మా ఇంటికి దక్షిణం వీధిపోటు ఉంది. దాని వెనుక స్థలం కొంటే మంచిదా? మద్ది శకుంతల, ఉప్పల్
వీధిపోటు దక్షిణం వైపు ఉన్నప్పుడు పడమర స్థలం కొనడం వల్ల ఉపయోగం ఉండదు. ఉన్న ఇంటిని పడమరకు పెంచి కట్టాలి. దక్షిణం వీధిపోటు ‘వీధిచూపుగా’ మారాలి. అంటే, ఆ వీధిపోటు ఇంటికి ‘దక్షిణ ఆగ్నేయం’ వచ్చేలాగా మార్చుకోవాలి. అందుకు ఇంటి పడమర స్థలం కొని వదిలి వేయకుండా, ఉన్న ఇంటిని పడమర వరకు పెంచి కట్టడం వల్ల వీధిపోటు స్థితి మారుతుంది. ఇలా వీలు కానప్పుడు ఉన్న ఇల్లు తీసేసి రెండు స్థలాలను కలిపి ఒకే స్థలంగా మార్చి అందులో శాస్త్రీయంగా నైరుతి ఉచ్చభాగంలో మళ్లీ ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు ఇంటికి వీధిపోటు దోషం పోతుంది.
ఇంట్లో ఏ గదిని ‘గెస్ట్ రూమ్’గా వాడాలి? కింది ఫ్లోర్ నైరుతినే ఇవ్వాలా? వారాల కిషోర్, కోదాడ
ఇంటిసభ్యులు తమ గదులు విభజన చేసుకున్న తర్వాత మిగిలిన పడకగదిని గెస్ట్గదిగా మార్చుకోవచ్చు. సహజంగా ఇంట్లో నాలుగు బెడ్రూమ్లు నైరుతి, వాయవ్యం, పడమర, దక్షిణం దిశల్లో ఉంటాయి. అలా కాకుండా ఈశాన్యంలో పడకగది ఉంటే, అందులో టాయ్‌లెట్ ఉంటే దోషం. టాయ్‌లెట్ లేకుండా చూసుకోండి. ఈశాన్య దిశలో ఉన్న గదిని పిల్లలకు ఇవ్వడం మంచిది. ఇక నైరుతి, దక్షిణం, పడమరలు గృహసభ్యులు వాడుకొని వాయవ్య గదిని ‘గెస్ట్గది’గా ఇవ్వొచ్చు. తప్పనిసరిగా కిందిఫ్లోర్లోని నైరుతి గదినే గెస్ట్‌కు ఇవ్వాలనే నియమం లేదు. వసతులు ఉన్న గదిని టెర్రస్‌మీద కూడా ఏర్పాటు చేసి ఇవ్వొచ్చు.
బాల్కనీల్లో బాత్రూమ్లు కట్టుకోవచ్చా? ఊడుగల పద్మ, షామీర్పేట్
ఇంటికి నిర్మించే బాల్కనీలు సహజంగా నాలుగు, ఐదు అడుగుల కన్నా ఎక్కువ వెడల్పు ఉండవు. మెట్లు ఇచ్చినవైపు ఆరేడు అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ, అటువైపు టాయ్‌లెట్ కట్టకూడదు. మిగతా బాల్కనీల్లో అంటే ఉత్తరం, పడమరల్లో బాల్కనీలున్నా అన్ని సందర్భాల్లోనూ టాయ్‌లెట్ నిర్మాణానికి అనుకూలం కావు. బాల్కనీ తక్కువ వెడల్పు ఉన్నప్పుడు ఉత్తర వాయవ్యం, పడమర వాయవ్యంలోc టాయిలెట్ కడితే ఇంటితోపాటు రేలింగ్‌ను ఆనుకొని నిర్మించాల్సి వస్తుంది. అప్పుడు ఆ దిశలను బ్లాక్ చేసిన దోషం అవుతుంది. పడమరవైపు గానీ, ఉత్తరం దిశలోగానీ విశాలమైన బాల్కనీలు వస్తే దానిలో ఇంటిని ఆనుకోకుండా టాయ్‌లెట్ కట్టుకోవచ్చు. ఏ ఉపగదికైనా చుట్టూ కొంత ఖాళీ ప్రదేశం ఉండాలి.
మా ఇంటికి మూడు దిక్కులా రోడ్లు ఉన్నాయి. కానీ, మూడు గేట్లు పెట్టొద్దని అంటున్నారు. మరి, ఎన్ని గేట్లు పెట్టుకోవాలి?నవీన్‌చంద్ర, ఆలేరు
ఇంటికి ఎన్ని రోడ్లు వస్తే అన్ని గేట్లు పెట్టుకోవాలి. మీ ఇంటికి వీధులు మూడు రావడం వల్ల స్థలానికి ఎంతో మంచిది. ఒకే వీధి ఉంటే మూడు గేట్లు పెట్టకూడదు కానీ, మూడు వీధులకు మూడు గేట్లు దోషం కాదు. మీరు పంపిన ప్లాను చూశాను. తూర్పు, దక్షిణం, పడమర వీధులున్న ఇల్లు మీది. దానికి తూర్పు ఈశాన్యంలో, దక్షిణ ఆగ్నేయంలో, పడమర వాయవ్యంలో గేట్లు పెట్టుకోండి. మీరు రోజూ ఏ వీధినుంచి వెళ్లవలసి వచ్చినా ఆ వీధికి తప్పక గేటు ఉండవలసింది. గేటు పెట్టనంత మాత్రాన వీధి లేకుండా పోదుకదా! వీధులను అనుసరించి శాస్త్ర సమ్మతంగా మూడు రోడ్లకూ మూడు గేట్లు పెట్టుకోవచ్చు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678