రిజర్వేషన్ బోగి (కథలు)
రచన: జూపాక సుభద్ర
పేజీలు: 104; వెల: రూ. 100/-
ప్రచురణ: నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్
ప్రతులకు: నవ తెలంగాణ పుస్తక కేంద్రాలు
ఫోన్: 94900 99378
నిచ్చెనమెట్ల భారతీయ సమాజంలో దళితుల పట్ల ఆధునిక కాలంలోనూ కొనసాగుతున్న వివక్ష గురించి కలమెత్తిన వారిలో జూపాక సుభద్ర ఒకరు. చదువుకునే కాలంలో, ఉద్యోగంలో కుదురుకున్నప్పుడు, ఆ తర్వాత మెరుగైన జీవితం గడుపుతున్న దశల్లో కూడా దళితులకు ఎదురయ్యే ఆధునిక అంటరానితనాన్ని రచయిత్రి ‘రిజర్వేషన్ బోగి’ కథల్లో కండ్లకుకట్టారు. తాను రిజర్వేషన్ చేసుకున్న సీటును తనకు ఇవ్వాలన్నప్పుడు, అప్పటికే దానిని ఆక్రమించుకున్న వ్యక్తి దురుసుతనాన్ని ఎండగడుతుంది ‘రిజర్వేషన్ బోగి’ కథ. గొడ్డు మాంసం తినడంపై ఇటీవలి కాలంలో దేశంలో విస్తృతంగానే చర్చ జరిగింది. అట్టడుగు వర్గాల మహిళలకు చవకగా లభించే పోషకాహారంపై వివాదం ఎందుకని సమకాలీన సమాజాన్ని ప్రశ్నిస్తూ సాగిన కథలు ‘బిందాస్ బీఫ్’, ‘నీసు నియ్యతి’, ‘ముద్దుకూర’. పల్లెలతో పోలిస్తే నగరాల్లో కుల వివక్ష తక్కువ అనుకుంటారు. అయితే నగరాల్లో కూడా కులం విషయంలో ఎదురయ్యే పరిణామాలను వివరిస్తుంది ‘కూటికి పేదనైనా’ కథ. బాల్యంలో ఇంట్లోకి రానివ్వని సహ విద్యార్థిని, ఆ తర్వాతైనా మారుతుందనుకోవడం భ్రమే అనే కోణాన్ని వివరించే కథ ‘రిజెక్టెడ్ కాల్’. రచయిత్రి తల్లి ‘కనికీర’ (కనకవీర) పేరు మూలాలను వెతుకుతూ సాగే ‘ఆనవాల్లు ఆగమైన అవ్వ’తో ప్రారంభమయ్యే ‘రిజర్వేషన్ బోగి’ పుస్తకం దళితుల జీవితాలను, దళితుల సంస్కృతిని చిత్రిస్తూ, తెలంగాణ యాసలో సాగుతుంది. మనిషిని మనిషిలా చూడాలనే తత్వాన్ని బోధిస్తుంది.
-చింతలపల్లి హర్షవర్ధన్