B Hari | తెలుగు సినిమా రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన ప్రముఖ సినీ పంపిణీదారుడు, డబ్బింగ్ చిత్రాల నిర్మాత బి. హరి ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో పంపిణీ రంగంలో కీలక పాత్ర పోషించిన హరి ఆకస్మిక మరణం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు సినిమా పంపిణీ రంగంలో బి. హరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలైన వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ఠ మూవీస్ నిర్మించిన అనేక చిత్రాలను ఆయన నెల్లూరు ప్రాంతంలో పంపిణీ చేశారు. తన వ్యాపార నైపుణ్యం, సినీ రంగంపై ఉన్న అవగాహనతో పంపిణీ రంగంలో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాకుండా తమిళ హీరో విశాల్ నటించిన పలు చిత్రాలను తెలుగులో ‘హరి వెంకటేశ్వర పిక్చర్స్’ బ్యానర్‌పై విడుదల చేసి నిర్మాతగా కూడా మంచి పేరు సంపాదించారు. ఆయన విడుదల చేసిన విశాల్ చిత్రం ‘అభిమాన్యుడు’ తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. డబ్బింగ్ సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేయడంలో కూడా హరి ముఖ్య పాత్ర పోషించారు. హరి సినీ ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. మొదట చెన్నైలో తెలుగు సినిమాలను హైర్ ప్రాతిపదికన ప్రదర్శిస్తూ పంపిణీ రంగంలో అడుగుపెట్టారు. అనంతరం 2006లో దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో, హీరో రామ్ నటించిన ‘దేవదాస్’ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసి తన ప్రయాణాన్ని మరింత విస్తరించారు. అప్పటి నుంచి గత ఇరవై సంవత్సరాల్లో వందలాది సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
సినిమా రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా ఆయన ముందుండేవారని సినీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొత్త రచయితలు, యువ ప్రతిభకు అవకాశాలు కల్పించడంలో ఆసక్తి చూపేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన హరి, అక్కడే గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందినట్లు సమాచారం. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బి. హరి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.