గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jul 12, 2020 , 03:15:18

ఆడబిడ్డ పుడితే ఊరంతా సంబురం!

ఆడబిడ్డ పుడితే ఊరంతా సంబురం!

‘మళ్లీ ఆడపిల్లే  పుట్టిందా?’ అనే మాట ఎన్నిసార్లు వినుంటాం?  అవమానాలు.. ఈసడింపులు చాలా ఉంటాయి. కానీ.. ఒక ఊళ్లో మాత్రం ఆడబిడ్డ పుడితే పండుగ చేసుకుంటారు. అది కూడా ఊరు ఊరంతా సంబురమవుతుంది. అందుకే.. ఆ ఊళ్లో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. గౌరవంగానూ ఉంటారు. 

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలోని హరిదాస్‌పూర్‌. చూడ్డానికి చిన్న గ్రామం. కానీ, ఈ ఊరిని చూసి ప్రపంచమే పాఠం నేర్చుకునేంత గొప్పదనం ఉంది. ఆడపిల్ల పుడితే పురిట్లోనే చిదిమేసే మనుషులున్న ఈ రోజుల్లో.. ‘మాకు ఆడపిల్ల పుట్టేట్టు చూడు దేవుడా’ అని వేడుకుంటారు హరిదాస్‌పూర్‌ గ్రామస్తులు. 

ఊరంతా వేడుకలు : మహిళలపై జరుగుతున్న దాడులు.. స్త్రీలు అనుభవిస్తున్న అవమానాలను చూసి బాధపడ్డారు ఆ గ్రామస్తులు. అంతా కూర్చొని మాట్లాడుకున్నారు. ప్రపంచానికి ఓ మంచి సందేశమివ్వాలనుకున్నారు. ఆడబిడ్డను కాపాడుకోవడమే లక్ష్యంగా చాటింపు వేసి ‘ఊళ్లో ఎవరికి ఆడబిడ్డ పుట్టినా ఊరంతా సంబురం చేసుకోవాలె. పుట్టబోయేది ఆడబిడ్డయితే బాగుండు అని అందరూ వేడుకోవాలె’ అని ప్రకటించారు. 

ఆడబిడ్డ బతుకాలని: హరిదాస్‌పూర్‌లో 90% అబ్బాయిలే ఉండేవారు. చూద్దామన్నా ఆడబిడ్డలు కనిపించకపోయేది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే, రాబోయే రోజుల్లో మరింత అధ్వానంగా తయారవుతుందనే ఆందోళన మొదలైంది. దీంతో ఆడబిడ్డల సంరక్షణకు కంకణం కట్టుకున్నారు. ఎవరికి అమ్మాయి పుట్టినా, ఆ బిడ్డ పెంపకానికి పంచాయతీ నుంచే కొంత డబ్బు ఇవ్వాలనే తీర్మానం చేశారు. ఈ సరికొత్త ఆలోచనను జనవరి 1, 2020 నుంచి అమలు చేస్తున్నారు. 

మొదటి ముగ్గురు: తీర్మానం చేసిన తర్వాత సత్యవతి-నగేశ్‌ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. వెన్నెల-దినకర్‌ దంపతులకూ ఆడబిడ్డే జన్మించింది. బానోత్‌ సంగీతకూ అమ్మాయి పుట్టాలనే కల నెరవేరింది. దీంతో ఊరంతా కలిసి పంచాయతీ ఆఫీస్‌కు రంగులు వేశారు. లైట్లతో అలంకరించారు. ఆడబిడ్డల తల్లిదండ్రులను సన్మానించి.. కుటుంబ సభ్యులకు దావత్‌ ఇచ్చారు. ఊరంతా అంతా కలసి సంబురాలు చేసుకున్నారు. logo