మెత్తటి జూలున్న సింహాన్ని కౌగిలించుకుని పడుకోవాలని ఉందా?! ఎలుగుబంటి ఒడిలో సేదతీరాలనీ, అడవిదున్న కొమ్ముతో ఆటలాడాలనీ ఎప్పుడన్నా అనిపించిందా… ఏం ఫర్వాలేదు. అవేం పెద్ద కలలు కానేకావు. ఎందుకంటే వీటిని నిజం చేసుకోవడం సులభం. యానిమల్ షేప్డ్ సోఫాలు… అలాంటి ముచ్చట్లు ఉన్న వారికోసమే రూపొందుతున్నాయి మరి!
కొంత మందికి జంతువులంటే భలే ఇష్టం. మెత్తగా ఉండే వాటి బొచ్చును చూస్తే అదో సరదా. అలాగని ఏ కుక్క పిల్లనో, పెద్ద పిల్లినో పెంచుకోగలరు కానీ, గాండ్రించే పులులనూ, వేటాడే తోడేళ్లనూ ముద్దాడలేరుగా. పోనీ వాటిని వాళ్ల అభిమాన లిస్టులోంచి తొలగించనూ లేరు. అందుకే వాటి వీడియోలు చూస్తూ, అప్పుడప్పుడూ జూలకు, అవకాశముంటే సఫారీలకు వెళ్లి పలకరిస్తూ ఉంటారు. అంతే తప్ప ఆ జీవులను ముట్టుకోవాలనో, కౌగిలించుకోవాలనో ఉన్న సరదా మాత్రం తీరదు. అలాంటి ముచ్చట ఉన్న వాళ్ల కోసం ఎంత సేపు కావాలంటే అంత సేపు ఆ జంతువుల ఒడిలో పడుకుని, వాటిని హత్తుకున్న అనుభూతి కలిగేలా ఓవర్ సైజ్డ్ సోఫాలు, సోఫా బెడ్లు మార్కెట్లోకి వస్తున్నాయిపుడు. ఆన్లైన్లో దొరికే వీటిలో ఎన్నో వెరైటీలు కూడా ఉంటున్నాయి.
ఈ యానిమల్ సోఫాలను ప్లష్ టాయ్లకు వాడే మెత్తటి బొచ్చు ఉండే హై క్వాలిటీ మెటీరియల్తో తయారు చేస్తున్నారు. మనకు ఏ జంతువు ఇష్టం, అది ఎలాంటి రంగులో ఉండాలి, ఎలాంటి ముఖకవళికలు ఉండాలి అన్న ఇష్టాన్ని బట్టీ వీటిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఎలుగుబంటిని తీసుకుంటే, నలుపు, బ్రౌన్, లేదా ధ్రువపు ఎలుగుబంటిలా తెలుపు రంగు బొచ్చుతో ఉండేది… ఇలా అన్నమాట. ఇంకేం, ఈ జంతువుల ఒడిలో పడుకుని ఎంచక్కా ఆటలాడుకోవడమే… ఎందుకంటే వీటికి గోర్లూ, కోరలూ ఉండవుగా!