Aishwarya Lekshmi | గ్లామర్‌తోనే కాదు అభినయంతోనూ సినీరంగంలో రాణించవచ్చని నిరూపిస్తున్న నటి ఐశ్వర్య లక్ష్మి. తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఐశ్వర్య తెలుగులోనూ గాడ్సే, అమ్ము, మట్టికుస్తీ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘పొన్నియన్ సెల్వన్’ వెబ్ సిరీస్‌లో సముద్ర కన్యగా మెరిసిన ఐశ్వర్య ఇటీవల ‘హలో మమ్మీ’ సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలుకరించింది. వచ్చిన అవకాశాల్ని భాషతో సంబంధం లేకుండా అందిపుచ్చుకుంటున్న ఐశ్వర్య ఈ మధ్య తన గురించి పంచుకున్న కబుర్లు..
మాది తిరువనంతపురం. పుట్టగానే మా నాన్న నాకు శ్రీలక్ష్మి అనీ, అమ్మ ఐశ్వర్య అనీ పేరు పెట్టారు. చివరికి నా పేరు ఐశ్వర్య లక్ష్మిగా మారింది. డాక్టర్ అవ్వాలనుకున్నాను. ఎంబీబీఎస్ చదవడానికి కొచ్చి వెళ్లాను. కానీ అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్ రావడానికి రెండు రోజుల ముందు, హీరోయిన్ కోసం ఓ పేపర్లో ప్రకటన చూశాను. నా ఫోటోను ఆ చిరునామాకు పంపాను. అలా మొదటి అవకాశం వచ్చింది.
నా మొదటి క్రష్ క్రికెటర్ యువరాజ్ సింగ్. టీనేజ్‌లో యువరాజ్ అంటే చాలా ఇష్టపడేదాన్ని. ఆ తర్వాత క్రికెట్ చూసే సమయం లేదు. ఇక సినిమాల్లో అభిషేక్ బచ్చన్, విజయ్ దళపతి అంటే ఇష్టం. నాపై ఇంత అభిమానాన్ని, ప్రేమను అందిస్తున్న అభిమానులందరికీ రుణపడి ఉంటా. అందరి సపోర్ట్‌తో మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను.
నేను సినిమాల్లోకి రావడం అమ్మకు ఇష్టం లేదు. మొదట్లో వ్యతిరేకించేది. ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తున్నది. ప్రస్తుతం నాకు నటనే మొదటి ప్రాధాన్యం. భిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నా. అందుకే పాత్ర నిడివి కంటే, కథ ఎంత బలమైనది అనేది చూస్తాను. హీరోయిన్‌గానే చేయాలనేది నా ప్రాధాన్యం కాదు. మంచి కథలో చిన్న పాత్ర పోషించినా చాలనుకుంటా.
జీవితంలో ఎప్పటికీ పెండ్లి చేసుకోను. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూసేదాన్ని. అప్పుడు నాకు కూడా పెండ్లి చేసుకోవాలి అనిపించేది. గతంలో నా ప్రొఫైల్ ఓ మ్యాట్రిమోనీలో కూడా పెట్టాను. కానీ ఇప్పుడు నాకు తెలిసిన చాలామందిలో ఒకటి రెండు జంటలు తప్పితే అందరూ రాజీపడి బతుకుతున్నారు. పెండ్లి వల్ల చాలామంది వ్యక్తిగతంగా ఎదగలేకపోతున్నారు. వివాహంపై నా అభిప్రాయం మారింది. అందుకే నేను ఎప్పటికీ చేసుకోకూడదని నిర్ణయించుకున్నా.
నేను అభిమానించిన నటులతోనే కలిసి పనిచేయడం నా అదృష్టం. ‘క్రిస్టోఫర్’ సమయంలో మమ్ముట్టిగారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ‘కింగ్ ఆఫ్ కోతా’ షూటింగ్లో కంటే ప్రమోషన్స్‌లోనే దుల్కర్‌తో స్నేహం బలపడింది. హీరో విక్రమ్ సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు.
తెలుగు చిత్రాల్లో నటించేందుకు నేనెప్పుడూ ఆసక్తిగా ఉంటాను. ‘ఊ అంటావా మావా’ పాటలో సమంత పాత్ర లాంటి బోల్డ్ లుక్ లేదా మహానటిలో కీర్తి సురేష్ లాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఛాలెంజింగ్ పాత్రలు చేయడాన్ని ఇష్టపడతా. దసరాలో కీర్తిసురేశ్ యాక్టింగ్ చాలా అసాధారణంగా ఉంటుంది.
నా ఫేవరేట్ నటీమణుల్లో సమంత కూడా ఒకరు. కోపం, భావోద్వేగ పూరిత సన్నివేశాల్లో సమంత తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తుంది. శ్రీలీలకు అద్భుతమైన డ్యాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. సాయిపల్లవి డ్యాన్సర్‌గా, నటిగా అసాధారణ రీతిలో తనను తాను నిరూపించుకుంది. ఫిదాలో సాయిపల్లవి పాత్రకు ఫిదా అయిపోయా.