బ్రౌజర్ అంటే.. అడ్రస్ బార్లో వెబ్‌సైట్‌ని టైప్ చేయడం, ఈమెయిల్స్ చెక్ చేయడం, బిల్లు కట్టడం, బ్యాంకింగ్ లావాదేవీలు, బుక్మార్క్లు పెట్టుకోవడం!! మనలో చాలామందికి తెలిసింది ఇదే. కానీ, బ్రౌజర్లు అంతకుమించి అప్డేట్ అవుతున్నాయి. మీరు ఇప్పటికీ అదే పాత వెర్షన్లతో అతుక్కుని ఉంటే కుదరదు. అప్డేట్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఈ మార్పు ఆషామాషీ కాదు. దీని వెనుక ‘ఏఐ’ ఉంది. అందుకే టెక్నాలజీ నిపుణులు రానున్నది అంతా ‘ఏఐ బ్రౌజర్స్ వార్’గా అభివర్ణిస్తున్నారు. ఈ క్రమంలో క్రోమ్‌తో మొదలుకుని చిన్నచిన్న స్టార్టప్ బ్రౌజర్ల వరకూ ఎలాంటి అప్డేట్లను మోసుకొస్తున్నాయో తెలుసుకోవడం అనివార్యం!!
మీరు ఏ బ్రౌజర్ వాడతారు అంటే.. క్రోమ్ అనేవారు ఎక్కువ. ఇక ఫైర్ఫాక్స్ విషయానికొస్తే టెక్సావీల ఫేవరెట్.. ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ అడ్డా. ఇక యాపిల్ యూజర్లకు సఫారీ ఉండనే ఉంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించేవారికైతే ఔరా అనిపించే ఒపేరా ఉంది. ఈ ఫ్లోలో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మాటేంటి అంటే.. కాస్త సెటైరికల్‌గా.. ఏముందీ.. అప్పుడప్పుడూ క్రోమ్‌ని డౌన్లోడ్ చేసుకునేందుకు వాడతారు అనేస్తారు. ఎందుకంటే.. ఇప్పుడు ‘ఎడ్జ్’ పేరుతో మెరుగుపరచిన మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ప్లోరర్ పరిస్థితి ఒకప్పుడు అదే! అయితే, అప్డేట్లు వస్తున్న కొద్దీ.. బ్రౌజింగ్ తీరు మారిపోయింది. బ్రౌజర్లు కూడా పోటీ పడుతూ ఇంటర్నెట్ ఫలాలను ఇన్నొవేటివ్‌గా నెటిజన్ల ముందుకు తెస్తున్నాయి. బ్రౌజర్ అంటే కేవలం ఇంటర్నెట్కు గేట్‌వే మాత్రమే కాదు. ఇప్పుడు బ్రౌజర్ ఓ ఏఐతో కూడిన అసిస్టెంట్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే, బ్రౌజర్ ఏఐ వెర్షన్‌లోకి అప్‌గ్రేడ్ అయిపోయింది.
బ్రౌజర్ అంటే ట్యాబ్‌లు కాదు!
క్రోమ్ అంటే వేగానికి చిహ్నంగా.. ఫైర్ఫాక్స్ ఎథికల్.. సఫారీ ప్రీ-ఇన్స్టాల్ టూల్.. అనే బ్రాండ్లను దాటుకుని కో-పైలట్లు, అసిస్టెంట్లు, ఏఐ చాట్బాట్లను నిక్షిప్తం చేసుకుని ముందుకొస్తున్నాయి. అంతేకాదు.. బ్రౌజర్ అంటే పర్సనల్ డిజిటల్ సెక్రటరీ అనిపించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. బ్రౌజర్లు కొత్త శకంలో అడుగుపెట్టాయి. ఇప్పటిదాకా మనం ట్యాబ్‌లు, బుక్మార్క్లు వాడినవాళ్లం. ఇప్పుడు వాటి స్థానంలో ఏజెంట్లు, వర్క్‌ఫ్లోలు, ఏఐ ఇంటర్‌ఫేస్‌లు వచ్చేశాయి. బ్రౌజర్లో మీరు ఏ పని స్టార్ట్ చేసినా.. మాన్యువల్‌గా క్లిక్ చేస్తూ కమాండ్లు ఇవ్వాల్సిన పని లేదు. ఏ పనిని ప్లాన్ చేస్తే అది భుజాన వేసుకోవడానికి బ్రౌజర్లో ఏఐ సేవకులు సిద్ధంగా ఉంటారు. ఆర్టికల్ చదవడం కావొచ్చు, ప్రాజెక్టు రిసెర్చ్ అయ్యుండొచ్చు, మెయిల్స్‌కు రిైప్లె ఇవ్వడం కావొచ్చు.. అన్నీ ఇప్పుడు బ్రౌజర్ వన్-స్టాప్ కో-పైలట్‌గా పనిచేస్తున్నది.
కో-పైలట్ బ్రౌజర్ అంటే..
ఇకపై మనం బ్రౌజర్‌ని ఒక ఓఎస్లా చూడొచ్చు. అంటే.. కొన్ని ప్రత్యేక పనులను బాధ్యతగా నిర్వహించేందుకు బ్రౌజర్ ఓఎస్‌లో కొన్ని కో-పైలట్ టూల్‌లు రెడీగా ఉంటాయి. వాటికి అప్పగించిన పనిని మన ప్రమేయం లేకుండానే నిర్విరామంగా చేస్తూనే ఉంటాయి. కావాలంటే.. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఏఐ బ్రౌజర్లను చూస్తే తెలుస్తుంది. Arc, SigmaOS, Opera’s Aria, Microsoft Edge with Copilot ఇవన్నీ ఏఐ హంగులతో నెటిజన్లకు పరిచయం అయ్యాయి. ఇవి సాధారణ వెబ్ బ్రౌజర్లు కావు. అంతకుమించి పనిచేస్తాయి. మీరు చేస్తున్న పనిని అర్థం చేసుకుని, దానికి కావాల్సిన ఇన్పుట్లను మీరు చెప్పకుండానే సేకరిస్తాయి.
కేవలం వెబ్‌పేజీలు చూపించడానికి కాదు.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకుని మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఉదాహరణకు మీరు రాత్రికి డిన్నర్ ప్లాన్ చేస్తున్నారని అనుకుందాం. మీరు Arc బ్రౌజర్లో ఓ రెసిపీ వెతుకుతుంటే.. అది కేవలం లింక్‌లు చూపించదు. మీరు ఇంట్లో ఉన్న పదార్థాలను బేస్ చేసుకుని ఏ రెసిపీలు చేయవచ్చో చెప్పేస్తుంది. ఇక ‘ఏజెంటిక్ వెబ్’గా ముందుకొచ్చింది Opera Neon. దీని ప్రత్యేకత ఏంటంటే.. బ్రౌజింగ్‌లో మీ తరఫున ఓ ఏజెంట్లా పనిచేస్తుంది. మీ వెబ్ విహారంలో మీతోపాటు పనిచేస్తూ.. టాస్క్‌లను సులభంగా ముగించేందుకు ఉపకరిస్తుంది. బ్రౌజింగ్ ప్యాటర్న్‌ని అర్థం చేసుకుని మీ వ్యూహాల్లో, నిర్ణయాల్లో ‘ఏఐ ఏజెంట్’ పాత్ర కీలకంగా మారుతుంది.
గూగుల్‌కి పోటీ మొదలైందా?
ఏఐ బ్రౌజర్ల హవాకి ఇది ప్రారంభం మాత్రమే! కేవలం వెబ్‌పేజీలను చూపించడం వీటి పనికాదు. ఇది వెబ్ విహారంలో మన పనితీరు మార్చేస్తున్నది. మనకు సహాయపడే కో-పైలట్లు ఇప్పుడు మన ఇంటర్నెట్ యూజ్ వ్యవస్థకు కొత్త నిర్వచనాన్ని ఇవ్వనున్నాయి. ఈ పోటీతో క్రోమ్ కూడా మారాల్సిందే. లేకపోతే, మిగిలినవాళ్లు అప్‌గ్రేడ్ అవుతుంటే… ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లా అవుట్డేట్గా మిగిలిపోవచ్చు. ఇంతకాలం బ్రౌజర్ మార్కెట్లో గూగుల్ క్రోమ్ ఒక బెంచ్‌మార్క్. కానీ ఇప్పుడు… కొత్త ఏఐ బ్రౌజర్లు మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నాయి. అనేక స్టార్టప్‌లు ఏజెంట్ ఫస్ట్ బ్రౌజింగ్‌తో వచ్చేస్తున్నాయి. క్రోమ్ తన హవా నిలబెట్టుకోవాలంటే.. ఆర్కిటెక్చర్‌ని తిరిగి రాయాల్సిందే. ఇది టెక్నాలజీ నిపుణుల విశ్లేషణ. అందుకే ఇకపై బ్రౌజర్ అంటే సెర్చ్ బాక్స్ కాదు. అది మీ డిజిటల్ పనులకు అసిస్టెంట్. ఏ బ్రౌజర్ వాడతారు అనే ఎంపిక చాలా ముఖ్యమైంది. ఎందుకంటే అది మీ డిజిటల్ ఫ్లోని నడిపిస్తుంది.
ముచ్చటగా మూడు..
-అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్