నార్మన్ బోర్లాగ్… అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త. ఆ పేరు విననివారు ఉంటారేమో కానీ.. ఆయన ప్రచారం చేసిన హరిత విప్లవం గురించి తెలియనివారు ఉండకపోవచ్చు. నార్మన్ స్మారకంగా ఏటా ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందిస్తున్నారు. ఈ ఏడాది ఒక భారతీయురాలు ఆ పురస్కారాన్ని స్వీకరించడం విశేషం. ఆమె పేరు స్వాతి నాయక్. ఈ గౌరవాన్ని అందుకున్న మూడో భారతీయురాలు. శాస్త్రవేత్తలకు, రైతులకు మధ్య వారధిగా నిలిచినందుకు ఈ గుర్తింపు దక్కింది. ఒరిస్సాలోని పూరి పుణ్యక్షేత్రం ఆమె స్వస్థలం. మొదటి నుంచి స్వాతికి వ్యవసాయమంటే ఇష్టం. పట్టుబట్టి అగ్రి బీఎస్సీ చదివారు.
గ్రామీణాభివృద్ధి మీద మాస్టర్స్ చేశారు. సరైన విత్తనాలు ఎంచుకుంటే, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా మంచి దిగుబడి సాధించవచ్చని ఆమె నమ్మకం. అందుకే, కరువును తట్టుకోగల ‘సహబాగి దాన్’ అనే వరి వంగడాన్ని రైతులకు పరిచయం చేశారు. ఇది ఒరిస్సాలో వేలమంది రైతుల జీవితాల్ని మార్చేసింది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల ఇలాంటి వంగడాల్ని బంగ్లాదేశ్, నేపాల్ రైతులకు కూడా అందించారు స్వాతి. మహిళా రైతుల జీవితాల్లో వెలుగు నింపాలన్నది తన ఆశయం. సాగులో మహిళల పాత్ర ఎక్కువే అయినా.. సమాజం వారిని రైతులుగా గుర్తించడం లేదని వాపోతారు స్వాతి. వ్యవసాయానికి సంబంధించి అనేక అంశాల మీద తనదైన ప్రభావం చూపుతున్న ఓ భారతీయ మహిళకు బోర్లాగ్ అవార్డు ఇవ్వడం సముచితమైన గౌరవమే.