కాయగూరల్లో రసాయన అవశేషాలు. పండ్ల విషయానికి వస్తే.. రసాయనాలు చల్లి మగ్గిస్తున్న వైనం. ఆరోగ్యం కోసం హెల్తీ డ్రింక్స్ తీసుకుందామంటే… వాటిలో పేర్లు తెలియని ప్రిజర్వేటివ్స్ అనారోగ్యాన్ని కానుకగా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. ఈ పరిస్థితికి విరుగుడుగా చిరుధాన్యాలతో హెల్తీ డ్రింక్ తయారుచేసి విపణిలో అడుగుపెట్టాడు ఓ యువకుడు. ఔషధ రంగంలో తనకున్న అనుభవంతో ‘ఫామ్ న్యూట్రా’ స్టార్టప్ నెలకొల్పాడు. కొర్రలతో రుచికరమైన పానీయం తయారుచేసి ఆరోగ్యాన్ని పంచుతున్న గండూరి శైలేష్ మిల్లెట్ డ్రింక్స్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు.అవసరమే
ఆలోచనకు పునాది అంటారు పెద్దలు. హైదరాబాద్‌లో ఓ ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు శైలేష్. ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఆందోళన చెందాడు. పద్నాలుగేండ్ల ఉద్యోగ అనుభవం సంతృప్తిని ఇవ్వకపోగా, భయాందోళనలకు గురిచేసింది. ఈ క్రమంలో పలు పరిశోధనలు చేశాడు. తాను ఎదుగుతూ, పదిమందికి ఉపాధి కల్పించాలని భావించాడు. ఆర్థిక ప్రయోజనం కన్నా… సమాజానికి మేలు చేయడమే ప్రధానంగా భావించి 2019లో ‘ఫామ్ న్యూట్రా’ స్టార్టప్ నెలకొల్పాడు. తొలి ప్రయత్నంగా కొర్రలతో సేమియా ఉత్పత్తి ప్రారంభించాడు. అయితే, అది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నిరాశ చెందాడు. మళ్లీ పుంజుకొని మరిన్ని ప్రయోగాలు చేపట్టాడు. చివరికి 2023లో మిల్లెట్ డ్రింక్ తయారీకి శ్రీకారం చుట్టాడు. మధుమేహులు కూడా తీసుకునేలా దీనిని ఆవిష్కరించాడు.
కొర్రలు పులియబెట్టి
ప్రయోగం సఫలమైంది. ఉత్పత్తి చేయడమే మిగిలింది. ఈ క్రమంలో శైలేష్ తన నివేదిక, డీపీఆర్‌ను రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (ఐసీఏఆర్)- నార్మ్ ఏ-ఐడియా ఇంక్యుబేషన్ సెంటర్లో సమర్పించాడు. వారి చొరవతో ఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ) నుంచి రూ.50 లక్షల గ్రాంట్ పొందాడు. వాటికి మరో రూ.25 లక్షలు జతచేసి మొత్తంగా రూ.50 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలో ఫామ్ న్యూట్రా మిల్లెట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్‌ను నెలకొల్పాడు. కొర్రలు పులియబెట్టి తీసిన ఉత్పత్తికి డ్రైఫ్రూట్స్ జోడించి రుచికరమైన పానీయం తయారుచేసి ఆన్లైన్ అంగట్లో అమ్మడం మొదలుపెట్టాడు.
ఆన్లైన్లో అమ్మకాలు..
శైలేష్‌ది విజయవాడ. అక్కడే డిగ్రీ దాకా చదివాడు. తర్వాత బాపట్లలో ఎంఫార్మసీ పూర్తిచేశాడు. పట్టా చేత పట్టుకుని హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో మెడిసిన్ ప్రొడక్షన్ విభాగంలో ఉద్యోగిగా చేరాడు. కానీ, కొలువులో సంతృప్తి లేక స్టార్టప్ జర్నీ మొదలుపెట్టాడు. ఎలాంటి రసాయన అవశేషాలు లేకుండా పూర్తి సహజసిద్ధంగా ఈ మిల్లెట్ డ్రింక్ తయారు చేస్తున్నాడు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మెటీరియల్స్‌ను వాడుతూ వీటిని ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ మిల్లెట్ పానీయంలో ఆరెంజ్, పైనాపిల్, మ్యాంగో ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని సొంత వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నాడు.
పాలమూరు కొర్రలు
ఈ ఉత్పత్తి తయారీకి ఉపయోగించే కొర్రలను శైలేష్ పాలమూరు (మహబూబ్‌నగర్), కర్నూలు జిల్లాల రైతుల నుంచి సేకరిస్తున్నాడు. నేరుగా రైతుల దగ్గరే కొనుగోలు చేయడం వల్ల వారికి మద్దతు ధర లభించినట్టు అవుతున్నది. డ్రింక్స్ తయారీలో ఉపయోగించే మిగతా ఫ్లేవర్స్‌ను గుజరాత్ నుంచి తెప్పిస్తున్నాడు. అన్నిరకాల ప్రమాణాలతో తయారవుతున్న తమ మిల్లెట్ డ్రింక్స్ వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుందనీ, జీర్ణ సమస్యలు తొలగిపోతాయని శైలేష్ అంటున్నాడు. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడించాడు. చక్కెర లేకుండా తయారవుతున్న తమ డ్రింక్‌ను మధుమేహం ఉన్నవారు సైతం నిరభ్యంతరంగా తాగొచ్చని చెబుతున్నాడు. క్రమంగా స్టార్టప్ అభివృద్ధి చెందుతుండటంతో ఐదుగురు యువకులకు ఉపాధి కల్పించాడు. వీళ్లంతా ప్రతిరోజూ వెయ్యి బాటిల్స్/ పౌచెస్ తయారు చేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఉత్పత్తి సామర్థ్యం పెంచే ప్రయత్నంలో ఉన్నాడు శైలేష్. ఈ ఏడాది రూ.36 లక్షల టర్నోవర్ సాధించామని చెప్పుకొచ్చాడు. సిబ్బంది వేతనాలు, అద్దెలు, ముడిసరుకు కొనుగోలు ఇలా అన్ని ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.లక్ష మిగులుతున్నదని తెలిపాడు. తాజాగా అనంతపురంలో ఓ ఫ్రాంచైజీ కూడా ఇవ్వడం విశేషం.
అందరూ తాగొచ్చు
మనం తీసుకునే ఆహారాన్ని ఔషధంగా ఎందుకు మార్చకూడదనే ఆలోచన ఎప్పుడూ నాలో ఉండేది. ఇప్పుడు మనం ఏ డ్రింక్ తీసుకున్నాసరే దానిలో చక్కెర కలుస్తుంది. దీంతో ఆరోగ్యం మాట అటుంచితే అనారోగ్యం కొనుక్కున్నట్టు అవుతుంది. అందుకే నేను కొర్రల్లో ఉన్న మంచి గుణాలతోపాటు టీజీయా అనే తీపి పదార్థాన్ని కలిపి ఈ మిల్లెట్ డ్రింక్ తయారుచేశాను. ఇందులో ఎలాంటి క్యాలరీలూ ఉండవు. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ దీనిని తాగొచ్చు. ఇందులోని విటమిన్ బీ1, బీ3, బీ6 అరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.
– గండూరి శైలేష్…? మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి