మానవ దేహం ఎన్నో వింతల నిలయం. ఊపిరి తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ…. అన్నీ పెద్దపెద్ద వ్యవస్థలుగా ఉంటాయి. పాదం నుంచి మెదడు దాకా మన లోపలి నిర్మాణాల గురించి చదవడమే తప్ప చూసే అవకాశం ఉండదు. కానీ ఏకంగా మానవ దేహం లోపలే ప్రయాణించిన అనుభూతిని కలిగిస్తుంది నెదర్లాండ్స్ దేశంలోని ‘కార్పస్ మ్యూజియం’. ప్రపంచంలోనే తొట్ట తొలిదైన ఈ తరహా ప్రదర్శనశాల వీక్షకులకు వినూత్నమైన అనుభూతిని అందిస్తున్నది.
ఏముందో… అని పాటలు పాడుకోవటం సహజమే. కానీ కార్పస్ మ్యూజియంలో నిజంగానే గుండెల్లో ఏముందో చూసేయొచ్చు. కడుపులో ఏం ఉండదు పాపం… అని కొందరి గురించి అంటుంటారు. అసలు కడుపులో ఏముంటుందో చూడాలన్నా కూడా అక్కడికెళ్తే చాలు. ఒక్క పొట్టలోనే కాదు మెదడులో ఏముంది, ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయి, కండరాల సంగతేంటి, పళ్లెంత పటిష్టంలాంటివన్నీ ఆయా భాగాల దగ్గరికెళ్లి మరీ తెలుసుకునే వెసులుబాటు ఉంది. నెదర్లాండ్స్ దేశంలోని ఉస్త్గేస్త్ పట్టణంలో ఉన్న దీన్ని హెన్రీ రెమ్మర్స్ స్థాపించారు. ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో విభిన్నమైన శైలిలో మానవ శరీరం లోపలి భాగాలను పోలిన నిర్మాణాన్ని చేపట్టారు. 11 అంతస్తుల్లో 2008లో ప్రారంభించిన దీన్ని ఏటా లక్షల మంది సందర్శిస్తున్నారట. వీళ్లలో కుటుంబాలుగా వచ్చేవాళ్లు కొందరైతే, పాఠశాలలు, కాలేజీల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న వాళ్లు మరికొందరు.
ఆరెంజ్ మ్యాన్‌గా పిలిచే ఓ నారింజ రంగు వ్యక్తి ఆకారం ఈ భవంతి మధ్యలో ఉంటుంది. దీనిలో ప్రవేశించాక అతని పాదం నుంచి మోకాలికి ఎస్కలేటర్ ఉంటుంది. అక్కడ ఉండే ఒక పెద్ద గాయం ద్వారా మనం మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాం. అక్కడినుంచి కండరాలు ఎలా పనిచేస్తాయి, వాటి నిర్మాణం ఎలా ఉంటుంది అన్నది దగ్గరినుంచి చూస్తాం. తర్వాత వ్యక్తిగత భాగాలుండే ప్రదేశానికి వెళతాం. అక్కడే అండం శుక్రకణంతో ఫలదీకరణం చెందడాన్ని 3డీ కళ్లద్దాల సాయంతో వీక్షిస్తాం. అక్కడి నుంచి పేగుల ద్వారా ప్రయాణించి కడుపులో ఆహారం ఎలా జీర్ణమవుతుంది అన్నది చూస్తాం. ఆ తర్వాత కవాటాల ద్వారా గుండెను చేరుతాం. తర్వాత ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇలా అన్నిటి గురించీ తెలుసుకుంటూ తల భాగానికి చేరుకుంటాం. అక్కడే మనం మనిషి నోట్లోకి వెళ్లిన అనుభూతిని చెందుతాం. అలా ‘జర్నీ థ్రూ ద హ్యూమన్ బాడీ’ (శరీరం గుండా ప్రయాణం) ముగుస్తుందన్నమాట. మన పంచ్‌కి ఎంత శక్తి ఉంది, పరిగెడితే గుండె ఎలా పనిచేస్తుంది, మనిషి శరీరం మీద పోషకాహారం, వ్యాయామం ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కూడా ఈ టూర్లో ప్రత్యక్షంగా చూపిస్తారు. తద్వారా మన శరీరం పట్ల మనం మరింత శ్రద్ధ తీసుకోవాలన్న ఉద్దేశం ఇందులో దాగుంది. మనిషి లోపల అడుగు పెట్టే ఈ మానవయాన్ కాస్త వింతగానే ఉంది కదూ!