Diabetes | పిలవకుండానే వచ్చేసి, ఒంట్లో తిష్ఠ వేసే మొండి అతిథి.. మధుమేహం. జీవితాంతం ఆ రుగ్మతతో సహజీవనం చేయాల్సిందే. మరీ ముఖ్యంగా ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహ సమస్య పెరిగిపోతున్నది. జన్యుపరమైన కారణాల వల్ల కూడా మనదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువే! అధిక కొవ్వు, ఊబకాయం మధుమేహానికి దారితీస్తాయి.
ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కణాల మీద ఒత్తిడి పెరుగుతుంది (సెల్యులార్ స్ట్రెస్). శక్తిని అందించే చక్కెరను స్వీకరించే దశనూ అవి దాటిపోతాయి (ఇన్సులిన్ రెసిస్టెన్స్). ‘ఒంట్లో కొవ్వు పేరుకుంటున్నది.. జాగ్రత్త పడండి’ అంటూ కణాలను హెచ్చరించే వ్యవస్థ వల్లే ఇలా జరుగుతుంది. ఇందుకు IRE1/XBP1 అనే రెండు రసాయనాలు కారణమట. అలా అని ఆ రసాయనాలను ఆపే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అదృష్టవశాత్తు.. ఎలాంటి దుష్ఫలితాలూ లేకుండా ఈ రెండు రసాయనాలనూ నియంత్రించే మందులను కనుగొన్నారు కాలిఫోర్నియా పరిశోధకులు. ఊబకాయంతో ఉన్న ఎలుకల మీద ఈ తరహా చికిత్స చేసి సత్ఫలితాలు సాధించారు కూడా!