
1 నవంబర్, 1956.. తెలంగాణ చరిత్రలో ఒక దుర్దినం. అప్పటి వరకూ తెలంగాణకున్న స్వతంత్ర రాజకీయ అస్తిత్వం..సాంస్కృతిక అస్తిత్వం ఆనాటితో అంతమైంది. సీమాంధ్ర వలసాధిపత్యం ఆరంభమయ్యింది.అయితే, విలీనానికి కారణాలు, విలీన విద్రోహ రాజకీయాల గురించి ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది. ఆ సంగతులన్నీ తెలంగాణలోని ప్రతి మనిషికీ ఎరుకైంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రాతిపదికలను గురించి ఉద్యమ కాలంలోనే పల్లెనుంచి పట్నం దాకా చర్చించుకున్నది. ఇవాళ సీమాంధ్ర వలస పాలననుండి తెలంగాణ విముక్తమైంది. తిరిగి స్వతంత్ర సామాజిక సాంస్కృతిక అస్తిత్వాన్ని, స్వయంపాలననూ సంపాదించుకున్నది. ఇలాంటి సమయంలో తెలంగాణలో వెల్లివిరిసిన సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మరొక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరమున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఏడేండ్లు గడిచిన సందర్భంగా ఈ 20 ఏండ్ల మలిదశ ఉద్యమం సాధించిన గుణాత్మకమైన ఫలితాలను మదింపు చేసుకోవాల్సి ఉన్నది. వాటిని మరింత ఉన్నతీకరించుకోవడంతోపాటు ఆ విలువలను స్థిరీకరించుకోవాల్సిన అవసరమూ ఇప్పుడున్నది.
తెలంగాణ.. తను కోల్పోయిన స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని తిరిగి పొందాలనుకున్నది. తన ప్రత్యేక భాషా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవాలనుకున్నది. రాజ్యాధికారంతోనే వనరుల దోపిడినీ అంతం చేయవచ్చుననీ, సాంస్కృతిక వలసీకరణను నిలువరించవచ్చుననీ, ప్రత్యేక భాషా సాంస్కృతిక అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవచ్చుననీ భావించింది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మరోమారు చిగురించింది. ఆ ఆకాంక్ష ఉద్యమంగా రూపు దాల్చింది. ఈ ఉద్యమానికి ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు..’ అన్న నినాదాన్ని ట్యాగ్‌లైన్‌గా అందించారు ప్రొ॥ జయశంకర్. ఈ ట్యాగ్‌లైన్‌ను తెలంగాణ రాజకీయ ఆర్థిక నినాదంగా మార్చారు ప్రజాగాయకుడు గద్దర్. ‘మా నీళ్లు మాగ్గావాలే.. మా నిధులు మాగ్గావాలే. మా ఉద్యోగాలు మాగ్గావాలే. మా భూములు, మా బొగ్గు మాగ్గావాలే. అందుకే మా తెలంగాణ మాగ్గావాలే..’ అని గొంతెత్తి పాడారు. ఈ క్రమంలోనే మరికొంతమంది తెలంగాణ బుద్ధిజీవులు తమ సృజనాత్మకతకు పని చెప్పారు.

ఉద్యమం కోసం అద్భుతమైన ప్రతీకలను అందించారు. “నీ అట్లతద్దికి నా బతుకమ్మకు బంధుత్వమెక్కడిది? నీ అట్టుకు నా జొన్నరొట్టెకు సుట్టరీకమెక్కడిది?” అంటూ సాంస్కృతికంగా తెలంగాణ, సీమాంధ్ర ఒకటి కాదని గోరటి వెంకన్న చాటి చెప్పారు.“అవ్వోనివా నువు అయ్యోనివా.. తెలంగానోనికి తోటి పాలోనివా.. చార్మినారుకు సున్నమేసినవా.. గోలుకొండకు రాళ్లు మోసినవా?” అని మా నేలమీద మీ పెత్తనమేంటని గూడ అంజయ్య ప్రశ్నించారు.ఈ ప్రతీకలతో కూడిన ప్రశ్నల వర్షంలో సీమాంధ్ర పాలకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇలా తెలంగాణ కవులు రచయితలు, బుద్ధిజీవులు తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన తాత్విక భూమికను ఏర్పరిచారు. 1969 ఉద్యమానికి ఇలాంటి తాత్విక భూమిక లేకపోవడం వల్ల పాలపొంగులాగా లేచిన ఉద్యమం రాజకీయ విద్రోహంతో ‘నీళ్లు చల్లిన పాలపొంగులా’ కుప్పకూలిపోయింది. మళ్లీ అది లేవడానికి 25 ఏండ్లు పట్టింది. ఈ 25 ఏండ్లలో తెలంగాణ ఉద్యమదీపం ఆరిపోకుండా ఎంతోమంది బుద్ధిజీవులు, తమ చేతులను అడ్డం పెట్టి, మలిదశ ఉద్యమం రాజుకోవడానికి నిప్పును కాపాడారు.
తవ్వినకొద్దీ.. చరిత్ర!
20 ఏండ్ల మలిదశ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఊపిరి పోసింది. జాతీయ ఉద్యమం సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘వందేమాతరం’ నినాదం ప్రజల్లో ఎటువంటి ఉత్తేజాన్ని నింపిందో ‘జై తెలంగాణ’ నినాదం కూడా అలాగే తెలంగాణను తట్టి లేపింది. మరుగున పడిపోయిన చరిత్రను తవ్వి తీయడానికి అనేకమంది చరిత్ర పరిశోధకులు పలుగూ పారా పట్టుకొని పురా తవ్వకాలు చేశారు. ఘనమైన తెలంగాణ చరిత్రను వెలికి తీశారు. సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సుజాతారెడ్డి, సాహూ, అల్లం రాజయ్య, బి.ఎస్.రాములు, జితేంద్రబాబు, డా॥ జైకిషన్, సూర్యప్రకాష్, సంగనభట్ల నరసయ్య, పరవస్తు లోకేశ్వర్ వంటివారితోపటు డాక్రి, తెలంగాణ జాగృతి, తెలంగాణ హిస్టరీ సొసైటీలాంటి సంస్థలూ తెలంగాణ చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం చేశాయి. బహుజన వీరులు సర్వాయి పాపన్న, తుర్రేబాజ్ ఖాన్, సుద్దాల హనుమంతు, బందగీ, కొమురం భీం, భాగ్యరెడ్డివర్మ, వట్టికోట ఆళ్వారుస్వామి, మగ్దూం, కాళోజీ, దాశరథి, సురవరం ప్రతాపరెడ్డి, నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహదూర్ .. ఇలా ఎంతోమంది తెలంగాణ వైతాళికులు వెలుగులోకి వచ్చారు.

తెలంగాణపై మగ్దూం చెప్పిన ‘ఇంక్విలాబ్ కా పైగంబర్ తెలంగాణ’, దాశరథి చెప్పిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’, కాళోజీ చెప్పిన ‘మాటొక్కటి భాషొక్కటి, భారతాన వెలసి నిలుచు తెలంగాణ’ అన్న కవితా పాదాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం పొందాయి. దాశరథి కవితా పాదాలను అన్వయించి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు ‘మా తెలంగాణం.. కోటి ఎకరాల మాగాణం’ అన్న నినాదాన్ని రూపొందించారు. ఆ నినాదమే ఈ రోజు ప్రభుత్వానికి ఒక ప్రధాన ఎజెండాగా మారింది. ఈ క్రమంలో నిజామాంధ్ర మహాసభల చరిత్ర, హైదరాబాద్ విమోచన చరిత్ర.. దానిపై భిన్న దృక్పథాలు, హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య పేరుతో జరిగిన సైనికచర్యపై ప్రత్యక్ష కథనాలు, ఆపరేషన్ పోలో సందర్భంగా ముస్లింలపై జరిగిన ఊచకోతపై పండిట్ సుందర్‌లాల్ నివేదిక, 1969 ఉద్యమచరిత్ర, 1969 ఉద్యమ కరపత్రాలు రెండు సంపుటాలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విద్రోహచరిత్ర, భారత రాష్ర్టాల ఏర్పాటు పరిణామ చరిత్ర, 1956లో వట్టికోట ఆళ్వారుస్వామి వెలువరించిన తెలంగాణం రెండు సంపుటాలు, బి.ఎన్ శాస్త్రి రచించిన ‘రెండు తెలుగురాజ్యాలు ఎందుకు?’ పుస్తకాలు పునర్ముద్రణ పొందాయి.
హైదరాబాద్ రాజ్యంపై పోలీసు చర్యపై హైదరాబాద్ రాజ్య చివరి ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ రాసిన ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ పుస్తకాన్ని డాక్రీ సంస్థ మళ్లీ ముద్రించింది. ‘తెలంగాణ చరిత్ర’, ‘తెలంగాణ సాహిత్య చరిత్ర’ అనే రెండు విలువైన పుస్తకాలను సుంకిరెడ్డి నారాయణరెడ్డి వెలువరించారు. ‘హైదరాబాద్ తెలంగాణదే’ శీర్షికతో సాధికారికమైన సమాచారంతో పుస్తకాన్ని ప్రచురించారు సంగిశెట్టి శ్రీనివాస్. సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన గోలకొండ కవుల సంచికను తెలంగాణ జాగృతి సంస్థ పునఃప్రచురించింది. చరిత్ర పరిశోధకుడు జితేంద్రబాబు సంకలించిన ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభల చరిత్ర’నూ ప్రచురించి, తెలంగాణ ప్రజలకు అపూర్వకానుకను అందించింది. లోకేశ్వర్ రాసిన ‘సలాం హైదరాబాద్’ నవల ఒక సంచలనం.. ఇట్లా తెలంగాణ చరిత్రపై అనేక పుస్తకాలు వెలువడ్డాయి.
బలమైన ఉద్యమ సాహిత్యం
ప్రొ॥ జయశంకర్ ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడంలో అనితర సాధ్యమైన పాత్రను పోషించింది. సి.పి.ఎం తెలంగాణ వ్యతిరేక వైఖరిపై రాసిన వ్యాసాలతో తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రచురించిన ‘కమ్యూనిజమా కోస్తా వాదమా’ పుస్తకం వామపక్షాలపై, ముఖ్యంగా సి.పి.ఐ, న్యూడెమోక్రసీలపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది. ఆ పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని మార్చుకోవడానికి దోహదం చేసింది. తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంయుక్తంగా ప్రచురించిన ఆర్.విద్యాసాగర్ రావుగారి ‘నీళ్లు.. నిజాలు’ పుస్తకం, నీటి దోపిడీ రాజకీయాలను ప్రజలకు వివరించడంలో సఫలమైంది. తలాపున గోదావరి, కృష్ణా నదులు పారుతున్నా తెలంగాణకు న్యాయంగా అందాల్సిన నీటి వాటా ఎందుకు అందడం లేదో ఆయన వ్యాసాలు, ప్రసంగాలు ప్రజలకు విడమర్చి చెప్పాయి. నీళ్లలో నిప్పులు రగిలించి ఉద్యమానికి నీళ్లను ఒక ప్రధానాంశంగా మార్చడంలో ఆయన కృషి విస్మరించలేనిది. విద్యాసాగర్ రావుకంటే ముందే సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను ఎత్తి చూపిస్తూ వి.ప్రకాష్, ఇన్నయ్య గార్లు పరిశోధనలు, క్షేత్ర పర్యటనలు చేసి కొన్ని పుస్తకాలను ప్రచురించారు. సీమాంధ్ర సాంస్కృతిక వలసీకరణలో అవహేళనకు, చిన్నచూపునకు బలవుతున్న తెలంగాణ భాషను సాహిత్య భాషగా మన కవులు, కథా రచయితలు నిలబెట్టారు. మట్టిగొట్టుక పోయిన అద్భుత పదసంపదను, మన పలుకుబడులను, మన సామెతలను పని గట్టుకొని వెలికి తీశారు. నలిమెల భాస్కర్ ‘తెలంగాణ పదకోశం’, రవ్వా శ్రీహరి ‘నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం’, వేముల పెరుమాళ్లు రాసిన ‘తెలంగాణ సామెతలు’.. తదితర పుస్తకాలు తెలంగాణ భాష సాహిత్య భాషగా స్థిరపడటానికి దోహదం చేశాయి.
సాంస్కృతిక ఉద్యమం.. ధూంధాం

ఒకవైపు సాంస్కృతిక సామ్రాజ్యవాదం, మరొకవైపు అంతర్గత సాంస్కృతిక వలసవాదం దెబ్బకు అనేక జానపద కళారూపాలు అంతరించి పోయాయి. తమలో ఉన్న అంతర్గత శక్తితో కొన ఊపిరితో బతికి ఉన్న ఒగ్గు, చిందు బాగోతం కళారూపాలు అంతరించి పోవడానికి దగ్గరయ్యాయి. ఉద్యమం సందర్భంగా వీటన్నిటికీ ప్రాణప్రతిష్ఠ జరిగింది. అపురూపమైన తెలంగాణ జానపద కళారూపాలు తిరిగి ప్రజలకు దగ్గరయ్యాయి. వందలాది జానపద బాణీలు తెలంగాణ ఉద్యమపాటలకు బాణీలయ్యాయి. ఒగ్గు కళాకారులు చుక్కా సత్తయ్య, మిద్దె రాములు, చిందు కళాకారిణి చిందు ఎల్లమ్మను తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలుగా ఉద్యమం నిలబెట్టింది. జయధీర్ తిరుమలరావు ‘చిందు జాంబ పురాణం’ పుస్తకాన్ని ప్రచురించారు. డా॥ ముత్యం చిందు ఎల్లమ్మ జీవిత చరిత్ర పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం వందలాది మంది ప్రతిభావంతులైన పాట కవులను వెలికి తీసింది. ప్రతి గ్రామంలో గోసి గొంగడి కళాకారులను ఉద్యమం తయారుచేసుకున్నది. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, మిత్ర, జయరాజ్, నందిని సిధారెడ్డి, కోదాటి శ్రీను, పైలమ్ సంతోష్, దరువు ఎల్లన్న, సుందిళ్ల రాజన్న, యశ్ పాల్, నిస్సార్, మిట్టపల్లి సురేందర్, అశోక్.. ఇలా ఎన్ని పేర్లయినా రాయవచ్చు.
అరుణోదయ విమల, రసమయి బాల్కిషన్, ప్రభాకర్, కోటేశ్వరరావు, డప్పు రమేశ్, నేర్నాల కిషోర్, సాయిచంద్, నాగరాజు, రమాదేవి, చైతన్య, తేలు విజయ, స్వర్ణ, మధుప్రియ, ఏపూరి సోమన్న, షేక్ బాబా, జహంగీర్, భిక్షునాయక్, జంగిరెడ్డి, కృష్ణవర్మ, భీమసేన, ఎర్ర ఉపాలి లాంటి ఎందరో కళాకారులు అద్భుతమైన కళా ప్రదర్శనలతో, రూపకాలతో, ఆటాపాటలతో, ధూంధాంలతో తెలంగాణ జనాన్ని ఉద్యమబాటలోకి నడిపారు. దేశపతి శ్రీనివాస్‌ది ఉద్యమంలో విలక్షణమైన కళా వ్యక్తిత్వం. మాటను పాటను జమిలిగా జోడించి.. శ్రోతల్లో ఉద్యమ భావావేశాన్ని రగిలించారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో అమరులైన తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకులు బెల్లి లలిత, ఐలయ్య సదా స్మరణీయులు. ఈ కళాకారుల ధూంధాంలు, ఆటాపాటా కార్యక్రమాలు తెలంగాణ గ్రామాలను, పట్టణాలను కదిలించి ఉద్యమబాటను ఎక్కించాయి. ఈ క్రమంలో తెలంగాణలో వందలాది పాటల క్యాసెట్లు, సీడీలు వెలువడ్డాయి.
కవిత్వం, కథా సాహిత్యం
ఉద్యమ సమయంలో వందలాది కవితా, కథా సంకలనాలు ప్రచురితమయ్యాయి. జూలూరి గౌరీశంకర్ ప్రచురించిన ‘పొక్కిలి’, తెలంగాణ సాంస్కృతిక వేదిక ప్రచురించిన ‘మత్తడి’, ఇటీవలే వెలువడిన ‘మునుం’, ‘జిగర్’, ‘ఊపిరి’, ‘అమరం 69-73’ తెలంగాణ ఉద్యమ కవితా సంకలనాలు తెలంగాణ కవుల ఉద్యమ చైతన్యానికి గీటురాయిగా నిలిచాయి. తెలంగాణ సాంస్కృతిక వేదిక ప్రచురించిన ‘తెలంగాణ తొవ్వలు’ పుస్తకం ఆనాడు ఒక సంచలనం. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకులుగా గత పుష్కర కాలంగా వెలువరిస్తున్న కథా సంకలనాల్లో తెలంగాణ కథలకు ప్రాతినిధ్యం తగినంతగా లేకపోవడంతో కర్ర ఎల్లారెడ్డి తెలంగాణ కథా సంకలనాలు ప్రచురించారు. ఎందరో మెరికల్లాంటి తెలంగాణ కథా రచయితలను తెలుగు కథా సాహిత్యానికి పరిచయం చేశారు. జయధీర్ తిరుమల రావు సంపాదకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం ‘తెలంగాణ కథ’ సంపుటాలను వెలువరించింది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్కూడా ‘తెలంగాణ బృహత్ కథా’ సంకలనాన్ని తీసుకొచ్చింది. ఈ సంకలనంలో తొలితరం కథా రచయితల నుంచి సమకాలీన కథా రచయితల వరకు చోటుచేసుకున్నాయి. ముదిగంటి సుజాతారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ తొలితరం తెలంగాణ కథల సంపుటిని వెలువరించారు. ఈ సంపుటాలు తెలంగాణ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. మరింత మంది తెలంగాణ రచయితలకు స్ఫూర్తినిచ్చాయి. ఈ ఉద్యమకాలంలోనే పెద్దింటి అశోక్ కుమార్ భారతీయ కథా సాహిత్యంలో రచయితగా సుస్థిరంగా నిలబడటం గర్వకారణం. ఆయన రాసిన పుస్తకాలు, కథలు అనేకం వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.

సాంస్కృతిక సంబురాలు
ఈ ఉద్యమకాలంలోనే ‘బతుకమ్మ’ పునరుజ్జీవనం పొందడం, బోనాల పండుగ, పీర్ల పండుగ, నాగోబా జాతర, సమ్మక్క సారలమ్మ జాతర, కొమురవెల్లి జాతర, ఏడుపాయల జాతర, తెలంగాణలో ఉన్న దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, పొచ్చెర, కుంటాల, బొగత జలపాతాలు, సాంస్కృతిక విశేషాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఉత్సవంగా నిలబెట్టడంలో తెలంగాణ జాగృతి కృషిని ఇక్కడ ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ నిజాం కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సంబురాలు ఒక సంచలనం. ఒక అపురూప సంరంభం. అక్కడ ప్రదర్శితమైన కళారూపాలు ప్రజలకు కనువిందు చేశాయి. తెలంగాణ వంటకాల రుచి ‘ఆహా!’ అనిపించింది. జొన్నరొట్టె, జొన్నగట్కా, పచ్చిపులుసు, సకినాలు, అప్పాలు, పత్తర్ కా గోష్, మేక తలకాయ కూర.. ప్రజలు సగర్వంగా ఆరగించారు. ఇక అప్పటినుండి అన్ని ఉద్యమసభల సందర్భంగా భోజనాల్లో జొన్నరొట్టె, జొన్న గట్కా, పచ్చిపులుసు మెనూలో తప్పనిసరి అయ్యాయి. బిజెపి నేత బండారు దత్తాత్రేయ దసరా మరునాడు ఏర్పాటు చేయిస్తున్న ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమం కూడా తెలంగాణ ఉద్యమకారుల మధ్య సోదర భావాన్ని, ఐక్యతనూ ప్రోది చేసింది.

మన రాష్ట్రం.. మన మీడియా
తెలంగాణ ఉద్యమ అవసరాల కోసమే ఒక దిన పత్రిక.. ‘నమస్తే తెలంగాణ’ ప్రారంభమైంది. ఆ పత్రిక ఆదివారం సంచికకు ‘బతుకమ్మ’ అని పేరు పెట్టడం తెలంగాణ అస్తిత్వ భావనలో భాగమే. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో తెలంగాణ రచయితల వేదిక ప్రచురించిన ‘తెలంగాణ సోయి’, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రచురించిన ‘తెలంగాణ టైమ్స్’ పత్రికలు గొప్ప ప్రభావాన్ని కలుగజేశాయి. ఆ పత్రికలు అనివార్య కారణాలతో నిలిచిపోయినా ఆ తర్వాత ‘నడుస్తున్న తెలంగాణ ’, ‘దక్కన్ ల్యాండ్’ పత్రికలు నిలదొక్కుకొని తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని వ్యాప్తి చేశాయి. ‘వీక్షణం’ అచ్చంగా తెలంగాణ పత్రిక కాకపోయినా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను సైద్ధాంతికంగా సమర్తిస్తూ, తెలంగాణ వ్యాసాలను విస్తృతంగా ప్రచురించింది. తెలంగాణపై నలువైపులనుండి ఏకదాటిగా విషం చిమ్ముతున్న సీమాంధ్ర టీవీ చానళ్ల థాట్ పోలీసింగ్‌ను నిలువరించడానికి తెలంగాణ టీవీ చానళ్ల అవసరాన్ని తెలంగాణ పెట్టుబడిదారులు కొంతమేరకు తీర్చగలిగారు. టీ న్యూస్, వీ6, హెచ్ఎంటీవీ వంటి శాటిలైట్ చానళ్లు, టీఎన్ఎన్, దక్కన్ టీవీ లాంటి కేబుల్ చానళ్లు తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పాయి. సీమాంధ్రుల కుట్రలను, తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు భగ్నం చేశాయి. స్థూలంగా వ్యాఖ్యానిస్తే గడచిన 25 ఏండ్లలో తెలంగాణలో కనిపించిన సాంస్కృతిక పునరుజ్జీవనం లేదా సాంస్కృతిక వెల్లువ దేశంలో మరెక్కడా కానరాదు. ఇది ఉద్యమం సాధించిన అద్భుతమైన ప్రజావిజయంగా చెప్పుకోవచ్చు. అణగారిపోయిన ఒక జాతి లేచి నిలబడి తనను తాను నిలబెట్టుకున్న అపురూపమైన చారిత్రక సంఘటన.. ఈ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం.
సోదరభావం.. జాతి భావన
తెలంగాణలో వెల్లువెత్తిన సాంస్కృతిక పునరుజ్జీవనం తెలంగాణ ప్రజల్లో జాతి భావనను మేల్కొలిపింది. ‘తెలంగానోల్లమ్.. మేమంతా ఒక్కటే’ అన్న భావన ఉద్యమం సందర్భంగా ఉన్నతంగా వ్యక్తమైంది. తెలంగాణకు చెందిన దేనినైనా ఎత్తి పట్టడం, తెలంగాణేతరమైన దాన్ని తిరస్కరించడం అతివాదంగా కనిపించినా, అస్తిత్వ ఉద్యమాలకుండే సహజ లక్షణంగా మాత్రమే దాన్ని చూడాలి. కులమతాలకు, సామాజిక హోదాలకు అతీతంగా ఉద్యమంలో వ్యక్తమైన సోదరభావం నిజంగా అపూర్వం. తెలంగాణలో శతాబ్దాలుగా ప్రజల ఆచరణలో ఉన్న సంబోధనలు.. అన్నా, తమ్మీ, బిడ్డా, ఏమె, రావే, పోవే.. వయసుతో, సామాజిక హోదాతో నిమిత్తం లేకుండా సర్వసాధారణమైనవిగా స్థిరపడి పోయాయి. ఇక్కడ అటువంటి కొన్ని అనుభవాలను పంచుకోవడం.. వాటిని కొనసాగించుకోవడానికి, ఉన్నతీకరించుకోవడానికీ ఉపకరిస్తాయి.

ఎర్రమంజిల్‌లో ఉన్న సాగునీటిశాఖ ప్రధాన కార్యాలయం ‘జలసౌధ’. హైదరాబాద్‌లో ఒక ఉద్యమకేంద్రంగా మారింది. సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె సందర్భంగా ఉద్యమ కార్యక్రమాలతో సందడిగా ఉండేది. ఆ సందర్భంగా తరచుగా కనబడే దృశ్యం.. స్త్రీల బతుకమ్మ. చీపుర్లతో పనిచేసే కాంట్రాక్ట్ లేబర్లతో కలిసి వైట్ కాలర్ ఉద్యోగులు, మహిళా ఇంజినీర్లు ‘బతుకమ్మ’ ఆడుతూ కనిపించేవారు. సాధారణ సమయంలో మనం చూడలేని అపురూప దృశ్యమది. అలాగే, కోదాటి శ్రీను ‘అస్సాయిదులా హారతి.. కాళ్లగజ్జెల గమ్మతి’ పాటకు, గద్దర్ ‘పొడుస్తున్న పొద్దుమీద..’ పాటకు డ్రైవర్లు, అటెండర్లు, ఇతర నాలుగో తరగతి ఉద్యోగులు, ఎన్జీవోలు, ఇంజినీర్లు కలిసి ధూలా ఆడటం అతి సాధారణ దృశ్యంగా ఉండేది. ఇటువంటి దృశ్యాలే అన్ని ఆఫీసుల్లోనూ కనిపించాయి. ఆఫీసులో సబార్డినేట్.. కానీ, ఉద్యమంలో నాయకుడు. ఎన్జీవోల నాయకత్వంలో గెజిటెడ్ ఆఫీసర్లు, క్లాస్ 1 ఆఫీసర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు కలిసి పనిచేశారు. ఎక్కడా హోదాకు లేదా ప్రొటోకాల్‌కు సంబంధించిన అంశాలు ఉద్యమంలో కలిసి పనిచేయడానికి అడ్డంకి కాలేదు. ఉద్యమానంతరం కూడా ఈ సోదరభావం కొనసాగాలి. ‘అందరం సమానమే’ అన్న ఈ విలువను తెలంగాణ సమాజం నిలబెట్టుకోవాలి.
అలాగే, తెలంగాణ జేఏసీ ఇచ్చిన ‘వంటావార్పు’ కార్యక్రమం కూడా గ్రామాల్లో ప్రజలను కులమతాలకు అతీతంగా ఐక్యం చేసింది. అంతకు ముందు బడుల్లో పిల్లలకు పగటిపూట భోజనాన్ని దళిత స్త్రీలు వండితే తిరస్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే, వంటావార్పు కార్యక్రమంలో ఈ భేదభావాలు మర్చిపోయి ప్రజలందరూ కలసి వండుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ చైర్మన్ ఘంటా చక్రపాణి పంచుకున్న అనుభవాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. శామీర్పేటవద్ద రాజీవ్ రహదారిమీద గ్రామస్తులంతా కలిసి ‘వంటావార్పు’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొందరు కూరగాయలు తరుగుతున్నారు. కొందరు అన్నం వండుతున్నారు.

అన్నం వండుతున్న వ్యక్తిని ‘మీరేమిటోల్లే?’ అని చక్రపాణి అడిగారు. దానికి ‘మేము హరిజనులం సార్’ అని చెప్పిండు ఆ మనిషి. ‘మీరు వండితే రెడ్డోల్లు, కాపోల్లు తింటరానే?’ అని చక్రపాణి మరో ప్రశ్న. ‘ఉత్తప్పుడు తినరుగానీ, ఇప్పుడు తింటరు సార్’ అని ఆయన జవాబు. ఉద్యమంలో ఇలాంటి దృశ్యాలు సాధారణమైనవే. మనుషులు వాళ్లేకానీ, సందర్భం వేరైనప్పుడు వారి సామాజిక వ్యవహారంలో మార్పు ఎందుకు చోటు చేసుకుంటుంది? ఎందుకంటే, ఉద్యమం మనిషిని డిక్లాసిఫై చేస్తుంది. ఉద్యమానంతరం కూడా ఈ విలువను తెలంగాణ సమాజం నిలుపుకోవాలి. అప్పుడే ఉద్యమానికి నిజమైన సాఫల్యత. తెలంగాణలో సామాజిక న్యాయానికి గట్టి పునాది పడుతుంది. ఇది అనుకున్నంత సులువైనదేమీ కాదు. ఒక్కరోజుతో సాధించేదీ కాదు. ఈ భావన.. ఈ ఉద్యమస్ఫూర్తి నిరంతరంగా, ప్రవాహం లాగా కొనసాగాలి. ఉద్యమ శ్రేణులు ఆ విలువను కొనసాగించడానికి కృషి చేయాలి.
ఉప సంహారం
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది. కాబట్టి, ఇప్పుడు విచక్షణతో ఏది మంచి? ఏది చెడు? మనలో ‘తిరస్కరించాల్సింది’, ‘పరిహరించుకోవాల్సింది’ ఏమిటి? అని బేరీజు వేసుకోవాల్సిన సమయమిది. ఉద్యమకాలంలో వ్యక్తమైన సామూహిక ఐక్యతా భావన, తామంతా ఒక్కటేనన్న జాతిభావనను మరింతగా ఉన్నతీకరించుకోవాల్సి ఉన్నది. తెలంగాణ భాషా సాంస్కృతిక ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాల్సిన సందర్భమిది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వలసవాదం నుంచి, విచ్ఛిన్నకర శక్తులనుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరమున్నది.

మనదైన సినిమా
ఇదే కాలంలో తెలంగాణ సినిమాకూడా తన ఉనికిని చాటుకున్నది. సినిమాల్లో తెలంగాణ భాషను గూండాలకు, రౌడీలకు, సంఘ విద్రోహశక్తులకు వాడటాన్ని ఉద్యమం తీవ్రంగా నిరసించింది. తెలంగాణ సినిమా రంగం మీదకు రావడానికి ఉద్యమ వాతావరణం ఎంతగానో దోహదం చేసింది. ఎన్. శంకర్ నిర్మించిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా సాధించిన అద్భుత విజయం, తెలంగాణలో అనేకమంది ఔత్సాహికులను సినిమా రంగంలోకి నడిపించింది. ‘కొమురం భీం’ సినిమా 20 ఏండ్ల తర్వాత తిరిగి విడుదలై, ప్రజల ఆదరణ పొందింది. ‘బతుకమ్మ’, ‘ఇంకెన్నాళ్లు’ తదితర సినిమాలు తెలంగాణ కథాంశాలతో నిర్మాణమయ్యాయి. అవి వ్యాపారపరంగా గొప్ప విజయం సాధించలేకపోయినా, తెలంగాణ సినిమా పరిశ్రమ నిలదొక్కు కోవడానికి పునాదులు వేశాయి. ఇదే కాలంలో తెలంగాణ వైతాళికులపై వారాల ఆనంద్ డాక్యుమెంటరీలు నిర్మించారు. సామల సదాశివ, మంచం మీద పడుకొనే కేంద్ర సాహిత్య అకాడమీకి అనేక అనువాదాలు చేసి ఇచ్చిన ముద్దసాని రాంరెడ్డిలపై డాక్యుమెంటరీలు వచ్చాయి. దేశపతి శ్రీనివాస్ ‘కవి దృశ్యం’ వీడియో వచన కవిత్వం మరొక విలక్షణ ప్రయోగం. సి.వనజ నిర్మించిన ‘ఓ యుద్ధకాండ’ డాక్యుమెంటరీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని గొప్పగా రికార్డు చేసింది.
మట్టి రంగు చిత్రాలు
ఈ సాంస్కృతిక వెల్లువలో చిత్రకారులు, కార్టూనిస్టులు కూడా తమవంతు కృషి చేశారు. కొండపల్లి శేషగిరిరావు, కాపు రాజయ్య, పి.టి. రెడ్డి లాంటి పాతతరం చిత్రకారులు, అప్పటికే ప్రముఖ చిత్రకారులుగా స్థిరపడిన వైకుంఠం, ఏలే లక్ష్మణ్‌లతోపాటు ఈతరం చిత్రకారులు గోనె లింగరాజు, అన్నవరం శ్రీనివాస్, ప్రభాకర్, శ్రీనివాస నాయక్, అక్బర్ తదితరులను ఉద్యమం తనవైపు నిలబెట్టుకున్నది. ఏలే లక్ష్మణ్ చిత్రాలు, గోనె లింగరాజు తెలంగాణ బతుకుచిత్రాలు, అన్నవరం శ్రీనివాస్, అక్బర్లు వేసిన అనేకమైన చిత్రాలు పుస్తకాలకు, పత్రికలకు ముఖచిత్రాలుగా మారాయి. ప్రభాకర్ వేసిన తెలంగాణ వైతాళికుల బొమ్మలు, శ్రీనివాస్ నాయక్ తెలంగాణ కవుల కవిత్వపంక్తులకు వేసిన చిత్రాలు తెలంగాణ రచయితల వేదిక సభల్లో ఇతర సంస్థల ఉద్యమసభల్లో ప్రదర్శితమై, అందరి ప్రశంసలూ అందుకున్నాయి.
వివిధ పత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులను కూడా ఉద్యమం తయారుచేసుకున్నది. శేఖర్ వేసిన ఉద్యమకార్టూన్లు అందరి ప్రశంసలను పొందాయి. భరత్‌భూషణ్, గోవింద్, కందుకూరి రమేశ్‌బాబు లాంటి ఫొటోగ్రాఫర్లు తెలంగాణ జీవనాన్ని, సాంస్కృతిక ఔన్నత్యాన్ని అద్భుతంగా తమ కెమెరా కంటితో రికార్డు చేశారు. తెలంగాణ ఉద్యమసంస్థలకు, ముఖ్యంగా తెలంగాణ జె.ఎ.సి పోస్టర్లను, పుస్తకాలకు కవర్ డిజైన్లు చేసి ఇచ్చింది ప్రముఖ డిజైనర్ ఎం.వి. రమణారెడ్డి. తెలంగాణ తల్లి బొమ్మను గీసి ఇచ్చింది నిర్మల్‌కు చెందిన కళాకారుడు బి.వి.ఆర్. చారి. కె.సి.ఆర్.గారి సూచనలతో కొన్ని మార్పులతో చారి గీసిచ్చిన తెలంగాణ తల్లి చిత్రం తెలంగాణ ప్రజల సమ్మతిని పొందింది.
