ఇంట్లో వండుకునేంత తీరిక లేదు. బయటి తిండి అరాయించుకునే శక్తి లేదు. ఆకలి బాధ తినకుంటే తప్పేది కాదు. వంటంటే చిన్న పని కాదు. కూరగాయలు కొనాలి. కడగాలి, తరగాలి… తినడానికే సమయం లేదంటే ఇన్ని పనులా? అనే ఉద్యోగినుల కోసం కొత్త పౌడర్లొచ్చాయ్. పప్పులోకి పాలకూర, చారులోకి టమాటా, తాలింపులోకి కరివేపాకు.. ఇలా ఏది కావాలంటే అది కడిగి, తరిగి, డీహైడ్రేట్ చేసి, పొడి చేసి, ప్యాక్ చేసి వంటింటికి వెజిటబుల్ పౌడర్లు చేరవేస్తున్నది కోహ్ ఫుడ్స్. కూరలే కాదు టిఫిన్స్ కోసం రెడీ మిక్స్‌లు అందిస్తున్నది కోహ్. ఉన్నత విద్యావంతులైన ముగ్గురు స్నేహితుల వంటింటి ప్రయోగం ఇలా మొదలైంది!
కీర్తి ప్రియా బిట్స్ పిలానిలో బీ ఫార్మసీ చదివిన తర్వాత ఐఐఎం, కోల్‌కతాలో ఎంబీఏ చదివింది. అది పూర్తి కాగానే బ్యాంక్, స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసింది. బెంగళూరు, ముంబయిలో ఉద్యోగం చేసేటప్పుడు సేంద్రియ ఆహారం, పోషకాహారం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం గమనించింది. అంతేకాదు ఉద్యోగాలు చేసే మహిళలు పెరుగుతున్నారు. తక్కువ సమయంలో వంట చేసుకునేందుకు రెడీ మిక్స్‌లను కొంటున్నారు. గుడ్ ఫుడ్‌కి డిమాండ్‌కు తగ్గట్టే ధరలున్నాయి. ఇవే కీర్తిని ఆలోచనలో పడేశాయి. ‘ఇంత ధర పెట్టి కొంటున్నాం. కానీ, రైతులకు మాత్రం ఈ లాభాలు దక్కవెందుకు?’ అనుకున్నది. తాను చిన్నప్పుడు సెలవులకు ఊరికి (సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరి) వెళ్లినప్పుడు రైతుల కష్టాలు దగ్గరగా చూసింది. పంటను అమ్మితే.. ఆ పంట కోయడానికి అయ్యే ఖర్చు కూడా రాకపోవడం గమనించింది.
ఫార్మసీలో ఫార్ములేషన్స్ కీర్తికి ఇష్టమైన సబ్జెక్ట్. ‘కుకింగ్ కూడా ఓ రకంగా ఫార్ములేషనే కదా. నాకున్న నాలెడ్జ్‌తో వెజిటబుల్ పొడులు తయారు చేసి రైతులకు మేలు చేయచ్చు’ అనుకుంది. కానీ, ఇంట్లో అడ్డు చెప్పారు. ‘పేరున్న ఇన్స్టిట్యూట్లో చదివి, పెద్ద కంపెనీల్లో జాబ్ చేయక…ఈ ప్రయోగాలు నీకెందుకు? ఉద్యోగమే బెస్ట్’ అని సలహా ఇచ్చారు. అయినా కీర్తి తన ఆలోచనను మార్చుకోలేదు. ఆహార నిల్వ కోసం రసాయనాలు కలపకుండా, రుచి, రంగు కోసం రసాయనాలు జోడించకుండా సహజమైన ఆహారాన్ని మార్కెట్లోకి తేవాలనుకుంది. ఏదో చేయాలనే తపనతో స్టడీ మొదలుపెట్టింది. ఆహారాన్ని బాగా డీ హైడ్రేట్ చేసి (తేమ అయిదు శాతం మించకుండా) ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేయడం తెలుసుకుంది. వాటిని ఈజీగా వాడుకునేలా మార్కెట్ చేయడం కోసం ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. సహజమైన ఆహారాన్ని మన శరీరం ఒక విధంగా సంగ్రహిస్తుంది. న్యూట్రియెంట్ సప్లిమెంట్స్‌ని మరోలా సంగ్రహిస్తుంది. ఈ సప్లిమెంట్స్‌కి బయో అవైలబిలిటీ చాలా తక్కువ. అదే సహజ ఆహారానికి బయో అవైలబిలిటీ ఎక్కువ. కాబట్టి మార్కెట్లో తప్పకుండా ఆదరణ ఉంటుందని ఆచరణకు సిద్ధమైంది. రైతులతో అవగాహన తొండ తిరుమలగిరి రైతులతో ‘మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తాను. వ్యవసాయం లాభసాటిగా మారుస్తాను. నేను చెప్పిన పద్ధతిలో సాగు చేయాలి’ అని కీర్తి అడిగింది. రైతులతో అవగాహన చేసుకుని అదే గ్రామంలో పరిశ్రమ పెట్టింది. అప్పటికే వాణిజ్య పంటలతో నష్టపోయిన రైతులకు ఇదో లాభసాటి మార్గంగా కనిపించింది. అంతకుముందెన్నడూ సాగు చేయని బీట్రూట్, క్యారెట్ పంటలు వేయడం మొదలుపెట్టారు. వీటితోపాటే టమాటా, గోంగూర, కాకర లాంటి కూరగాయలు, ఆకుకూరల సాగులోకి దిగారు.
స్నేహితుల ఆర్థిక సహకారంతో కీర్తి కొత్త ప్రయాణం మొదలైంది. తిరుమలగిరిలో ప్రొడక్షన్ యూనిట్లో కోహ్ ఫుడ్స్ పేరుతో చిప్స్, కూరగాయల పొడుల తయారీకి పూనుకుంది. కూరగాయలు, ఆకుకూరలు కోసిన తర్వాత వాటికి బ్యాక్టీరియా, ఫంగస్ సోకకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాటించింది. వాటితో పొడులు, చిప్స్ తయారు చేశారు. తేమ అయిదు శాతానికి తక్కువగా ఉంటే సూక్ష్మ జీవులు పెరగవు. కాబట్టి ప్రిజర్వేటివ్స్ కలపాల్సిన అవసరం రాలేదు. సహజమైన రంగు, సువాసన, కమ్మదనం కస్టమర్స్‌ని ఆకర్షించాయి. ఒకసారి కొన్నవాళ్లు మళ్లీ మళ్లీ కొని ఆదరించారు. గోంగూర, కరివేపాకు, బీట్రూట్, క్యారెట్, టమాటా.. పొడులకు మంచి ఆదరణ వచ్చింది. పులుపు కోసం టమాటాలు కడిగి, తరిగి, వాటిని ఉడికించాల్సిన అవసరమే లేదు. ఏదైనా కూరలో టమాటా పొడి వేసుకుంటే క్షణాల్లో పులుపు వచ్చేస్తుంది. ఇడ్లీలోకి అదనపు పోషకాల కోసం క్యారెట్, బీట్రూట్, పాలకూర.. పొడులును వాడుకోవచ్చు. ఈ రెడీ మిక్స్‌కి ఆదరణ ఎంతగా వచ్చిందంటే ఇక్కడివాళ్లు పెద్ద మొత్తంలో కొని విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు పంపిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల ఆహార ఉత్పత్తుల గురించి రీల్స్ చేసే రోహిణీ దీప్తికి ఓ రోజు ఒక హ్యాంపర్ వచ్చింది. అందులో కోహ్ ఫుడ్స్ బీట్రూట్ ప్యాక్ ఉంది. ఇదెలా ఉంటుందో చూద్దామని ఇడ్లీలో కలిపింది. టేస్ట్, స్మెల్, కలర్ బాగున్నాయి. నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి ఇంకా కొనాలని అనుకుంది. ‘ఇంకా మీ ప్రొడక్ట్స్ ఏమున్నాయి?’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిణి పింగ్ చేసింది. ‘నేనే ఫౌండర్‌ని’ అంటూ కీర్తి రెస్పాండ్ అయింది. అలా ఇద్దరినీ బీట్రూట్ పొడి కలిపింది.
‘కోహ్ ఫుడ్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తారా?’ అని కీర్తి అడిగింది.‘సరే చేస్తాను. కానీ, ముందుగా మీ ఫ్యాక్టరీ చూశాకే’ అని బదులిచ్చింది రోహిణి. రీల్స్ కోసం తిరుమలగిరిలో తయారీ యూనిట్‌కు వెళ్లింది. అక్కడ కార్మికులు కూరగాయలు శుద్ధి చేయడం నుంచి ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసే వరకు చూసింది. ఆ తర్వాత గ్రామాల్లోని రైతులతో కలిసి చేస్తున్న సాగు గురించి తెలుసుకుంది. రోహిణీ బిట్స్ (హైదరాబాద్)లో మెకానికల్ ఇంజినీరింగ్, ఎకనామిక్స్‌లో పీజీ చదివింది. వ్యాపారం తనకూ ఆసక్తి ఉంది. అప్పటికే ఓ చిన్న కంపెనీ నడుపుతున్నది. కోహ్ ఫుడ్స్ రుచులే కాదు, బిజినెస్ మోడల్ నచ్చాక.. ‘రీల్స్ సంగతి తర్వాత… నేనూ ఈ బిజినెస్‌లోకి వస్తాను. మనిద్దరం కలిసి ఎందుకు ప్రయాణం చేయకూడదు’ అని అడిగింది రోహిణి. అలా ఇద్దరూ కలిసి కోహ్ ఫుడ్స్‌ని మరిన్ని ప్రొడక్ట్స్‌తో పెద్దది చేశారు. పెరిగిన ఉత్పత్తికి తగ్గట్టే మార్కెటింగ్ కూడా పెంచాల్సి వచ్చింది. ఈ టీమ్‌లోకి అజయ్ చేరాడు. తను ఐఐటీ బాంబేలో చదివాడు. కీర్తి, అజయ్ ఒకే కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ పరిచయంతో అజయ్ కోహ్ ఫుడ్స్‌లో జాయిన్ అయ్యాడు. కంపెనీ ఆపరేషన్స్ హెడ్ బాధ్యతలు చూసుకుంటున్నాడు.
కోహ్ పుడ్స్ బ్రాండ్ పేరుతో రకరకాల కూరగాయలు, ఆకుకూరల పొడులను కస్టమర్లకు పరిచయం చేసేందుకు చాలాచోట్ల స్టాల్స్ పెట్టి, జనానికి కనిపించేలా ప్రదర్శిస్తూ, వాసన చూపిస్తూ కొత్త రుచులు పరిచయం చేశారు. కస్టమర్లే ఈ పొడులకు ప్రమోట్ చేయడంతో వినియోగదారుల సంఖ్యా పెరిగింది. ఇలా కొత్త కస్టమర్లే కాదు కొత్త ప్రాంతాల నుంచీ ఆర్డర్లు వస్తూ వ్యాపారం దేశమంతా విస్తరించింది. ఈ కామర్స్, ఆన్లైన్ ఆర్డర్లతో దేశంలో ఎక్కడికైనా పొడులను డెలివరీ చేస్తున్నారు. రిటైల్ వ్యాపారులు, ఆహార కంపెనీలు కూడా బల్క్ ఆర్డర్లు ఇవ్వడంతో కోహ్ పంట పండింది. అయితే కస్టమర్ల నుంచి కోహ్ నిర్వాహకులకు ఓ విన్నపం వచ్చింది. పొడులు కలుపుకొని వండుకుంటున్నాం. అదేదో మీరే రెడీ మిక్స్ తయారు చేసి ఇవ్వొచ్చు కదా’ అని అడుగుతుంటే ఆ సెగ్మెంట్‌లోకీ అడుగుపెట్టారు. ఏడు రకాల పెరసట్టు మిక్స్‌లు తయారు చేశారు. 15 రకాల వెజిటబుల్ మిక్స్‌లు తీసుకొచ్చారు. కోహ్ ఫుడ్స్ కాన్సెప్ట్ నచ్చి, స్టార్టప్ ఇండియా ఇందులో పెట్టుబడులు పెట్టింది. దీనికి తోడు కోహ్ పుడ్స్ అనేక అవార్డులు గెలుచుకుంది! ఇలా ఈ ముగ్గురి ప్రస్థానం మూడు పొడులు ఆరు రెడీ మిక్స్లుగా ముందుకుసాగుతున్నది.

మనవాళ్లు విదేశాల నుంచి దిగుమతి అయిన కూరగాయలు, పండ్లు ఎక్కువ ఖరీదుకి కొంటున్నారు. వాటిలో కంటే మన రైతులు పండించే పంటల్లోనే పోషకాలు ఎక్కువ. ఇంకొంతమంది కూరగాయలు, ఆకుకూరల్లో ఉన్న పోషకాలను వదిలేసి సప్లిమెంట్లను కొని నష్టపోతున్నారు. ఎగ్జోటిక్ వెజిటబుల్స్ మోజు పోవాలి. మన రైతుకు సరైన అవకాశాలు రావాలి. మేం నేచురల్ ఫార్మింగ్ చేసే రైతుల దగ్గర కొనుగోలు చేస్తాం. పంట వేసే ముందు సాయిల్ టెస్ట్ చేయిస్తాం. దానికి తగ్గట్టుగా రైతులకు సాగు సూచనలు చేస్తాం. మా ప్రొడక్ట్స్‌పై నో ప్రిజర్వేటివ్స్, నో ఆడిటివ్స్ ముద్రిస్తాం.