాయణం’ లాంటి చిత్రాలు కొన్ని. ఈ ద్వయానికి ‘సినారె’ సాహిత్యం తోడుగా నిలవగా అది ‘ముత్యాలముగ్గు’గా వెలిగింది. రామాయణ కథను భూమికగా చేసుకుని బాపూరమణలు నిర్మించిన చిత్రాలు సంఖ్యాపరంగా ఎక్కువే. సంప్రదాయం పట్ల ప్రేమ, ఆధునికతపట్ల ఆసక్తి కలిగిన వీళ్లు రామకథను సోషల్ వెర్షన్‌గా నిర్మించిన చిత్రం ‘కలియుగ రావణాసురుడు’. ఇది 1988లో విడుదలైంది.
సీతాపహరణాన్ని, సీతారామ వియోగాన్ని సాంఘిక రూపంలో ఈ చిత్రంలో చూపించారు బాపూ రమణలు. కథకు వస్తే రావుగోపాలరావు ఒక అటవీ ప్రాంతానికి చెందిన భూస్వామి. తన కిందివారికి బీమా చేయించి వారిని పులిరూపంలో హతమారుస్తూ, స్త్రీలను బలాత్కరిస్తూ, బీమా సొమ్ము కాజేస్తుంటాడు. మురళీ మోహన్ బీమా కంపెనీ తరఫున వస్తాడు. అతని భార్య (శారద)ను రావుగోపాలరావు చూసి మోహించి, ఆమెను కిడ్నాప్ చేసి బంధిస్తాడు. పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ పథకం వేసి సీతను చెర విడిపిస్తాడు. ఇదీ చిత్ర కథ. ఈ సినిమా కోసం డా.సి.నారాయణరెడ్డి రెండు గీతాలు రాశారు. ఒకటి “నమోనమో హనుమంతా మహిత గుణవంతా” గీతం కాగా, రెండోది “నల్లానల్లని కళ్లు నవ్వీనవ్వని కళ్లు” గీతం. ‘కళ్లు’ ప్రధానంగా రాసిన ఈ గీతంలో దాదాపు 24 సార్లు ఆ పదాన్ని ఉపయోగించడం విశేషం.
పల్లవి
నల్లా నల్లని కళ్లు
నవ్వీ నవ్వని కళ్లు
చూసినట్టే చూసి తలుపులు
మూసేసుకున్న కళ్లు
దర్శకుడు బాపు ఈ గీతం నేపథ్యాన్ని సినారెతో చెబుతూ తన రేఖాచిత్రాల్లో తనకు ఎటువంటి కళ్లు కావాలో, తాను ఏ కళ్ల గురించి గీతాన్ని కొరుకుంటున్నాడో గీసి చూపించారట. అలా బాపు రేఖల్లో రూపుదిద్దుకున్న చిత్రాలకు, సినారె అక్షర చిత్రాలు అందించారట. సాధారణంగా అందమైన స్త్రీ కళ్లను వర్ణించేటప్పుడు నీలి కళ్లు… అందులోనూ చారడేసి కళ్లుగా కవులు వర్ణించడం మనకు తెలుసు. పై పల్లవిలో కవి వర్ణించింది ‘నల్ల నల్లని కళ్లు’ గురించి. ఇది నిజంగా విశేష రూప ప్రయోగమే. దీనికి తోడు వెంటనే చెప్పింది ‘నవ్వీనవ్వని కళ్లు’ గురించి. అంటే అరవిచ్చుకుని సిగ్గుతో వాలిపోయే కళ్లన్నమాట. ఇంకా ఆ కళ్లు చూసినట్టే చూసి సిగ్గుతో తలుపులు మూసుకున్నాయట. ఇక్కడ తలుపులు అంటే కను రెప్పలు. చిన్నప్పుడు “కిటకిట తలుపులు, కిటారి తలుపులు…” అన్న పొడుపుకథ చదువుకున్నాం కదా!

Cine Sinare
చరణం
తొలిపొద్దులో తామరకళ్లు
మలిసందెలో కలువకళ్లు
ఏటిపాయలో చేపకళ్లు
తోటమలుపులో లేడికళ్లు
ఎన్నాళ్లు చూసినా ఎన్నేళ్లు చూసినా
లోతులందని కళ్లు
నా లోకమేలే కళ్లు
ఏమి చక్కని కళ్లు
రామచక్కని కళ్లు
పల్లవిలో కళ్ల హావభావాలను చెప్పిన కవి తరువాతి చరణాల్లో, అంటే పైన ఉదహరించిన పంక్తుల్లో వివిధ సమయాలు, సందర్భాల్లోని కళ్లను గురించి కళ్లకు కట్టారు. తొలిపొద్దులో కనిపించే నాయిక కళ్లు తామరకళ్లట, కారణం తామరలు ఉదయం సూర్యుని రాకతో విచ్చుకుంటాయి. కలువపూలు చంద్రుని వెన్నెలకు విప్పారుతాయి కాబట్టి మలిసందెలో కనిపించే కళ్లను కలువ కళ్లుగా వర్ణిస్తారు. ఏటిలో కనిపించినప్పుడు చేపకళ్లు, తోటలో కనిపించినప్పుడు లేడికళ్లు. కారణం లేడి కళ్లలోని మెరుపు గొప్పగా ఉంటుందన్నది కూడా కవి భావన. ఇంకా ఎన్నాళ్లు, ఎన్నేళ్లు చూసినా ఆమె కళ్లలోని కాంతిని, లావణ్యాన్ని వర్ణించాలంటే తన భాషకు, భావానికి అందలేదేమో! అందుకే ఏకంగా… “ఏమి చక్కని కళ్లు/ రామచక్కని కళ్లు” అంటాడు. ఈ ‘రామచక్కని’ అనే పదం తెలంగాణలో విశేషంగా వాడుకలో ఉన్నపదమే. గతంలోనూ సినారె ‘ఓ రామసక్కని బంగారు బొమ్మ’ అన్న ప్రయోగం చేశారు. తరువాత ప్రయోగాలు… పదాలు చూడండి “సిగ్గును చీరగ చుట్టుకొని/ చిలిపిగ ఓరగ కప్పుకొని/ చిరుచిరునవ్వులు చురచుర/ చూపులు కలియబోసి ముగ్గలేసి’ అన్నచోట నాయకుణ్ని చూసిన నాయిక సిగ్గుతో తన చీరను కప్పుకొన్నదని చెప్పడం వెనక ఆ కళ్లే చీరను కప్పుకొన్నాయని అర్థం.
తరువాత ‘రారమ్మని పోపొమ్మని ఊరించే కళ్లు సరసాలకు/ శంఖం పూరించే కళ్లు/ ఆవులించే కళ్లు/ ఆకలేసిన కళ్లు/ రైకతొడిగిన కళ్లు/ పైట తొలగిన కళ్లు’ అంటారు కవి. వీటి గురించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇట్టే తెలిసిపోతుంది ఈ కళ్లు ఏమేం కోరుకుంటున్నాయో అని. ఇంకా అక్కడితో అయిపోలేదట… ‘కొసరి కొసరి మగతను ఎగదోసే కళ్లు మనసును నమిలేసే కళ్లు’ కూడానట. చివరిగా చక్కని ప్రయోగం చేస్తూ మండుటెండలో వడగళ్లు పడితే కలిగే అనుభూతి, తాను కోరుకున్న నాయిక తన కళ్లలో పదిలంగా దాచుకున్న కలల లోగిళ్ల గురించి చెబుతారు..
ఆ కళ్లే నడివేసవి వడగళ్లు
ఆ కళ్లే నా కలల పొదరిళ్లు
లోతులందని కళ్లు
నా లోకమేలే కళ్లు
ఏమి చక్కని కళ్లు
రామచక్కని కళ్లు
– పత్తిపాక మోహన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

