సహజ సిద్ధమైన అందంతో అలరారడం గొప్ప వరం. వెండితెరపై మెరిసిపోవాలంటే మాత్రం, ఆ సౌందర్యానికి అదనపు తళుకులు అద్దాల్సిందే. సినీరంగంలో ఆ బాధ్యత తీసుకుంటారు మేకప్ ఆర్టిస్టులు. తారల అందాన్ని ద్విగుణీకృతం చేసే రూపశిల్పులుగా వారిది కీలక భూమిక. కేవలం అందానికి మెరుగులు దిద్దడమే కాకుండా, పాత్రలకు అనుగుణంగా తారలను తీర్చిదిద్దడం మేకప్ ఆర్టిస్ట్‌ల ముఖ్యవిధి. ఈ రంగంలో విశేషానుభవాన్ని సంపాదించుకున్నారు సీనియర్ మేకప్ ఆర్టిస్టు రాఘవ. అగ్ర కథానాయకుడు వెంకటేష్ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా గత 35 ఏండ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘బతుకమ్మ’ పలుకరించినప్పుడు మేకప్ సంగతుల్ని పంచుకున్నారిలా..
వెంకటేష్ తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ (1986) నుంచి ఆయనతో ప్రయాణం సాగిస్తున్నా. అంతకుముందు చాలా కాలం నుంచే నేను పరిశ్రమలో ఉన్నాను. దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాలకు పనిచేస్తుండేవాడిని. ‘కలియుగ పాండవులు’ సినిమాకు చీఫ్ మేకప్ అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత వెంకటేష్ నన్ను పిలిచి, ‘మీరు బయట సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా కొనసాగండి’ అని అడిగారు. అలా వెంకటేష్‌తో నా వృత్తి పరమైన అనుబంధం మొదలైంది. తొలుత హీరో రామకృష్ణ సహాయకుడిగా నేను సినీరంగంలోకి అడుగుపెట్టాను. అనంతరం నాటి ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ పీతాంబరం వద్ద అసిస్టెంట్‌గా కొన్నాళ్లు పనిచేశాను. అప్పుడాయన ఎన్టీఆర్‌గారికి వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా ఉండేవారు. ఎన్టీఆర్ ‘నిప్పులాంటి మనిషి’ మొదలుకొని అనేక సినిమాలకు మేకప్ అసిస్టెంట్‌గా పనిచేశాను. ‘సింహబలుడు’ చిత్రానికి ఎన్టీఆర్‌కు తొలిసారిగా మేకప్ వేసే అదృష్టం దక్కింది.
సుదీర్ఘ కెరీర్లో ‘గణేష్’, ‘సుభాష్ చంద్రబోస్’ చిత్రాలకు నంది అవార్డులను స్వీకరించాను. ‘గణేష్’ చిత్రంలో విలన్ పాత్రలో కోట శ్రీనివాసరావుకు చేసిన మేకప్‌కు నంది అవార్డు వరించింది. ‘సుభాష్ చంద్రబోస్’ సినిమాలో చిన్న పిల్లలను భారతమాతతో పాటు వివిధ గెటప్‌లలో తీర్చిదిద్దినందుకు అవార్డు తీసుకున్నా. వెంకటేష్ నటించిన ‘చంటి’ సినిమా మేకప్‌ను నేను ప్రత్యేకంగా భావిస్తా. ఆ సినిమాకు ముందు వెంకటేష్‌కు క్లాస్ హీరో అనే ఇమేజ్ ఉండేది. ‘చంటి’లో ఆయన్ని గ్రామీణ యువకుడి పాత్రలో అమాయకుడిగా చూపించాల్సి వచ్చింది. గెటప్‌ల విషయంలో వెంకటేష్, నేను చాలా కసరత్తులు చేశాం. చివరగా మా ఇద్దరికి నచ్చిన గెటప్‌తో ఫొటోషూట్ చేసి చిత్ర దర్శకుడు రవిరాజా పినిశెట్టి, నిర్మాత కె.ఎస్.రామారావులకు పంపించాం. ఫొటోలు చూసిన వెంటనే కె.ఎస్.రామారావు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. రవిరాజాగారు ఫోన్ చేసి ‘తమ్ముడూ! గెటప్ అదిరిపోయింది. ఫొటోలు చూశాక ఈ సినిమా వందరోజులు ఆడుతుందనే నమ్మకం వచ్చింది’ అన్నారు. దర్శకనిర్మాతల నుంచి వచ్చే అలాంటి ప్రశంసలే వృత్తిపరంగా స్ఫూర్తినిస్తాయి.
ప్రస్తుతం మేకప్ విషయంలో ట్రెండ్ మారుతున్నది. ఒకప్పుడు కేశాలంకరణ మొదలుకొని గెటప్ వరకు అన్నీ మేకప్ ఆర్టిస్ట్ చూసుకునేవారు. ఇప్పుడు హెయిర్ డిజైన్ కోసం ప్రత్యేకంగా హెయిర్ైస్టెలిష్ట్లు వచ్చారు. ఒక పాత్రకు సంబంధించిన గెటప్ బాగా కుదిరిందంటే మేకప్ ఆర్టిస్టుతో పాటు కాస్ట్యూమ్స్, హెయిర్ైస్టెలిస్ట్ ఘనత కూడా ఉంటుంది. ప్రస్తుతం మన తారలు కొంతమంది ముంబయి నుంచి మేకప్ ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నారు. మనలో లేని గొప్పతనం ముంబయివారిలో ఏముందో ఇప్పటికీ అర్థం కాదు. పౌరాణిక, చారిత్రక సినిమాల్ని గమనించినట్లయితే దక్షిణాది సినిమాల మేకప్, కాస్ట్యూమ్స్ ఉత్తరాది కంటే చాలా ఉన్నతమైన ప్రమాణాలతో కనిపిస్తాయి. అయితే, ఈ విషయంలో ఎవరినీ నిందించలేం. బ్లాక్ అండ్ వైట్ కాలంలో తారల్ని అందంగా చూపించే బాధ్యత మొత్తం కెమెరామెన్, మేకప్మెన్లపైనే ఉండేది. కానీ కాలక్రమేణ మేకప్ విభాగంలో అనేక మార్పులొచ్చాయి. ఇప్పుడు సాంకేతికత తోడుకావడంతో తెర వెనక అద్భుతాలు సృష్టిస్తున్నారు. మేకప్పరంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనిస్తూ అప్డేట్ అవుతుంటాను.
వెంకటేష్ వద్ద ‘కలియుగ పాండవులు’తో మొదలైన నా ప్రయాణం నేటి వరకు నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. 35 ఏండ్లుగా ఆయన నన్ను ఇంట్లో మనిషిలా ఎంతో అప్యాయంగా చూసుకుంటున్నారు. వెంకటేష్ నాపై చూపించే ప్రేమకు ఎప్పటికీ వెలకట్టలేను. నా కుటుంబం ఉన్నతికి వెంకటేష్ తొలినుంచి ఎంతో ప్రోత్సాహాన్నందించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నాకు ఆయన వల్ల దేశవిదేశాల్ని చుట్టొచ్చే అదృష్టం దక్కింది.
వెండితెరపై వెలుగులీనుతున్న గొప్ప తారలకు మేకప్ వేసే అదృష్టం రావడం నా అదృష్టం. ముఖ్యంగా మహానటి సావిత్రి, దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్యకు మేకప్ వేయడం నా జీవితంలో చిరస్మరణీయ ఘట్టాలుగా మిగిలిపోయాయి. ఓసారి సావిత్రికి మేకప్ వేస్తూ ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా. ‘అదేంటయ్యా ఏడుస్తున్నావ్’ అని ఆమె అడిగారు.‘నేను పుట్టకముందే మీరు సూపర్‌స్టార్. అలాంటిది మీకు మేకప్ వేయడం ఏ జన్మపుణ్యమో అనిపిస్తున్నది. అందుకే ఉద్వేగం ఆపుకోలేకపోయా’ అని చెప్పాను. కెరీర్ ఆరంభంలో.. అప్పటి ప్రముఖ నటీనటులు చాలా మందికి మేకప్ వేయడం నాకు దక్కిన వరంగా భావిస్తా.
వెంకటేష్ నటించిన ‘నాగవల్లి’ సినిమాలో అఘోర గెటప్ కోసం రెండు గంటల సమయం పట్టేది. ఆ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. తెలుగు పౌరాణిక, జానపద సినిమాల మేకప్‌పై నాకు పట్టు ఉండటంతో, అఘోర గెటప్‌ను ఎలాంటి రిఫరెన్స్‌లు తీసుకోకుండా సులభంగా వేయగలిగాను. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’లో కూడా వెంకటేష్ పాత్రపరంగా వైవిధ్యమైన గెటప్‌లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ఆ సినిమా ఫస్ట్‌లుక్ చాలా బాగుందని ప్రశంసలొస్తున్నాయి. వెంకటేష్‌తో చేసిన.. ‘చంటి’, ‘స్వర్ణకమలం’, ‘శత్రువు’, ‘నాగవలి’్ల, ‘జయం మనదేరా’ సినిమాలు మేకప్ పరంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి.
ప్రస్తుతం కంప్యూటర్ గ్రాఫిక్స్, డీఐ వంటి టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో మేకప్ పరమైన లోపాల్ని తెరవెనక సరిచేస్తున్నారు. వయసుపైబడ్డ ఛాయల్ని మేకప్ ద్వారా కొంతవరకు మాత్రమే కవర్ చేయగలుగుతాం. టెక్నాలజీ ఉపయోగిస్తే మరికొంత బెటర్మెంట్ కనిపిస్తుంది. కానీ, పూర్తిగా వయసును దాచి పెట్టలేం. తారలు ఆరోగ్యంపై తీసుకునే శ్రద్ధ, ఫిట్నెస్ అంశాలు కూడా మేకప్ ఆర్టిస్ట్ పనితనాన్ని ప్రభావితం చేస్తాయి.
ఇప్పుడు దేశవిదేశాల్లో ఉన్న ఫిల్మ్ స్కూల్స్‌లో మేకప్‌కు సంబంధించిన కోర్స్‌లను అందిస్తున్నారు. చాలా మంది ముంబయి, లండన్‌లకు వెళ్లి మేకప్ కోర్స్ నేర్చుకొని ఇక్కడికొచ్చి ప్రాక్టీస్ మొదలుపెడుతున్నారు. లక్షలు పెట్టి నేర్చుకొనే ఆ కోర్సుల వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో నేను చెప్పలేను. ఈ రంగంలోకి రావాలనుకునే యువత ప్రాక్టికల్‌గా ప్రావీణ్యం సాధించాలి. బ్యూటీషియన్‌గా పనిచేసే మహిళలు మేకప్ ఆర్ట్‌ను త్వరగా ఆకళింపు చేసుకుంటారు. యువకులైతే పేరున్న సెలూన్స్‌లో పనిచేస్తే హెయిర్ైస్టెలింగ్, మేకప్ విషయంలో ప్రాథమికమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాంటి వారు చిత్రసీమలో వేగంగా రాణిస్తారు. 1974లో చిత్రసీమలోకి ప్రవేశించిన నేను ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నానంటే వృత్తిపట్ల ఉన్న అంకితభావం, ప్రేమే కారణమని భావిస్తున్నా.
-కళాధర్ రావు