జరిగిన కథ
మల్లికాగిరి నుంచి పోదన నగరం చేరుకున్న సీహ.. అక్కడి పరిస్థితి చూసి స్పృహ కోల్పోతుంది. జయసేనుణ్ని తీవ్రంగా గాయపరచి, చీకటి కొట్లో వేయిస్తాడు ఈసాణుడు.. అంతేకాదు శత్రువును పొగిడినందుకు కల్లణసీహుని తలను ఖండిస్తాడు. ఆ తర్వాత..
“భయపడనవసరం లేదు! నేను సవరను!” భూగృహం లోపలికి దిగుతూ తన ఉనికిని ప్రకటించింది సవరసత్తి. ముగ్గురూ ఆమె కోసమే ఎదురు చూస్తున్నారు. ఆమె రాక.. వాళ్ల మనసులను తేలికపరచింది. నెగడు పెద్దగా చేసినాడు పోటిసుడు. సవరసత్తి, సౌగంధిక, వామదేవుడు, పోటిసుడు ఆ నెగడుచుట్టు నాలుగు వైపులా కూర్చున్నారు. “అక్కా! ఇంకా ఎన్నాళ్లు ఈ అజ్ఞాతం? బయట ఏం జరుగుతున్నది?” సౌగంధిక ఆందోళన. “నా మిత్రుడు క్షేమంగా ఉన్నాడు కదా!” వామదేవుని శంక. “కుసుమ శ్రేష్ఠి రాజావారు ఎక్కడున్నారు తల్లీ!” పోటిసుని ఆరాటం. “అందరి ప్రశ్నలకూ సమాధానం దొరుకుతుంది. కొంచెం ఓపిక పట్టండి!”అన్నది సవరసత్తి ప్రశాంతంగా. “ఈసాణుడి రాక్షసత్వం క్రమక్రమంగా అర్థమవుతున్నది. రాచరికం పట్ల ఆసక్తి కోల్పోయిన మహారాజు కళింగాదిత్యుని బలహీనత.. వానికి వరంగా మారింది. పరిపాలనలోని అన్ని విభాగాలనూ వాడు వశపరచుకున్నాడు. మహారాణి ఖరహర ప్రియ మాత్రం అతనికి లొంగలేదు. కోశాగారం ఆమె అధీనంలో ఉన్నది. అది వాని కాళ్లూ చేతులు కట్టేసినట్లయింది. వాడు ఆమెకు సంబంధించిన బంధువు కావడంతో ఆమె వద్ద ఎక్కువ చొరవ చూపలేదు కానీ, ఆమెను కూడా గృహ నిర్బంధంలో ఉంచినాడు.
వాడు పగబట్టిన పాము! నీతీ నియమాలు లేని నక్క. ఎవరినైనా ఎప్పుడైనా కాటేస్తాడు. ధనం లేనిదే పరివారాన్ని, సైన్యాన్ని లోబరుచుకోవడం అసాధ్యం కాబట్టి అడ్డదారుల్లో అది సంపాదిస్తూ పాలనపై గుట్టుగా తన పట్టును కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగానే కుసుమ శ్రేష్ఠి గారి సరుకు అంతా సముద్రపు దొంగల పేరుతో వాడే కొల్లగొట్టినాడు. శ్రేష్ఠి గారిని చెరసాలలో పెట్టినాడు. అతని కొడుకును బంధించినాడు. పోదన నగరంలో శ్రేష్ఠి గారి భవనంలో ఉన్నదంతా దోచుకొని రమ్మని తన మనుషులను పంపినాడు” “ఇదంతా మీకు ఎట్లా తెలుసు తల్లీ?” పోటిసుని సందేహం. “నిన్నటి వరకు ఆ దుర్మార్గుడు నా పడకింటిలోనే గడిపినాడు కదా! నేను అడగనవసరం లేకుండానే మధుపానం మత్తులో అన్నీ కక్కేవాడు. వానికి సౌగంధికను దక్కనీయలేదని ఇప్పుడు నా మీద కూడా పగ పెంచుకున్నాడు” కుతకుతలాడింది సవర. “మరి ఇప్పుడు ఏం చేద్దాం?” సాలోచనగా అన్నాడు వామదేవుడు. “ఏదో ఒక విధంగా మనం అంతఃపురంలోకి చేరుకోవాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడు గానీ మనం ఏం చేయవచ్చునో నిర్ణయించలేం..” అన్నది నిట్టూరుస్తూ సవరసత్తి. అందరూ దీర్ఘాలోచనలో పడిపోయినారు. “ఇప్పుడు నేనే ఒక ఆయుధంగా మారాలి!” గంభీరంగా అన్నది సౌగంధిక. ఉలిక్కిపడ్డాడు వామదేవుడు. అయోమయంగా చూసినాడు పోటిసుడు.
జంగిటి. కొండ కోనల మధ్య పుడమితల్లి అందాలు ఆరబోసుకున్న పల్లె! కొండపాదులో సమతలమైన విశాల ప్రదేశంలో పొలాలు విస్తరించి ఉన్నాయి. వర్షాలు పడ్డప్పుడు సెలయేళ్లు కొండ నుంచి దూకిరాగా.. వాటిని ఒడుపుగా పట్టుకొని, కుంటలుగా మార్చుకుంటారు అక్కడి రైతులు. పాడిపంటలకు కొరతలేదు. పని పాటలు నిరవధికంగా కొనసాగుతుండే చోటు. అక్కడికి ఎందరో పొరుగూరు వాళ్లు పంట పనుల సమయంలో వచ్చి, నెలల తరబడి ఉండి వెళుతుంటారు. కోడె వయసులో ఉన్న ఆడ-మగల మధ్య సరసాలు; విరసాలు సాధారణమే! అందుకేనేమో అక్కడికి వచ్చిన వాళ్లు మళ్లీ వెళ్లడానికి ఎంతో బాధపడతారు. ఆ ఊళ్లోకి కొత్తగా వచ్చిన ఇద్దరు ఆడవాళ్లను గురించి అందరూ చర్చించుకో సాగినారు. కోనాపురం నుంచి వచ్చినారట. ఆ పేరు కూడా ఈ ఊరి వాళ్లకు కొత్తదే. అక్కడ కరువు తాండవించి, పెద్ద వాళ్లందరూ చనిపోతే మిగిలిన ఒక ముసలమ్మను వెంట తెచ్చుకున్నారు. అది గుడ్డిది; ఆ పిల్లల్లో పెద్దదానికి ఆ ముసలమ్మ అత్తనట! ఇద్దరిలో పెద్దది చాలా అందగత్తె! పేరు భాణసత్తి; చిన్నదీ కంటికి నదరయిందే. దాని పేరు ఆహవసత్తి; ముసలమ్మ పేరు కమలసత్తి. వాళ్లకు పని ఇవ్వడానికి మగవాళ్లు పోటీ పడుతుండటం ఇంటి ఆడవాళ్లకు ఏమాత్రం నచ్చడం లేదు. కానీ అడ్డుకోలేని నిస్సహాయత కారణంగా దేవునికి దండం పెట్టుకుంటున్నారు. ఆ వయ్యారి భామలు తమ మగల కంట పడకూడదని! ఊళ్లో కొంచెం పెద్ద రైతుగా పేరున్న సచ్చసామి పొలానికి వెళ్లేందుకు తాడు అల్లుకుంటున్నాడు జనపనారతో. అంతలో వాళ్ల ఇంటి ముందు నుంచి చిలుకల వంటి ఆ నూతన వనితలు వెళ్లడం అతని కంటపడ్డది.
చేస్తున్న పనిని మధ్యలోనే ఆపేసి ఆ చేడియల వెంట వెళ్లడానికి సిద్ధమై.. “పొలంలో పిట్టల బాధ అధికమైంది. నేను వెంటనే వెళ్లాలి!” అంటూ, భార్య సమాధానం కోసం చూడకుండా వడిసెల భుజానికి వేసుకొని అతను బయలుదేరినాడు. ఇదంతా లోపలినుంచి చూస్తున్న అతని భార్య రేవాకి గుండె ఆగినంత పనైంది. వెడలిపోవు తన మొగుడి తీరుగాంచిన దయిత కంటనీరు దాగదాయె! మామ చూడకుండ మలిపె పక్కకు తల జారె వీపు నుండి జలజలమని.. (వెళ్లిపోతున్న భర్త తీరు చూసి అతని భార్య రేవాకి కన్నీరు ఆగలేదు. చేరువలో కూర్చున్న మామ కంట పడకూడదని ఆమె తల తిప్పుకొన్నది. అప్పుడు ఆ కన్నీరు వీపు మీద జలజలమని జారింది) సరిగ్గా అదే సమయంలో సంచారి అయిన శ్రమణకుడు సాధనా నందుడు జంగిటి గ్రామ పొలిమేరలోకి ప్రవేశించినాడు. అతనే పూర్వాశ్రమంలో ప్రణాలుడు. ఆ వాతావరణం అతణ్ని ఎంతగానో ఆకట్టుకున్నది. మనిషికి స్వేచ్ఛ ఎంత ఆనందదాయకమో అతనికి అనుభవంలోకి వస్తున్నది. ఒకప్పుడు స్త్రీలను చూడటానికి, మాట్లాడటానికి, వాళ్ల సాంగత్యం కోరుకోవడానికి మనసు ఆరాటపడేది. ఒక సందర్భంలో అయితే ఒక అపురూప సౌందర్య రాశిని జలకాలాడుతుండగా చూసి, దేశ బహిష్కారానికే గురి అయినాడు. బుద్ధదేవుని శిష్యుడు మాధవుడు అతణ్ని చేరదీయడంతో బతుకుచిత్రమే మారిపోయింది. ఏది శాశ్వతానందమో ఎరుకపడింది. ఇంకా పూర్తిగా భౌతిక సంపదల నుంచి మోహం దూరం కాకపోయినా, అతని మనసు ఇప్పుడు చెప్పినట్లు వింటున్నది. శిశిరం చివరి రోజులవి. చలి, ఎండల సమానమైన కలయిక శరీరానికి హాయిని, మనసుకు ఆనందాన్ని అందిస్తున్నది. పిందెలు పడుతున్న మామిడి పూత; ప్రకృతిని రాగరంజితం చేస్తున్న కోయిల కూత మానవజీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. గౌతమీ తరంగాల శీతల పవనాలు బుద్ధ దేవుని శాంతి సందేశాన్ని మోసుకొస్తున్నాయి. హఠాత్తుగా సాధనానందుని నడక ఆగిపోయింది. ఒక అద్భుత దృశ్యం అతణ్ని స్థాణువుని చేసింది.
అస్మక రాజధాని పోదన! మహారాజు సౌరిసంబ అంతరంగ మందిరం. మహారాజుతోపాటు మహామాత్యుడు చామీకరుడు; సేనాని మలయసేహరుడు సమావేశమైనారు. “ఈ నిజం విశ్వసనీయంగా లేదు మహామాత్యా!” ఎన్ని రకాలుగా ఆలోచించినా అంతుచిక్కని సమస్య అనిపిస్తున్నది సౌరసంబ మహారాజుకు ఆ సంఘటన. “కుసుమ శ్రేష్ఠి అజాతశత్రువు; ధర్మవర్తనుడు; దానకర్ణుడు. అతనికి హాని తెలపెట్టే అవసరం ఎవరికి ఉంటుంది?” “మా అనుమానం కూడా అదే ప్రభూ! వారి మందిరం శాంతి సదనం; వారి హృదయం ప్రేమ మందిరం. అతని ఏకైక కుమారుడు జయసేనుడు కూడా సుగుణ సంపన్నుడు. నమ్మకస్థులైన సేవకులు, బంట్లు, పరివారం కలిగి వైభవోపేతమైన జీవనం గడుపుతున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందేమోననే సంశయం కూడా ఉన్నది మహారాజా! కుటుంబంలో ఏ ఒక్కరూ మిగుల లేదు..” చామీకరుడు ఇంకా ఏదో చెబుతుండగా.. “శ్రేష్ఠి గారు దేశాంతరంలో ఉండటం వలన బతికిపోయినారు ప్రభూ!” తనకు తెలిసిన విషయం చెప్పినాడు మలయసేహరుడు. సౌరిసంబ మొఖం వెలిగింది. “ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసిన వాళ్లు ఉన్నారా? ఆ సమాచారం సమగ్రంగా తెలియజేయండి సేనాధిపతీ!” అన్నాడు కళ తప్పిన మొహంలో కొత్త కాంతి నిండగా. సేనాపతి జరిగిన సంఘటనను ఈ విధంగా క్లుప్తంగా తెలియజేసినాడు..
“కుసుమ శ్రేష్ఠి వ్యాపార నిమిత్తం కళింగదేశానికి వెళ్లినాడు. కొద్దిరోజుల క్రితమే కొత్త కోడలిని ఇంటికి తెచ్చినారు. దేశాంతరంలో ఉన్న శ్రేష్ఠిని ఇంటికి తోడుకొని రావడానికి పంపిన బంటు తిరిగి రాకపోవడంతో, ఆందోళనగా శ్రేష్ఠి కుమారుడు జయసేనుడు కూడా వెళ్లినాడు. వాళ్లిద్దరూ తిరిగి రాలేదు. ముందు వెళ్లిన బంటు, తర్వాత వెళ్లిన జయసేనుడు, అక్కడే ఉన్న కుసుమ శ్రేష్ఠి ఏమైపోయినారో తెలవదు. ఇంతలో తోలుబొమ్మలాడించే కళాకారులు లంకా దహనం నాటక ప్రదర్శన చేసినారు. ఆ ప్రదర్శన చివరన ప్రమాదవశాత్తూ మంటలంటుకొని శ్రేష్ఠి వారి భవనం పూర్తిగా తగులబడిపోయింది. అంతఃపుర స్త్రీలు, పరిచారకులు అందరూ అగ్నికి ఆహుతి అయినారు” “అవునా?” నమ్మలేనట్లు అన్నాడు మహారాజు. “శ్రేష్ఠి భవనం లక్క ఇల్లు కాదు; గట్టి కలపతో నిర్మించింది కదా! అంత తేలికగా ఎట్లా తగలబడుతుంది? శ్రేష్ఠికి ప్రత్యేక రక్షణ దళం ఉంటుంది కదా! వాళ్లు ఏం చేస్తున్నారు? అంతఃపుర స్త్రీలను రక్షించే వ్యవస్థ లేదా? ఆట ప్రదర్శించిన వాళ్లే అసలు నేరస్థులు. ఏదో పథకం ప్రకారమే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు మీకు అనిపించడం లేదా?” “అనిపించింది ప్రభూ!” అంటూ ఆ తర్వాత జరిగిన పరిణామాలను తెలిపినాడు సేనాని.
“ప్రదర్శన చూడటానికి వేల సంఖ్యలో వీక్షకులు వచ్చినారు. వాళ్లు మైమరిచిపోయి ఆట చూసే మహేంద్రజాలం ప్రదర్శించినారు నిర్వాహకులు. మంటలు భయంకరంగా అంటుకున్నా, అదంతా ప్రదర్శనలో భాగమన్న భ్రమలో మునిగిపోయి ఉన్నారు వాళ్లు. మన రాజభటులు కూడా కొంతమంది కాలక్షేపానికి వెళ్లి చూడగా, ఏదో మోసం జరుగుతున్నట్లు వాళ్లకి అనుమానం కలిగింది. అప్పటికే భవనంలో ఏదో గొడవ జరుగుతున్నట్లు గమనించినారు. ఒక భటుడు అక్కడనే ఉండి, మరొకరిని నా వద్దకు పంపినాడు. నేను వెంటనే 50 మంది అశ్వికులను అక్కడికి పంపినాను!” “ఆ దుండగులు కనిపించినారా?” “కనిపించినారు కానీ, దొరకలేదు ప్రభూ!” “అదేమి?” “మనవాళ్లు వెళ్లేటప్పటికే భవనం బూడిదయింది. శ్రేష్ఠి గారి బలగం అంతా ఆ వంచకుల చేతుల్లో హతమైనారు. మన సైనికులు వాళ్లని వెంటాడి వెంటాడి వధించినారు. ఒక్కడు మాత్రం తప్పించుకొని పోయినాడు. వాడు ఏదో కనికట్టు చేసి మాయమై పోయినాడు” అన్నాడు సేనాని. “ఆ తర్వాత, ఆ పోరులో వీరమరణం పొందిన శ్రేష్ఠి బంట్లకు రాజోపచారాలతో అంత్యక్రియలు జరిపించినాం. గుర్తుపట్టరానంతగా మాడిపోయిన శ్రేష్ఠి భార్య, కోడలు, మరి కొంతమంది పరిచారికలకు కూడా అంతేష్ఠి జరిపించినాం మహారాజా!” అన్నాడు మహామాత్యుడు. “మరి ఆ భవన పరిసరాలకు కాపలా ఏర్పాటు చేసినారా?” సౌరిసంబ మహారాజు వివరణ కోరినాడు. “అవును ప్రభూ! మన సైనికులు ఆ భవనం చుట్టూ.. అదే.. ఆ భవన ప్రదేశం చుట్టూ కాపలా కాస్తున్నారు.
మరొక విషయం.. ములక రాజధాని మల్లికాగిరి నుంచి శ్రేష్ఠి కోడలి చెల్లెలు వచ్చి చూసి వెళ్లినట్లు సమాచారం అందింది” “కుసుమ శ్రేష్ఠికి ఈ సమాచారం అందించే ప్రయత్నం ఏమైనా చేసినారా?” “వాళ్లకు తెలిసిన వాళ్లు ఏమైనా ప్రయత్నించినారేమో తెలియదు ప్రభూ! మనం ఈ విషయంలో మాత్రం చొరవ చూపించలేదు” కొద్దిసేపు ఆలోచించి సౌరిసంబ తన నిర్ణయాన్ని ప్రకటించినాడు. “కుసుమ శ్రేష్ఠి మనకు చాలా కావలసినవారు. ఇటువంటి కష్ట సమయంలో మనం తోడుండటం ఎంతో అవసరం. ముందుగా వేగులను పంపించి కుసుమ శ్రేష్ఠిని, అతని కుమారుణ్ని వెతికించి తీసుకొని రండి! కళింగరాజు కళింగాదిత్యుని కలిసి, వారి సహకారం తీసుకోండి! నా పేరున వారికి ఒక ప్రత్యేక లేఖను పంపండి! శ్రేష్ఠి భవనం చుట్టూ కాపలా పటిష్ఠం చేయండి! శ్రేష్ఠి కుటుంబంతో సంబంధం ఉన్న వాళ్లందరినీ విచారించి, మరింత సమాచారం సేకరించండి! నిపుణుడైన వాస్తు శిల్పిని తీసుకొని వెళ్లి ఆ భవన పరిసరాల్లో రహస్య మార్గాలు ఉన్నాయేమో తెలుసుకోండి!” ఇంతలో ప్రతీహారి వచ్చి.. ‘ముళక రాజు విష్ణుముఖుడు వార్తాహరుని పంపినా’డని తెలిపినాడు.