సౌగంధికను వామదేవుని వద్దకు వెళ్లుమని చెబుతుంది సవరసత్తి. చెంచుగూడెంలో కటిలుడు తాను కళింగకు వెళ్లి వచ్చిన విషయాలను రాయహత్థి వాళ్లతో చెబుతాడు. సంతోషంగా వెళుతున్న భాణుసత్తి, ఆహవసత్తిలను సచ్చ సామి అడ్డుకుంటాడు. తర్వాత…
“పక్కకు తప్పుకోండి సామీ!” అడ్డంగా నిలబడిన ఆసామిని చూసి చిరుకోపంతో అన్నది ఆహవసత్తి. “అరే! నా పేరు నీకెట్లా తెలుసు సుందరీ! అయినా పక్కకు తప్పుకొమ్మంటున్నావు. ఎవరి పక్కకు? నీ పక్కకా? మీ అక్క పక్కకా?” ‘పక్క’ అనే పదాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు సచ్చ సామి. ఆ మాట ఆహవకు అర్థమైంది; భాణుకు అర్థం కాలేదు. అతని చూపు అక్క భాణుసత్తిని తాకడం ఇష్టం లేదు ఆహవకు. అందుకే, “మా అక్కకు పెళ్లి అయింది. పరదేశానికి వెళ్లినాడు మా బావ. తొందరలోనే వస్తాడు!” అన్నది. భాణుకు ఆ మాటలు వినిపించడం లేదు. అంత దగ్గరగా పరాయి మగాడిని చూడటం ఆమెకు అదే తొలిసారి. పెళ్లి అయినా భర్త ఇంతవరకూ దగ్గరకు రాలేదు; మాట్లాడలేదు. ఈ ఆజానుబాహుని రూపం, నిట్టూర్పుల గాలి, కంటి చూపుల కిరణాలు ఆమెకు తెలియకుండానే వివశత్వం కలిగిస్తున్నాయి. ఇది గమనించిన ఆహవసత్తి.. భాణును పక్కకు లాగి, ఇద్దరి మధ్యలో గోడలా నిలబడ్డది. అతను నవ్వి, ఇట్లా అన్నాడు.. “పొరుగు దేశమునకు పోయిన పెనిమిటి ఆలసించి వచ్చునపుడు నేను మాటలాడకుందు; మనసెరిగి అతండె ఊరడించు ననుకునేరు కలను.. (పరాయి దేశానికి వెళ్లిన భర్త, చెప్పిన సమయం కంటే ఆలస్యంగా ఇంటికి వస్తాడు. అప్పుడు నేను అలిగి మాట్లాడకుండా పడుకుంటాను. అయినా నా మనసు తెలిసిన అతను నన్ను ఊరడిస్తాడని కలలుగంటుంటారు మీ ఆడవాళ్లు). అది కల్ల అనే నిజం మాత్రం గుర్తించరు” ఉలిక్కిపడ్డది భాణుసత్తి. తన మగడు పరదేశం పోయిన సంగతి ఇతనికి ఎట్లా తెలుసు? అనుకున్నది. అక్కడి నుండి పక్కకు తప్పుకోకుండానే అమాయకంగా అదే ప్రశ్న అడిగింది.
“నా పెనిమిటి పరాయి దేశంలో ఉన్నట్లు మీకు ఎట్లా తెలుసు సామీ? (‘ఇప్పుడే చెప్పినాను గదనే’ అంటున్న ఆహవను పట్టించుకోకుండా).. ఆయన క్షేమంగా ఉన్నారా? ఎప్పుడొస్తారు? మీరు జ్యోతిషులా? సాముద్రికులా..” అంటుండగానే, సచ్చసామికి ఠక్కున ఒక ఆలోచన వచ్చింది. “అవును నేను సాముద్రికుడనే. ఒక్కసారి నీ చేయి చూస్తే భూత, భవిష్యత్తు, వర్తమానాల గురించి చెబుతా” అంటూ ఆ మిషతో భాణుసత్తి చేయి అందుకోబోయినాడు. భాణు కూడా తన చేతిని అతని చేతికి ఇవ్వడానికి సిద్ధపడింది. “ఆగు!” అని గట్టిగా అరుస్తూ, భాణుసత్తి చేతిని పట్టి లాగింది ఆహవసత్తి. “నీకు పూర్తిగా మతిభ్రమించింది. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తావు; మొగుని పేరు ఎత్తగానే ఏది ఇమ్మన్నా ఇచ్చేస్తావు! మొన్నటికి మొన్న ఎవడో చిలుక శాస్త్రం చెప్పే వాడిని కూడా పూర్తిగా నమ్మేసి, వాడు ఏది ఇవ్వమంటే అది ఇవ్వడానికి సిద్ధపడ్డావు. ఈయన పండితుడు కాదు; సాముద్రికుడూ కాదు! ఈ ఊరి పెద్దరైతుల్లో ఒకరు; పేరు సచ్చసామి. ఈయన సంగతి అందరికీ తెలుసు. ఆడగాలి కోసం ఏడామడలు వెళ్లే రకం! ఇక్కడ ఎవరూ అంత తేలికగా వచ్చేవాళ్లు లేరు. తమరు దయచేసి దయచేయండి మహానుభావా!” అన్నది మరింత కోపంగా. ‘అబ్బో ఈ చిన్నది తెలివిలో మహా పెద్దదిగా ఉన్నదే! దీన్ని లేకుండానన్నా చూసుకోవాలి; లేదంటే ఇది లేనప్పుడన్నా దాన్ని చూసుకోవాలి!’ అని మనసులోనే అనుకుంటూ, అసహనంగా అక్కడి నుంచి కదిలినాడు సచ్చసామి. సరిగ్గా అప్పుడే ఆ దారిన వస్తున్న సాధనానందుడు భాణుసత్తి కంటపడ్డాడు. అతని చేతిలో ఒక గ్రంథం కూడా ఉన్నది. దీర్ఘలోచనా వశుడైన అతణ్ని చూడగానే భాణుసత్తి మనసులో ఒక భావం కదిలింది.
“అయితే, నా మగడు ఏమన్నాడు? ఎక్కడున్నాడు? ఎట్లా ఉన్నాడు?” కళ్లనీళ్లు కారుతుండగా కలవర పడుతూ, తనలో తానే అనుకున్నట్లు పైకి అనేసింది చంద్రహత్థి. నిజమే! మనువాడక పోయినా తనువర్పించిన ప్రేమమయి చంద్రహత్థి. పోటిసుడు కూడా మాట తప్పే మనిషి కాదు! మంచితనానికి మారుపేరు; పరోపకారానికి నిలువెత్తు నిదర్శనం; కర్తవ్యం నిష్ఠకు శిలాశాసనం. ఈ విషయం చెంచుగూడెంలోని ప్రతి మనిషికీ తెలుసు. “నీవు ప్రతిదానికి బెంబేలెత్తిపోతూ ఆరోగ్యం పాడుచేసుకోకు! పోటిసుడు మహావీరుడు! అతణ్ని ఎదుర్కొనగల మొనగాడు లేడు! దొంగలు వెనుక నుండి గాయపరిచినారు గానీ, ముందు నుండి వస్తే నా మరిదిని నిలువరించే వాళ్లు కాదు!” గర్వం ఉట్టిపడుతుండగా అన్నది రాయహత్థి. “అవును! అతను మహావీరుడు!” తొలిసారిగా కటిలుని నోటి నుండి కూడా పోటిసుని ప్రశంస వినిపించింది. “అక్కడ పోటిసుణ్ని చూసిన వారంతా ఆయన గొప్పతనం గురించి చెప్పినారు. ఆయన ఎక్కడా ఓడిపోయినట్లు గానీ, గాయపడినట్లు గానీ నేను ఒక మాట కూడా వినలేదు” ఆ మాటలు వింటున్న చంద్రహత్థికి ఆనందం కన్నీటి రూపంలో కట్టలు తెంచుకొని ప్రవహించింది. “పదండి! పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, అవి నా పోటిసుణ్ని చేరేంతవరకే! ఒక్కసారి ఆయనను చేరుకుంటే చాలు! అగ్నికీలలు సముద్రుణ్ని ఏమీ చేయలేక ఆగిపోయినట్లు, మహాసాగరం వంటి ఆయనను తాకలేక సమస్యలు చిన్నబోతాయి.
నేను వెంటనే ఆయనను కలుసుకోవాలి..” “అదే కదా అసలు సమస్య!” మళ్లీ మొదటికి వచ్చినాడు కటిలుడు. “ఇప్పుడు ఆయనను అక్కడ కనిపెట్టడం కూడా అంత సులువు కాదు! ఆయన చేయాల్సిన పని ఎంతో కష్టంతో కూడుకున్నది. ఎంతో మంది అకారణ శత్రువులు కూడా ఆయనను వెంటాడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రమాదాల నడుమ పద్మవ్యూహంలో అభిమన్యునిలాగా ఉన్న పోటిసునికి మనం కొత్త సమస్యగా మారకూడదనేదే నా అభిప్రాయం!” “మీరు ఇట్లాగే మీనం – మేషం లెక్కిస్తూ కూర్చొండి! నేను మాత్రం ఆయన కష్టాల్లో ఉండగా కళ్లు మూసుకొని కూర్చుండలేను! ‘ఎప్పుడెప్పుడు ఆయనను చూడగలనా’ అని మనస్సు ఉవ్విళ్లూరుతున్నది. నిజంగా నేనతనికి సమస్యగా మారినా, దాన్ని ఛేదించగల శక్తియుక్తులు ఆయనకు మెండుగా ఉన్నాయి. నేను బయలుదేరుతున్నాను!”.. తాను ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించి.. “నీ గుర్రాన్ని నాకు ఇవ్వు! నేను వెళతాను! నాకు కళింగ దారి తెలుసు!” అన్నది కటిలుణ్ని చూస్తూ చంద్రహత్థి. ఆమె ఇంకొక్క క్షణం కూడా ఆగజాలదన్న విషయం ఆ ఇద్దరికీ అర్థమయింది. చంద్రహత్థికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా, అది ఆమె ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా వాళ్లకు తెలుసు. అందుకే విషయం సాగదీయకుండా తన గుర్రాన్ని తేవడానికి వెళ్లినాడు కటిలుడు.
కళింగలో బుధవారం సంత ఎంతో ప్రత్యేకమైనది. ఆ సంతలో దొరకని వస్తువు ఉండదు. ఆరోజు సముద్ర సుంకం కూడా ఉండదు కాబట్టి దేశ, విదేశ వర్తకులు తమ వస్తువులను సరసమైన ధరలకు అమ్ముకొని లాభాలు గడిస్తారు. ప్రజలు కూడా తమకు ఎప్పుడూ, ఎక్కడా లభ్యం కాని వస్తువులను ఆ సంతలో కొనుక్కోగలుగుతారు. క్రయవిక్రయాల విషయంలో కళింగ ప్రభువులు కలుగజేసుకోరు. కాకపోతే ఘర్షణ ధోరణి ఏర్పడినా, గొడవలకు తెగబడినా రాజభటులు వెంటనే సద్దుమణిగేటట్లు చేస్తారు. సేనాధిపతి కూడా సంతను పర్యవేక్షిస్తుంటాడు కాబట్టి ఏ విధమైన అల్లర్లు, కొట్లాటలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సంత అందరి సంతసాలను వృద్ధి చేస్తుంది. ఆవగింజలు మొదలు అలచందల దాకా రకరకాల గింజలు; ముత్యాలు మొదలు వజ్రాల దాకా అన్ని రకాల రత్నాలు; మేకులు మొదలు ఈటెల దాకా వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు; మేలి ముసుగు మొదలు దుప్పట్ల దాకా భిన్న రకాలైన వస్త్రాలు; ఉన్ని మొదలు ఏనుగు చర్మం దాకా రకరకాల జంతుచర్మాలు, గోళ్లు, దంతాలు; లవంగాలు మొదలు వట్టివేళ్ల దాకా సుగంధ ద్రవ్యాలు; కొడవళ్లు మొదలు పలుపుల దాకా అనేక రకాలైన వ్యవసాయ పరికరాలు; గురుగులు మొదలు గోళెంల దాకా అనేక మట్టి పాత్రలు; చెక్క బొమ్మలు మొదలు రత్నపేటికల దాకా లెక్కలేనన్ని దారు కళాకృతులు; కుందేళ్లు, జింకలు, ఎనుబోతులు, అడవి పందులు, మేకలు, గొర్రెలు, ఎద్దులు, ఆవులు, గుర్రాలు, ఏనుగులు, లొట్టిపిట్టలు.. అనేక రకాల జంతువులు; గువ్వలు, కంజులు, అడవి కోళ్లు, సీమ కోళ్లు, పావురాలు, చిలుకలు, డేగలు, పిగిలి పిట్టలు, నెమళ్లు.. అనేక రకాల పిట్టలు; ఇవిగాక బుట్టలు, అల్లికలు, వస్త్రాల అల్లికలు, ముగ్గుల యంత్రాలు, వంట పాత్రలు, కేశతైలాలు, రకరకాల పూలు, తివాచీలు, యంత్ర పరికరాలు; అనేకానేక రకాల మత్తుపానీయాలు..
అన్నిటినీ మించిన ఆహార పదార్థాలు.. నిజంగా సుమారు వంద ఎకరాల స్థలంలో విస్తరించి ఉండే ఆ సంస్థలో ఒక్కోరకమైన వస్తువులకు ఒక్కొక్క వీధిలాగా బారులు బారులుగా విక్రయ కేంద్రాల అంగళ్లు ఏర్పాటు చేసుకుంటారు వ్యాపారులు. నెలకొకసారి జరిగే ఆ సంతలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలే గాక దేశ విదేశాల మనుషులు కూడా పాలుపంచుకుంటూ ఉండటం విశేషం. సంతలో తినుబండారాల అంగళ్లకు ఐదు ఎకరాల స్థలం ఏర్పాటు చేసినారంటే అక్కడ అమ్మే పదార్థాలకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతున్నది. భక్ష్యాలు, లేహ్యాలు, ద్రావకాలు, కారాలు, నూనె పదార్థాలు, వేపుళ్లు, పచ్చళ్లు, తీపి పదార్థాలు, మాంసాహారాలు, శాకాహారాలు, రొట్టెలు, రకరకాల పలావులు, ద్రావకాలు, నిప్పుల మీద కాల్చే పదార్థాలు, అచ్చంగా నూనెలో ఉడికించినవి, పచ్చివి, ఆవిరితో ఉడికించినవి, చప్పటివి, ఉప్పూకారాలు దట్టించినవి… ఎన్నో రకాలు. ఆ వీధిలో అందరినీ ఆకర్షిస్తున్నది మాత్రం పప్పు పిండి ప్రత్యేక వంటకాల అంగడి. శనగపప్పు, మినపపప్పు, పెసరపప్పు, అలసందల పప్పులతో వేర్వేరుగా పిండి రుబ్బించి; ఆ పిండిలో ఉప్పు, కారం, సుగంధద్రవ్యాలను జోడించి మెత్తగా కలిపి పెట్టుకుని; చింతపండు, ఉప్పు, వాము తదితర పదార్థాల మిశ్రమం కూరిన మిరపకాయలు అద్ది, రకరకాల బజ్జీలు తయారు చేస్తున్నది సుద్ది అనే ఓ నల్ల పిల్ల. అది తయారు చేసిన ఘుమఘుమలాడే వంటకాలను ఎర్రగా, బుర్రగా ఉన్న దాని అత్త దేవి అడిగిన వాళ్లకి అడిగినట్లు తగిన ద్రవ్యం తీసుకొని అందిస్తున్నది. పదార్థాల రుచి మహత్తో లేక ఇద్దరు ఆడవాళ్ల అందం మహిమనో కానీ ఆ వీధి మొత్తంలో.. వాళ్ల అంగడిలోనే జనం ఎగబడి కొంటున్నారు; ఆవురావురు మనుకుంటూ తింటున్నారు.
అంతఃపుర ప్రత్యేక రక్షకుడైన అవణాయరు సైతం అక్కడికి చేరుకోవడానికి గడియ సమయం పట్టిందంటే అక్కడ కొనుగోలుదారుల తాకిడి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అవణాయరు దృష్టి ఆ ఇద్దరిలో ఒకరి మీద ఆగిపోయింది. తిండి మరచి, తినేసేటట్లు ఆమెనే చూస్తున్నాడు. అతను అసలే భోజన ప్రియుడు. అందులోనూ సౌందర్యరాధకుడు. అతని మనసుకు, కనులకు ఆశించిన దాని కంటే ఎక్కువ ప్రతిఫలమే లభించినట్లు ఉన్నది. గుక్కతిప్పుకోకుండా తింటున్నాడు; చూపు మరల్చకుండా చూస్తున్నాడు. మధ్యాహ్నం చివర అక్కడికి చేరుకున్న అవణాయరు సాయంత్రం రాత్రిగా మారుతున్నా అక్కడి నుంచి కదలడం లేదు! సాధారణంగా రాజకుటుంబం వాళ్లు ఎవరైనా అంగళ్లలో కొనుగోలు చేస్తున్నారంటే సాధారణ పౌరులు దూరంగా ఉంటారు. అవణాయరు ఆ అంగడిలోకి ప్రవేశించగానే క్రమక్రమంగా సాధారణ ప్రజలు అక్కడి నుండి తప్పుకొన్నారు. ఇప్పుడు ఒకరిద్దరు క్రయం కోసం వచ్చి, తమకు కావలసిన పదార్థాలు తీసుకొని పోతున్నారు. జనం పూర్తిగా పల్చబడిన తర్వాత అవణాయరు మెల్లగా లేచి, దేవి వద్దకు చేరుకున్నాడు. ఆమె రెండు చేతులూ తన రెండు చేతుల మధ్య కప్పి, అంతకు ముందు ఒకటికి రెండుసార్లు మనసులో మననం చేసుకున్న మాటలను నెమ్మదిగా ఇట్లా ప్రకటించినాడు.. “దయచేసి.. నా వెంట వస్తావా?” అని అర్ద్రంగా.. అభ్యర్థిస్తున్నట్లుగా. వెంటనే చెంప పగిలిపోయేటట్లు ఒక్కటిచ్చినాడు దేవి రూపంలోని వామదేవుడు. అప్రమత్తమైన రాజభటులు.. దేవి గుండెలకు ఈటెలు గురి పెట్టినారు.