చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి దక్షిణాదిన వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న మలయాళీ ముద్దుగుమ్మ ఇవానా. తమిళంలో వచ్చిన ‘లవ్‌టుడే’ సినిమాతో హీరోయిన్గా మారి.. ఇటీవలే ‘#సింగిల్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ భామకి తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ సెలెబ్రిటీగా మారిన కేరళ కుట్టీ ఇవానా అలియాస్ అలీనా షాజీ పంచుకున్న కబుర్లు..
మాది కేరళలోని త్రిశూర్. చిన్నప్పటినుంచి నటన, డ్యాన్స్‌పై ఆసక్తి ఉండేది. సినిమాలు కూడా తెగ చూసేదాన్ని. అలా ఇండస్ట్రీలోకి రావాలన్న కోరిక కూడా పుట్టింది. 2012లో మలయాళ సినిమా ‘మాస్టర్స్’లో చిన్నపాత్రతో నా కెరీర్ మొదలైంది. తర్వాత తమిళంలో వచ్చిన ‘నాచియార్’లో లీడ్ రోల్ చేశాను. జ్యోతిక గారు నాకు గొప్ప ఇన్స్పిరేషన్. ‘నాచియార్’లో ఆమెతో కలిసి నటించడం నా కెరీర్లో మరపురాని అనుభవం.
నాకు బీచ్‌లు ఇష్టం. కేరళలోని కోవలం బీచ్ నా ఫేవరెట్. అక్కడ కూర్చొని సముద్రం చూస్తూ రిలాక్స్ అవుతుంటాను. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటాను. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, నా వర్క్ అప్డేట్స్ షేర్ చేయడం ఇష్టం. ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాను. తెలుగులోనూ మంచి కథలు వస్తే చేస్తాను.
డ్యాన్స్ నాకు లైఫ్ లాంటిది. నా సినిమాల్లోని పాటల్లో డ్యాన్స్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను. డ్యాన్స్, ట్రావెలింగ్, బుక్స్ చదవడం నా హాబీలు.
అల్లు అర్జున్ గారి సినిమాలు చాలా ఇష్టం. ముఖ్యంగా ‘పుష్ప’ బాగా ఆకట్టుకుంది. ఆయన డ్యాన్స్, యాక్టింగ్‌కు ఫ్యాన్‌ని! తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పగా, ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు సినిమాలను హృదయంతో ఆదరిస్తారు.
రొమాంటిక్ సీన్స్ కొంచెం కష్టమే, కానీ కథలో భాగంగా ఉంటే తప్పకుండా చేస్తాను. కానీ, ఆ సీన్స్ బాగా రావాలంటే సెట్లో కంఫర్టబుల్ వాతావరణం ఉండటం అవసరం. ‘లవ్‌టుడే’ సినిమా నాకు తమిళంతోపాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చింది. ఆ సినిమా తర్వాత నాకు వరుస అవకాశాలు వస్తున్నాయి.
‘నాచియార్’ సినిమా సమయంలో దర్శకుడు బాల గారు, అందరూ సులభంగా పలకగలిగే పేరును స్క్రీన్ నేమ్‌గా పెట్టుకుంటే మంచిదని సూచించారు. మా కుటుంబం ‘ఇవానా’ అనే పేరు ఎంచుకుంది. ఇప్పుడు నా అసలుపేరు కంటే ఇదే ఎక్కువ పాపులర్ అయింది.
‘#సింగిల్’ కథ విన్నప్పుడు చాలా ఫ్రెష్‌గా, ఫన్‌గా అనిపించింది. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్, కేతిక శర్మతోపాటు గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అవకాశంగా భావించాను. ఈ సినిమాలోని నా రోల్ నాకు చాలా స్పెషల్.
చిన్నప్పుడు హైట్ విషయంలో నన్ను చాలామంది ఏడిపించేవారు. తక్కువ హైట్ వల్ల చాలా అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కొన్నా. స్కూల్లో నా ఫ్రెండ్స్ నన్ను పొట్టి అని ఏడిపించేవారు. దాంతో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయేదాన్ని.