
అణగారిన ప్రజల అభ్యున్నతికోసం తన యావజ్జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఉప్పుమావులూరి సాంబశివరావు. సంక్షిప్తంగా ఉ.సా.గా ప్రసిద్ధులు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కవిగా, గాయకునిగా, రచయితగా, సంపాదకుడిగా, నాయకుడిగా, చింతనాపరుడిగా… బహుముఖీనంగా పీడిత ప్రజానీకానికి అండగా నిలిచిన ధీమంతుడాయన. అణగారిన జనం కోసం అహరహం పాటుపడిన ఉ.సా. 2020 జూలై 25న కరోనా బారినపడి అకాల మరణం చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రథమ వర్ధంతి (2021 జూలై 25)ని పురస్కరించుకొని ఉ.సా. స్మారక కమిటీ ఆయన ఆశయాలకు కొనసాగింపుగా నాలుగు పుస్తకాలను వెలుగులోకి తీసుకువచ్చారు. బొర్రా గోవర్ధన్, ప్రొఫెసర్ చక్రధరరావు, ఓల్గా తదితరులు వివిధ సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై రాసిన వ్యాసాలను ‘దేశీ దిశ’ రూపంలో సంకలనం చేశారు. సమకాలీన రాజకీయాలపై ఉ.సా. ఆలోచనలను ‘నిప్పుకణికలు’ పేరుతో, ఆయన రాసిన పాటలు, కవితలను ‘జోలాలీ…’ శీర్షికతో రెండు వేర్వేరు పుస్తకాలు ప్రచురించారు. ఉ.సా. అయిదు దశాబ్దాల ఉద్యమ జీవితంలోని వివిధ పార్శాలను స్పృశిస్తూ ఆయనతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నవారు వెలిబుచ్చిన అభిప్రాయాలను ‘బహుళ బహుజన జెండా అజెండా ఉ.సా’ అనే పేరుతో వెలుగులోకి తీసుకువచ్చారు. ఉద్యమాల ఉపాధ్యాయుడుగా ప్రసిద్ధిచెందిన సాంబశివరావు గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి ఈ పుస్తకాలు ఆలంబనగా నిలుస్తాయి.
దేశీ దిశ
(ఉ.సా స్మారక సదస్సుల పత్రాలు)‘
పేజీలు: 176; వెల: రూ.150
నిప్పుకణికలు
(ఉ.సా. రాజకీయ వ్యాసాలు)
పేజీలు: 152; వెల: రూ.100
జోలాలీ…
(ఉ.సా. పాటలు)
పేజీలు: 312; వెల: రూ.150
బహుళ బహుజన జెండా- అజెండా ఉ.సా.
పేజీలు: 300; వెల: రూ.200
ప్రచురణ: ఉసా స్మారక కమిటీ
ప్రతులకు: సిఎల్ఎన్ గాంధీ,
ఫోన్: 98480 55369
-హర్షవర్ధన్ చింతలపల్లి
కలలతో కమనీయ నృత్యం
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆదిత్య నాథ్ దాస్ మస్తిష్కంలోంచి జాలువారిన కవితల సంపుటి.. ‘డ్యాన్సింగ్ విత్ డ్రీమ్స్- జర్నీ ఫ్రమ్ మీ టు మై సెల్ఫ్’ పుస్తక శీర్షికే ఒక కవిత్వ ప్రేమికుడి అభిరుచిని, పుస్తక సారాన్నీ తెలియజేస్తున్నది. ఇది ఓ భావుకుడి అంతరంగ యాత్ర. ఇందులోని 43 ఆంగ్ల కవితలూ దేనికదే ప్రత్యేకమైనవి. ‘ఇందులోని సాహిత్యం మొహమాటాలు లేకుండా, పాఠకుల హృదయంతో నేరుగా మాట్లాడుతుంది’ అంటారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సీతాకాంత్ మహాపాత్ర.‘నేను పాఠశాల విద్యార్థిగానే రాయడం ప్రారంభించాను. కవిత్వం అంతా భాషే అయినా, భాష అంతా కవిత్వం కాదని అప్పుడే తెలుసుకున్నాను. మనిషి తన భావాలను అత్యంత సరళంగా, సమర్థంగా, స్వచ్ఛంగా వ్యక్తీకరించే మాధ్యమం కవిత్వం ఒక్కటే అని నాకు అనుభవపూర్వకంగా తెలిసింది’ అంటారు ఆదిత్యనాథ్. చిత్రకారుడు రమణజీవి స్కెచ్లు అక్షరాల ఆంతర్యాన్ని వెల్లడిస్తాయి. కవి హృదయానికి చిత్రిక పడతాయి.

డ్యాన్సింగ్ విత్ డ్రీమ్స్
రచన: ఆదిత్యనాథ్ దాస్
పేజీలు: 50; వెల: రూ. 575
ప్రతులకు: ముఖ్య పుస్తక కేంద్రాలు.
-కన్నెకంటి వెంకట రమణ