Deepika Padukone | ఆన్ స్క్రీన్‌లో ఆమె అందం-ఆఫ్ స్క్రీన్‌లో ఆమె వ్యక్తిత్వం కోట్లమంది అభిమానులను సంపాదించి పెట్టాయి. కాబట్టే దీపికా పదుకొనె.. దశాబ్ద కాలం నుంచీ అప్రతిహతంగా బాలీవుడ్‌ను ఏలేస్తున్నది. పెండ్లి తర్వాత తను ఆచితూచి కథలను ఎంచుకుంటున్నది. ప్రభాస్ సరసన ప్రాజెక్ట్-కె ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ క్రేజీ భామ ముచ్చట్లు..
ఈ సంవత్సరం కూడా టైమ్స్-100 జాబితాలో చోటు దక్కడం ఆనందంగా ఉంది. అయితే ఈసారి నాలోని నటికి కాకుండా.. నాలోని శక్తిమంతురాలైన స్త్రీకి ఈ గుర్తింపు లభించింది. కుంగుబాటు సమస్యను నేను అధిగమించిన తీరు ‘టైమ్స్’ను ఆకట్టుకుంది.
ఈ ప్రపంచంలో ఆడ, మగ మధ్య ఉన్న చిన్నపాటి విభజన రేఖపట్ల నాకు చాలా స్పష్టత ఉంది. నేను, నా చెల్లి వాటికి అతీతంగా పెరిగినా పరిస్థితులు, పరిసరాలు కొత్త పాఠాలు నేర్పుతూనే ఉన్నాయి. నేను మాత్రం.. ఇప్పటివరకు మనుషులను వేరుచేసి చూడలేదు.
పద్దెనిమిదేండ్లకే మోడల్‌గా నా ప్రయాణం ప్రారంభించాను. నిజానికి నేనొక అథ్లెట్‌ని. నా తండ్రి ప్రకాశ్ పదుకొనె నుంచి ఆట నాకు వారసత్వంగా వచ్చింది. అందువల్లే శరీరాన్ని, మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు ఖరీదైన వస్తువులు షాపింగ్ చేయడానికి జంకేదాన్ని. ఎందుకైనా మంచిదని పర్సులోని డబ్బు ఒకటికి రెండుసార్లు లెక్కబెట్టుకునేదాన్ని. ఇప్పుడు, ఆ ప్రతిష్ఠాత్మక బ్రాండ్స్‌కు నేను రాయబారిని.
లాక్డౌన్ చాలా నేర్పింది. ఎప్పుడూ షూటింగ్‌లు, పని, ప్రయాణాలు అంటూ బిజీబిజీగా తిరిగేదాన్ని. కరోనా సీజన్లో కుటుంబంతో గడిపేందుకు తీరిక దొరికింది. మనసును నియంత్రించడం అనేది నాకు ముందునుంచే అలవాటు కాబట్టి, ఏమంత ఇబ్బందిగా అనిపించలేదు. సమయం విలువేమిటో, డబ్బు విలువేమిటో, బంధువుల విలువేమిటో, ఆఖరికి మనం పీల్చే గాలి విలువేమిటో కూడా నేర్పింది కరోనా.
కొవిడ్ వల్ల ఆత్మీయులను కోల్పోయి కొందరు, ఉపాధి పోగొట్టుకొని కొందరు చాలా ఇబ్బందిపడ్డారు. లాక్డౌన్లో రణ్వీర్తో గడపడానికి సమయం చిక్కింది. పెండ్లి తర్వాత మేమిద్దరం మరింత దగ్గరయ్యాం. మా ఇద్దరి కుటుంబాలు ఇంకా దగ్గరయ్యాయి.
నిజానికి పరిశ్రమకు రావడానికి ముందే నన్ను నేను చాలా ప్రశ్నలు వేసుకున్నా. ఎందుకంటే నాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. పైగా నా భాషలో దక్షిణాది యాస కొట్టొచ్చినట్టు కనిపించేది. నిజంగా నేను పరిశ్రమలో నిలదొక్కుకోగలనా? నా ప్రయాణం ఎలా ఉండబోతుందో? అని భయపడ్డాను. వాటన్నిటికి సమాధానమే ఈ రోజు నాకు దక్కిన గుర్తింపు.
నాకు చీరలు, చుడీదార్లు ఇష్టం. ఇంట్లో క్యాజువల్స్కే ప్రాధాన్యం. గ్రీన్, పింక్ అభిమాన వర్ణాలు. మితంగా తింటాను. తగినంత వ్యాయామం చేస్తాను. వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. హాలీవుడ్లో చిన్నచిన్న వేషాలు వేయడం కంటే ఇక్కడ మంచినటిగా పేరు తెచ్చుకోవడమే గౌరవంగా భావిస్తా.