కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, కాదేదీ పోస్టు కనర్హం అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. పిల్లలతో పిక్నిక్ వెళ్లినా ఓ పోస్ట్.. బుడ్డోడు బడికి వెళ్లినా ఓ పోస్ట్.. ఈ లిస్టుకి అంతే లేదు. ఎందుకు సోషల్ మీడియాలో అన్ని విషయాలను ఇంతగా షేర్ చేస్తారు.. మరీ ముఖ్యంగా కొంతమంది ప్రతి మజిలీని సోషల్ మీడియా వేదికగా పదిమందితో ఎందుకు పంచుకుంటారు.. అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక సైకాలజీ ఉంది, అదేంటో తెలుసుకుందాం రండి.
ఓ ఉద్వేగాన్ని వ్యక్తపరచడానికి, ఓ అంశంపై అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి, సామాజిక అంశాలపై వాదోపవాదాలకు సోషల్ మీడియానే వేదిక. ఈ ధోరణి ఎంతగా మన జీవితాల్లో చొచ్చుకొచ్చిందంటే ఎక్స్ వేదికగా రోజుకు 50 కోట్ల పోస్టులు పంచుకుంటున్నారు. యూట్యూబ్‌లో అయితే నిమిషానికి 400 గంటల సమాచారం అప్లోడ్ అవుతున్నది. ఫేస్బుక్ గురించి అయితే చెప్పే పనిలేదు! ప్రతినెలా 20 లక్షల 80 వేల మంది కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. నెల మొత్తంలో 20 గంటల కంటే ఎక్కువ సమయం ఫేస్బుక్ (ఎఫ్బీ)లో ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎందుకంత చురుగ్గా ఉంటున్నారా అని ఆరా తీస్తే.. బోలెడన్ని కారణాలు కనిపిస్తాయి.
గుర్తింపు కోసం.. చాలామంది సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేది తమకు గుర్తింపు కోసం. తామేంటో జనాలకు చెప్పడం కోసం. న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన ఓ సర్వేలో 68 శాతం మంది తామేంటో, దేని గురించి పట్టించుకుంటామో చెప్పేందుకే సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేస్తునట్టు తెలిపారు. సైకాలజిస్ట్ కార్ల్ రోజర్స్ ప్రకారం ప్రతి మనిషికి వాస్తవ స్వీయభావన (రియల్ సెల్ఫ్), ఆదర్శ స్వీయభావన (ఐడియల్ సెల్ఫ్) ఉంటాయి. సోషల్ మీడియాలో తాము వాస్తవంగా ఉన్నదాని కంటే, ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ విషయాలను ఎక్కువగా పోస్ట్ చేస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.
బంధాల బలోపేతం కోసం.. స్నేహితులతోనూ, శ్రేయోభిలాషులతోనూ టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియా వేదికలు సులభమైన మార్గాలు. ఆ మధ్య నిర్వహించిన ఓ సర్వేలో కరోనా లాక్డౌన్ కాలంలో సోషల్ మీడియా పోస్టులు తమలోని డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళనలను కొంతవరకు తగ్గించాయని 43 శాతం మంది తెలిపారు. లాక్డౌన్ కాలంలో ఫ్రెండ్స్‌తో సంభాషించడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడిందని 90 శాతం మంది టీనేజర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పోటీతో ప్రోత్సాహం.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం కమ్యూనికేషన్ కోసం, రిలేషన్షిప్ కోసమే అనుకున్నా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కంపెనీలు, ప్రోడక్ట్స్ పేజీలను లైక్ చేయడం, కామెంట్ పెట్టడం వెనక డిస్కౌంట్ పొందాలనే కోరిక ఉంటుంది. బ్రాండ్ పేజీలను లైక్ చేసే వారిలో 67 శాతం మంది స్పెషల్ ఆఫర్స్ కోసమే చేస్తారని ఓ సర్వేలో తేలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సాధారణ పోస్టుల కంటే, ఏదైనా పోటీకి సంబంధించిన పోస్టులకు 3.5 రెట్లు ఎక్కువ లైకులు, 64 శాతం ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయని డిజిటల్ నిపుణులు చెబుతున్నారు.
నేనూ ఓ భాగమే.. నలుగురితోపాటు నేనూ ఉన్నాను అనే భావన కోసమే కొందరు ఈ వేదికలపై చురుగ్గా ఉంటారు. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్‌ల్యాండ్ బృందం నిర్వహించిన పరిశోధనలో ఫేస్బుక్లో తమ పోస్టులకు లైకులు గాని కామెంట్లు గాని రాకుంటే సెల్ఫ్ ఎస్టీమ్పై ప్రభావం చూపించిందని అందులో పాల్గొన్నవారు తెలిపారు. సమాచారాన్ని పంచేందుకు.. చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది నలుగురికి ఉపయోగపడే సమాచారం అందిద్దామని. న్యూయార్క్ టైమ్స్ పరిశోధనలో 94 శాతం మంది ఎదుటివారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే సమాచారాన్ని షేర్ చేసినట్టు చెప్పారు. మనుషులు తమకు ఏదైతే ఆనందాన్ని కలిగించిందో, వినోదాత్మకంగా అనిపించిందో అలాంటి సమాచారాన్ని అందరితో షేర్ చేయడానికి ఇష్టపడతారని సైకాలజీ నిపుణులు చెప్తున్నారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం కొంతవరకు మేలేమోగానీ, శ్రుతిమించితే అనర్థమే. అది మన ఆలోచనలు, అనుభూతులు, ప్రేరణలపై ప్రభావం చూపుతుంది. ఆ వాస్తవం గ్రహించేలోపే నష్టం జరిగిపోతుంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో అప్రమత్తంగా ఉండాలి. మనకు తెలియకుండానే సోషల్ మీడియా మనపై ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.
వెల్లువలా వచ్చే నోటిఫికేషన్లు, వాట్సాప్ మెసేజ్‌లు అవసరమైన సమాచారాన్ని గుర్తించడంలో అడ్డుకుంటాయి.
ఎడతెరిపి లేకుండా వచ్చే సమాచారం వస్తు వ్యామోహాన్ని పెంచుతుంది. పొద్దస్తమానం స్క్రోల్ చేస్తూ, క్లిక్ చేస్తూ ఉంటే అనవసరమైన సమాచారం బుర్రలోకి చేరిపోతుంది. ఇది మెదడులో బౌద్ధిక అంశాలను నియంత్రించే ప్రాంతాన్ని ప్రభావితం చేసి మానసికంగా త్వరగా అలసిపోయేలా చేస్తుంది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం మనలో పోలిక గుణాన్ని పెంచి అసూయ, ద్వేషం వంటి ప్రతికూల భావోద్వేగాలను మనసులోకి తీసుకొస్తుంది.
సోషల్ మీడియాలో నెగెటివ్ అంశాలు ఎక్కువగా చూడటం వల్ల సామాజిక ఆమోదం లేని విషయాలూ సాధారణంగా మారిపోతాయి.
సోషల్ మీడియా అల్గారిదం మనుషులను సమూహాలుగా విడగొడుతుంది. దేన్ని నమ్మాలో అదే నిర్దేశిస్తుంది. సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుంది. వాటి మధ్య ఉండే సామాజిక బంధాలను బీటలు వారేలా చేస్తుంది. ఇదంతా కూడా సమూహంలో ఉండే వారికి తెలియకుండానే జరిగిపోతుంది.
కష్టమైనా, సుఖమైనా నలుగురితో పంచుకోవడం మనిషి నైజం. మనిషి మనుగడకు అది అవసరం కూడా. ఇది పరిధి దాటితేనే ఇబ్బంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం అవసరమే గానీ, దాని ఆవల కూడా బంధాలను, అనుబంధాలను ఏర్పరచుకోవడం ముఖ్యమని గుర్తించడం చాలా అవసరం.