ఎనభయ్యేండ్ల వయోభారాన్ని మోస్తూ ఓ మహానగరంలో చిరుతిండ్ల దుకాణం నడిపే దృశ్యాన్ని ఎవ్వరం దాదాపుగా ఊహించలేం. కానీ, మన్సుఖ్ దాదా మాత్రం దీనికి మినహాయింపు. 81 ఏండ్లున్న మన్సుఖ్ దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని బాగా రద్దీ ఉండే ఓ వీధిలో చిరుతిండ్లు అమ్ముతున్నారు. ఇక తన దుకాణం కోసం ఆయన రోజూ ఉదయమే తాజా చిరుతిండ్లను (మరాఠీలో ఫర్సన్ అని పిలుస్తారు) ప్రశాంతంగా, శ్రద్ధగా సిద్ధం చేసుకుంటారు. ఈ వయసులోనూ పనిచేస్తున్నారంటే ఆయన జీవితం అంత సులువుగా సాగిపోలేదని అర్థం చేసుకోవాల్సిందే. చిరుతిండ్ల అమ్మకానికి ముందు ఆయన ఓ వస్ర్తాల దుకాణంలో పనిచేసేవారు. కొవిడ్ సమయంలో తన 76వ ఏట మన్సుఖ్ పని మానేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన కొడుకు ఉద్యోగమూ పోయింది. ఎలాంటి ఆదాయం లేకపోవడం, పెరుగుతున్న మందుల ఖర్చు, తగ్గుతున్న పొదుపు మొత్తం మన్సుఖ్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే, ఆయన మాత్రం పరిస్థితులకు తలవంచలేదు.
కొవిడ్ లాక్డౌన్ ముగిసిపోయిన తర్వాత తన జీవిక కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. అలా తన దగ్గర మిగిలిన కొద్దిమొత్తం డబ్బుతో ముంబయిలోని సాయిబాబా నగర్లో జైన్ డేరాసర్ దగ్గర రోడ్డువారగా ఓ చిన్న మడిగ తెరిచారు. ఓ చెట్టు కింద ఓ టేబుల్ పెట్టుకుని చిరుతిండ్లు అమ్మడం మొదలుపెట్టారు. దీని గురించి “సానుభూతి పొందడం కోసం కాకుండా నా మనుగడ కోసం, కుటుంబం కోసం చేస్తున్నాను” అని మన్సుఖ్ పేర్కొంటారు. ఇప్పుడు ఆయన కొడుకు కూడా అకౌంటెంట్ ఉద్యోగంలో చేరిపోయాడు. అయినప్పటికీ ఆయన చిరుతిండ్ల అమ్మకం మాత్రం ఆపేయలేదు. ముంబయి లాంటి నగరంలో కుటుంబంలో ఒక్కరి సంపాదన అంటే చాలా చిన్నమొత్తం. అందువల్ల, మన్సుఖ్ తనకు చేతనైనంత పని చేస్తూ కుటుంబానికి అండగా నిలవాలనుకున్నారు. ఇక తన చిరు వ్యాపారం విషయంలో మన్సుఖ్ ఎవ్వరి నుంచి సానుభూతి కోరుకోవడం లేదు. కేవలం తన పనికి తగిన గౌరవం మాత్రమే ఆశిస్తున్నారు. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి జీవన పోరాట యోధులు ఎదురైతే ఉడతా భక్తిగా అండగా నిలవండి.