Disha Naik | మహిళలు అన్ని రంగాల్లో అడుగు పెడుతున్నారు. పురుషులతో తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించు
కుంటున్నారు. కొన్ని ఉద్యోగాల్లో మాత్రం వారి ఉనికే కనిపించడం లేదు. ‘ఎయిర్పోర్ట్ ఫైర్ ఫైటర్’ అలాంటి కొలువే. గోవాకు చెందిన దిశ నాయక్ ఆ లోటు తీర్చారు. దిశకు మొదటినుంచీ తను ఏ దిశన వెళ్లాలనే స్పష్టత ఉంది. విమానయాన రంగం అంటే ఇష్టం. అందులోనూ విమానాల్లో అగ్ని ప్రమాద నివారణ పట్ల ప్రత్యేక ఆసక్తి. ఇదేమంత తేలికైన విషయం కాదు.
మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడికి గురిచేసే శిక్షణ ఉంటుంది. ఆరునెలలపాటు ఆ శిక్షణలో రాటుదేలారు. తానేమిటో నిరూపించుకున్నారు దిశ. సాధారణంగా ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో మంటలను ఆర్పడమే కాకుండా, అందులోని ప్రయాణికులను కాపాడాలి. ఇందుకు చాలా తెగువ అవసరం. ప్రాణ రక్షణ నైపుణ్యాలను అందిపుచ్చుకున్న తర్వాత, గోవా విమానాశ్రయంలో అడుగుపెట్టి.. దేశంలోనే తొలి మహిళా ఎయిర్పోర్ట్ ఫైర్ ఫైటర్గా చరిత్ర సృష్టించారు దిశ నాయక్. ‘ఈ కొలువులో ఎంతో సంతృప్తి ఉంది’ అంటారామె ఆత్మవిశ్వాసంతో.