భూమి పుట్టుకతో పోల్చుకుంటే మనిషి చరిత్ర చాలా అల్పం. అందులోనూ తను నాగరికుడిగా మారిన కథ కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితందే! కానీ ఈ కొద్ది సమయంలో తన జీవితంలో వచ్చిన మార్పు మాత్రం అసాధారణం. గింజల్ని తింటూ బతికిన మనిషి తనే సేద్యం నేర్చుకున్నాడు. వేట నుంచి పశువుల పెంపకానికి మారాడు. బతుకులో సులువు పెరిగిన కొద్దీ సంపద ఎదిగింది. అవసరం కోసమో, ఆకలి తీరేందుకో… వస్తువుల్ని ఇచ్చిపుచ్చుకోవడం మొదలైంది. ఆనక బంగారం, నాణేలు లాంటి మారకంతో కావల్సిన వస్తువులు ‘కొనుక్కునే’ వరకూ వినిమయానిది ఓ అద్భుత అధ్యాయం.
కానీ, 21వ శతాబ్దం వరకూ మార్కెటింగ్ మనిషి చేతుల్లోనే ఉండేది. నచ్చింది కొనుక్కోవడం. ఒక్కోసారి నచ్చినా కూడా రకరకాల కారణాలతో వస్తువుకి దూరంగా ఉండటం సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడలా కాదు! మనిషే మార్కెట్ చేతిలో ఉన్నాడు. ఇది నువ్వు కొనుక్కుని తీరాలి అని మార్కెటే మనిషికి చెబుతున్నది. లేకపోతే నీ బతుకు వృథా అని హెచ్చరిస్తున్నది. డబ్బు లేదనే సాకు చెప్పడానికి లేదు అప్పులిస్తున్నారు. అంత ఖర్చు భరించలేనంటే వాయిదాల్లో చెల్లించమంటున్నారు.
తర్వాత కొంటాలే అంటే క్రెడిట్ కార్డు చూపిస్తున్నారు. మొత్తానికి కంటిచూపు పడిన ప్రతిదీ కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఈ ఆటను సులభం చేసేందుకు సంస్థలు ఎన్నో పథకాలు వేస్తున్నాయి. ఇది ఉచ్చు అని కూడా తెలియకుండానే అందులో చిక్కుకుంటాం. ఒక కంపెనీ లోగో దగ్గర నుంచీ, ప్యాకెట్ మీద ఉండే రంగుల వరకూ మనకు తెలియకుండానే మనసును గెలుచుకునేందుకు మార్కెటింగ్ నిపుణులకు వందల కోట్లు చెల్లిస్తున్నాయి. మార్కెటింగు బుర్రతో.. మనల్ని టింగుబుర్ర చేస్తున్నాయి. వాటి ఆటను తెలుసుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండవచ్చు. అందుకే ఈ కథనం.
అది 1970 సంవత్సరం. ఫుట్ బాల్ ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి. ఫైనల్స్‌కు బ్రెజిల్, ఇటలీ చేరుకున్నాయి. కాసేపట్లో ఆట మొదలవుతుంది అనగా… లెజెండరీ క్రీడాకారుడు పీలే ఒక్క క్షణం ఆగమని రిఫరీని అభ్యర్థించాడు. షూస్ ముడి వేసుకోవాలని సాకు చెప్పాడు. అందరి చూపూ అతని షూస్ మీద పడ్డాయి. అదే తనకు కావాల్సింది. అలా చేయమనే తనకు సదరు కంపెనీ నుంచి సూచన వచ్చింది. ఆ షూస్ ఏమిటా అని చూసిన వారికి ప్యూమా బ్రాండ్ కనిపించింది. ఒక్కసారిగా ఆ సంస్థ వెలిగిపోయింది. మరో సందర్భంలో నైకి సంస్థ కూడా మైకెల్ జోర్డాన్‌తో కలిసి ఇలాంటి పథకమే అమలు చేసింది. ఇలాంటి ప్రయత్నాలతో షూస్‌ని కేవలం సౌకర్యానికే కాకుండా… ఒక స్టేటస్ సింబల్ లాగా మార్చే ప్రయత్నం కొలిక్కి వచ్చేసింది. ఎక్కడి దాకో ఎందుకు… ఇక మన జీవితాల చుట్టూ తిరిగే కొన్ని వ్యూహాలను చెప్పుకొందాం.
ఇప్పుడిప్పుడే దసరా సీజన్ దాటింది. కానీ దీపావళి, ఆ తర్వాత క్రిస్మస్, ఆపై న్యూ ఇయర్. ఈ సందర్భాల్లో వచ్చే ప్రకటనలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ సమయంలో మీకు అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్నాం. వీటిని వదులుకుంటే చాలా నష్టపోతారు అనే ప్రకటనలు విచ్చలవిడిగా కనిపిస్తాయి. అంతేకాదు. మిలియన్ డేస్, బిలియన్ డేస్, లైట్నింగ్ డీల్స్.. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు కొనాలన్న ఆలోచనకు అగ్గి ముట్టించేవే. పరిమిత స్టాక్, గత నెలలో వెయ్యి మంది కొనేశారు, లిమిటెడ్ ఎడిషన్… లాంటి పదాలు, పథకాలు అన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయి. మనిషిలో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (ఎఫ్వోఎమ్వో) అనే గుణం ఉంటుంది. తాను ఏదన్నా విలువైంది కోల్పోతానేమో అన్నదే ఈ భయం. ఆ ఎఫ్వోఎమ్వోను రేకెత్తించేవే ఈ మాటలు.
ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుకీ పది పాయింట్లు మీ అకౌంట్లో పడతాయి. వాటిని తర్వాత వాడుకోవచ్చు. ప్రతి షాపులోనూ, ప్రతి సైట్లోనూ ఇలాంటి ఆకర్షణలు కనిపిస్తాయి. అంతేనా! స్క్రాచ్ కార్డులు, బోనస్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, లాయల్టీ ప్రోగ్రాం, మెంబర్షిప్, స్పిన్ టు విన్, లక్కీ డిప్… అన్నీ కూడా ఈ గేమిఫికేషన్ కిందకి వస్తాయి. స్టార్‌బక్స్ లాంటి సంస్థలకు కోట్ల రూపాయలు ఆర్జించిందీ వ్యూహం. ఇలాంటి వాటిలో పాల్గొన్నప్పుడు, ఏదో సాధించిన ఉద్వేగం వస్తుంది. ఏదో పోగేసుకున్న ఘనతగా తోస్తుంది. దీంతో మనలోని డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. పదేపదే అలాంటి అనుభవాన్ని కోరుకుంటుంది. వ్యసనం అంటే బాగోదు అనుకుంటే కనీసం వదులుకోలేని అలవాటుగా మార్చేస్తుంది.
టీవీ నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకూ.. పాటల నుంచి ఫొటోల వరకూ ఇప్పుడు ఏ సేవలు పొందాలన్నా ఎంతో కొంత రుసుం చెల్లించాల్సిందే! కానీ నెలకు ఇంత అని ముందే చెప్పరు. చెబితే అప్పుడు బుర్రకి పని పెడతాం. అందుకే మన ఆశకి ఎర వేస్తారు. మొదటి నెల పది రూపాయలు కట్టండి చాలు. రెండో నెల నుంచి అయిదు వందలు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుంచి తీసేసుకుంటాం. నచ్చకపోతే సబ్స్క్రిప్షన్ క్యాన్సల్ చేసుకోండి… పోయేదేముంది! అని ఊరిస్తాయి. ధర తక్కువే కదా, నచ్చకపోతే తర్వాత చూసుకోవచ్చు అనుకుని బరిలోకి దిగిపోతాం. కానీ, చాలా సందర్భాల్లో క్యాన్సలేషన్ మర్చిపోతాం. ఒకోసారి క్యాన్సల్ చేసుకుందాం అనుకున్నా.. ఆ ప్రక్రియ అంత తేలికగా జరగదు. సాంకేతిక అడ్డంకులు లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించమనే సలహాలు ఎన్నో దాటాల్సి ఉంటుంది. ఈమధ్య న్యాయస్థానాలు ఈ తరహా వ్యూహాల పట్ల కఠినంగా ఉన్నప్పటికీ, ఈ తీరులో మార్పు రాలేదు. వినియోగదారులు తమ సబ్స్క్రిప్షన్ క్యాన్సల్ చేసుకునే సౌలభ్యం ఇవ్వనందుకు… గతనెల అమెజాన్ సంస్థకు ఏకంగా 250 కోట్ల డాలర్ల పెనాల్టీ వడ్డించింది న్యాయస్థానం.
చిన్న పాప్ కార్న్ డబ్బా వంద రూపాయలు.. కానీ దానికి రెట్టింపు ఉన్న పాప్‌కార్న్ బకెట్ కేవలం 120 రూపాయలే. ఈ ధరల పట్టిక చూడగానే, అసలు పాప్ కార్న్ తినాలా వద్దా అనే నిర్ణయం కంటే పెద్ద పాప్ కార్న్ బకెట్ తీసుకుంటే మనం ఏదో లాభపడిపోతాం అనిపిస్తుంది కదా! అదే డికాయ్ ఎఫెక్ట్. ఇది మన మెదడు మీద ఎలా పనిచేస్తుందనే దాని మీద కొన్ని ప్రయోగాలు కూడా జరిగాయి. దీనికి అట్రాక్షన్ ఎఫెక్ట్, అసెమిట్రిక్ డామినెన్స్ ఎఫెక్ట్ లాంటి పేర్లు పెట్టారు. ఒకే తరహా ఉత్పత్తులు వేర్వేరు మోతాదులలో ఉన్నప్పుడు, వాటి ధర కూడా ఇంచుమించుగా అదే స్థాయిలో ఉండాలని మెదడు అంచనా వేస్తుంది. దాన్ని దెబ్బతీసి, మనసును లొంగదీస్తుంది అసెమిట్రిక్ డామినెన్స్. ఒకసారి గమనిస్తే కూల్ డ్రింక్స్ లాంటి ఉత్పత్తులలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఓ వందేళ్ల క్రితం అమెరికాలో బ్రేక్‌ఫాస్ట్ కింద పాలు, గుడ్లు, జావ, మాంసం తినేవాళ్లు. ఇప్పుడు దాదాపుగా అందరూ కార్న్ ఫ్లేక్స్, ఓట్స్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఓ దేశపు అలవాటునే మార్చేసిన ఘనత మార్కెటింగ్ది. జాన్ హార్వే కెలాగ్ అనే ఓ వైద్యుడు అనుకోకుండా కనుగొన్న ఉత్పత్తే ఈ కార్న్‌ఫ్లేక్స్. అప్పటికప్పుడు ఆకలి తీర్చేసే వీటిని మీ అల్పాహారం కిందకి మార్చేసుకోమంటూ కెలాగ్ కంపెనీ స్థాపించారు. వేర్వేరు రుచులలో బాక్సుల్లో అమ్మకాలతో కొత్త ఒరవడి సృష్టించారు. ఓట్స్ది కూడా ఇలాంటి కథే. ఒకప్పుడు పశువులకు దాణాగా వేసే ఈ ఆహారాన్ని క్వాకర్ అనే కంపెనీ అల్పాహారం కింద మార్చేసింది. గమనించాలె కానీ, మన జీవితంలో చాలా అలవాట్ల వెనుక కంపెనీలే కనిపిస్తాయి. ఇందుకు మరో గొప్ప ఉదాహరణ ఎంగేజ్మెంట్ రింగ్. 1930ల వరకూ నిశ్చితార్థానికి ఉంగరం పెట్టుకునే అలవాట్లు పాశ్చాత్యదేశాల్లో ఉండేది కాదట. కానీ, డిబీర్స్ అనే వజ్రాల కంపెనీ… ఈ అలవాటును పెంచి పోషించిందని విశ్లేషణలు చెబుతున్నాయి. కొత్త అలవాట్లనే కాదు, ఉన్న అలవాట్లను మార్చడం కూడా మార్కెటింగ్ మాయే! ఉప్పుతో పళ్లు తోముకుంటారా అని ఎగతాళి చేసి, పేస్టును అలవాటు చేసి… ఆపై మీ పేస్టులో ఉప్పుందా అని అడిగేంత ధైర్యం దాని సొంతం! ఫ్రెండ్షిప్ డేకి గ్రీటింగ్ కార్డులు, ధనత్రయోదశికి తప్పకుండా బంగారం కొనాలనే బలవంతాలు… అన్నీ ప్రకటనల సారమే.
కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితాలు ఇవ్వడం కొత్తేమీ కాదు. తెలిసితెలిసీ ఆ ఆకర్షణకు లోబడతాం కూడా. అదే వ్యూహానికి కాస్త పదును పెట్టిన కంపెనీలు సేవారంగంలోనూ దూసుకెళ్తున్నాయి. అదే ఫ్రీ ట్రయల్. స్పాటిఫైనే ఉదాహరణగా తీసుకుందాం. దాన్ని ఉచితంగా వినవచ్చు. కానీ కోరుకున్న పాటలు దక్కవు. లేదా వరుసగా ఒకే సినిమా పాటలు రావు. అదీ కాదంటే మధ్యలో ప్రకటనల్ని కూడా వినాల్సి వస్తుంది. మీకు నచ్చిన పాట, నచ్చిన వరుసలో అవిరామంగా వినాలి అంటే కేవలం కొద్ది రూపాయలు చెల్లిస్తే చాలు అనే మాట వినిపిస్తే ఎగిరి గంతేస్తాం. ఆన్లైన్ సేవలలో ఇప్పుడిది సర్వసాధారణం. వీడియో ఎడిటింగ్, యానిమేషన్, అనువాదం, ఈమెయిల్… ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా పరిమిత సమయంలో, పరిమిత సేవల్ని ఉచితంగా ఇవ్వడం పూర్తిస్థాయి సేవ కావాలంటే భారీ రుసుములు చెల్లించాల్సి రావడం ఇప్పుడో ఆనవాయితీ. ఉచితంగా వాడాలంటే మీ క్రెడిట్ కార్డ్ వివరాలు లాక్కునే సంస్థలకీ లెక్క లేదు.
ఏదో ఊసుపోక క్రికెట్‌కి సంబంధించిన రీల్ చూశామే అనుకుందాం. వేలు పైకి జరిపామో లేదో… మళ్లీ ఆ ఆటకి సంబంధించిన రీలే కనిపిస్తుంది. ఓటీటీలో కూడా అంతే! హారర్ సినిమాలు చూస్తుంటే మనకు మెనూలో అవే దర్శనమిస్తాయి. ఫ్రిజ్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగానే… ఆ రోజు నుంచి ఏ వెబ్సైట్లోకి వెళ్లినా ఫ్రిజ్కి సంబంధించిన ప్రకటనలే ఊరిస్తాయి. మనిషి తనకు నచ్చిన కంటెంట్ లేదా వస్తువును వెతుక్కుంటూ వెళ్లే రోజులు కావివి. మన బ్రౌజింగ్ హిస్టరీని బట్టి, మన మనస్తత్వం ఏమిటో తెలుసుకుని మరీ కంపెనీలు నేర్పుతో కళ్ల ముందు మెదులుతున్నాయి. కేవలం బ్రౌజింగ్ మాత్రమే కాదు, ‘ఇవాళ నాకు పిజ్జా తినాలని ఉంది’ అని శ్రీమతితో అన్నా ఒక కార్ల షోరూం ముందు తచ్చాడినా.. ఫోన్ ద్వారా మన మాటల్ని, ఫొటోల్ని, ప్రయాణాలని గమనిస్తున్న యాప్స్ ఆయా సంస్థలకు సమాచారాన్ని చేరవేసేస్తున్నాయి.
మెక్ డొనాల్డ్స్‌ను అంతా జంక్‌ఫుడ్‌కు మారుపేరుగా భావిస్తారు. కానీ, అటువైపే నడుస్తారు. దానివెనుక ఉన్న రకరకాల మార్కెటింగ్ వ్యూహాలలో ఒకటి ఆ సంస్థ లోగోలోనే ఉంది. లోగో మధ్యలో కనిపించే M అక్షరం ఆ రెస్టారెంట్ భవనాలను సూచిస్తుంది. వంపులు తిరిగి లోనికి ఆహ్వానించే తలుపులలాగా ఉంటుంది. లోగోలో ఉండే పసుపురంగు ఎంత దూరం నుంచైనా కనిపిస్తుంది. ఇక ఎరుపు రంగు ఆకలిని పెంచుతుందని, ఏదో ఒకటి తినాలనే ఆత్రుత కలిగిస్తుందనీ తేల్చారు. LG లోగోలో ఉండే చిరునవ్వులాంటి ముఖం, పరుగును సూచించే నైకి రూపం, మోటారు రెక్కల్ని సూచించే BMW… అన్నీ కూడా మనసుని కట్టిపడేసేవే! మన కళ్ల ముందు కనిపించే రంగులు, దృశ్యాల వేగం, వాటి ఆకృతి అన్నీ కూడా తెలియకుండా చాలా ప్రభావం చూపుతాయి. అందుకే ప్రకటనల్లో పాలిష్ చేసిన పళ్లనీ, మెరుపు రంగుల్నీ వాడతారు. అంతదాకా ఎందుకు. కొకొమిలాన్ లాంటి కార్టూన్లు పిల్లల్ని ఆకర్షించేందుకు కళ్లు చెదిరే రంగుల్నీ, తలతిప్పుకోలేని వేగాన్ని వాడుతున్నాయని పరిశోధనలు తేల్చాయి. మన పంచేంద్రియాల మీద ఎలాగో అలా పట్టుసాధించడమే ఇప్పటి విపణి వ్యూహం. అంతదాకా ఎందుకు నురగ లేకుండా సబ్బును ఊహించగలమా. మురికి పోవాలంటే నురగ అవసరం లేదనే విషయాన్ని మనం ఎప్పుడో మర్చిపోయాం. యాపిల్ మొబైల్ స్టోర్లలో ప్రతి గ్యాడ్జెట్నీ ముట్టుకునే అవకాశం ఎందుకో మనకు అర్థం కాదు. ఓ ఉత్పత్తిని చేతిలోకి తీసుకున్నప్పుడు దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన బలపడుతుంది కాబట్టే.. ఆ ఎత్తుగడ!
మార్కెటింగ్‌లో ఏదైనా సాధ్యమే. ఇలా జరక్కూడదు కదా అని మనం ఆశ్చర్యపోవడానికి లేదు. మన ఊహకు అతీతంగా, మూర్ఖత్వంగా తోచే వ్యూహాలు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. అందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి.
ఒక చీరల షాప్ పక్కన మరో చీరల కొట్టు, ఒక హాల్ పక్కనే ఇంకో హాల్, ఒక కూల్ డ్రింక్ డిస్పెన్సర్ పక్కనే మరో సంస్థ ఉత్పత్తి… చూడటానికి మూర్ఖత్వంగా తోస్తాయి. ఒకరి కడుపు మీద ఇంకొకరు కొడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ, దీని మీద జరిగిన పరిశోధన వేరే ఫలితాలు చెబుతున్నది. పెప్సీ కోక్ పక్కపక్కనే ఉన్నప్పుడు అసలు దాహం వేస్తోందా, వేస్తే కూల్ డ్రింకే తాగాలా అనే ఆలోచన కంటే అసలు రెండింటిలో ఏది కొనుక్కోవాలి అన్న ప్రశ్న వస్తుందట!
ఐకియాలాంటి కొన్ని స్టోర్లలోకి వెళ్తే నీరసం వచ్చేంతగా నడిపిస్తాయి. కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులు కొనాలంటే చాలా షరతులు పెడతాయి. ఇంకొన్ని అబ్బే మా ఉత్పత్తి నీలాంటి వాళ్లకు కాదు అన్నంత ధీమాగా ఉంటాయి. ఫలితంగా మనలోని వీరుడు మేల్కొంటాడు. వాటిని కొనితీరాల్సిందే అని పట్టుబడతాడు. అదే వాటి విజయం.
ధర ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గుతుంది అన్నది ఆర్థిక సూత్రం. ధర పెరిగిన కొద్దీ, దానికి గిరాకీ పెరుగుతుంది అనేది ఓ మినహాయింపు. దీనికి ఉదాహరణే వెబ్లెన్ గూడ్స్. రోలెక్స్ వాచీలు కూడా సమయాన్నే చూపిస్తాయి. కానీ వాటిని స్టేటస్ సింబల్ కిందకి మార్చేస్తే… అందుకోవాల్సిన లక్ష్యంగా మారిపోతాయి. ఇందుకు కాస్త భిన్నం గిఫిన్ గూడ్స్. టామాటాలు లాంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు కూడా జనం వాటిని కొనడం మానరనీ, ప్రత్యామ్నాయాలకు వెళ్లరనీ.. ఇతరత్రా ఖర్చులు తగ్గించుకుని అయినా వాటిని కొంటారని చెబుతుందీ సూత్రం.
ఉత్పత్తి చేసేవాడే అమ్మకందారుడు అవగలడు అన్నది అపోహ. స్విగ్గీకి ఒక్క హోటల్ కూడా లేదు, ఉబర్‌కి ఒక్క కారు కూడా ఉండదు. ఓయోకి హోటళ్లు కరువు. ఆయా సేవలకు అవి వేదికలు మాత్రమే. ఒక్క ఆలోచనతోనే వేల కోట్లు సంపాదించవచ్చనే ఆధునిక విపణికి ఇవి నిదర్శనాలు.
కొన్ని ఫొటోలు డిలీట్ చేయకపోతే మీరు మెయిల్స్ పంపలేరు, సబ్స్క్రిప్షన్ కట్టకపోతే మీ సేవల్ని ఆపేస్తాం… లాంటి మాటలు వినియోగదారులను దూరం చేసుకోవు సరికదా… మరింత జాగ్రత్తపడేలా త్వరపెడతాయి.
ఇవే కాదు! ఖర్చు లేని పనే కదా అని రేటింగ్ ఇవ్వమని అడగడం, మరొకరికి రిఫర్ చేస్తే నగదు ఇవ్వడం, నచ్చకపోతే డబ్బు వాపస్ లాంటి సవాళ్లు, సరికొత్తగా లాంటి లేబుల్స్, ఆర్గానిక్ లాంటి బిరుదులు.. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మనసును కట్టిపడేసేవే. ఇది అనైతికం అనలేం. మేము మోసపోయాం అని తేలికగా నిరూపించలేం. వస్తువులే మన ఉనికి అయిపోయిన కాలంలో కొనుగోళ్లకు దూరంగా బతకలేం. కాస్త ఆగి ఆలోచించడమే తక్షణ కర్తవ్యం.
అన్నట్టు మనకు ఆలోచించుకునే సమయాన్ని కూడా విపణి ఇవ్వదు. సూపర్ మార్కెట్లలో వేలాది ఉత్పత్తుల ప్రదర్శన వెనుక ఇదే వ్యూహం. ఇన్నింటి మధ్య మెదడు నిర్ణయం తీసుకునే సామర్థ్యం కోల్పోతుంది. దీన్నే డెసిషన్ ఫెటిగ్ అంటారు. తన కళ్ల ముందు కనిపిస్తున్న వేలాది ఎంపికలలో ఏది అవసరమో నిర్ణయించుకోలేక… మెదడు పొరపాటు చేస్తుంది. అందుకే ఉప్పు కోసం సూపర్ మార్కెట్లోకి వెళ్లినవారు సంచులతో తిరిగి వస్తారు. మెదడుకి కాస్త అవకాశం ఇవ్వడమే ఈ యుద్ధాన్ని ఎదుర్కొనే తంత్రం. అప్పుడు విచక్షణ పనిచేస్తుంది. విపణిలో తన దారి తీరికగా వెతుక్కుంటుంది.
– కె.సహస్ర