జరిగిన కథ
కళింగలోని రాజకీయ పరిస్థితులను వామదేవాదులకు వివరిస్తుంది సవరసత్తి. జంగిటి గ్రామంలో భాణుసత్తి, ఆహవసత్తి అనే ఇద్దరు అందాల భామలు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. సాధనానందగా మారిన ప్రణాళుడు ఒక అద్భుత దృశ్యం చూస్తాడు. ఆ తర్వాత..
పుణ్యభూమి ఇదియె మోదుగు వృక్షాలు
పఱచె నెఱుపు పూలు విరివిగాను
బుద్ధదేవు చరణముల వ్రాలినట్లున్న
భిక్షువు లనిపించ వీక్షకులకు..
(ఆ అడవిలో వరుసగా ఉన్న మోదుగు చెట్లు తమ లేత ఎరుపు రంగులో ఉన్న పువ్వులను కుప్పలుగా రాల్చినాయి. అవి చూపరులకు కాషాయాంబరధారులైన బౌద్ధ బిక్షువులు బుద్ధ దేవుని చరణాలమీద వాలినారా అనిపిస్తున్నాయి) పట్టరాని ఆనందంతో ఆ దృశ్యాన్ని చూస్తూ చాలాసేపు మెదలకుండా ఉండిపోయినాడు సాధనానందుడు. ‘ఇదంతా చూస్తుంటే బుద్ధ భగవానుడు నాపట్ల అపారమైన కరుణను చూపిస్తున్నాడని అనిపిస్తున్నది. జీవితంలో ఎప్పుడూ ఇంత ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవించలేదు. ఆ స్వామి నా జీవిత పరమార్థానికి నన్ను చేరువ చేస్తున్నాడనిపిస్తున్నది’ అనుకుంటూ, అక్కడనే ధ్యానస్థితిలో కూర్చుని యోగ సాధనకు ఉపక్రమించినాడు. కానీ, ఆ సన్నివేశం తుఫానుకు ముందు ప్రశాంతత వంటిదని; ఇకపై బతుకంతా అల్లకల్లోలం కానున్నదన్న సంగతి అతనికి ఆ క్షణంలో తెలియదు.
“మతిగానీ పోయిందా? నీవు ఆయుధంగా మారడం ఏమిటి?” మందలిస్తున్నట్లుగా అన్నది సవరసత్తి. “అక్కా! ముల్లును ముల్లుతోనే తీయాలి. ఎందులో పోయేవాడు అందులోనే పోతాడు అంటారు కదా! స్త్రీలోలుడైన ఈసాణుడికి స్త్రీనే ఎరగావేసి కార్యం సాధించాలి!” అన్నది తన ఆలోచనలోని మర్మం ఎరుక పరుస్తూ సౌగంధిక. “ఆ ఎరవు నీవే ఎందుకు కావాలి?” అడ్డుకున్నాడు వామదేవుడు. “ఎందుకంటే, నేనంటే వానికి చచ్చేంత ఇష్టం!” సౌగంధిగక. “కానీ, అందుకు నేను ఒప్పుకోను!” వామదేవుడు. “నేను కూడా!” వెంటనే అన్నది సవరసత్తి. “ఆ దుర్మార్గునికి నిన్ను బలివ్వకూడదనే కదా అవమానాలు పడుతూ పోరాడుతున్నాను. నీకు నచ్చినవాడు, ఉన్నతుడైన ఈ వామదేవునితో నీ జీవితం సాగిపోవడమే నేను కోరుకునేది” “అక్కా! మనం చాలా అనుకుంటాం కానీ, ఆ పైవాడు అనుకున్నవే జరుగుతాయి. కొన్ని కావాలంటే మరికొన్ని వదులుకోక తప్పదు! నేనొక్కదాన్ని కొంత త్యాగబుద్ధిని చూపిస్తే మా వామదేవుని మిత్రుడు, అతని తండ్రి, వాళ్ల కుటుంబాన్ని కాపాడవచ్చు. ఆ ఈసానుణ్ని అంతం చేస్తే, మన కళింగకు మేలు జరుగుతుంది. రాజు, రాణి స్వేచ్ఛ పొందుతారు. ప్రజలు సుఖపడతారు. ఇంతమంది సుఖం కోసం నాకు నేను కాదనుకోవడం మంచిదే కదా! అయినా ఇది పెద్దత్యాగం ఏమీ కాదు! మన వృత్తి ధర్మమే..” తన నిర్ణయాన్ని సమర్థించుకున్నది సౌగంధిక. “అది నిన్నటి వరకు! కానీ, ఇప్పుడు నీవు నాకు కాబోయే భార్యవు!” అన్నాడు వామదేవుడు. ఆ ఒక్క మాటతో సౌగంధిక కంటనీరు ఎగిసి పడ్డది.
“నీవట్లా భావించడం నా అదృష్టం. అయినా, నాలాంటి వాళ్లను పెద్ద మనసుతో ఇల్లాలిగా నీవు అంగీకరించినా లోకం ఒప్పుకోదు! అది ఎప్పటికైనా మీ జీవితాలకు ముప్పే కదా! మా బతుకులు ఇంతే! ఇట్లా కూలిపోవాల్సిందే!” కన్నీరు తుడుచుకున్నది, ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమె.
“నిన్ను నీవు సమర్థించుకోవడానికి ఇన్ని మాటలు మాట్లాడనవసరం లేదు! నాకూ ఓ మనసుందని, దాన్ని గౌరవించాలని అర్థం చేసుకో!” చుబుకాన్ని ఎత్తినాడు వామదేవుడు. ఆ స్పర్శ ఆమెను కదిలించింది! దుఃఖపు నదిగా మారి అతన్ని అల్లుకున్నది. “ఒకరకంగా చూస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌగంధిక ఆలోచనను ఆచరణలో పెట్టడమే మేలనిపిస్తున్నది” గంభీరంగా అన్నది సవరసత్తి. ఉలిక్కిపడ్డాడు వామదేవుడు. అతని కౌగిలి నుంచి విడివడింది సౌగంధిక. “నిజమే! కానీ ఈ ఆలోచనను కొంచెం మార్చుకొని ఆచరణలో పెడదాం!” అన్నాడు అంతసేపు మౌనంగా వీళ్ల సంభాషణలను వింటున్న పోటిసుడు. “ఏమిటది?” మిగతా ముగ్గురూ ఒకేసారి అన్నారు. “మహాభారతంలో కీచకునిలా ఆ ఈసానుణ్ని అంతం చేయాలి!” తన ఆలోచనను ఈ విధంగా వివరించినాడు పోటిసుడు. “మన సవరమ్మ సుధేష్ణాదేవిలా వానికి సౌగంధికను కలుసుకునేందుకు సంకేత స్థలానికి రమ్మని సమాచారం ఇస్తుంది. అక్కడికి నేను ముందే చేరుకొని కనిపించకుండా ఉంటాను. వాడు ఆ గదిలోకి వచ్చి, సౌగంధిక గారితో మాట్లాడుతుండగానే నేను వాని పని పడతాను!” “ఈ ఆలోచన బాగానే ఉన్నది, కాకపోతే నీ స్థానంలో నేను వెళ్తాను!” అన్నాడు వామదేవుడు.
“ఇది సాధ్యం కాదు!” తేల్చేస్తున్నట్లు అన్నది సవరసత్తి. “ఎందుకంటే వాడు కీచకుడు కాదు; నేను చెప్పినట్లు వినడు. కీచకుడు సుధేష్ణాదేవి తమ్ముడు, వాళ్లకు అతిథి కాబట్టి చెప్పినట్లు విన్నాడు. ఈసాణుడు సర్వాధికారి. వాడు చెప్పినట్లు మనం వినాలి! అసలే వానికి నా పట్ల అనుమానం మొదలైంది..” “మరేం చేద్దాం?” సాలోచనగా అన్నది సౌగంధిక. “ఈ పని ఒక సంఘటనతోనో, ఒక్క గడియలోనో, ఒక్క వ్యక్తితోనో పూర్తయ్యేది కాదు! మనం అందరం కలిసికట్టుగా ఈ కార్యాన్ని సాధించాలి! ముందుగా మనలో ఎవరో ఒకరు సాధ్యమైనంత తొందరగా రాజాంతఃపురంలో చోటు సంపాదించాలి. అక్కడే ఉంటే.. జరుగుతున్నవి తెలుసుకోవచ్చు; జరుగరానివి అడ్డుకోవచ్చు!” అన్నది సవరసత్తి. నలుగురూ ఎవరికివారు ఆలోచనల్లో మునిగి పోయినారు.
“ఏమిటి విష్ణుముఖ మహారాజుల సందేశం?” ములకదేశం నుంచి వచ్చిన వార్తాహరునితో అన్నాడు అస్మక రాజు సౌరిసంబ.ఆ వచ్చినవాడు అస్మక రాజభటునికి ఒక లేఖ నిచ్చినాడు. అతను దాన్ని సేనానికి అందజేసినాడు. సేనాని మహామంత్రి చామీకరుని చేతికి ఇచ్చినాడు. చామీకరుడు ఆ లేఖను చదివినాడు.. “అస్మక మహారాజులు శ్రీశ్రీశ్రీ సౌరిసంబ వీరాగ్రేసరులకు ప్రణామాలు! ఈ పాటికే తమకు పోదనలోని కుసుమ శ్రేష్ఠికి సంబంధించిన సమస్త విషయాలు ఎరుకపడి ఉంటాయని అనుకొనుచున్నాం. కుసుమ శ్రేష్ఠి కుటుంబంతో మా రాజ్యానికి గల అనుబంధం కారణంగానే మేమీ విషయంలో కలుగజేసుకోవాలని భావిస్తున్నాం. అంతేగానీ, తమరాజ్య ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం మా ఉద్దేశ్యం కాదని ముందుగానే మనవి చేస్తున్నాం! కుసుమ శ్రేష్ఠుల వారి కోడలు మా రాజ్యపు మల్లికాగిరి వణిక్ ప్రముఖులైన మేఘచంద్రుల కుమార్తె. విధివశాత్తు ఆమె కూడా శ్రేష్ఠి వారి భవనం దహనమైన సంఘటనలో ప్రాణాలను కోల్పోయిందన్న విషాద వార్త మాకు అందినది. పుట్టెడు దుఃఖములో ఉన్న మేఘచంద్రుని కుటుంబానికి ఉపశమనం కలిగించుటకు మావంతు ప్రయత్నమే ఈ లేఖ. జరిగిన సంఘటనపై కూలంకష విచారణ జరిపించి, నిజ నిర్ధారణ చేయాల్సిందిగా తమరికి మా విజ్ఞప్తి! ఇది ప్రమాదవశాత్తు జరిగినదా? లేక రాజకీయ కుట్ర ఉన్నదా?
దయచేసి తెలుపగలరు. రాజకీయ ప్రమేయం ఉన్నట్లయితే ఆ కళింగ రాజుపై ఇద్దరమూ కలిసి దండెత్తి కుసుమశ్రేష్ఠిని, అతని తనయుణ్ని కాపాడుకుందాం. తమరి మార్గ నిర్దేశనంలో ఈ విషయంలో ఏమి చేయడానికైనా మేము సిద్ధం. తమరి ప్రత్యుత్తరానికై నిరీక్షిస్తూ ఉంటాం. భవదీయుడు.. రాజా విష్ణుమూర్తి!” లేఖ చదవడం పూర్తి చేసినాడు చామీకరుడు. “ఊఁ..” ఆలోచనాంతరంగుడై అన్నాడు మహారాజు. “ఈ వార్తాహరునికి భోజనాదికాలు ఏర్పాటు చేయించండి! మనం మరింత సమగ్రంగా ఆలోచించి, మన నిర్ణయాన్ని విష్ణుముఖునికి ఎరుకపరచుదాం. అప్పటివరకూ నిరీక్షించమనండి!” ఆ మాటలు విన్న భటుడు.. “చిత్తం మహారాజా!” అంటూ వచ్చిన వార్తాహరుని వెంటబెట్టుకుని పోయినాడు. వాళ్లు వెళ్లిన తర్వాత మంత్రి, సేనాధిపతులతో ఆ విషయం చర్చించినాడు మహారాజు సౌరిసంబ. “నిజంగానే ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉన్నదా?” “అది తెలియాలంటే మన బంటును సాధికారికంగా కళింగకు పంపాలి ప్రభూ!” అన్నాడు మంత్రి చామీకరుడు. “ఏదో కుట్ర జరుగుతున్నట్లు నాకూ అనుమానంగా ఉంది ప్రభూ! ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే సాధారణ భటుణ్ని కాకుండా, ఒక ప్రత్యేకమైన యోధుణ్ని పంపడం శ్రేయస్కరంగా ఉంటుంది!” అన్నాడు మలయసేహరుడు. “ఆ ప్రత్యేక యోధుడవు నీవే ఎందుకు కాకూడదు సేనాధిపతీ!” అన్నాడు మహారాజు.
చెంచుగూడెంలో.. “దర్శనమ్ము చేత దండిగా సుఖమిచ్చు స్పర్శ చేత సంతసమ్ము నిచ్చు ప్రేమ కళల కతడె పెన్నిధియే; నేడు కానరాక భాగ్యహీన నైతి.. (చూసినంత మాత్రాన సుఖం కలుగుతుంది; తగిలినంత మాత్రాన ఆనందం కలుగుతుంది; అంతటి ప్రేమ కళామూర్తి అతను. అతణ్ని చూసే అదృష్టం లేనిదాన్ని నేనే కదా!)” అంటున్న చంద్రహత్థిని చిత్రంగా చూసింది రాయహత్థి. “పిచ్చి కుదిరింది. పుస్తెలు గుచ్చుకోవడానికి పలుపుతాడు ఇవ్వమన్నదంట.. నీ వంటిదే! అంతా కుదురుకొని ఒక పద్ధతి ప్రకారం నీ ప్రియుణ్ని చేరుకునేందుకు సిద్ధమవుతున్న వేళ మళ్లా ఇట్లా బెంగటిల్లుతావేమే చంద్రా!” అన్నది ఆవేదనగా రాయహత్థి. “పిచ్చి కుదిరిన సంగతి నిజమే కానీ, ప్రేమ కూడా పిచ్చేకదా అక్కా! నీ మరిది ప్రేమతో నన్ను పిచ్చిదాన్నే చేసినాడు. ఆ పిచ్చే నన్ను ప్రాణాలతో ఉంచుతున్నది. తనకోసం నా ప్రాణాలైనా ప్రేమతో ఇచ్చే తెగింపు నింపుతున్నది. నీవేం భయపడకు అతణ్ని చేరుకునే దాకా నీవేది చెబితే అది వింటాను. ఏం చేయిమంటే అది చేస్తాను!” దృఢంగా అన్నది చంద్రహత్థి. “నీవు తప్పకుండా నా మరిది పోటిసుణ్ని కలుసుకుంటావు! నీ ప్రేమను గెలిపించుకుంటావు! నన్ను నమ్ము! రేపే మన ప్రయాణం..” రాయహత్థి మాట పూర్తి కాలేదు. “అందుకు నేను ఒప్పుకోను!” అన్నాడు అక్కడికి వస్తూనే కటిలుడు. అతణ్ని చూసి ఆశ్చర్యపోయినారు హత్థిలు ఇద్దరూ.
“నీకేమైందిరా? చంద్ర సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమన్నావు. మళ్లీ సమయానికి వచ్చి అడ్డుకుంటున్నావు?” విసుక్కున్నది రాయహత్థి .
“అక్కా! నేను మాట తప్పడం లేదు! తప్పను! అట్లాగని మీరు చేసే ప్రతి సాహసాన్ని చూస్తూ ఊరుకోలేను కదా!” అన్నాడు స్థిరంగా కటిలుడు.
అతను ఇంతకు మునుపటి కటిలుడు కాదు! వాని మాటలో, ప్రవర్తనలో స్పష్టమైన మార్పు తెలుస్తున్నది. శరీరం కూడా మునుపటి కంటే దృఢంగా ఉన్నది. లక్ష్యం లేని జీవితానికి, లక్ష్యం కోసం బతికే జీవితానికి తేడా అదే మరి! ఇన్నాళ్లూ తెగిన గాలిపటంలా గడిచిన అతని జీవితం రాయహత్థి మాటలతో ఒక్కసారిగా మారింది. ప్రతిక్షణం, ప్రతి నిమిషం అతను చంద్రహత్థిని సంతోషంగా ఉంచడం గురించే ఆలోచిస్తున్నాడు. రాయహత్థి, చంద్రహత్థి కళింగకు వెళ్లాలని అనుకున్నప్పుడే అతను వాళ్ల దారి ఎంతవరకు మేలైందో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టినాడు. తన వద్దనున్న సొమ్మును అంతా కలిపి ఒక అశ్వాన్ని కొనుక్కున్నాడు. దృఢంగా ఉండేందుకు వ్యాయామం; ఆరోగ్యంగా ఉండేందుకు యోగ చేయడమే కాదు; కత్తి సాము, కర్రసాము కూడా సాధన చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వారాల క్రితం కనిపించిన కటిలుడు.. కుటిలుడు. ఇప్పుడు కనిపిస్తున్న కటిలుడు.. కనకగుణుడు!
రెండు రోజుల క్రితం కళింగకు వెళ్లి చాలా విషయాలు తెలుసుకున్నాడు. అందుకే వాళ్ల ప్రయాణాన్ని అడ్డుకున్నాడు. “అయితే, మమ్ములను ఎందుకు అడ్డుకుంటున్నావో చెప్పు!” సూటిగా అడిగింది చంద్రహత్థి. “ఏం చెప్పాలి? ఎట్లా చెప్పాలి?’ అయోమయంలో పడిపోయినాడు కటిలుడు.