Inspiration | రాణించని చోట రాజ్యమేలాలని ఏండ్ల తరబడి కలలు కనడం కంటే.. ఇష్టమైన రంగంలో కష్టపడితే కలలు పండించుకోవచ్చని రాఘవేంద్ర గంజి గుర్తించాడు. ఇంటర్లో మూడుసార్లు ఫెయిలైనా బాధపడలేదు. మూడేళ్లు సప్లిమెంటరీలు రాసి గెలిచానని గెంతులేయనూ లేదు. తనదైన రంగుల ప్రపంచానికి చేరుకునేందుకు ఇదో దారి అనుకుని ముందుకు సాగాడు. అంతర్జాతీయ బహుమతులు తెచ్చుకున్నాడు. పాతిక లక్షల వేతనం సాధించాడు! ఆ రంగుల కల గురించి తన మాటల్లోనే..
బొమ్మలు గీయడం నాకు పుట్టుకతో వచ్చిన విద్య. బుద్ధి తెలిసినప్పటి నుంచీ బొమ్మలు గీసేవాడిని. కానీ చదువుల్లో వెనుకే. బొటాబొటి మార్కులతో పది పాసయ్యాను. ఇంటర్మీడియెట్ మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాను. సప్లిమెంటరీలోనూ అదే ఫలితం. మాకు ఊళ్లో (గట్టుప్పల్, నల్లగొండ జిల్లా) రైస్ మిల్లు ఉంది. ఆ వ్యాపార బాధ్యతలు చూస్తూనే బొమ్మలు గీశాను కొన్నాళ్లు. మంచి రంగులు, పేపర్లు ఎక్కడ దొరుకుతాయని ఎవర్నో అడిగితే.. అబిడ్స్ (హైదరాబాద్)లోని రాయల్ స్టేషనరీ పేరు చెప్పారు.
రంగుల కోసం హైదరాబాద్ వస్తూ పోతున్నప్పుడు ఆర్ట్ గ్యాలరీలకు వెళ్లి తోట వైకుంఠం, లక్ష్మా గౌడ్, లక్ష్మణ్ ఏలె లాంటివారి పెయింటింగ్స్ చూసేవాణ్ని. ఫైన్ ఆర్ట్స్ చదివి మంచి ఆర్టిస్ట్ కావాలనే కోరిక కలిగింది. ఏడాదికో సబ్జెక్ట్ చొప్పున మూడేళ్లు కష్టపడి ఇంటర్ పాసయ్యాను. ఇంట్లో చెప్పకుండానే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాశాను. రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ వచ్చింది. బీఎఫ్ఏ చదువుతానంటే. ‘బొమ్మలకు చదువు ఉంటుందా? చదివి ఏం చేస్తారు?’ అని మా నాన్న కొట్టిపారేశాడు. నాన్నకు అర్థమయ్యేలా చెప్పి, ఒప్పించాను. నాలుగేళ్లలో ఏదో ఒక ఉద్యోగం చేస్తానని మాటిచ్చి హైదరాబాద్ బయల్దేరాను.
జేఎన్టీయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) కోర్సులో చేరి కొత్త ప్రపంచంలో అడుగుపెట్టాను. వర్క్‌షాపులు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, సెమినార్లు, అవార్డులు.. ఇలా ఫుల్ బిజీ అయిపోయాను. ఇదే జీవితం అనుకుని నాలుగేళ్లపాటు రాత్రీ పగలు రంగుల ప్రపంచంలో గడిపాను. ఫైన్ ఆర్ట్స్ చదివేప్పుడు చాలా ఆర్ట్ కాంపిటీషన్స్‌లో బహుమతులు గెలుచుకున్నాను. హైదరాబాద్ నుంచి మొదలుపెడితే అంతర్జాతీయ స్థాయి వరకు 25 అవార్డులు గెలుచుకున్నాను. ‘హిరోషిమా, నాగసాకి అణుబాంబు’ విషాద ఘటనకు 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అంతర్జాతీయ చిత్రకళా పోటీ నిర్వహించారు. నాకు మొదటి బహుమతి వచ్చింది. బీఎఫ్ఏ ఫైనల్ ఇయర్లో ఉద్యోగాల వేట మొదలుపెట్టాను.
అప్పటికే ఆర్ట్‌కి మంచి మార్కెట్ ఉందని అర్థమైపోయింది. పేరున్న వాళ్ల చిత్రాలకు ఉన్నంత డిమాండ్ నాలాంటి వాళ్లకు ఉండదు కదా! వాళ్లంత ఎదగాలంటే యాభై ఏళ్లు పడుతుంది. అంతకాలం బతకాలి కాబట్టి ఏదైనా జాబ్ చూసుకోవాలనుకున్నా. ఆర్టిస్టుగా నిలదొక్కుకోవచ్చని ఒక సినిమాకు స్టోరీ బోర్డ్స్ గీశాను. కానీ, టైటిల్స్‌లో నా పేరు వేయలేదు. ఆ ఫీల్డ్ వదిలేశాను. బీఎఫ్ఏ కోర్స్ పూర్తి చేశాను.
ఉద్యోగం కోసం యానిమేషన్ నేర్చుకోవాలని పిక్సెల్లాయిడ్ స్టూడియోస్‌లో చేరాను. తొమ్మిది నెలల శిక్షణ తర్వాత అందులోనే ఉద్యోగం ఇచ్చారు. అత్తారింటికి దారేది, జులాయి, దేవుడు చేసిన మనుషులు, ఎవడు.. సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేశాను. ఈ ఫీల్డ్‌లో రాణించాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నేను కొత్త కొత్త ఆర్ట్, త్రీడీ టెక్నిక్న్ నేర్చుకుంటాను. ఉద్యోగం చేస్తూ, నేర్చుకుంటూ రోజూ 18 గంటలు కష్టపడ్డాను. పిక్సెల్లాయిడ్ స్టూడియోస్‌లో నా జీతం నెలకు ఎనిమిది వేల రూపాయలు! ఆ తర్వాత, టైమ్జ్ కంపెనీలో రూ.20 వేల వేతనానికి చేరాను. అక్కడ ఆరేళ్లు పనిచేశాను. సినిమాల నుంచి గేమింగ్ ఇండస్ట్రీకి వచ్చాను. ఆ కంపెనీలో ఆరేళ్లపాటు పనిచేశాను.
జీతం పెరగాలి. అమెజాన్ అతిపెద్ద డాటా సెంటర్‌ని ఇండియాలో స్థాపించాలనుకుంది. ఆ కంపెనీ హైదరాబాద్‌కి వచ్చింది. అందులో త్రీడీ యానిమేటర్ జాబ్ కోసం దరఖాస్తు చేశాను. అంతపెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం రావాలంటే చాలా కష్టపడాలి.
అమెజాన్‌లో నాలుగు నెలల్లో అయిదు సార్లు ఇంటర్వ్యూలు చేశారు. అంతకుముందు ఉద్యోగాల్లో హిందీలో మేనేజ్ చేశాను. సబ్జెక్ట్ మీద పట్టు ఉంది. కానీ భాష రాదు. గ్లాస్ డోర్ వెబ్సైట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తెలుసుకుని, గూగుల్‌లో సమాధానాలు వెదికి, పేజీలకు పేజీలు రాసుకున్నాను. వాళ్లడిగే అవకాశం ఉన్న ప్రశ్నలకు ఇంగ్లిష్ సమాధానాలు కసితో ప్రిపేర్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూలు గట్టెక్కాను. నెలకు ఎనిమిది వేల జీతంతో పని చేసే నాకు 16.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం ఇచ్చారు. నేను ఆశపడ్డదానికంటే ఎక్కువ జీతం! అయినా అక్కడితో ఆగిపోలేదు. ఆగిపోకూడదు.
టెక్నాలజీలో వేగంగా మార్పులు వస్తున్నాయి. గేమింగ్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో వర్చువల్ రియాలిటీకి ప్రాధాన్యత పెరిగింది. ఆక్యులస్ (డివైజ్)తో వర్చువల్ రియాలిటీ కోసం మెటావర్స్ ప్రాజెక్ట్ హెచ్‌సీఎల్ కంపెనీకి వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం నాకిచ్చారు. ఏడాదికి 25 లక్షల రూపాయల జీతం ఇస్తామన్నారు. ఫైన్ ఆర్ట్స్ తర్వాత ఆర్టిస్టుగా బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఆందోళన పడ్డాను. ఆర్ట్‌ని వదులుకుని వేరే పనికి పోవాలనే ఆలోచన రాక కొత్త సాంకేతిక పద్ధతుల్ని నేర్చుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. ఇదే నా విజయ రహస్యం. మార్కెట్లో వచ్చే మార్పులు తెలుసుకుని, వాటికి తగ్గట్టుగా నన్ను నేను మలచుకున్నాను. గెలుపు సాధించాను.
– నాగవర్ధన్ రాయల