హంసా మెహతా పేరు చాలామంది విద్యావేత్తలకు కూడా తెలియకపోవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో తనొక సంచలనం. బరోడాలోని మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్-చాన్స్లర్ హోదాలో హంసా మెహతా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పురుషాధిక్య సమాజానికి సవాలుగా నిలిచారు. దేశంలోని వివిధ ప్రాంతాల విద్యావేత్తలను తమ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. గొప్పగొప్ప హోదాలతో గౌరవించారు. అందులో అనేకమంది మహిళలూ ఉన్నారు. క్యాంపస్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎంతటివారైనా సరే.. నిబంధనలను ఉల్లంఘిస్తే కళ్లెర్రజేసేవారు.
సిలబస్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించారు. కాబట్టే, ‘అమెరికన్ మ్యాథమెటికల్ మంత్లీ’ తన ప్రత్యేక సంచికలో బరోడా విశ్వవిద్యాలయ ప్రమాణాలను కొనియాడింది. నోబెల్ విజేత వెంకట్ రామకృష్ణన్ ఈ ఆవరణలో చదువుకున్నవారే. తొమ్మిదేళ్ల ఆమె పాలన ఓ స్వర్ణయుగం. రాజ్యాంగ సభ సభ్యురాలిగా ఆ గాంధేయవాది మహిళల హక్కుల కోసమూ గళం వినిపించారు. ఎన్నో అర్థవంతమైన చర్చలు లేవనెత్తారు.