‘వ్యూస్’ ముఖ్యం కాదు, మాకు ‘వ్యాల్యూస్’ ముఖ్యం అని చెప్పే వాళ్లు యూట్యూబ్ నిండా కనిపిస్తారు. ఆ మాటకు కట్టుబడేవాళ్లు అరుదుగా ఉంటారు. వాల్యూస్ కోసం నిలబడితే వ్యూసే రావు. లైక్స్ రావు. ఫాలోవర్స్ అంతకన్నా రారు. అయినా సరే వాల్యూస్నే ఫాలో అవుతున్నారు రూరల్ మీడియా టీమ్ లీడర్ శ్యామ్ మోహన్. స్వేదం.. సేద్యం సఫలమైన తీరు కళ్లకు కడుతూ రైతు జీవితాన్ని ఈ తరానికి చూపిస్తున్నారు. రైతు సమస్యలు, రైతు ఆవిష్కరణలు, పల్లె ముచ్చట్లెన్నో చూపే రూరల్ మీడియాకి ఆ ముచ్చట్లకున్నంత కథ ఉంది. సాగులో కష్టనష్టాలున్నట్టే వ్యయ, ప్రయాసలకోర్చి సాగుబాటలో సాగుతున్న శ్యాం మోహన్ చెప్పిన రూరల్ ముచ్చట్లివి.
కార్టూనిస్ట్‌గా పదేళ్లు పని చేశాను. జర్మన్ పత్రిక కోసమూ పని చేశాను. ఇంటర్నేషనల్ అవార్డులూ వచ్చాయి. హ్యాపీగా ఉన్నాను. భవిష్యత్‌లో కంప్యూటరే కార్టూన్లు గీస్తుందని మిత్రుడు అరుణ్ సాగర్ ఇరవై ఏళ్ల క్రితమే చెప్పాడు. అదిప్పుడు నిజమైంది! అప్పటికి నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. ఈ-మెయిల్ కూడా తెలియదు. ముందుచూపుతో కార్టూనిస్ట్‌గా మడుగులో ఉండిపోకుండా సబ్-ఎడిటర్‌గా మారాను. యూట్యూబర్‌గా ఎదిగాను. మట్టిలో నడిచినప్పుడే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. జీవితం నదీ ప్రవాహంలా ఉండాలని నేను కోరుకుంటాను.

జర్నలిజంలోకి వచ్చాకే నాకు వ్యవసాయంతో అనుబంధం పెరిగింది. కార్టూనిస్ట్‌గా, సబ్-ఎడిటర్‌గా చాలాకాలం పత్రికల్లో పని చేశాను. ప్రధాన పత్రికల్లో రాజకీయ, నేర, సినిమా, వ్యాపార వార్తలకు ఉన్న ప్రాధాన్యం వ్యవసాయ వార్తలకు ఉండేది కాదు. గ్రామాల్లో ఎక్కువ లైఫ్ ఉన్నా పత్రికలు తక్కువగా కవర్ చేసేవి. ఓసారి వికారాబాద్ పోయాను. ఆ ప్రాంతం కంది పంటకు ప్రసిద్ధి. అక్కడ పరిచయమైన రైతు మిగతా రైతుల కంటే ఎకరానికి క్వింటా ఎక్కువ పండించానని తన అనుభవాలు చెప్పాడు. అతనిని రైతులు ఫాలో అయితే వేల క్వింటాళ్ల దిగుబడి పెరుగుతుందని ‘రైతుల జీవితాన్ని మారుస్తున్న వ్యవసాయ విధానం’ పేరుతో స్టోరీ ప్లాన్ చేశాను. పైస్థాయి జర్నలిస్టులు ఇందులో ఏముందన్నట్టు చూశారు. ఆ కథనం ప్రచురణ కాలేదు. బిజినెస్, సినిమా, రాజకీయాలు, క్రైమ్ జనం ఎక్కువ చదువుతారు. కాబట్టి ప్రధాన పత్రికల్లో రైతు వార్తలకు పెద్దపీట వేయరు. అప్పుడొచ్చిందే ఈ ‘రూరల్ మీడియా’ ఆలోచన.

‘రూరల్ మీడియా’ పేరుతో వెబ్సైట్ ప్రారంభించాను. రైతు సమస్యలు, విజయాలు రాశాను. ఆరేళ్లకు యూట్యూబ్ బూమ్ వచ్చింది. జనం చదవడం మాని, చూడటం వైపు మళ్లుతున్నారు. కాబట్టి యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేయాలనుకున్నాను. కెమెరామెన్, వీడియో ఎడిటర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టుతో టీమ్ ఏర్పాటు చేసుకున్నాను. ‘రాజకీయం, సినిమా, క్రైమ్, సెన్సేషన్ వార్తలు వద్దు.. సెలబ్రిటీ ఇంటర్వ్యూలు అసలే వద్దు. గ్రామాలు, రైతు ఆవిష్కరణలు ప్రపంచానికి చూపించాలి’ అని మా టీమ్ ముందే నిర్ణయం తీసుకుంది. పెద్ద పత్రికల్లో ప్రాధాన్యం లేని, సింగిల్ కాలమ్ రైతు వార్తలే మాకు మార్గదర్శనం చేశాయి. ‘మాతోట’ ప్రాజెక్ట్ వల్ల 2వేల మంది గిరిజన రైతులు లబ్ది పొందారనే చిన్న వార్త పట్టుకుని ఆదిలాబాద్ పోయాం. స్థానిక ఆదివాసీ సాయంతో కవ్వాల్ అడవుల్లో ఆదివాసీ రైతుల జీవితాల్లో మార్పుని చూస్తున్నాం. ఆ సందర్భంలో దట్టమైన అడవిలో నివసించే అక్కాచెల్లెలి గురించి తెలిసింది. ఇద్దరే ఒక చిన్న గుడిసెలో ఉంటూ రెండు ఎకరాల మామిడి తోట పండిస్తున్నారు. వాళ్లతో ఉండలేక ఒకామె కొడుకు పట్టణానికి వలసపోయి, ఆటో నడుపుకొంటున్నాడు. అయినా వాళ్లు అడవిని వదల్లేదు. ఆ ఇద్దరి జీవితాన్ని చిత్రీకరించాం. రూరల్ మీడియా చానెల్లో మొదటి వీడియో అదే! ప్రకృతిలోని జీవన సౌందర్యంతో మా చానెల్ పరిచయమైంది.

రైతు బాధితుడే కాదు. శాస్త్రవేత్త కూడా! వాళ్ల సమస్యలకు వాళ్లే పరిష్కారాలు కనిపెడుతున్నారు. వాళ్ల వ్యక్తిగత విజయాలు మరెందరికో స్ఫూర్తినిస్తాయి. నెగెటివ్ వార్తల ప్రపంచంలో కొన్ని పాజిటివ్ మార్పులు చూపించాలనే మా సంకల్పం సత్ఫలితాలిస్తున్నది. ఒకరి విజయం మరొకరికి స్ఫూర్తినివ్వడమే కాదు మరోచోటా సత్ఫలితాలిస్తున్నది. అందుకే గ్రామీణ జ్ఞానం కూడా ఈ వార్తల ప్రపంచానికి ఎంతో అవసరమని భావించి మారుమూల ప్రాంతాలకు కార్లలో, ఎడ్ల బండ్లలో పోయాం. అవి పోలేని చోటకు కాలి నడకన చేరాం. మీ గురించి మీరే చెప్పాలని, మీరు చెప్పలేని సమయంలో నేను మాట్లాడతానని వాళ్లతో చెబుతాను. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర ఒక గ్రామంలో గంగారాం అనే రైతు ఉన్నాడు. పెన్‌గంగాలో కలిసే వాగు దాటి తను చేనుకు పోయేవాడు. చిన్న బ్రిడ్జ్ కావాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా పరిష్కారం కాలేదట.
పడేసిన కరెంటు వైర్లతోని తానే తీగల వంతెన నిర్మించాడు. మిగతా రైతులు ఆర్థిక సహాయం చేశారు. గంగారాం చెప్పిన బాధలు విని… వంతెన కట్టేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉట్నూరు, ఇంద్రవల్లి మధ్య వర్షం బాగానే కురుస్తుంది. కానీ నీరు నిలువదు. అక్కడి ప్రజల కష్టాలను వెలుగులోకి తెచ్చాం. ఆ ప్రాంతాన్ని వాటర్ షెడ్ పథకానికి ఎంపిక చేసి, నాబార్డ్ నిధులు మంజూరు చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో నక్కలగండి రిజర్వాయర్‌కు సమీపంలోని మర్లపాడు తండా వర్షంలో ఒక రాత్రంతా మునిగిపోయి ఉంది. ఆ తండా బాధను బయటి ప్రపంచానికి చూపించాం. ఆ ఊరిని కలెక్టర్ సందర్శించారు. ఇలా పల్లె కష్టాలను దగ్గరగా చూసి ప్రపంచానికి చూపించాం. ప్రభుత్వాలు, అధికారులు, ఎన్జీవోలే కాదు హృదయం ఉన్నవాళ్లు రైతు గుండె ఘోషను అర్థం చేసుకున్నారు. ఆ సమస్యలకు పరిష్కారం చూపించారు. జర్నలిస్ట్‌గా ఇంతకన్నా గొప్ప సంతృప్తి ఇంకేమిస్తుంది?!

మమ్మల్ని అభిమానించే రైతులు ఉన్నట్టే. మా నుంచి లాభం ఆశించే వాళ్లూ తయారయ్యారు. మా స్టోరీలు చేయమంటూ వెంటపడ్డారు. విదేశాల నుంచి వచ్చి వ్యవసాయం చేస్తున్నాం, సేంద్రియ సాగు చేస్తున్నామంటూ చెప్పేవాళ్లు. వాళ్లలో నిజాయతీ లేదు. వాస్తవానికి దూరంగా ఉండే మాటలకు మేమూ దూరంగానే ఉన్నాం. వాస్తవాలకు, రైతు జీవితానికి కట్టుబడి పనిచేయాలనే మా పట్టుదల ఏ ప్రలోభానికీ సడలిపోలేదు. రూరల్ మీడియా చానెల్‌కి 55 వేల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. వీడియోకి సగటున ఒక వేయి దాకా వ్యూస్ వస్తాయి. మాకు వ్యూస్ కన్నా వాల్యూస్ ముఖ్యం. మా వల్ల ఎంతో మంది సమస్యలు పరిష్కారమయ్యాయి. వ్యూస్ కన్నా ఇవి ముఖ్యమైనవి కదా.
గూగుల్ నుంచి మాకు నెలకు అయిదు వేలు, పది వేలు వస్తాయి. మా ఖర్చు, శ్రమతో పోల్చితే వచ్చేది జీరో. అయినా ఎందుకు చేస్తున్నారని చాలామంది అడుగుతారు. ఇది సంతోషం కోసం, వృత్తిలో సంతృప్తి కోసం చేస్తున్నాం. దీని కోసం నెలకు నలభై వేల రూపాయలు ఖర్చు చేస్తాం. మాకు ఆఫీస్ లేదు. వీడియోగ్రాఫర్ ఇస్రం సంతోష్, నేను ఊళ్లు తిరిగి వస్తాం. వీడియో ఎడిటర్లు పూర్ణారావు, మనోహర్, ప్రసాద్ ఎవరిళ్లలో వాళ్లు ఎడిట్ చేస్తారు. ఆ తర్వాత అనుపమ కోటి, ముఖేష్ వాయిస్ జోడిస్తారు. ఇలా ఎవరిళ్లలో వాళ్లు ఉండి పని చేస్తాం. అప్పుడప్పుడూ మీట్ అవుతాం. మా బతుకుదెరువు కోసం ఎన్జీవోల ప్రాజెక్ట్‌లకు కేస్ స్టడీ, ఫీడ్ బ్యాక్ కోసం వీడియోలు చేస్తాం. బీబీసీ, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఐఎఫ్‌డీసీ తెలంగాణలో కొన్ని వీడియోలు చేయమని అడిగితే చేశాం. ఇలా వచ్చే ఆదాయంలో కొంత ఈ రూరల్ మీడియా కోసం ఖర్చు చేస్తున్నాం. మా శ్రమ, ఖర్చులకు దక్కే ప్రతిఫలం సంతృప్తే. చిన్న గ్రామ కథను ప్రపంచానికి చేర్చాం. ఒక రైతు ఆవిష్కరణ వేలమంది రైతులకు స్పూర్తి అవుతున్నది. డిజిటల్ మీడియా గ్రామీణ గొంతుకకు కొత్త శక్తినిచ్చింది. పల్లె ప్రజల అనుభవ జ్ఞానాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరచడమే లక్ష్యంగా ఇకముందూ పనిచేస్తాం.

తెలంగాణ పల్లెల్లో తిరుగుతూ, రైతుల జీవితాలను వింటూ శ్యాంమోహన్ తన అనుభవాలు రాశారు. తెలంగాణ పల్లెల్లో జీవన వికాసం, పల్లె సమస్యలను వివరిస్తూ రాసిన కథనాలను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ‘జనగణ మన తెలంగాణ’ పేరుతో పుస్తకం ప్రచురించింది. ఐఏఎస్ శిక్షణ పొందేవారికి కేస్ స్టడీ కోసం ఈ పుస్తకం ఇస్తున్నారు.
‘జీరో నాలెడ్జ్‌తో బయలుదేరాను. రైతులే మా గురువులు. నీటితోనే పంటలు పండిస్తారని అనుకునేవాడిని. జహీరాబాద్‌లో రైతు వినోదమ్మ వర్షాభావ పరిస్థితుల్లో మంచుతో నాలుగు రకాల జొన్నలు పండిస్తున్నది. మేము తెలుసుకున్న కొత్త విషయాన్ని మా రూరల్ మీడియా ప్రపంచానికి చూపింది. ఆదివాసీలు కొత్త వాళ్లతో మాట్లాడరు. నమ్మకం కుదిరేదాకా వాళ్ల దగ్గర ఉండేది. వాళ్లతో మాటలు కలిపేది. వాళ్ల వ్యవసాయ ముచ్చట్లు వింటూ అక్కడే ఉండేది. తినడం, పడుకోవడం పల్లెల్లో, ఆదివాసీ గూడేల్లోనే. భద్రాచలం ఆదివాసీలతో కలిసి తిన్నప్పుడు చీమలతో పచ్చడి నూరుకుంటారని తెలిసింది.