అవధ్ ఓజా.. ఉత్తరాదిలో ప్రముఖ సివిల్ సర్వీస్ శిక్షకుడు. ఓరోజు బాల్య మిత్రుడితో కలిసి కారులో వెళ్తూ.. ముచ్చట్లలో పడ్డారు. కొంతసేపటి తర్వాత.. ‘మనం ముసలివాళ్లం అవుతున్నాం!’ అంటూ మొదలుపెట్టిన మిత్రుడు.. వృద్ధాప్య కష్టాలు, ఆ సమయంలో పని చేయలేని నిస్సహాయత గురించి ఏకరువు పెట్టాడు. ఓజా కొద్దిసేపు భరించి.. ఓచోట కారు ఆపాడు. మిత్రుణ్ని కారు దిగమని చెప్పి.. అతను దిగేయగానే రయ్యిమని కారులో వెళ్లిపోయాడు. ఓజా తనను దారిమధ్యలో అలా ఎందుకు వదిలి వెళ్తున్నాడో ఆ మిత్రుడికి అర్థంకాలేదు.
అదే విషయం ఓజా దగ్గర ప్రస్తావిస్తే.. ‘అతనితో ఇంకొంతసేపు అలానే మాట్లాడితే.. ఆ మాటల ప్రభావం నామీద కూడా పడుతుంది. నేను కూడా ముసలివాడిని అయ్యానని నిర్ణయించుకుంటా.
అందుకు తగ్గట్టే ప్రవర్తిస్తా! నా శరీరం కూడా అలాగే ప్రవర్తిస్తుంది. అందుకే ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు నా మిత్రుణ్ని మధ్యలోనే దింపేశా!’ అని చెబుతాడు. ఈ మాటలు కొంత కఠినంగానే అనిపించవచ్చు. కానీ వాస్తవం. నిరాశా పూరితమైన మాటలు మాట్లాడేవారితో ఉంటే.. మన జీవితం కూడా నిరాశా పూరితంగానే మారుతుంది.
మీరు తన వయసు ఎంతైనా కానీ, తాను చేపట్టిన పనిలో విజయం సాధించగలనని నమ్మాడు కాబట్టే.. కల్నల్ హర్లాండ్ డేవిడ్ శాండర్స్ ప్రపంచమంతా తనను గుర్తుంచుకునేలా విజయం సాధించాడు. ఈ పేరు ఎప్పుడూ వినలేదని అనిపిస్తున్నదా? నిజమే.. ఇతని పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ, కేఎఫ్‌సీ (kfc) పేరు వినగానే.. నోరు ఊరుతుంది కదా? ఈ సంస్థ వ్యవస్థాపకుడే.. ఈ కల్నల్ హర్లాండ్ డేవిడ్ శాండర్స్. కేఎఫ్సీలోని వంటకాల రుచికన్నా.. శాండర్స్ జీవితం గొప్పగా ఉంటుంది. మరింత స్ఫూర్తిదాయకంగా, ఆసక్తికరంగా సాగుతుంది. 60 ఏళ్ల వయసు అంటే చాలామంది దృష్టిలో ‘జీవితం చివరి దశ’ అనే నిరాశే ఉంటుంది. కానీ, రిటైర్మెంట్ వయసు అంటే.. జీవితానికి ముగింపు దశ కాదనీ, మరో కొత్త జీవితానికి ప్రారంభమని స్ఫూర్తి నింపుతుంది హర్లాండ్ విజయ గాథ.
1890 సెప్టెంబర్ 9న అమెరికాలోని ఇండియానాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు హర్లాండ్. ఆయనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. కుటుంబాన్ని పోషించేందుకు తన తల్లి ఓ ఫ్యాక్టరీలో పనిచేసేది. హర్లాండ్ ఇంట్లో వంట చేస్తూ.. తోబుట్టువులను చూసుకునేవాడు. అలా.. ఏడేళ్ల వయసులోనే వంటల్లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడో తరగతి వరకే ఆయన చదువు కొనసాగింది.
ఆ తర్వాత.. కుటుంబానికి ఆసరా అయ్యేందుకు వ్యవసాయ కూలీగా మారాడు. రైల్వే కూలీ పనితోపాటు బతకడానికి అనేక పనులు చేశాడు. చిన్నప్పటి నుంచే వంటలపై ఆసక్తి ఉండటంతో.. 40 ఏళ్ల వయసులో ఆహార వ్యాపారంలో అడుగుపెట్టాడు. 1930లో ఒక గ్యాస్ స్టేషన్లో ఒక చిన్న రెస్టారెంట్‌ను తెరిచాడు. తానే సొంతంగా తయారుచేసిన ఫ్రైడ్ చికెన్‌ను అమ్మడం మొదలుపెట్టాడు. రుచి, శుచీ నచ్చడంతో.. అతని వంటకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో ఆ గ్యాస్ స్టేషన్‌నే పూర్తిస్థాయి రెస్టారెంట్‌గా మార్చేశాడు. ఈ క్రమంలో విభిన్న వంటకాలను ప్రయత్నించాడు.
వన మూలికలు, సుగంధ ద్రవ్యాలు కలిపి ఒక రహస్య రెసిపీని కనిపెట్టాడు. దానిని పెద్ద రెస్టారెంట్లకు అమ్మడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయినా.. ఆ రెసిపీని తీసుకోవడానికి ఏ రెస్టారెంటూ ముందుకురాలేదు. సంఖ్యలో నిజానిజాలు ఎలా ఉన్నా, అతిశయోక్తి అనిపించినా.. ఒక లెక్క ప్రకారం హర్లాండ్ రెసిపీ 1,009 సార్లు తిరస్కరణకు గురైందట. అనేక ప్రయత్నాల తర్వాత హర్మన్ అనే వ్యక్తి హర్లాండ్తో కలిసి వ్యాపారం చేయడానికి ముందుకొచ్చాడు. అలా.. 1952లో మొట్టమొదటి కేఎఫ్‌సీ ప్రాంచైజీని ఏర్పాటుచేశాడు హర్లాండ్.
దినదిన ప్రవర్ధమానంగా వెలిగిన కేఎఫ్‌సీ.. అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 1963 నాటికే అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, మెక్సికో, జమైకా దేశాల్లో 600 ఫ్రాంచైజీలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ సంస్థకు 145 దేశాల్లో 25 వేల ఔట్లెట్స్ ఉన్నాయి. 1964లో రెండు మిలియన్ డాలర్లకు పెప్సీ సంస్థకు కేఎఫ్‌సీని విక్రయించాడు 73 ఏళ్ల హర్లాండ్ డేవిడ్ శాండర్స్. ఆ తర్వాత అదే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కేఎఫ్‌సీ రెస్టారెంట్లను సందర్శించి నాణ్యతను పరీక్షించేవాడు. అంతకుముందు శాండర్స్ అనేక చిన్నా చితక ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా.. ఎక్కడా విజయం సాధించలేదు.
చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన వంటల వ్యాపారంలోకి.. 62 ఏళ్ల లేటు వయసులో అడుగుపెట్టాడు. ఇష్టంతో పనిచేసి.. అద్భుతమైన విజయం సాధించాడు. నాణ్యత విషయంలో రాజీ పడకపోవడమే తన విజయ రహస్యమని చెప్పేవాడు. 1980 డిసెంబర్ 16న 90 ఏండ్ల వయసులో అనారోగ్యంతో మరణించాడు. ఆ సమయానికి కేఎఫ్‌సీకి 48 దేశాల్లో ఆరు వేల ఔట్లెట్లు ఉన్నాయి. ఏడాదికి రెండు వందల కోట్ల డాలర్ల ఆదాయం అందుకునేవాడు. ఈ క్రమంలోనే ‘శాండర్స్ చారిటబుల్ ఆర్గనైజేషన్’ ద్వారా సేవా కార్యక్రమాలూ నిర్వహించాడు.
హర్లాండ్ శాండర్స్‌కు ఈ విజయం ఒక్కరోజులో వచ్చిందికాదు. అతని వ్యాపార ప్రయాణం.. ఎన్నో ఒడుదొడుకులతో సాగింది. మొదటిసారి ప్రారంభించిన కేఎఫ్‌సీ రెస్టారెంట్ మొదలుపెట్టినప్పుడు.. ఉద్యోగులతో గొడవ వల్ల మూసేయాల్సి వచ్చింది. తర్వాత ప్రారంభించిన హోటల్.. అగ్నికి ఆహుతైంది. ముచ్చటగా మూడోసారి మొదలు పెట్టినప్పుడు.. రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చింది. అప్పటి మాంద్యం ప్రభావంతో.. రెస్టారెంట్‌ను మూసేశాడు. ఆ తర్వాత తన రహస్య రెసిపీపై నమ్మకంతో.. దాన్ని పట్టుకొని వెయ్యికి పైగా హోటల్స్ చుట్టూ తిరిగాడు. వాళ్లంతా తిరస్కరించినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అలానే ప్రయత్నించాడు. చివరికి హర్లాండ్ విజయాన్ని అందుకున్నాడు. కోకాకోలా పానీయం లానే కేఎఫ్‌సీ రెసిపీ కూడా ఇప్పటికీ రహస్యమే!
సాండర్స్ రోడ్డు పక్కన మొదటి కేఎఫ్‌సీ రెస్టారెంట్‌ను ప్రారంభించిన రోజులు. ఒకరోజు అక్కడి గవర్నర్ అట్నుంచి వెళ్తూ.. ఆకలిగా ఉందని ఈ హోటల్ వద్ద ఆగి.. ఇక్కడి స్పెషల్ రెసిపీని తిన్నాడు. అది తెగ నచ్చడంతో సాండర్స్‌కు ‘కౌంటీకి కర్నల్’ అని కితాబు ఇచ్చాడు. ఆ పేరుతోనూ సాండర్స్ పాపులర్ అయ్యాడు.
– బుద్దా మురళి