జీవిత పాఠాలు స్ఫూర్తినిస్తాయని చెప్పే గెలుపు ఆమెది. దశాబ్దాల క్రితం ఎవరెస్ట్ శిఖరం చేరిన తొలి భారత మహిళ బచేంద్రిపాల్ గురించి తరగతి గదిలో విన్నది. ఏడో తరగతిలో విన్న ఆ గెలుపు పాఠమే ఆమెకు జీవితమైంది. హిమాలయాలు ఎక్కాలని కలగన్న అమ్మాయి 28 ఏళ్ల వయసులో అనుకున్న లక్ష్యం చేరింది. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు సైకిల్‌పై సవారీ చేసిన మొదటి భారత మహిళగా చరిత్రకెక్కింది. రేపటి విద్యార్థులకు గెలుపు పాఠమైంది దివ్యా సింగ్ జీవితం!
‘పర్వతాలు అధిరోహించాలన్నది ఇప్పటి కోరిక కాదు. చిన్నప్పటి ఆశయమ’ని చెబుతున్నది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఉపాధ్యాయిని దివ్యా సింగ్! తను ఏడో తరగతి చదివేటప్పుడు ‘ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం’ అని టీచర్ చెప్పగా విన్నది. అదే పాఠంలో హిమాలయ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ గురించి చదివింది. దివ్యలో అప్పుడే హిమాలయాలకు చేరుకోవాలనే కోరిక మొగ్గ తొడిగింది. ఎదుగుతున్న దివ్యతోపాటు ఆమె కోరికా బలంగా పెరిగింది.
గెలుపు ఎవరికీ అలవోకగా రాదు. ప్రయత్నం లేకుండా అందుకునేదీ గొప్ప విజయం కాదు. దేశంలో ఏ మహిళా చేయని సాహసం చేసింది కాబట్టే దివ్య వార్తల్లోకి ఎక్కింది. ఎన్నో అభినందనలు అందుకుంటున్నది. ఎవరెస్ట్ సైకిల్ యాత్ర రెండు వారాలు సాగినా, ఇది నిజంగా ఏడాదిన్నర కష్టఫలం! హిమాలయాలను అర్థం చేసుకోవడం, అక్కడి దారులు, వాతావరణం తట్టుకునేందుకు అనువుగా శరీరాన్ని మలుచుకోవడానికి, సామర్థ్యం పెంచుకోవడం కోసం దివ్య ఏడాదిన్నరపాటు సాధన చేసింది. ఇందుకోసం ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నది. నేపాల్‌లో ఇరవై రోజులపాటు హిమాలయ వాతావరణంలో, పర్వత దారుల్లో సైకిల్ తొక్కడంలో మెలకువలు నేర్చుకుంది. దివ్య హిమాలయ యాత్రకు ఉమా సింగ్ గైడ్‌గా సహకరించింది.
మూడేండ్ల క్రితం.. దివ్య అందరిలాగే కాలినడకన తొలిసారి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది. ఆ తర్వాత ఏడాదీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దాకా వెళ్లింది. ఈ రెండు ప్రయత్నాల్లో ఏ ఒక్క మహిళా సైకిల్‌పై అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయడం లేదని గుర్తించింది. ఆ ప్రయత్నమేదో తనే చేయాలని అనుకున్నది. హిమాలయాల్లో సైక్లింగ్‌కు పాటించాల్సిన నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల అనుమతులు తీసుకుని ఈ ఏడాది మార్చి 16న దివ్యా సింగ్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సైకిల్ యాత్ర మొదలుపెట్టింది. కాట్మాండు నుంచి బయలుదేరిన ఆమె సుమారు ఏడు వందల కిలోమీటర్లు ధైర్యంగా ముందుకు సాగింది. ఇంతకుముందెన్నడూ చూడని దారిలో దూసుకెళ్లింది. ఎక్కడ ఎలాంటి మలుపు ఉందో, అక్కడ ఎలాంటి నేల ఉందో తెలియదు. అయినా సరే ఆమె భయపడకుండా ఉత్సాహంగా సైకిల్‌పై మున్ముందుకు సాగిపోయింది. కొండ అంచులపై కొత్త ప్రయాణం పర్వత యాత్రలో సైకిల్‌పై సవారీ తేలికైనది. తొందరగా గమ్యం చేరుకోవచ్చు. కాలినడకే కష్టమైనదని అనుకోవచ్చు. కానీ ఆ ప్రయాణం అంత తేలిగ్గా జరగలేదట.
‘ఎవరెస్ట్ దారిలో కేవలం పది శాతం దూరం మాత్రమే సైకిల్ ప్రయాణానికి అనువైనది. మిగతా తొంబై శాతం దూరం సైకిల్ ప్రయాణానికి ప్రతికూలంగా ఉంటుంది. జారిపోయే పర్వత అంచులపై సైకిల్ని నడపడం అసాధ్యం. అప్పుడు సైకిల్ని భుజాన వేసుకుని మోసుకుంటూ వెళ్లా’ అని తన భారమైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది దివ్య. ఎంత భారమైనా అనుకున్నది చేసి తీరాలన్నది ఆమె సంకల్పం. ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తూ, రాతి బాటల్లో అడుగు ముందుకేస్తూ, పర్వత సానువుల్లోని ఇరుకైన బాటల్లో పయనిస్తూ హిమాలయాల్లోని సుర్కే, ఫక్డింగ్, నమ్చే బజార్, లొబుచే దాటుతూ ఎవరెస్ట్ చేరుకునేందుకు, రెపరెపలాడే మువ్వన్నెల పతాకం చేతపట్టి పైపైకి ప్రయాణించింది.

హిమాలయాలపై ప్రత్యేకమైన వాతావరణం ఎవరికైనా సవాలే. అక్కడ పన్నెండు వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక వాతావరణంలో ఊహించని మార్పులు సంభవిస్తుంటాయి. మంచు విపరీతంగా కురుస్తుంది. ఆ ప్రదేశంలో సైకిల్‌పై సవారీ చాలా కష్టం. ఎత్తైన చోట గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. సాధారణ గాలిలో కన్నా సగం కంటే తక్కువగా ఆక్సిజన్ ఉండే ప్రదేశం అది. ఆ వాతావరణంలో సైకిల్ తొక్కడం ఎంతో కష్టం. కాలినడక సమయంలో సైకిల్ మోయడం మరీ కష్టం. ఆ సమయంలో తన గుండె నిమిషానికి 120 నుంచి 125 సార్లు కొట్టుకునేదట. రెండు వారాల ప్రయాణంలో దివ్య అనేక అవాంతరాలు ఎదుర్కొంది. ఎంత కష్టమైనా వెనుదిరగాలనే ఆలోచనే లేకుండా ముందుకు సాగింది. మంచు తుఫాను, చల్లని గాలికి ఎప్పుడు కిందపడతానోనని ఆమె భయపడింది. దీనికితోడు.. మౌంటెన్ సిక్నెస్ ఉండనే ఉంది. అవాంతరాల దారి, కొత్త వాతావరణం వీటన్నిటినీ ఎదుర్కోవాలి. ‘ఏ క్షణంలో కుప్పకూలిపోతానో’ అని దివ్య భయపడుతూనే ప్రయాణించింది. వెనుదిరగాలనే ఆలోచన మాత్రం మనసులోకి రానీయలేదు. ఆ పట్టుదలే ఆమెను ముందుకు నడిపించింది. ఆమె మనోబలం ముందు మౌంటెన్ సిక్నెస్ ఓడిపోయింది. అపనమ్మకం, భయం, అలసట అన్నీ ఓడిపోయి ఆమె సంకల్పం గెలిచింది. దివ్యా సింగ్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు విజయవంతంగా చేరుకుంది. సముద్రమట్టానికి 17,560 అడుగుల ఎత్తుకు సైకిల్‌పై ప్రయాణించి మువ్వన్నెల పతాకం ఎగురవేసింది. ‘హిమాలయ బేస్ క్యాంప్‌కు చేరుకున్నప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోయాను. అక్కడికి చేరిన క్షణాల్లో మా కుటుంబ సభ్యులూ నాలాగే అనుభూతి చెందారు. ఆ రోజు నా జీవితంలో మరచిపోలేనిది’ అని దివ్య సంతోషంగా తన విజయాన్ని పంచుకుంది. ఆమె గోరఖ్‌పూర్‌కు తిరిగి వచ్చాక వాళ్ల కుటుంబ సభ్యులకే కాదు ఆ ఊరి వాళ్ల ఆనందానికీ హద్దుల్లేవు!
దివ్యకు పొలిటికల్ సైన్స్, హోమ్ సైన్స్‌లో రెండు పీజీ డిగ్రీలున్నాయి. అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా డిగ్రీ ఉంది. ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నది. గవర్నమెంట్ స్కూల్ టీచర్ కావాలని పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నది. కొద్ది సమయం చదువుకుంటూ, ఎక్కువ సమయం పర్వతారోహణ కోసం సాధన చేస్తున్నది. ‘ఇలా చేస్తే టీచర్ జాబ్ వస్తుందా?’ అనే సందేహమే వద్దు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు మూడు సార్లు చేరుకున్న ఘనత, సైకిల్‌పై బేస్ క్యాంప్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళగా, ప్రపంచ మహిళల్లో రెండో వ్యక్తిగా ఆమె కీర్తికెక్కింది. ఉపాధ్యాయినిగా పని చేస్తూనే సైకిల్‌పై సవారీని ఇకపైనా కొనసాగిస్తానంటున్నది. అంతేకాదు ఏదో ఒకనాటికి ఎవరెస్ట్ శిఖరాగ్రానికీ సైకిల్ సవారీ చేస్తానంటున్నది!