ప్రొటీన్ పౌడర్లు, ఎనర్జీ డ్రింకుల మధ్య మన సంప్రదాయ పదార్థాలు మెల్లగా మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అలాంటి సహజ పదార్థాల్లో ఒకటి గోంద్ కతీరా. దీన్నే బాదం బంక అని కూడా పిలుస్తారు. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే సహజ శక్తిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం, యునాని వైద్యంలో ఉపయోగిస్తున్న ఈ సహజ గమ్ ఇప్పుడు ఆరోగ్య పానీయాల్లో కొత్త ట్రెండ్‌గా మారుతున్నది.
గోంద్ కతీరా అనేది ఒక సహజ జిగురు. దీన్ని ప్రధానంగా ఆస్ట్రాగలస్ వర్గానికి చెందిన ముళ్ల మొక్కల నుంచి తీస్తారు.
చెట్టు తొక్కను స్వల్పంగా కోసినప్పుడు పాల లాంటి ద్రవం బయటకు వస్తుంది. అది గాలికి ఆరిపోయి స్ఫటికాల్లాంటి ముక్కలుగా మారుతుంది. వాటిని సేకరించి శుభ్రపరచి మార్కెట్లో అమ్ముతారు. ఈ స్ఫటికాలను నీటిలో 68 గంటలు నానబెడితే అవి జెల్లీలా ఉబ్బిపోతాయి. అదే తినదగిన గోంద్ కతీరా.
ఎంత మేలో…
గోంద్ సహజ శరీర శీతలకారి. ముఖ్యంగా ఎండాకాలంలో లోపలి వేడిని తగ్గించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. డీహైడ్రేషన్ సమస్యలు అరికట్టడంలో సహాయపడుతుంది. వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఎముకలు, కీళ్లకు బలాన్నిస్తుంది. సంప్రదాయ వైద్యంలో కీళ్ల నొప్పులు తగ్గించడంలోనూ ఉపయోగిస్తారు. ప్రసవానంతర బలహీనత తగ్గించడంలో సాయపడుతుందని విశ్వాసం. ఇది సున్నితమైన ల్యాక్సేటివ్లా పనిచేసి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరానికి హైడ్రేషన్ అందించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
ఇలా తాగొచ్చు..
1. గోంద్ కతీరా మిల్క్ డ్రింక్ చల్లటి పాలలో నానబెట్టిన గోంద్ కతీరా, రోజ్ సిరప్, తేనె కలిపితే శీతల పానీయం సిద్ధం.
2. నిమ్మ శర్బత్చల్లటి నీటిలో గోంద్ కతీరా, నిమ్మరసం, కొద్దిగా పంచదార, ఉప్పు కలిపితే రిఫ్రెషింగ్ డ్రింక్ రెడీ.
3. ఫలూదాసబ్జా గింజలు, సేమియా, పాలు, ఐస్‌క్రీమ్‌తో గోంద్ కతీరా కలిపి టేస్టీ ఫలూదా తయారు చేయవచ్చు.
4. మ్యాంగో స్మూతీ మామిడి గుజ్జు, పాలు, గోంద్ కతీరా కలిపి క్రీమీ స్మూతీ చేసుకోవచ్చు.
5. బాదం-రోజ్ టానిక్ బాదం పాలు, రోజ్ వాటర్‌తో కలిపితే పోషక పానీయం తయార్.
ఇవి చూడాలి…
గోంద్ కతీరా మరీ ఎక్కువగా వాడకూడదు. గర్భిణులు వైద్యుల సలహాతో తీసుకోవాలి. జీర్ణ సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉపయోగించాలి. చిన్న స్ఫటికంలా కనిపించే గోంద్ కతీరా, వాస్తవానికి ఆరోగ్యానికి పెద్ద వరమే. ఈ వేసవిలో ఒకసారి ట్రై చేయండి. ప్రకృతి ఇచ్చిన శీతల స్పర్శను ఆస్వాదించండి మరి!
తయారీ విధానం:
చిన్న స్ఫటికం (టీ స్పూన్) తీసుకోవాలి.
ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి.
ఉదయం అది జెల్లీలా ఉబ్బిపోతుంది.
నీటిని వడకట్టి పానీయాల్లో కలిపి వాడాలి.
దీన్ని ఎప్పుడూ నానబెట్టిన తరువాతే వాడాలి.
పొడిగా తినకూడదు.
రోజుకు 12 టేబుల్ స్పూన్లు సరిపోతాయి.