ఏ ఊరికి వెళ్లినా… బీడు భూముల్లో, డొంకలు, దారి పక్కన ఉమ్మెత్త (దత్తూర) మొక్క కనిపిస్తుంది. దీనిని సులభంగానే గుర్తుపట్టవచ్చు. ఇది పొదలా పెరుగుతుంది. ఈ మొక్క మూడు అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. పూలు పెద్దగా, గంట ఆకారంలో ఉంటాయి. తెల్లగా, ముదురు గులాబీ రంగులో ఉండే ఈ పూలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సువాసన వెదజల్లుతాయి.
ఉమ్మెత్త అత్యంత ప్రమాదకరమైన మొక్క. దీని కాండం, ఆకులు, పూలు, కాయలు విషపూరితమైనవి. దత్తూర గింజలు ఒకటి, రెండు తిన్నా ప్రాణాపాయమే. ఈ మొక్కలో స్కోపోలమైన్, హయోస్కియమైన్ వంటి అతి ప్రమాదకరమైన రసాయనాలు కలిగి ఉంటాయి. ఇవి మన మెదడును, నాడీ వ్యవస్థను ధ్వంసం చేస్తాయి. ప్రాణాపాయం కూడా. అందుకే దీనిని ఆంగ్లంలో ‘డెవిల్స్ ట్రంపెట్’ అంటారు.
ఉమ్మెత్త శివునికి అత్యంత ప్రీతికరమంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం శివార్చనలో ఉమ్మెత్త పూలు ఉపయోగిస్తారు. కాశీలోని శివార్చనలో నల్ల ఉమ్మెత్త పూలు, ఆకులు, కాయలను ఉంచి పూజలు చేస్తారట! విషపూరితమైన మొక్క ప్రమాదకరమైనది. అయినా ఈ చెట్టు ఇంట్లో ఉంటే శుభప్రదమంటారు. ఈ మొక్క ఉన్న ప్రదేశం చుట్టుపక్కలకు భూత, ప్రేత, పిశాచాలు రావని నమ్మకం. గ్రహబాధలు, శత్రుబాధలు తప్పుతాయని నమ్మకం. ఉమ్మెత్త దుష్ట శక్తులను తరిమి కొడుతుందని విశ్వసిస్తారు. వినాయక చవితి రోజున చేసుకునే వరసిద్ధి వినాయక పత్రి పూజా కార్యక్రమంలో ఇది ఐదవది.
కోతి, కుక్క కరిచిన చోట ఉమ్మెత్త ఆకులు నూరి ఉంచితే విషం శరీరానికి పాకదంటారు. ఉమ్మెత్త ఆకుల రసం గజ్జి, తామర, దురద, తలలో పేల బాధల నుంచి విముక్తి కోసం రాసుకుంటారు. వైద్యంలో నల్ల ఉమ్మెత్తను ఎక్కువగా వాడతారు. మా ఔషధ వనంలో తెల్లని, గోధుమ వర్ణం చెట్లు లెక్కకు మించి ఉన్నాయి. దీని కాయలు చెట్టు మీదనే ఎండి పగులుతాయి. గాలి ద్వారా విస్తరించి మొలకెత్తుతాయి.
g ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు