Natti Kumar | తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా చుట్టూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు చిత్రబృందం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతుండగా, మరోవైపు థియేటర్ల వ్యవహారానికి సంబంధించిన కొత్త వివాదం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు తెలంగాణ ఎగ్జిబిటర్లు తాజాగా కొన్ని కొత్త షరతులు పెట్టడం చర్చనీయాంశమైంది.ఇటీవల ‘పెద్ది’ సినిమా ప్రదర్శనకు ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని ప్రకటించిన ఎగ్జిబిటర్లు, తాజాగా నిర్వహించిన సమావేశంలో మరో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు సమాచారం.
థియేటర్లలో పర్సంటేజ్ విధానాన్ని నిర్మాతలు అంగీకరిస్తేనే సినిమాను ప్రదర్శిస్తామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సెట్ అయిన అంశంపై మళ్లీ కొత్త నిబంధనలు తీసుకురావడం పట్ల సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ సమావేశం అనంతరం అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎగ్జిబిటర్ల వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో పరిశ్రమ పెద్దలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు.ఆ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు, పరిశ్రమ పెద్దలు సినిమా విడుదల సాఫీగా జరుగుతుందని స్పష్టంగా చెప్పారని నట్టి కుమార్ పేర్కొన్నారు. అందరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కొత్త అంశాలను తెరపైకి తీసుకురావడం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలపై పదేపదే మార్పులు చేయడం పరిశ్రమకు మంచిది కాదన్నారు.
అలాగే ఈ వ్యవహారం వెనుక కొంతమంది ప్రభావశీల వ్యక్తులు ఉన్నారంటూ ఆయన ఆరోపించారు. థియేటర్ల లీజులు, ఎగ్జిబిటర్ల వ్యవహారంపై కూడా కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. నిజమైన థియేటర్ యజమానులకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు ఉండాలని, వారి ప్రయోజనాల కోసం తాము ఎప్పుడూ మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక కొంతమంది ఎగ్జిబిటర్లు ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవిని కలుస్తామని చెప్పడంపై కూడా నట్టి కుమార్ స్పందించారు. కేవలం ఒకే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు ‘పెద్ది’ సినిమాకు ఎదురవుతున్న సమస్య రేపు ఇతర హీరోల సినిమాలకు కూడా రావచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా పరిశ్రమలోని ప్రముఖ హీరోలు, నిర్మాతలు కూడా ఈ అంశంపై స్పందించాలని ఆయన కోరారు. టికెట్ ధరలు పెంపు వంటి అంశాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, అలాంటి విషయాలపై ఇతరులు నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు.
ఈ వివాదానికి త్వరగా పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేసిన నట్టి కుమార్, అవసరమైతే తాను ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు. మంగళవారం వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత కూడా సరైన నిర్ణయం రాకపోతే ఫిలిం ఛాంబర్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని వెల్లడించారు.జూన్ 4న విడుదలకు సిద్ధంగా ఉన్న ‘పెద్ది’ సినిమా చుట్టూ ఇప్పుడు ఈ వివాదం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.