జరిగిన కథ కమలసత్తి తన కొడుకు వచ్చినాడని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అవణాయరు జయసేనుణ్ని అనుమానిస్తాడు. చిలుకవాడ భూగృహంలో చంద్రహత్థి అసలు రూపం గమనిస్తారు వోహా, ససిప్పహా. తర్వాత…
చిలుకవాడ భూగృహం… క్షణంలో తేరుకొని.. వోహా, ససిప్పహా ఇద్దరూ ఒక్కసారిగా చంద్రహత్థి మీదికి దూకినంత పని చేసినారు. అప్పటికే పూర్తి స్పృహలోకి వచ్చిన చంద్రహత్థి ఏమాత్రం బెదరలేదు. “నీవు ఆడదానివే కదా!?” సూటిగా చూస్తూ అడిగింది ససిప్పహా. “ఏం? ఇంకా మీకు అర్థం కాలేదా?” వెక్కిరింపుగా అన్నది చంద్ర. “ఇక్కడికి ఎందుకు వచ్చినావ్?” “ఎవరు పంపినారు?” “వేషం మార్చుకుని ఎందుకొచ్చినవ్?” ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించినారు వాళ్లిద్దరూ. “మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తా! నేనేమీ పారిపోను. ముందు తాగడానికి నీళ్లివ్వండి!” నిదానంగా, దృఢంగా అన్నది చంద్రహత్థి. ఆమెను చూస్తే అపకారం చేసే మనిషిలా అనిపించలేదు వాళ్లకు. మళ్లీ ముంతతో నీళ్లు తెచ్చి ఇచ్చింది వోహా. నీళ్లు తాగి, కురులు ముడి వేసుకొని, సౌక ర్యంగా కూర్చుని గొంతు విప్పింది చంద్రహత్థి… “పాడు దేవుడా! కృపా రహితుడ వీవు! ఆడ జన్మనిచ్చినా వదేల? ఇచ్చి, ప్రేమ గూర్చి, ఇష్టమౌ మగవాని చిక్కకుండ దవ్వు సేయుటేల? (ఓ దయలేని దేవుడా! నాకు ఆడజన్మను ఎందుకిచ్చినావు? ఇచ్చి, మనసులో ప్రేమను నింపినావు; నింపి, నేను ఇష్టపడే మగవాడిని నాకు దక్కకుండా ఎందుకు దూరం చేస్తున్నావు?)” అన్నది.
ఆమె దైన్యతను చూసి కొంచెం మనసు కరిగినా, వాళ్లు తమ ధర్మాన్ని విస్మరించలేదు. పదేపదే ప్రశ్నలు అడిగినారు. సంక్షిప్తంగా తన కథ చెప్తే వాళ్ల ప్రశ్నలన్నిటికీ జవాబు లభిస్తుందని ఈ విధంగా చెప్పింది చంద్రహత్థి… “నా పేరు చంద్రహత్థి. మాది చెంచుగూడెం. మా గూడెంలోని ఆడవాళ్లను దారిదోపిడీగాళ్లు ఎత్తుకొని పోతుంటే, పోటిసుడు రక్షించినాడు. కానీ ఆ ప్రయత్నంలో గాయపడ్డాడు. అతని వీరత్వం చూసి నేను మనసు పడ్డాను. ఆయన కూడా నన్ను ఇష్టపడ్డాడు. ఇద్దరం ఒక్కటైనాము. ఆయన గాయం మానిన తర్వాత, తాను మధ్యలో వదిలిన పని పూర్తిచేసి వస్తానని చెప్పి, ఇక్కడికి… అదే కళింగకు వచ్చినాడు. ఎన్నాళ్లు చూసినా మరలి రాలేదు. నేను పిచ్చిదాన్ని అయిపోయినాను. మా అక్క నాకు నయం చేయించి, నన్ను ఇక్కడికి పంపించింది. ఆయనను వెతికే ప్రయత్నంలోనే నేను మీకు చిక్కినాను” “పోటిసుడు అంటే ఎవరే?” అడిగింది వోహా. “అదే ఆలోచిస్తున్నానే. మహావీరుడు అంటున్నది కాబట్టి, అటువంటి వాళ్లు ముగ్గురు ఇటీవలి కాలంలో ఇక్కడికి వచ్చినారు. ఒకరు శ్రేష్ఠిగారి కుమారుడని విన్నాం. ఇంకొకరు అతని స్నేహితుడట” ససిప్పహా అంటుంటే.. “ఆ మూడవ వీరుడు… తర్వాత వచ్చిన వాడేమోనే. శ్రేష్ఠి కుమారుని స్నేహితుడిని, మన సౌగంధిక గారిని కాపాడినాడు కదా…!” అంది వోహా. “అవును! అతనే పోటిసుడు!” ఆ కంఠం వినగానే, ఇద్దరూ ఉలిక్కిపడి, గబుక్కున లేచి నిలబడ్డారు… వోహా, ససిప్పహా. ఆశ్చర్యంగా వాళ్లని చూస్తూ, కదలకుండా అట్లాగే కూర్చున్నది చంద్రహత్థి. ఒక అందమైన స్త్రీ హుందాగా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది.
ఆమె సవర… సవర సత్తి. “నీ పేరు చంద్రహత్థి కదా!” అన్నది ఆమెనే చూస్తూ. సవరసత్తిని చూడగానే అప్రయత్నంగా లేచి నిలబడ్డది చంద్ర. “నిన్ను పోటిసుడు చూసినాడు; నీవు కూడా అతణ్ని చూసినావు; అతని మాటలు విన్నావు!” అన్నది లాలనగా. “అమ్మా! మీ కాళ్లు పట్టుకుంటాను. నా పోటిసుని వద్దకు నన్ను చేర్చండి!” నిజంగానే కాళ్లమీద పడ్డది చంద్రహత్థి. హత్థిని ప్రేమతో పైకెత్తి, గుండెకు హత్తుకున్నది సవర. “మీరు ఒకరి కోసం ఒకరు బతుకుతున్నారు తల్లీ! మీ ప్రేమ అజరామరం! కాకపోతే, ఇది మీకు పరీక్షా సమయం” అంటూ వాళ్ల కథను తనకు తెలిసినంత చెప్పింది; పోటిసుని మనసు కూడా తెలిపింది; వాళ్లిద్దరూ ఒకరినొకరు కలుసుకోలేక పోయిన సందర్భం తెలిపింది; పోటిసుడు ఈసాణుని అనుసరించి వెళ్లడానికి ముందు, చంద్రహత్థి గురించి చెప్పిన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. దుఃఖపు ముద్దగా మారిన చంద్రహత్థి సవరసత్తిని గట్టిగా వాటేసుకొని, వెక్కివెక్కి ఏడ్చింది. ఆ దుఃఖంలో తన ప్రియుడు క్షేమంగా ఉన్నాడని, తప్పకుండా కలుస్తానన్న ఆనందం కూడా ఉన్నది. “నీవేం బాధపడకు! మీరు తొందరలోనే కలుస్తారు. కాదు! నేనే మిమ్మల్నిద్దరినీ కలుపుతాను. కలపడమే కాదు, దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను!” అంటూ తలనిమిరి నుదుట ముద్దు పెట్టుకున్నది. జీవితంలో అంత ఆనందం ఎప్పుడూ అనుభవించలేదు చంద్రహత్థి . కన్నీటి పొరల నుండి కన్నతల్లిని చూస్తున్నట్లు సవరసత్తిని చూస్తూ.. “నిన్ను అమ్మా అని పిలవవచ్చా?” అన్నది. “బిడ్డా! నువ్వు నా బిడ్డవే! తప్పకుండా పిలవచ్చు!” అన్నది నవ్వుతూ సవరసత్తి.
“నిన్నే అడుగుతున్నా! ఎవడవు నీవు?” మళ్లీ గద్దించినాడు అవణాయరు. ఏం చెప్పాలో తోచక, తికమక పడుతున్నాడు భటుని వేషంలోని జయసేనుడు. సరిగ్గా అప్పుడే సుడిగాలిలా దూసుకొని వచ్చిన దేవి రూపంలోని వామదేవుడు జయసేని చెంప పగలగొట్టినాడు. అందరూ ఉలిక్కిపడ్డారు. “ఒరేయ్ పనికిమాలిన వెధవా! ప్రభువుల వారు నీకు మామ అవుతారని నీకు తెలుసు; నాకు తెలుసు. అది అందరికీ చెప్పాలెనా? టముకు తీసుకొని చాటింపు వెయ్యి. పుచ్చ పగిలిపోతుంది! ఏమనుకుంటున్నావో! నేనే ప్రభువులవారిని ‘బావా!’ అని పిలువను. నీవెట్లా పిలుస్తావురా నీచుడా!” అని చెడా మడా తిట్టి, “మన్నించండి మహాప్రభూ! వీని పేరు జాయప. నాకు మేనల్లుడు. నాకు మేనల్లుడయితే, మీకూ అల్లుని వరసే కదా! ఆ వరుసతో ఏదో మాట తూలి ఉంటాడు. వాని పక్షాన నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను.
మీ అనుమతి లేకుండా వీడిని కాపలా పెట్టుకోవడం కూడా నా తప్పిదమే. అందుకు నన్ను శిక్షించండి! వీడు అమాయకుడు. వీణ్ని ఏమీ అనకండి! నేనూ నా కోడలు ఇద్దరమూ ఆడవాళ్లం కదా! ఒక మగతోడు అవసర మవుతుందని నేనే వెంట తెచ్చుకున్నాను” అంటూ కన్నీరు ఒలకబోసింది దేవి. అదే… దేవి రూపంలోని వామదేవుడు. మరోమారు దేవి మాటలకు కరిగిపోయినాడు అవణాయరు. “దేవీ! ఈ మాటని ముందుగా చెబితే చాలా బాగుండేది కదా!” అన్నాడు. ఆపై.. “మన మధ్యన క్షమాపణలు ఎందుకులే!” అంటూ ఓదార్చి నాడు. అల్లడి వంక చూసినాడు. “ప్రభూ!” అన్నాడు యజమాని అంతరంగం గ్రహించిన సేవకుడు అల్లడు. “ఇకపై నీవు రాణిగారి మందిరం వద్ద విధులు నిర్వహించు. ఇక్కడ జాయప కాపలా ఉంటాడు” అన్నాడు విషయం అర్థమై, అక్కడి నుండి నీరసంగా నడుచుకుంటూ బయలుదేరినాడు అల్లడు. అతని మనసు వికలమైంది. తనకు అకారణ శిక్ష పడిందని విలవిలలాడుతూ రాణిగారి మందిరం వైపు వెళ్లినాడు. “ప్రభూ! మీది ఎంత మెత్తని మనసు…” అవణాయరు గుండెమీద తలను ఆనించినాడు వామదేవుడు (దేవి).
జంగిటిలో… “ఏంది? కొడుకు వచ్చేసినాడా?” నమ్మలేనట్లు అన్నాడు సచ్చసామి. “ఒక్కసారి బయటికి పిలువండి, దర్శనం చేసుకుంటా!” “నాయనా! ఆనందా! ఒకసారి బయటకు వచ్చి, ఆ పెద్ద మనిషిని కలువు!” అన్నది కమలసత్తి. తనను ఆ విధంగా పూర్తిగా కొడుకుని చేసుకోవడం ప్రణాలుడు తట్టుకోలేక పోతున్నాడు. ఆమె తొలి పరిచయం నుంచే ఆ భావనను పంచుతుండటం అతను గమనిస్తూనే ఉన్నాడు. ఇక తాను నిజంగా ఆ తల్లి రుణం తీర్చుకోవాలని నిర్ధారించుకున్నాడు. సచ్చసామిని చూసి నమస్కరించినాడు. ప్రతి నమస్కారం చేసిన సచ్చసామి ఆనందుని చూసి ఆలోచనలో పడిపోయినాడు. ‘ఈ మనిషిని ఎక్కడో చూసినట్లు ఉన్నదే!’ అనుకుంటుంటే ఏదో గుర్తొచ్చింది. “సామీ! తమరు బుద్ధదేవుని శిష్యులతో కలిసి తిరిగినారా ఏంది?” అన్నాడు. “అవును నాయనా!” తొట్రుపడకుండా, స్థిరంగా అన్నాడు ఆనందుడు. “జీవితం దుఃఖ మయమని; కోరికలను జయించాలని; లోకోపకారమే జీవితాశయమని తలంచి, సర్వం త్యజించి, శ్రమణకుడుగా మారాలనుకున్నాను కానీ, నా తల్లి ప్రేమ నన్ను మళ్లీ ఇల్లు వెతుక్కునేలా చేసింది” కమలసత్తి హృదయం ఆనందకమలమైంది! ఆహవ మనసును అలముకున్న మంచు తెరలు తొలగసాగినాయి!
భాణు అతని మాటల పట్ల మరింత ఆకర్షితురాలైంది! సచ్చసామి గుండె ముక్కలైంది! మారు మాట్లాడకుండా గిరుక్కున వెనుతిరిగినాడు అతను. అలా వెళుతున్నప్పుడు అతని దృష్టి ఒక గుడిసె మీది నుండి జారి పడిపోతున్న గుమ్మడి తీగ మీద పడింది. అది చూసి ఇట్లా అనుకున్నాడు… గుడిసె మీదనున్న గుమ్మడి తీగ! నీ కెందుకోయి పరుల సందు తోవ? జారిపడుదు వింక జాగ్రత్త! నీ గుండె సొంత ఇంటి సుఖ మదెంతొ హాయి! (గుడిసె మీద ఉన్న ఓ గుమ్మడి తీగా! ఎందుకు పరాయి సందులోకి వెళ్లడానికి ఆరాటపడుతున్నావు? జారి పడిపోతావు! నీ గుండెకు గాయం అవుతుంది జాగ్రత్త! ఎంతైనా సొంత ఇంటి సుఖమే హాయినిస్తుంది సుమా!) ఆనందుణ్ని తనకు దేవుడిచ్చిన కొడుకుగా భావించింది కమలసత్తి. వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. “నాయనా! ఆనందా! కోడలు పిల్లను తీసుకొని ఈ ఊరిని, పొలిమేరలను ఒక్కసారి కలయతిరిగి రా నాయనా!” అన్నది. ఆ మాటలు విన్న భాణుసత్తి ఆనంద తరంగిణి అయింది. ఒక్కసారిగా అత్తను గట్టిగా వాటేసుకొని, ముద్దు పెట్టుకుని, తన ఆనందాన్ని ప్రకటించాలన్న ఆలోచనను అదిమి పెట్టుకోవడం ఆమెకు చాలా కష్టమైంది. ఆహవ మాత్రం ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
‘పెద్దరాణి గారికి ఏమైందసలు? ఈ మాయగాడు వైద్యం పేరుతో ఏదైనా మరుల మందు ఇచ్చినాడా? కలిసిన తొలి పరిచయం నుండి కన్న కొడుకు కంటే ఎక్కువ ప్రేమ పంచుతున్నది. అది అర్థం చేసుకోవచ్చు కానీ, కోడలి చేతిని అదీ… కొత్త కోడలిని ఈ పరపురుషునికి అప్పగించడం ఏమిటో అంతు చిక్కకున్నది కదా! ఇది కోడలిపట్ల సానుభూతితో చేస్తున్నదా? లేక కక్షగట్టి రోహాదేవిని భ్రష్టురా లిని చేయాలనుకుంటున్నదా? మొత్తం మీద ఈమె మానసికస్థితి గతి తప్పిన మాట మాత్రం నిజం! ఇప్పుడు ఏం చేయాలి? ఆమె గుడ్డిదే కావచ్చు కానీ తనకు మహారాణి అనే విషయం కూడా మరువరానిది. ఆమె ఎదుట నిలబడి మాట్లాడటానికి తనకు ధైర్యం చాలదు ఇప్పటికీ..’ అని నిట్టూరుస్తూ, తన పని తాను చేసుకోవడానికి సిద్ధమైంది. మరోపక్క ఆనందంతో కన్నులు ఎగరేస్తూ, ఆనందుని వంక చూసింది ఆనందతరంగిణి భాణుసత్తి. ప్రణాలుడు అడకత్తెరలో పోకచెక్క తీరుగా అయినాడు. కన్నబిడ్డ కన్నా మిన్నగా చూస్తున్న కమలసత్తి గారి పట్ల అతనికి కొండంత అభిమానం పెరిగింది. కానీ, ఆమె స్వయంగా తనను ఆమె కోడలికి దగ్గర చేస్తూండటం ఎంత మాత్రమూ మింగుడు పడటం లేదు. పైగా స్వయాన తన కొడుకు భార్యను తనకు అప్పగించడం… మరొకపక్క బుద్ధుని మార్గం పదేపదే గుర్తుకు వచ్చి, దారి తప్పుతున్న తనను వెక్కిరిస్తున్నది; బుద్ధి తెచ్చుకొమ్మంటున్నది. తనలోని చీము నెత్తురున్న మనిషి మాత్రం ఆ భాణుసత్తి అందం అనే వలలో నుంచి తప్పించుకోలేక పోతున్నాడు. ఏది ఏమైనా, తనది రోట్లో తలపెట్టిన పరిస్థితి! ఎదురయ్యే సమస్యలకు ఎదురొడ్డటం తప్ప వేరే దారి లేదు…’ అనుకుంటూ భాణును చూసినాడు.
వెన్నెల ఆరబోసినట్లు నవ్వుతున్నది ఆమె. “ఏమిరా నాయనా! ఇంకా బయలుదేరనే లేదా?” అంటూ ఆనందుని మందలించి.. “కోడలు పిల్లా! నీ మనసులో ఏ సంకోచం పెట్టుకోకుండా, నా కొడుకు వెంట వెళ్లు తల్లీ!” అన్నది ప్రేమ నిండిన గొంతుతో. ఇంక తట్టుకోలేక చప్పున అత్తగారి కాళ్ల మీద పడ్డది భాణు. రెండు కన్నీటి చుక్కలు కమలసత్తి పాదాలను రసార్ద్రంగా ముద్దాడినాయి. కోడలిని ఎత్తి కౌగిలించుకొని, ముద్దాడి.. “చూడు రోహా! ఒక ఆడదానిగా నీకేం కావాలెనో అవన్నీ నేను చూసుకుంటా! నేను నీ అత్తమ్మను. నాలోని అమ్మను నీవు గుర్తించినావు; నీలోని ఆత్మను నేను గుర్తిస్తున్నాను!” అన్నది. వాళ్లిద్దరూ విహారానికి వెళ్లగానే చేస్తున్న పనిని ఆపేసి, కమలసత్తి వద్దకు వచ్చి.. “నీవు అసలు మనిషివేనా?” అని గట్టిగా అరిచింది ఆహవసత్తి.