‘సూపర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దశాబ్దంపాటు స్టార్ హీరోయిన్గా రాణించిన కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి.
స్టార్ హీరోలందరి సరసన నటించిన అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించింది. యోగా గురువుగా కెరీర్ ప్రారంభించిన స్వీటీ తన నటనతో దక్షిణాదిన తిరుగులేని హీరోయిన్గా ఎదిగింది. కొంతకాలంగా అప్పుడప్పుడూ ప్రేక్షకులను పలకరిస్తున్న అనుష్క ఇటీవలే ‘ఘాటి’ సినిమాతో మరోసారి
తనేంటో నిరూపించుకుంది. పెండ్లిపై తనకు నమ్మకం ఉందంటూ, సరైన వ్యక్తి, సరైన సమయం వస్తే తప్పకుండా పెండ్లిపీటలు ఎక్కుతానంటున్న అనుష్క పంచుకున్న కబుర్లు ఇవి..
నా మనసులో బెంగళూరుకి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అక్కడి వాతావరణం, స్నేహితులతో గడిపిన సమయం అన్నీ మరపురాని జ్ఞాపకాలే! మౌంట్ కార్మెల్ కళాశాలలో బీసీఏ చదివే సమయంలో నాకు కంప్యూటర్స్ కన్నా… ఫిట్నెస్ రంగంలో ఎక్కువ ఆసక్తి ఏర్పడింది.
‘బాహుబలి’ సినిమాలో దేవసేన పాత్ర చాలా శక్తిమంతమైనది. రాజమౌళి దర్శకత్వంలో ఆ పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఆ సినిమా నా కెరీర్లో భారీ విజయంతోపాటు అభిమానుల హృదయాల్లో
చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం సంపాదించుకునే అవకాశం ఇచ్చింది.
నాకు బలమైన పాత్రలు చేయడం ఇష్టం. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ లాంటి సినిమాల్లో నటించడం ద్వారా నటిగా నేనేంటో నిరూపించుకోగలిగాను. ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరగాలని చెప్పారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉండి ప్రయోగాలు అవసరమా అని చాలామంది అన్నారు. కానీ, నేను దాన్ని ఓ సవాలుగా భావించి బరువు పెరిగా.
నా అసలు పేరు స్వీటీ. కుటుంబసభ్యులు, స్నేహితులు నన్ను అలాగే పిలుస్తారు. సినిమాల్లోకి వచ్చినప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నాకు అనుష్క అని పేరు పెట్టారు.చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ నన్ను టొమ్ములు
అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఆ పేరు వింటే బెంగళూరులో గడిపిన నా బాల్యం గుర్తొస్తుంది.
భరత్ ఠాకూర్ దగ్గర యోగా శిక్షకురాలిగా పనిచేస్తున్నప్పుడు, బాలీవుడ్ దర్శకుడు ఇ.నివాస్ ద్వారా పూరీ జగన్నాథ్ పరిచయం అయ్యారు. అలా 2005లో ‘సూపర్’ సినిమాతో నా సినీజర్నీ మొదలైంది. ‘అరుంధతి’ నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఆ సినిమా నాకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు తెచ్చిపెట్టింది.
ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఒక క్లాస్మేట్ ఐ లవ్ యూ చెప్పాడు. అప్పుడు ప్రేమ అంటే ఏమిటో కూడా తెలియదు! కానీ, ఆ జ్ఞాపకం ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. నా పెండ్లి గురించి వచ్చే పుకార్లు విని నవ్వుకుంటాను. నాకు పెండ్లిపై నమ్మకం ఉంది. కానీ, సరైన వ్యక్తి, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. అన్నీ కుదిరితే పెండ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలూ లేవు!
‘ఘాటి’ నా కెరీర్లో మరో ప్రత్యేకమైన చిత్రం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కథలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నా పాత్ర కూడా ఇంటెన్స్‌తో ఉంటుంది. ఇక ‘కథనార్’ నా మొదటి మలయాళ చిత్రం, ఇది 14 భాషల్లో విడుదల కాబోతున్నది. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంది. కొత్త భాష, కొత్త టీమ్‌తో పనిచేయడం నాకు సరికొత్త అనుభవం.