e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home బతుకమ్మ వైరస్‌పై ‘వార్‌' రూమ్‌

వైరస్‌పై ‘వార్‌’ రూమ్‌

వైరస్‌పై ‘వార్‌' రూమ్‌

కొవిడ్‌ నుంచి ‘నేను సేఫ్‌.. నా ఫ్యామిలీ సేఫ్‌..’ అంతే చాలని అనుకోలేదు ఆ యువకుడు. సరైన సమయంలో చికిత్స లభిస్తే నే వైరస్‌ నుంచి అంతా సేఫ్‌గా బయటపడతారని భావించాడు. కొవిడ్‌ బాధితులకు తక్షణ వైద్యం అందించే లక్ష్యంతో ఓ ‘వార్‌ రూమ్‌’ ఏర్పాటు చేశాడు. ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలన్నా, దవాఖానలో బెడ్స్‌ అవసరమైనా వెంటనే సమకూర్చాడు.ఆగమేఘాల మీద అత్యవసర సమాచారం అందిస్తూ, కరోనా రెండో విలయంలో పదిహేను వందల మందికి సాయం చేశాడు హైదరాబాద్‌కు చెందిన టెకీ శ్రీహర్ష.

కరోనా సెకండ్‌ వేవ్‌ ఎన్ని విపరీతాలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పన వసరం లేదు. ఒకానొక సమయంలో దవాఖానలో బెడ్లు లేక, ఆక్సిజన్‌ అందక, ఔషధాలు దొరకక వైరస్‌ బాధితుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ఈ పరిస్థితిలో ఉన్నంతలో నలుగురికి అండగా నిలువాలనుకున్నాడు శ్రీహర్ష. బెడ్స్‌, ఆక్సిజన్‌ కోసం సామాజిక మాధ్యమాల్లో బాధితుల అభ్యర్థనలను చూసి చలించిపోయాడు. వారందరి తరఫున తనూ గాలించడం మొదలుపెట్టాడు. ఆన్‌లైన్‌లో జల్లెడ పట్టి ఎక్కడ బెడ్స్‌ ఖాళీ ఉన్నాయన్న సమాచారాన్ని బాధితులకు అందించాడు శ్రీహర్ష.

అ‘పూర్వ స్నేహితులు’

- Advertisement -

ఒక్కడిగా మొదలైన శ్రీహర్షతో వందలమంది కలిశారు.“ఆన్‌లైన్‌లో వెతికి బెడ్లు, ఆక్సిజన్‌, మెడిసిన్‌.. ఏది అవసరమైతే అది సమకూర్చే ప్రయత్నం చేశా. రోజుకు నాలుగైదు గంటలు కేటాయించాలని మొదలు పెట్టాను. మొదటి మూడు రోజుల్లో 20 మంది అవసరాలు తీర్చాను. తర్వాత కొందరు ‘మేము కూడా సాయం చేయవచ్చా’ అని అడిగారు. నాలుగు రోజుల్లో 40 మందితో ఒక గ్రూప్‌ తయారైంది. తర్వాత నా కాలేజీ ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ గ్రూప్‌లో పోస్ట్‌ పెట్టా. ‘రోజుకు రెండు గంటలు సమయం కేటాయించినా, ఆపదలో ఉన్నవారికి సాయం చేయొచ్చు. ఆస్పత్రి వివరాలు వెతికి సమాచారం ఇవ్వడమే పని’ అని చెప్పా. నేను ఊహించని విధంగా 250 మంది ముందుకు వచ్చారు. ప్రస్తుతం మా టీమ్‌లో 500 మంది వలంటీర్లు ఉన్నారు. వీరిలో కొందరు అమెరికా నుంచి పని చేస్తున్నారు” అని వివరించారు శ్రీహర్ష.

క్రౌడ్‌ ఫండింగ్‌ అండగా..

సామాజిక మాధ్యమాలే వేదికగా వీళ్ల సాయం సాగింది. అయితే, పల్లెలు, చిన్నచిన్న పట్టణాలకు చెందిన నిరుపేదలకు సోషల్‌ మీడియాపై అవగాహన ఉండదు. వారి కోసం కొవిడ్‌ ‘వార్‌ రూమ్‌’ను ఏర్పాటు చేశారు. అమెరికాలోని స్నేహితులు కొందరు ఆర్థికంగా సాయం చేస్తామన్నారు. మరోవైపు ‘గుడ్‌క్లాప్‌’ అనే ఫండ్‌ రైజింగ్‌ కంపెనీ సహకారంతో ఏప్రిల్‌ 29 నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ.47 లక్షలు నిధులు సమకూర్చుకున్నారు. “ఇలా సేకరించిన డబ్బుతో హైదరాబాద్‌, విశాఖపట్నం, కాకినాడ, ఆగ్రా, అజ్మీర్‌, భోపాల్‌, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 1,400 మంది కొవిడ్‌ బాధితుల అవసరాలు తీర్చాం. రూ.5.5 లక్షలతో కూకట్‌పల్లిలో 45 ఆక్సిజన్‌ పడకలు, 15 ఐసీయూ పడకలను ఏర్పాటు చేశాం. వెంటిలేటర్‌ బెడ్‌, ఐసీయూ బెడ్‌ సమాచారం అందించడం, నిరుపేదలకు ఆస్పత్రి బిల్లు కట్టడంతోపాటు ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఇలా అవసరమైనవి సమకూర్చాం. తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లో ఇప్పటి వరకు దాదాపు 800 మందికి రేషన్‌ కిట్లు అందజేశామ”ని చెప్పుకొచ్చారు శ్రీహర్ష. ఇప్పటి వరకు 18 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఉచితంగా పంపిణీ చేసింది శ్రీహర్ష బృందం.

పకడ్బందీగా

సోషల్‌ మీడియాలో వచ్చే రిక్వెస్ట్‌లు, కాల్‌సెంటర్‌కు వచ్చే ఫోన్‌కాల్స్‌ను పక్కాగా పరిశీలించిన తర్వాతే సాయం చేస్తారు. ‘వార్‌ రూమ్‌’లో ట్రిపుల్‌ఐటీ పూర్వ విద్యార్థులు, ఐటీ నిపుణులు, అంకుర సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు భాగస్వాములయ్యారు. పలువురు వైద్యులు, ఇంజినీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్‌లు స్వచ్ఛందంగా ఈ సేవలో పాలుపంచుకుంటున్నారు. ‘ఫోన్‌ చేసి నిజమైన బాధితులా, కాదా అని తేల్చుకుంటాం. నిజమైన వారే అయితే వెంటనే ఆస్పత్రి వివరాలు తెలియజేయడంతోపాటు ఎవరిని కలవాలో, ఎవరికి ఫోన్‌ చేయాలో సమాచారం అందిస్తాం’ అని వివరించారు శ్రీహర్ష. కొవిడ్‌ పూర్తిగా సద్దుమణిగే వరకు సేవలు కొనసాగిస్తామంటున్నాడు ఈ యువకుడు.

సాయం కోసం..

శ్రీహర్ష కొవిడ్‌ ‘వార్‌ రూమ్‌’ నంబరు 63042 96587,
ఇన్‌స్టాగ్రామ్‌లో www.instagram.com/
sriharshakaramchati/,
ట్విటర్‌లో twitter.com/
Harshakaramchati.
సాయం చేయడానికైనా, సాయం పొందడానికైనా సంప్రదించవచ్చు.

గుల్లపెలి సిద్ధార్థ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వైరస్‌పై ‘వార్‌' రూమ్‌
వైరస్‌పై ‘వార్‌' రూమ్‌
వైరస్‌పై ‘వార్‌' రూమ్‌

ట్రెండింగ్‌

Advertisement